విశాలాంధ్ర- ఆస్పరి : తెలుగు వాడుక భాషా ఉధ్యమ పితామహుడు దివంగత గిడుగు వెంకట రామమూర్తి 160 వ జయంతి వేడుకలను మండల పరిధిలోని శంకరబండ గ్రామంలోనే ఎంపీపీ పాఠశాలలో ఘనంగా నిర్వహించుకున్నారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపధ్యాయులు నాగేంద్రప్ప, ఉపాధ్యాయులు కన్యాకుమారి, నూర్ అహ్మద్ లు మాట్లాడుతూ గిడుగు వెంకట రామమూర్తి తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడన్నారు. గ్రాంథికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, విలువను తెలియజెప్పిన మహనీయుడన్నారు. వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడని, బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది అని పేర్కొన్నారు. ఆయన జయంతి ఉత్సవాలను తెలుగు భాషా దినోత్సవం గా జరుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.