విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : తపాల శాఖలో జీవిత భీమా చేసి మీ ఉజ్వల ఆర్థిక భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని పోస్టల్ ఇన్స్పెక్టర్ నాగరాజు పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక రేయిన్ బో ఇంగ్లీషు మీడియం ఉన్నత పాఠశాల నందు పోస్ట్ మాస్టర్ గోపాల్ ఆధ్వర్యంలో తపాల శాఖలో జీవిత భీమా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలపై ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక నెట్ వర్క్ కల్గిన సంస్థలలో భారత తపాల శాఖ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. తపాల శాఖలో భీమా చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా సుకన్య సమృద్ధి పథకం కింద బాలికల అభివృద్ధి కోసం చిన్న మొత్తాల పొదుపు ఖాతాలను ప్రారంభించారన్నారు. ఈ పథకానికి పది సంవత్సరాల లోపు ఉన్న బాలికలు అర్హులన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు తపాల జీవిత భీమా ఎంతగానో లాభదాయకంగా ఉంటుందన్నారు. ప్రైవేటు పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు కూడా లాభాలు ఉంటాయన్నారు. దేశంలో ఏ పోస్టుల్లోనైనా ప్రీయం చెల్లించవచ్చునని, ఆన్లైన్ సౌకర్యం ఉందన్నారు. ఆదాయ పన్ను రాయితీ, ఆకర్షణీయమైన బోనస్, లోన్ సౌకర్యం ఉంటుందని తెలిపారు. దేశంలో ఇతర ఇన్సూరెన్స్ కంపెనీల కన్నా తపాల జీవిత భీమా ఎక్కువ బోనస్ ఇస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ఉద్యోగులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రేయిన్ బో పాఠశాల కరస్పాండెంట్ గోవిందరెడ్డి, మెయిల్ ఓవర్సర్ దివాకర్, ఆయా గ్రామాల బీపిఎంలు, ఏ బీపిఎంలు, పాఠశాల ఉపాధ్యాయులు, పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.