విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) :రైతులు పండించిన మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలని సిపిఐ జిల్లా కార్య వర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, మండల కార్యదర్శి వీరేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం పెద్దకడబూరు గ్రామ శివారులో రైతులు కల్లాల్లో ఆరబెట్టిన మిరపను సిపిఐ ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల కారణంగా అరకొర పండిన మిరపను రైతులు కంటికి రెప్పలా కాపాడుకొన్న చివరికి గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరానికి లక్ష రూపాయలు దాకా పెట్టుబడి పెట్టినారని తెలిపారు. పెట్టిన పెట్టుబడి కూడా చేతికి రాక పోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తక్షణమే క్వింటాళ్లకు 50 వేల రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే మార్చి 2న కర్నూలులో జరిగే ఉమ్మడి జిల్లాల జనరల్ బాడీ సమావేశానికి సిపిఐ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి కుమ్మరి చంద్ర, రైతులు పాల్గొన్నారు.