విశాలాంధ్ర – కర్నూలు సిటీ : దాదాపు 400మంది నివాసముంటున్న సీపీఐ కాలనీలో తాగునీటి వసతిని ఏర్పాటు చేయాలని సీపీఐ సీనియర్ నాయకుడు కె జగన్నాథం, నగర కార్యదర్శి కె రామకృష్ణారెడ్డిలు నగరపాలక సంస్థ కమిషనర్ ఏ భార్గవ తేజను కోరారు.సోమవారం సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో తాగునీటి ని సరఫరా చేయాలని కోరుతూ సోమవారం స్థానిక నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ లో సీపీఐ నేతలు కమిషనర్ కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కె జగన్నాథం, కె రామకృష్ణారెడ్డి లు మాట్లాడుతూ నగర శివారుప్రాంతం నందికొట్కూరు రోడ్డులోని సీపీఐ కాలనీలో పేదలు గుడిసెలు వేసుకొని నివాసముంటున్నారని,ఇక్కడ నీటివసతి లేనికారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.తాత్కాలికంగా ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి చొప్పున వాటర్ ట్యాంకర్ల ద్వారా మంచి నీటిని సరఫరా చేయాలన్నారు.శాశ్వత ప్రాతిపదికన రెండు బోర్లు వేయించి విద్యుత్ మోటర్లు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో నగర సహాయ కార్యదర్శి సి మహేష్, శ్రీనివాసరావు, నగర కార్యవర్గ సభ్యులు భీసన్న, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి నాగరాజులు పాల్గొన్నారు.