విశాలాంధ్ర, పెద్దకడబూరు :విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చర్యలు విరమించుకోవాలని, కడపలో ఉక్కు పరిశ్రమ నిర్మాణం చేపట్టాలని కోరుతూ రాష్ట్ర సమితి పిలుపు మేరకు మండల పరిధిలోని కల్లుకుంట, పెద్దకడబూరు, హెచ్ మురవణి, కంబలదిన్నె గ్రామాల్లో విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో బుధవారం విద్యాసంస్థల బంద్ విజయవంతం అయింది. మండల కేంద్రమైన పెద్దకడబూరులోని ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కస్తూరి బా గాంధీ గురుకుల విద్యాలయం, ఆదర్శ పాఠశాల, రేయిన్ బో ఇంగ్లీషు మీడియం ఉన్నత పాఠశాల, బాలవికాస్ తదితర పాఠశాలలను ఏఐవైఎఫ్ తాలూకా అధ్యక్షులు జాఫర్ పటేల్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా బంద్ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం అలుపెరుగని పోరాటాలు చేస్తున్నారని తెలిపారు. 32 మంది విద్యార్థి యువకుల ప్రాణ త్యాగాలతో ఏర్పడిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం లాభాలు వస్తున్నా, ప్రైవేటు పరం చేయాలని చూస్తుందని ఆరోపించారు. ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు మోడీ ప్రభుత్వం నడ్డివిరిచేందుకు వామపక్షాలు మొక్కవోని ధైర్యంతో ఉద్యమాలను కొనసాగిస్తున్నారన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో అత్యంత వెనుకబడిన రాయలసీమ కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కోసం రెండు సార్లు శంకుస్థాపన చేసి, నిర్మాణం కోసం ఒక్కపైసా కూడా నిధులు మంజూరు చేయలేదని ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ ఆపాలని, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు షేక్ అల్లాబకాష్, వలి, మహ్మద్ హుస్సేన్, జయకృష్ణ, హరికృష్ణ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.