Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పంజాబ్‌ సీఎంగా సిక్కులకే అవకాశం : కేజ్రీవాల్‌

దిల్లీ : పంజాబ్‌లో 2022లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు గాను ఆమ్‌ఆద్మీ (ఆప్‌) పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిక్కు వర్గానికి చెందిన వ్యక్తిని ఎంపిక చేయనున్నట్లు ఆ పార్టీ నాయకుడు, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సోమవారం ప్రకటించారు. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అని అడగ్గా.. ‘‘దీనికి సంబంధించి పార్టీలో చర్చలు జరుగుతున్నాయి.. సమయం వచ్చినప్పుడు మీకు తెలియజేస్తాం.. అయితే నేను మీకు చెప్పగలిగేది ఏమిటంటే, పంజాబ్‌ మొత్తం అతడిని చూసి గర్విస్తుంది.. ఆప్‌ సీఎం అభ్యర్థి సిక్కు వర్గానికి చెందినవారన్న విషయం కచ్చితంగా చెప్పవచ్చు’’ అని ఆయన అన్నారు. పంజాబ్‌లో ప్రస్తుత నాయకత్వంపై అక్కడి ప్రజలు విసుగెత్తి ఉన్నారని, రాష్ట్రం కొత్త తరహా నాయకత్వం కోసం ఎదురు చూస్తోందని ఆప్‌ జాతీయ కన్వీనర్‌గా ఉన్న కేజ్రీవాల్‌ అన్నారు. పంజాబ్‌లో 2015 కోట్కాపురా పోలీసుల కాల్పుల సంఘటనపై దర్యాప్తు చేస్తున్న సిట్‌లో పని చేసిన మాజీ ఐపీఎస్‌ అధికారి కున్వర్‌ విజయ్‌ ప్రతాప్‌ సింగ్‌ను ఇక్కడ నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేజ్రీవాల్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన పంజాబ్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి సిక్కువర్గానికి చెందిన వారే ఉంటారని తెలిపారు. కున్వర్‌ విజయ్‌ ప్రతాప్‌ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీచేస్తారన్న విషయమై తరువాత నిర్ణయం తీసుకుంటామని ఓ ప్రశ్నకు సమాధానంగా కేజ్రీవాల్‌ చెప్పారు. మరో ప్రశ్నపై స్పందిస్తూ.. పంజాబ్‌లో కాంగ్రెస్‌ అసంతృప్త నేత నవజ్యోత్‌సింగ్‌ సిద్దూతో ఎటువంటి చర్చలు జరగలేదని, అలాంటిదేమైనా ఉంటే మీకే ముందు తెలుస్తుందని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img