Thursday, February 9, 2023
Thursday, February 9, 2023

అందరూ చదవాల్సిన విశ్లేషణాత్మక పుస్తకం

డాక్టర్‌ కె.నారాయణ
సీపీఐ జాతీయ కార్యదర్శి, మొబైల్‌ :9490952222
ఇటీవల ఎమెస్కో సంస్థ ప్రచురించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు ఆత్మకథ ‘‘బ్రేకింగ్‌ బారియర్స్‌ ‘‘పుస్తకాన్ని ఆసాంతం చదివాను. విజయవాడలో జరిగిన ఈ పుస్తకావిష్కరణ సభకు నేను కూడా హాజరయ్యాను. ఆ సభలో నాకు కూడా మాట్లాడే అవకాశం లభించింది.. ఎంతో విలువైన ఈ పుస్తకాన్ని తీసుకువచ్చిన ఎమ్మెస్కో విజయ్‌ కుమార్‌కి, కాకి మాధవరావుకి ప్రత్యేక అభినందనలు. రిటైర్‌ అయిన ఒక ఐఏఎస్‌ అధికారి రాసిన ఆత్మకథకు ప్రాముఖ్యత ఉంటుంది. అందులోనూ ఎమెస్కో లాంటి సంస్థ ఈ పుస్తకాన్ని ప్రచురించడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. మాధవరావు కుటుంబం, కింది స్థాయి నుంచి ఆయన ఎదిగిన తీరును ఎంతో చక్కగా వివరించారు. మాధవరావు తల్లి నిరక్షరాస్యులు. కానీ ఎంతో సాహసోపేతంగా వెట్టిచాకిరి విధానాన్ని అధిగమించి మాధవరావును చదివించడం ఆరోజుల్లో ఒక విప్లవాత్మక మార్పుగా చెప్పుకోవచ్చు. నాకు ఆనాటి దయనీయ పరిస్థితుల మీద అవగాహన ఉంది. ఎందుకంటే సోషల్‌ వెల్ఫేర్‌ హాస్టల్లో అత్యధికులు దళిత గిరిజన విద్యార్థులే బోర్డర్లుగా ఉంటారు. ఏఐఎస్‌ఎఫ్‌ నాయకునిగా వారి దయనీయ పరిస్థితులపై అవగాహన ఉన్నది. అణగారిన విద్యార్థులను ముందుకు తీసుకువెళ్లేందుకు ఏఐఎస్‌ఎఫ్‌ ప్రత్యేక దృష్టి పెట్టేది.
కాకి మాధవరావును ఐఏఎస్‌ అధికారిగా చూసేందుకు ఆయన తల్లి పడిన కష్టాలు, కృషి కళ్లకు కట్టినట్టుగా ఈ పుస్తకంలో ఉంది. మాధవరావు ఐఏఎస్‌ అధికారిగా ఎంపికైన తర్వాత అప్పటివరకు పడిన కష్టాలు చాలు, ఇకపై జీవితాన్ని అనుభవిం చాలని ఎన్నడూ అనుకోలేదు. అలా అనుకుంటే ఈ పుస్తకం వచ్చేదే కాదు.
ఆయన వచ్చిన నేపథ్యం కారణంగా ఐఏఎస్‌ అధికారి అయ్యాక మాధవరావు పేద వర్గాల పక్షపాతిగా ఉన్నారని ఒక వాదన ఉన్నది. దాంతో నేను ఏకీభవించను. ఎందుకంటే నా 50 ఏళ్ల రాజకీయ జీవితంలో అనేకమంది పేదరికంలో జన్మించి, ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌ యితర ఉన్నతాధికా రులు అయిన వారిని చూశాను. వారిలో మాధవరావు ‘‘కాకిలలో కోయిల వంటి వారు’’ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అదే సమయంలో అగ్రవర్ణాల నుంచి వచ్చిన ఐఏఎస్‌ అధికారులను పేద వర్గాల వ్యతిరేకులుగా ముద్ర వేయడం కూడా సమంజసం కాదు. ఎందుకంటే నాగార్జున అనే ఉన్నత వర్గానికి చెందిన ఐఏఎస్‌ అధికారి నిరుపేదల కోసం మనసా వాచా పనిచేశారు. దీంతో ఆయన అనేక మార్లు వేధింపులు, అక్రమ బదిలీలకు గురయ్యారు దీనికి వ్యతిరేకంగా ‘‘నిజాయితి అధికారుల అక్రమబదిలీల వ్యతిరేక పోరాట కమిటీ’’ని ఏర్పాటు చేసి మేము పోరాడిన రోజులు కూడా ఉన్నాయి. అప్పట్లో నాగార్జున అక్రమ బదిలీకి వ్యతి రేకంగా జిల్లా బంద్‌, చలో అసెంబ్లీ కార్యక్రమాలు కూడా నిర్వహించాం. కళారంగానికే పరిమిత మయిన కీ.శే. శివప్ర సాద్‌ ఆ ఉద్యమంలోనే మొదటి సారిగా బహిరంగ పోరాటరంగంలోకి వచ్చి రాజకీయ రంగంలో రాటు తేలారు.
ఎవరైనా సరే న్యాయం కోసం, న్యాయం తరఫున ఉంటే వారిపై కమ్యూనిస్టు లేదా నక్సలైట్‌ అనే ముద్ర వేసేవారు. కాకి మాధవరావు కలెక్టర్‌గా ఉన్న సమయంలో ‘‘దున్నేవానికే భూమి’’, ‘‘ గీసే వానికే చెట్టు’’ అమలు కోసం యజ్ఞంలా పని చేశారు. తెలంగాణలో భూస్వామ్య వ్యవస్థ బలంగా వేళ్లూను కున్న రోజుల్లో ఆయన వరంగల్‌ జిల్లాలో పనిచేసినప్పుడు అనేక ఆటంకాలు ఎదుర్కోవడమే కాకుండా నక్సలైట్‌ సానుభూతిపరులు అనే ముద్ర కూడా ఎదుర్కొన్నారు. ఆయన గురించి రాష్ట్రపతి స్థాయి వరకు కూడా వెళ్లింది. ఉద్యోగానికి గండం ఏర్పడిరదని ఆనాటి ప్రముఖులు కెేవీ రఘునాథరెడ్డి ఆందోళనపడిన ఘటన మాధవరావు పుస్తకంలో కనబరిచారు. చివరికి ఆనాటి ప్రజాస్వామ్యం కొంతయినా బతికుంది కాబట్టే గండం నుంచి బయటపడి చివరాంకం వరకు ఉన్నత స్థాయి నుంచే పదవీ విరమణ చేశారు. అయినా సామాజిక జీవితం దళిత బహుజనుల కొరకు తనదైన శైలిలో గళం వినిపిస్తూనే వున్నారు.
ఈ సందర్భంగా ఒక ఘటన చెప్పాలి. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ తదితర అంశాలపై దళిత పోరాట కమిటి అధ్వర్యంలో నాగపూర్‌లో జాతీయస్థాయి సమావేశం సీపీఐ చొరవతో జరిగింది, ఆనాటి సీపీఐ ప్రధాన కార్యదర్శి ఏబీ బర్దన్‌, సురవరం సుధాకరరెడ్డి తోపాటు కాకిమాధవరావు, మల్లేపల్లి లక్ష్మయ్య కూడా హాజరై తగిన సలహా లిచ్చారు. మాధవరావు మాటలు మృదువుగా ఉన్నప్పటికీ ప్రజల మంచి కోసం నిలబడడంలో అత్యంత దృఢంగా వ్యవహరించేవారు. మాధవరావు చేసిన పనిలో ఇరవై శాతం ఇప్పటి ఉన్నతాధికారులు చేసినా నేనెంతో సంతోషించే వాడిని. వారి వారి విలువల కోసం నిలబడి నట్లైతే వారి జీవితం ఫలప్రదమవుతుంది. అలా కాకుంటే వారు పొందిన పట్టాలకే ద్రోహం చేసిన వారుగా జీవితాంతం మిగిలిపోతారు. ఉన్నతాధికారులు తాము ఎలాంటి జీవితం గడపాలో నిర్ణయించుకోవాలి.
మాధవరావు ప్రత్యేకత ఏమిటంటే అందుబాటులో ఉన్న చట్టాల తోటే ఆటవికంగా సంపదను దోచుకునే కార్పొరేట్‌ తిమింగలాలను బహిర్గతం చేసేవారు. అమానవీయమైన కోవిడ్‌ మహమ్మారి కరాళ నృత్యం చేసిన రోజుల్లో కూడా భారత కార్పొరేట్‌ రాక్షసులు కనీస నైతిక విలువలను పక్కనపెట్టి కోట్ల రూపాయలు వెనకేసుకుని ప్రపంచ శతకోటీశ్వరుల జాబితాలో మొదటి మూడు నాలుగు స్థానాల కోసం పోటీపడ్డారు. పుస్తకం చివరి చాప్టర్‌ చివరిలో రాజ్యాంగాన్ని వివరంగా విపులీకరించి, అవసరమైన చట్టాల గురించి మాధవరావు చక్కగా తెలియపరిచారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రచించిన భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి ఓటు హక్కును కల్పించింది. ఈ హక్కుతో నీవు తలెత్తుకొని జీవిస్తావో లేదా మోసాలపై నిలబడే జీవిస్తావో అనేది ఎవరికి వారే నిర్ణయిం చుకోవాలి. ఏడు దశాబ్దాల క్రితం మహానుభావుడు అంబేద్కర్‌ ఇచ్చిన సందేశం ఇది. కానీ ఇప్పుడున్న మన పరిస్థితి ఏంటి? ఇంకా ప్రభుత్వాలు కార్పొరేటర్‌ రాక్షసుల ముందే తలవంచుకొని ఎందుకు నిలబడుతున్నాయి.
పుస్తకంలో కొన్ని పేజీలలో అంశాలు
మాధవరావు రాసిన పుస్తకంలోని 314 పేజీలో ఆర్థిక రాజకీయ వ్యవస్థలో ఉన్నత కులాలకు చెందినవారు ఏ విధంగా ఏకచిత్రాధిపత్యం వహిస్తున్నారనేది టేబుల్‌ రూపంలో సవివరంగా పేర్కొన్నారు. అలాగే గ్రామాలలో పేదలు దళితులు ఇప్పటికీ ఎదుర్కొంటున్న వివక్ష, దోపిడిని చక్కగా వివరించారు. కార్పొరేట్‌ బోర్డు సభ్యుల పొందికలో సైతం అగ్రవర్ణ కులాలకు చెందినవారే మొత్తం ఆధిపత్యం వహించడానికి కళ్లకు కట్టినట్లుగా రాశారు.
ఇక పేజి నంబర్‌ 315లో బ్రిటిష్‌ పాలకులు భారత దేశం నుంచి రూ . 358 కోట్ల కోట్లు సంపదను దోచుకెళ్లినట్లు తెలిపారు థామస్‌ పికెట్టి, లూకాస్‌ ఛాన్స్‌ చేసిన అధ్యయనం ప్రకారం 1922 నుండి 2014 వరకు 92 సంవత్సరా లలో ఆదాయం, సంపద మధ్య అసమానతలు తీవ్రమవుతున్నాయి అని, ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారని, పేదలు, మధ్యతరగతి ప్రజలు మరింత పేదరికంలోకి నెట్టి వేయబెడుతున్నారని తెలియజేశారు.
ఇక పేజీ 316 లో కోవిడ్‌ మహమ్మారి సమయంలో, అనగా 2021లో శతకోటీశ్వరుల సంఖ్య 39 శాతానికి పెరగగా, 84% కుటుంబాలు తమ ఆదాయాలు, కొనుగోలు శక్తిని విపరీతంగా కోల్పోయాయని వివరించారు. అలాగే పేజీ నంబర్‌ 317, 318లో ఆక్స్‌ఫామ్‌ 2022 నివేదికను ఉటంకిస్తూ ఆదాయ సంపదలో గోచరిస్తున్న స్పష్టమైన అసమానతల గురించి వివరించారు. ఆదాయం , సంపద వనరులను అందరికి అందుబాటులో ఉంచడంలో అసమాన తలు సరైనది కాదు, ముఖ్యంగా భారతదేశంలో అధికార పార్టీ మద్దతు సహకారంతో కొంతమందికి మాత్రమే సంపద ఆదాయాలు సొంతమవుతున్నాయి. రాజ్యాంగం లోని 38, 39 అధికరణల ప్రకారం ఆదాయ అసమానతలు తగ్గించాలని, దేశ సంపదపై అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని స్పష్టంగా ఉన్నట్లు తెలియజేశారు. ఆర్టికల్‌ 39బి లో సమాజంలోని వనరులను ఉమ్మడి మంచి కోసం ప్రభుత్వం పంపిణీ చేసే విధంగా విధానాలను రూపొందించాలని స్పష్టంగా ఉన్నది. ఆర్టికల్‌ 39 సీలో ఆర్థిక వ్యవస్థలోని చర్యలు సంపద, ఉత్పత్తి సాధనాలు కొందరి చేతుల్లో కేంద్రీకృతం అయ్యే విధంగా ఉండకూడదని పేర్కొంది.
ప్రభుత్వాలు 1991 నుంచి అనుసరిస్తున్న పన్ను విధానమే పెరుగుతున్న అసమానతలకు కారణమని పేర్కొ న్నారు. ప్రోగ్రెసివ్‌ పన్ను విధానం ద్వారా ఆదాయం, సంపద సమానత్వాన్ని సాధించవచ్చు. ఈ విధానంలో ధనవంతులకు ఎక్కువ పన్ను, తక్కువ ఆదాయం ఉన్నవారికి తక్కువ పన్ను వేస్తారు. అయితే రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే ప్రైవేటు రంగం నిరంతరం ప్రభుత్వాలను ప్రభావితం చేస్తూ మరింత తిరోగమన పన్ను విధానాలను తీసుకువచ్చేలా చేస్తోంది. భారతదేశంలో ప్రస్తుత కార్పొరేట్‌ పన్ను 22%, ఆదాయపన్ను 30 శాతం ఉన్నది. కార్పొరేట్‌ పన్ను ఇతర పెట్టుబడి దేశాల కంటే భారత దేశంలోనే తక్కువ. వారసత్వ పన్ను విధించని 19 ప్రపంచ దేశాలలో భారతదేశం ఒకటి .
పుస్తకంలోని పేజి నంబర్‌ 320లో కాకి మాధవరావు ఇలా అంటారు. రాజ్యాంగబద్ధంగా భారతదేశం సోషలిస్టు దేశంగా వ్యవహరించడం తప్పనిసరి, కానీ అమలులో మాత్రం పెట్టుబడి దారి దేశాల కంటే ఘోరంగా ఉన్నాం. రాజ్యాం గ పీఠిక, రాజ్యాంగంలోని 38 39వ అధికరణలో పేర్కొన్న ఆదేశిక సూత్రాలను గౌరవించడంలో ఎన్నికైన ప్రభుత్వాలు వరుసగా విఫలమవుతున్నాయి.
ఇంతటి సమాచార, విశ్లేషణాత్మక పుస్తకం మరింత జనబాహుళ్యంలోకి వెళ్లాల్సిన అవసరం ఉన్నది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img