Tuesday, December 6, 2022
Tuesday, December 6, 2022

అక్షరసీమను దున్నిన హాలికుడు!

చారిత్రకంగా కొన్ని ప్రాంతాల ప్రజలకు కొన్ని సామాన్య లక్షణాలు స్వభావాలు ఒంటపడుతుంటాయి. నీళ్ళవల్లనో గాలి వల్లనో నేల వల్లనో అవి ఆయాప్రాంతాల వారికి అబ్బుతాయని అంటూవుంటారు. అయితే, దేశమంటే మట్టికాదనీ, మనుషులేననీ తెలుసుకున్న తర్వాత ఈ తలకిందులు చైతన్యం వదిలిపోతుంది. ఆయాప్రాంతాల ప్రజల మనస్తత్వంలోనూ, జీవనతత్వంలోనూ వున్న విశిష్టతల వల్లనే ఆయాలక్షణాలు రూపుదిద్దుకుంటాయని అర్థమవుతుంది. ఈ సిద్ధాంతం విషయంలో ఎవరికైనా ఏమయినా అనుమానాలుంటే, ఒక్కసారి చిత్తూరుజిల్లా సాంస్కృతిక చరిత్ర పరిశీలించండి. అంత ఓపిక లేనివాళ్ళకి ఓ అడ్డదారి సూచిస్తా కె.సభా, మధురాంతకం రాజారాం, కేశవరెడ్డి తదితరులు రాసిన కథలూ, నవలలూ చదవండి చాలు! ఈ రచనలు చిత్తూరు జిల్లా సాంస్కృతిక స్వభావానికి ప్రతినిధి ప్రాయమయినవిÑ ఇరవయ్యో శతాబ్దిలో తెలుగునాట అంతటా రైతు జీవితాల పట్ల ప్రకటితమయిన గౌరవాదరాలకు సైతం ప్రతినిధులుగా కూడా నిలబడతాయి. ఉత్తరాంధ్ర తీరంలో, ఆకులందున అణగిమణగి, గురజాడ ‘‘దేశమును ప్రేమించుమన్నా’’ అంటూ పాడిన మరుసటి సంవత్సరమే, దక్షిణాంధ్ర ప్రాంతంలో చిత్తూరు జిల్లా ఏర్పడిరది. అప్పటివరకూ, ఉత్తర ఆర్కాటు జిల్లాకు ముఖ్యపట్టణంగా వుండిన చిత్తూరు కేంద్రంగా ఏర్పడిన ఈ జిల్లా చారిత్రకంగా ఊరూ పేరూ లేనిదేం కాదు! అప్పటికే దాదాపు నూరేళ్ళ చరిత్రవున్న ప్రాంతం చిత్తూరు. (హంపీ) విజయనగర సామ్రాజ్యం పతనమయిన తర్వాత, ఘంటాల మాట ఎలావున్నా, కత్తులు కదను తొక్కిన ప్రాంతమిది. పాళెగారుల పెత్తనంఎలా సాగినప్పటికీ, ఆంధ్రతమిళకర్ణాటక ప్రాంతాలకు అందుబాటులో వున్న ప్రాంతం కావడాన, సమగ్రమయిన అభివృద్ధిలో చిత్తూరు ఎప్పుడూ భాగంగా వుంటూనేవుంది. ఇక, ఇరవయ్యో శతాబ్దిలో వెల్లివిరిసిన రాజకీయ, సాంస్కృతిక పునరుజ్జీవన చైతన్యం చిత్తూరులోనూ పెల్లుబికింది. వాస్తవానికి, పందొమ్మిదో శతాబ్దంలోనే, పనప్పాకం ఆనందాచార్లు నాగ్‌పూర్‌ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించారు. ‘‘ఆంధ్రా వోల్టేర్‌’’ కట్టమంచి, పనప్పాకం, మాడభూషి, జిడ్డు, పార్థసారథి అయ్యంగార్‌, వుప్పలదడియం నాగయ్య, చిత్తూరు సుబ్రమణియం, శంకరంబాడి తదితరులు ఆ జిల్లాకు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించిపెట్టారు. అలాంటివాళ్ళ కోవకే చెందుతారు కె.సభా. కథకుడు, నవలాకారుడు, కవి, బుర్రకథల రచయిత, జానపద గీతాల సంకలనకర్త, జర్నలిస్టు, ప్రచురణకర్తగా సభా సుప్రసిద్ధులు. ప్రత్యేకించి, రైతులజీవనాన్ని ఇతివృత్తంగా తీసుకుని విస్తృతంగా రాసిన సభా అక్షరాలు ఆ మట్టివాసనలను ప్రసరింపచెయ్యడంలో వింతేముంది? యాభయ్యేడేళ్ళు బతికి 1980లో కన్నుమూశారు సభా. నాలుగుపదుల సారస్వతజీవితంలో, మున్నూరు కథలూ, పది నవలలూ, విస్తృతంగా బాలసాహిత్యం, రెండు పద్యకావ్యాలూ, ఓ గేయకావ్యం, రెండు బుర్రకథలూ రాసిన సభా అయిదు పత్రికల్లో పనిచేశారు. సాహిత్య విమర్శ వ్యాసాలు రాశారుÑ తెలుగులోనూ, ఇంగ్లిష్‌లోనూ పత్రికలు నడిపించారుÑ స్వయంగా ఓ ప్రెస్‌ నిర్వహించారు. అన్నిటికీ మించి, చిత్తూరు జిల్లా రచయితల సహకార సంఘం మూలస్తంభాల్లో ఒకరుగా ఉండి, చక్కని పుస్తకాలు ప్రచురించారు. రాజకీయాల్లో రంగా అనుచరుడిగానూ, ఆధ్యాత్మికమార్గంలో రమణ మహర్షి అనుయాయిగానూ, చలం జీవితసాహిత్యాల అభిమానిగానూ సభా జీవితాంతం కొనసాగారు. అలా బతికినందువల్లనే, ఇప్పటికీ ఆయన్ని మనం స్మరించుకుంటున్నాం! మన ఆర్థికరంగంలో వ్యవసాయరాదాని అనుబంధ రంగాల వాటా ఇప్పటికీ 70 శాతంగా ఉందని 2018నాటి ఓ నివేదికలో ప్రకటించింది ఎఫ్‌ఏవో. ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా వుండే ప్రత్యేక అధ్యయనసంస్థ ఎఫ్‌ఏవో (ఆహారవ్యవసాయ సంస్థ). దేశజనాభాలో దాదాపు 60 శాతంమంది ప్రాథమికంగా ఈ రంగాలపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారని ఎఫ్‌ఏవో పేర్కొంది. 1951ా2001 మధ్యకాలంలో, దేశీయ స్థూల ఉత్పత్తిలో వ్యవసాయం వాటా క్రమంగా క్షీణిస్తూ వచ్చిందని కూడా ఎఫ్‌ఏవో వెల్లడిరచింది. కె.సభా ఈ వాస్తవాలను ఏ అంతర్జాతీయ అధ్యయన సంస్థ పత్రాల ద్వారానో కాకుండా, ప్రత్యక్ష జీవితానుభవం ప్రాతిపదికగా గ్రహించి, తన రచనల్లో ప్రముఖంగా ప్రస్తావించడం ఆయన విశిష్టతకు అద్దంపడుతోంది. దురదృష్టవశాత్తూ, మన రచయితల్లో అత్యధికులు ఈ కఠోర వాస్తవాలను భావోద్రేకాలు రేకెత్తించడానికి వాడుకున్నంతగా, జీవనవిషాదాన్ని ప్రతిఫలించే నిమిత్తం స్వీకరించలేదు. సభా, ఇందుకు పెద్ద మినహాయింపు. ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి చెప్పినట్లు ‘‘లక్షలాది గ్రామాలకున్న నైసర్గిక స్వరూపాల తీరు తెన్నులు వేరు. భాషలు వేరు. సంస్కృతీ సంప్రదాయాలు వేరు...మతవిశ్వాసాలు వేరు. వర్షపాతం వేరు.... అటవీ సంపద వేరు....పంటలు వేరు. తిండితిప్పలు వేరు.’’ ఈ వైవిధ్యాల మధ్య ‘‘వేలాదిఏళ్ళుగా కొన సాగుతున్న జాతీయతా భావన, మానవీయ బంధం ఒకటే అయినా, ఈ భేదక లక్షణాలతో పాటు బలపడ వలసిన మానవీయ కోణాన్ని దర్శించిన రచయితల్లో సభాలాంటి వాళ్ళు మనకు కనిపిస్తా’’రన్నారు కేతు. వాస్తవానికి అదే వాళ్ళ ప్రత్యేకత. ఇంతకీ, ఇది బలపడ‘వలసిన’ కోణమే కానీ, వాస్తవానికి అక్షరసీమలో ఈ కోణం ఎప్పుడూతగినంతగాబలపడనే లేదు! ఆ విషయం సభాకి బాగా తెలుసు. ‘‘ఏ రాకుమారుడో, ఏ వెండితెర మీదనో అతని ప్రేయసికోసం విరహవేదన పడుతూ అడవిలో నడిచిపోతుంటే ఏ పల్లెరుగాయలాంటి చిన్నముల్లో పాదానికి గుచ్చుకుంటే ఏడు చెరువుల కన్నీరు కార్చే కరుణాపూరితులున్న ఈ దేశంలో, అనుదినం ఆలపిస్తూ ప్రతిక్షణం ముళ్ళడొంకల్లో తిరుగుతూ కనీసం గడియకో ముల్లు తొక్కుతున్నవారిని గురించి ఆలోచించే వ్యవధి లే’’దన్నారు సభా ‘పురిటినొప్పులు’ కథానికలో. ఈ వ్యవధిలేనివాళ్ళలో ముందువరసలో నిలబడే వాళ్ళు మన రచయితలే! హాయిగా మూసకట్టు ‘‘బాయ్‌ మీట్స్‌ గర్ల్‌’’ తరహా కథలు రాసుకుంటే, పేరుకు పేరూ, డబ్బుకు డబ్బూ అనుకునేవాళ్ళకి, కష్టజీవి కన్నయ్యల కడగళ్ళు కనబడకపోడంలో వింతేముంది? అయినా, కాయకష్టం చేసి బతికే వాళ్ళ జీవితాల గురించి చదవాలనే ఆసక్తి, కనీసం, ఆ వర్గీయులలోనయినా మిగిలుందా? ఇదంతా, సుఖానవున్న ప్రాణాన్ని కష్టాన పడేసుకోవడం కాకపోతే, మరేమిటని మన రచయిత మ్మన్యులు అనుకుంటే అందులో విస్తుపోవలసింది మాత్రం ఏముంది? ఇలా అనుకుంటున్నందువల్లనే, ఈ కోణం ఇప్పటికీ బలపడ‘వలసిన’ కోణంగానే మిగిలివుంది! కానీ, సభా లాంటి రచయితలు ముందే కూసిన కోయిలలు! అరవై, డెబ్బై యేళ్ళ కిందటే, వాళ్ళు ఈకోణాన్ని ప్రముఖంగా ప్రదర్శిస్తూ కలంపట్టారు. తమ సాహిత్యతత్వానికి తగిన భాషనూపరిభాషనూ రూపొందించుకున్నారు. అందుకే వాళ్ళ రచనల్లో మాండలిక విశిష్ట ప్రయోగాలు కనబడుతుంటాయి. ‘పరిగిలి’, ‘పెనిమగోరదోనెసిబ్బె’, (గానుగలో)‘చంద్రవంక’, ‘సంగటి’, ‘కాశీపిచనాల బియ్యం’, ‘పొంగలి’, ‘పుర్రు బెల్లంసవరం బంగారు బెల్లం’, ‘సాంగ్యం’, ‘నిలువండాలు కడియాలండాలు’, ‘శిలవరం’, ‘కసుపు’, ‘జమకాణాలు’, ‘బండారు’, లాంటి మాండలిక విశేషాల ప్రయోగం ‘మిధున లగ్నం’ లాంటి కథల్లో విస్తృతంగా కనిపిస్తుంది. సభా కథల్లో, ‘సేద్యం చేసేవాడికి సెలవెక్కడ?’, ‘పిండి కొద్దీ నిప్పట’ లాంటి సామెతలూ వినబడుతుంటాయి.
ఇంతకీ, మాండలికం వాణిజ్యప్రకటనల శాస్త్రం చెప్పే ‘యూనిక్‌ సెల్లింగ్‌ ప్రపొజిషన్‌ (యుఎస్‌పి)’ మాత్రమేనా? ఆ పాటిదే అయితే అటు పాఠకులూ ఇటు విమర్శకులూ దాని పేరు చెప్తే చాలు అంతగా పులకించడం ఎందుకు? మనోవేగంతో పరుగులుతీసే కాలాన్ని పట్టిబంధించే నిశ్చల చిత్రాలుగా మాండలిక ప్రయోగాలను మన్నించి నెత్తిన పెట్టుకోడం ఎందుకు? ఒక్క మాటకోసం గంటల తరబడి తన్నుకులాడేవాళ్ళకి ఇంత చిన్న విషయం తెలియదనే అనుకోవాలా? మాండలిక భాష ముఖ్యంగా ప్రాంతీయ మాండలికం మనమనుకునేంత సరళమయిన వ్యవహారం కాదు ! మాండలికభాష చారిత్రకంగా మాత్రమే రూపుదిద్దుకుంటుంది. దాని కడుపులో కాలాంతర పరిణామాలు దాగివుంటాయి. ఒకానొక జాతికో, వర్గానికో, ప్రాంతానికో పరిమితమయిన ఏకైక విశిష్టతకు ప్రతీక దాని మాండలికం. ఈ ఏకైకత్వం, ఆ అస్తిత్వం తాలూకు సాపేక్ష స్వాతంత్య్రానికి పతాక! అందుకే, మాండలిక ప్రయోగాలకు అంతటి ప్రాధాన్యం. తమ మాండలికం ప్రయోగించడం ఆ నిర్దిష్ట అస్తిత్వానికి గర్వకారణమైన విషయం. మాండలిక విభిన్నత సాంస్కృతిక వైవిధ్యాన్ని సుసంపన్నం చేస్తుందిÑ అది ఆయా అస్తిత్వాల సాపేక్షిక స్వాతంత్య్రాన్ని ప్రోత్సహిస్తుంది. తెలంగాణ రూపు దిద్దుకున్న పరిణామం సందర్భంగా ఈ విషయం రుజువయిందే! ఇప్పుడు, ఆంధ్రుల అస్తిత్వం గురించి చరిత్ర శాస్త్ర నిపుణులు వకుళాభరణం రామకృష్ణ, కొప్పర్తి తదితరులు చేస్తున్న చర్చ సందర్భంగా కూడా ఈ విషయం చర్చకు రావడం సహజమే. అలా సభా మరోసారి మనముందు చర్చకు నిలిచారు` శుభం!!
వ్యాస రచయిత సెల్‌: 8179691822

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img