కాసేపు మౌనంగా ఉంటా
ఆ మౌనంలో ఆవిర్లను తవ్వుకుంటా
విడిచిన కొన్ని బాధ్యతలను
చొక్కాలకు గుండీలుగా కుట్టుకుంటా
జేబు నిండే ఉంది ఎప్పుడూ వ్యర్ధాలతో
పటాపంచలు చేసే అవరోధాలను
అణచిపట్టి కాసేపు ఊపిరి సలపనీయక
ఒక చిమ్నీ వెలిగించి
లోపలి అజంతా గుహలను పరికిస్తా
కొన్ని మొక్కలకి నీళ్ళు పోసి పాదులు కట్టి
ఇంకొన్ని.. కలుపుతీత పంటకోత చేసి
మొత్తానికి ఆ మౌనంలోంచి పలుకుతా
వేల వేల అమూల్యమైన శబ్దాలను
ఏ చెవులకు అవి సోకుతాయో
ఏ వనంలో కూర్చోబెట్టి బోధనలవుతాయో
ఏ గ్రంథాల్లో నిక్షిప్తం చేయబడి
తరాల భాండాగారం అవుద్దో మరి
ఇంత మౌనంలోంచి అంత ఒలిచి
సంసారం సాగించి
వినాలనుకున్నవే విని
అనాలనుకున్నవే అని
ఇక ఆ రంగస్థలం నుంచి నిష్క్రమించి
ఆ పాత్రను వదిలి ఆ సారమంతా రంగరించి
ఒక సీసాలో నింపి ఒక కాలువలో వదిలి
నిలుచుంటాను మళ్ళీ
మౌనంతో ముచ్చటిస్తూ మౌనంగా ఒదుగుతూ
కొన్ని రెమ్మలను వేళ్ళ మధ్య ఆడిస్తూ తాకుతూ
మట్టిలోకి చూస్తూ పసిరికపై పడుకుని
ఆకాశాన్ని కావలించుకుని
ఇంకా మౌనంలోకి
వినూత్న విప్లవాత్మకమైన వెలుగుల్లోకి
అక్షరాల అరల కొలిమిలోకి..!!
- వగ్గు రఘువీర్, 9603245215