Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

అణగారిన ఆశ గొంతులో ముడి వీడిన గానం

జనం నుంచి జనంలోకి ఏటుకూరి ప్రసాద్‌ పాటలు

.‘‘అణగారిన ఆశ గొంతులో
ముడి వీడిన గానం నేనూ
యుగమంతా పల్లవించగా
సడిచేసే రాగం నేనూ’’
జనం కోసం జనం పాట కోసం తనను తాను అంకితం చేసుకున్న అభ్యుదయ కవి గొంతుక ఆలపించిన ‘ఆశారాగం’ ఇది.
సమస్త ప్రజాకళలకూ జన్మస్థానం గమ్యస్థానం సమాజమే. పాట కూడా జనంలోంచే జనం కోసమే పుడుతుంది. జనహృదిలో ధ్వనిస్తుంది. బండబారిన గుండెల్ని కరిగిస్తుంది. మోడువారిన మెదళ్ళను చిగురింప జేస్తుంది. సమూహాన్ని కదిలిస్తుంది. సమాజాన్ని మేల్కొల్పు తుంది. ఒక్కోసారి పాటే ఉద్యమానికి ఊపిరవుతుంది. విప్లవాలకు సాయం అవుతుంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ‘‘జనంనుంచి జనంలోకి’’ పాటలు అందుకు మంచి నిదర్శనం. ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ సుపరిచితులు ప్రముఖ సాహితీవేత్త ఏటుకూరి ప్రసాద్‌ (ఏటుకూరి బాలశంకర ప్రసాదరావు). దాదాపు అర్థ శతాబ్ధి శ్రామిక ప్రజా ఉద్యమాల చరిత్రను పాటల రూపంలో మనముం దుంచారు. అభ్యుదయ రచయితల సంఘంఅరసం నేతగా ఎందరో సాహిత్యవేత్తలకు ఏటుకూరి ప్రసాద్‌ గురుతుల్యులు. సహృదయులు. మార్క్సిజాన్ని త్రికరణశుద్ధిగా నమ్మిన వారు. సామ్యవాద వ్యవస్థను ఆశించేవారు. ఆరు దశాబ్దాల శ్రామికజన ఉద్యమాలతో మైత్రీబంధం కలవారు. వాటితో మమేకమైన వారు. అందుకే ‘‘మేల్కొల్పే కలానికి అలుపుండదుపోరాడే గుండెకు నిలుపుండదు.’’అనే దృఢసంకల్పంతో ఆయా ఉద్యమాలు నేపథ్యంగా పీడిత ప్రజల పోరాటాలకు బాసటగా రాసిన పాటలివి. భారత స్వాతంత్య్రోద్యమం, తెలంగాణ విమోచనకై సాగిన రైతాంగ సాయుధ పోరాటం తదితర ఘట్టాలను స్మరిస్తూ ‘పోరాటం మన చరిత్ర’ంటూ నాటి యోధుల పోరాటాలను, త్యాగాలను సందర్భోచితంగా గానం చేశారు. వచన కవిత్వం కదా ఈకాలంలో రాజ్యమేలుతోంది, మరి పాటలు..! అనుకోవడం సహజమే. కానీ నిజంగా పాట అవసరం ఇప్పుడు మరింత పెరిగింది. మనిషి సమూహంలోనే ఒంటరి వాడైపోతున్నాడు. కుటుంబ సభ్యుల మధ్యనే ఏకాకి తనం ఆవహిస్తోంది. ఇది మానవ ప్రవృత్తికే విరుద్ధమైంది. మెరుగైన జీవితం కోసం, చింతలేని కుటుంబం కోసం, ఉన్నతమైన సమాజం కోసం, సౌభాగ్యవంతమైన దేశంకోసం చర్చించడం, తర్కించడం, ప్రశ్నించడం నేరమైపోయింది. దేశద్రోహమై పోయింది. పాలకవర్గం కనుసన్నల్లోనే దోపిడీ యధేచ్ఛగా సాగిపోతోంది. ఈ విషవలయం నుండి బయటపడేందుకు నూతన చైతన్యం కావాలి. అందుకోసం సాగే ఉద్యమాలకు పాటే బాసట, ఒక సాధనం కూడా. ‘‘పాటదృశ్య కావ్యంఒక జాతరఒక ఊరేగింపుసమూ హపు చేతననృత్య కలాపంఅన్ని ఉద్యమాలకూ పాట ఆలంబనమయ్యింది ప్రాణభూతమయ్యింది.’’ అంటారు ప్రముఖ కవి కె. శివారెడ్డి తన ముందుమాట ‘కవనానుశీలనం’లో. పాట విప్లవ శంఖా రావం. ‘‘జనంనుంచి జనంలోకి’’ గేయ సంపుటి లో 93 గేయాలు, 13 నృత్య గేయాలు, 6గేయ నాటికలు ఉన్నాయి. ఈ పాటలన్నీ 19702020 సంవత్సరాల మధ్యరాసినవి. గతంలో ప్రచురించిన ఎర్రజెండా, ఎర్రబాట, పోరాటం తదితర గేయ సంపుటాల్లోంచి కొన్నింటిని అనంతర కాలంలో రాసినపాటలను చేర్చి కూర్చిందే ‘‘జనంనుంచి జనంలోకి’’ గేయ సంపుటి. ఇందులో కేవలం ఉద్యమపాటలే కాదు. దివిసీమ ఉప్పెన, సునామి, నేటి కరోనా కాలపు కష్టాలు, నష్టాలు, మానవీయకోణాలను పాటలుగా మలిచారు.
‘‘తూర్పు దిక్కున వెలగబోయిన
అరుణతారా వందనం
మార్పుకోసం ప్రజల నడిపిన
శ్రమిక వీరా వందనం
….. ….. …… …..
విశాలాంధ్రలో ప్రజారాజ్యమని
నినదించిన ఓ వ్యక్తీ
తెలంగాణలో జనశక్తికి పో
రాటం నేర్పిన శక్తీ
……. …… …..
పేదల బాధల గాధలకు త్యాగం
ఊపిరులూదిన వ్యక్తీ
దిగుళ్ళు పగుళ్ళు వేసిన గుండెకు
ధైర్యం పోసిన శక్తీ’’
అంటూ భారత కమ్యూనిస్టు ఉద్యమానికి అంకితమై సర్వం సమర్పించుకున్న విప్లవకారులు పుచ్చలపల్లి సుందరయ్యకు నివాళులెత్తారు. విప్లవ యోధులు చండ్ర రాజేశ్వరరావు, రావి నారాయణరెడ్డిగార్లను తన గీతరచనా పథంలో నిలుపుకున్నారు. వారిపట్ల గౌరవాన్ని ప్రకటించారు.
‘‘సామాజిక చైతన్య ప్రతీకలు ఈ పాటలు. పోరాటం ఈ పాటలకు పల్లవి. ఎర్రజెండా ఈ గీతాలకు ఊపిరి’’ అంటారు , ప్రముఖ కవి, సాహితీవేత్త పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి, అరసం నేత ఎస్వీ. సత్యనారాయణ. ‘‘మోదుగుపూల పరాగం’’ అంటూ ‘‘ఏటుకూరి ప్రసాద్‌ గారు రచించిన గీతాలు తెలగు ప్రజల హృదయాలను చూరగొన్నాయి. అనేక జైత్రయాత్రలు, ఉద్యమాలు, మహాసభలు, వీరు వ్రాసిన గీతాలు నాయకులను, కార్యకర్తలను ఆలోచింప చేశాయని చెప్పడంలో అతిశయోక్తిలేదు.కవిలో ఉన్న భావావేశాలను ప్రతిబింబించే అనేక గేయాలు,పాటలు ప్రత్యేకత చాటుతున్నాయి. నవరసాలకు ఈ కవితలు అద్దం పడుతున్నాయి. పాట వ్రాయడం ఒకవంతు. దానికి బాణికట్టడం అదో ప్రత్యేకత. ఎర్రజెండా పాటలు హృదయాలను కదిలిస్తాయి. ఆలోచింపచేస్తాయి. ఉద్యమాలకుఊపిరిపోస్తాయి.’’అని భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అభినందనలు వ్యక్తం చేశారు.
గేయ రచయిత సాహిత్య వేత్త అయితేనే చాలదు. గేయ రచనలో సంగీత సాహిత్య సమన్వయం సాధించాలి. అందుకు కనీస సంగీత పరిచయం అవసరం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ‘‘నేను గాయకుణ్ణి కాను. సంగీత జ్ఞానం లేదు. చిన్నప్పటి నుంచీ పాడటం అన్నా పాట వినడం అన్నా ఆసక్తిఉన్నవాణ్ణి. 1012సంవత్సరాల వయస్సున్న ప్పుడు కొన్నాళ్ళు ‘వీణ’ సాధన చేశా. అంటూ వివిధ సభల్లో తాను స్వయంగా పాడిన మరికొన్ని అనుభవాలను మనతో పంచుకున్నారు ‘స్వీయ ఆలాపనలో’. ఏటుకూరి ప్రసాద్‌ గుంటూరులో జన్మించారు. వృత్తి ఉద్యోగాల రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. గతంలో విశాలాంధ్ర ప్రచురణాలయం సంపాదకులుగా దీర్ఘకాలం పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక విశాలాంధ్ర ప్రచురణాలయం సోదర సంస్థగా ప్రారంభమైన నవచేతన ప్రచురణాలయం సంపాదక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఏటుకూరి ప్రసాధ తన జనగానం ‘‘జనంనుంచి జనంలోకి’’ని ఇటీవలే కనుమూసిన తన జీవిత సహచరి శ్రీమతి కుసుమగారికి అంకితం చేశారు. కె. శరచ్చంద్ర జ్యోతిశ్రీ.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img