మందలపర్తి కిషోర్
తాత్విక కథానిక అనే స్వతంత్ర రచనారీతి, ఆధునిక కథానికతో పాటే పుట్టిందనిపిస్తుంది. పదిహేడో శతాబ్దిలోనే వోల్టేయ్ర్ ఓ తాత్విక కథానిక రాశారనే విషయం అలా వుంచితే, ఆధునిక యుగంలో ఈ మాట అక్షరసత్యం. గగోల్, తల్స్తోయ్, దస్తయేఫ్స్కియ్, గోర్కియ్, హక్స్లీ, ఐసాక్ బాషేవిస్ సింగర్, జ్షాు పౌల్ సత్ర్, అలేయో కార్పెంటియెర్, హొర్హే లూయీ బర్హే, కాఫ్కా, బెకెట్, కామూ తదితరులు ఈ కోవకే చెందిన కథానికలు రాశారు. మనదేశం విషయానికొస్తే టాగోర్, గురజాడ, ఫకీర్మోహన్ సేనాపతి, ప్రేమ్చంద్, మంటో, బిభూతిభూషణ్ బంద్యోపాధ్యాయ, వైకం మహ్మద్ బషీర్ తదితరులూ ఈ కోవకే చెందిన కథానికలే రాశారు. ఇరవయ్యో శతాబ్దంలో వచ్చిన తెలుగు కథానికలకే పరిమితమయి చూస్తే, టేకుమళ్ళ, వేలూరి, కవికొండల, చలం, కొడవటిగంటి, పాలగుమ్మి, బుచ్చిబాబు, రాచకొండ, కాళీపట్నం, త్రిపుర, చండీదాస్ తదితరులపేర్లు స్ఫురిస్తాయి. అలా తాత్విక కథానికల పేరెత్తగానే తళుక్కున మెరిసే మరోముఖ్యమయిన పేరు మునిపల్లె (బక్క)రాజు. ఈ రంగానికే తన సాహిత్య శక్తిని ఉదారంగా ధారపోసిన మంచి రచయిత రాజుగారు. ఇరవయ్యో శతాబ్దం ఇరవైదశకంలో పుట్టి, తొంభై రెండేళ్ళు నిండుగా బతికి, ఇరవయ్యొకటో శతాబ్దాన్నిచూసి మరీ వెళ్ళిన రాజుగారు అర్ధ శతాబ్దంపైనే సాహిత్య సృజన చేస్తూపోయారు. పొందదగిన గౌరవాలన్నీ పొంది, మరీపోయారు. ‘మునిపల్లె రాజు అత్యుత్తమ కథాకృతులు’ ఆయన స్వకీయ పర్యవేక్షణలోనే రూపుదిద్దుకున్నాయి. ఉన్నతప్రమాణాలు కలిగిన ఆధునిక సాహిత్యాన్ని ఆదరించే పాఠకవర్గం వాటిని నెత్తినపెట్టుకుంది! అలా రాజుగారి కథల్ని ప్రేమార చేరదీసుకున్నవారిలో నోరి ‘నరశింహ్వ’శాస్త్రి, పురాణం సుబ్రహ్మణ్య శర్మ, వాకాటి పాండురంగరావు, విహారి మొదలుకుని ‘సంక్లిష్ట కవి’ యం.యస్. నాయుడు వరకూ ఎందరోవున్నారు. డా. అక్కిరాజు రమాపతిరావు ‘మంజుశ్రీ’, వడలి మందేశ్వరరావు తదితరులు మునిపల్లె రాజు కథలను ప్రశంసించారు.
మునిపల్లె రాజు అనేకకళల్లో ఆరితేరినవృద్ధమూర్తి! ఇంతకుముందే చెప్పినట్లుగా, కవికథకుడు మాత్రమే కాదు, నవలాకారుడు
సినారిస్ట్ కూడా. వృత్తిరీత్యా ఇంజినియరింగ్ సర్వేయరయిన రాజుగారు పాతికేళ్ళప్రాయంనుంచీ కవిత్వం, కథలు రాస్తూనేవున్నారు. ముప్పయ్యేళ్ళన్నా రాకముందే, 1950దశకం తొలినాళ్ళలో, ఆయన లోతయిన కథలు రాశారు. అప్పుడే వర్గసోపానంలో కట్టకడపటి చీడీమీదికి దిగజారుతున్న బ్రాహ్మణ కుటుంబాల ‘‘బతికిచెడినతనం’’ పర్యవసానాలను ఆయన చిత్రించినంత స్ఫుటంగా మరెవరూ చిత్రించలేదేమోఅనిపిస్తుంది. (దాదాపు దశాబ్దం తర్వాత కలం విదిలించిన పెద్దిభొట్ల ఇదే పరిణామక్రమం తాలూకు మరో దశను చిత్రించి, సాహిత్య చరిత్రలో తన స్థానం పదిలం చేసుకున్నారు. అదలా వుంచండి!) వాస్తవానికి ఈ బతికిచెడినతనం ప్రభావం ఇతర వర్గాలపై, వర్ణాలపై కూడా ఎలా పడిరదో రాజు చిత్రించారు. ‘‘జెట్టీ’’ కథ ఇందుకు తిరుగులేని తార్కాణం. కాల గర్భంలో కలిసిపోయిన సామాజిక నిర్మాణం చూరుపట్టుకు వేల్లాడే ఏ వర్గానిదైనా ఇంచుమించు ఒకే తరహా విషాదం. రాజాలూ మహారాజాలను ఆశ్రయించుకుని బతికే కొన్ని కులాలవాళ్ళు ఏదో స్వర్ణయుగం అంతరించి పోయిందనీ, ఈ పిదపకాలపు పిల్లకాకులకు మంచి చెడ్డలు ఎంచిచూడ్డం రాదనీ బాధపడుతుంటారు. మృగయా వినోదం పేరుతో లోకాన్ని మోసగించాలని చూసే ఆత్మపరవంచకులకు ఈ ఆశ్రితులే ఆలంబన. అలా వాళ్ళను విశ్వాసంగా సేవించడం ఏదో ఘనకార్య మని ఈ ఆశ్రితగణం భావించడాన్ని వాళ్ళ ‘‘విలువలు’’ గా చిత్రించడం కన్నా సాహిత్యనేరం మరొకటి లేదు. మునిపల్లె రాజు అలాంటి నేరాలూ ఘోరాలూ ఎన్నడూ చెయ్యకపోవడం ప్రత్యేకించి చెప్పుకోవలసిన విశేషం. స్వీయానుభవం ప్రాతిపదికపై మునిపల్లె రాజు రాసిన కొన్నికథలు జీవితవాస్తవాలతో సుసంపన్నమయివుండడం మాత్రమే కాకుండా, బాధాకరమయిన అనుభవాలఆర్ద్రతను కూడా తమలో నింపుకున్నాయి. పైకి వచనంలో వున్న భావకవిత్వంలా కనిపించవచ్చుగానీ, ఈ కథలు సామాజిక పరిణామాన్ని సున్నితపుత్రాసులో తూకం వేసినట్లుంటాయి. కవి కూడా అయిన ఈ కథకుడు ‘లెవెల్హెడెడ్’ కావడంవల్లనే అది సాధ్యమయింది
‘‘నిరంకుశ కవయ’’ అని ఆయన అనుకునివుంటే, సాహిత్యానికీ, తద్వారా చరిత్రకూ, నష్టం జరిగిపోయేది!
కుటుంబ సంబంధాల ప్రాముఖ్యం, ప్రాబల్యం బాగా తెలిసిన రచయిత మునిపల్లె రాజు. ‘చెప్పుల దానం’, ‘దొడ్డమ్మ వారసులు’, ‘లక్ష్మీ ఉపాసకుడు’, ‘సవతి తమ్ముడు’, ‘జ్ఞానధారదానధార’ లాంటి కథానికలు ఈ కుటుంబ సంబంధాలు ఎంత లోతుగా పాతుకునివున్నాయో వివరిస్తాయి. జ్ఞాతి
దాయాదుల మాత్సర్యం గురించీ, సవతితల్లుల అసూయగురించీ రాయని ‘ఇతిహాసా’ల్లేని జాతి మనది! అయితే, ‘కస్తూరి తాంబూలం’లాంటి కథానికలు దూరపుబంధువుల మధ్య కక్షలూకార్పణ్యాల రక్కిస పొదలెన్ని మొలిచినా, అవి మానవత్వాన్నీ, మాతృత్వాన్నీ కమ్మేయలేవనే జీవితవాస్తవాన్ని చాటి చెప్తాయి! మునిపల్లె రాజు రచనల్లో ప్రాచుర్యం పొందిన వాటిల్లో ‘‘వారాల పిల్లాడు’’ కథానిక ఒకటి. దిరిసెన పువ్వులాంటి సున్నితమయిన పిల్లల మనసు చిరిగి పేలికలయిపోతే, పర్యవసానం ఎంత అమానుషంగా వుంటుందో ఆ కథలో రాజుగారు చిత్రించారు. ఈ కథానికను రాసేనాటికి రచయితకు ముప్పయ్యేళ్ళు కూడా లేవని మరొక్కసారి మీకు గుర్తుచెయ్యదలిచాను! ఇలాంటి కథలు మరెవరూ రాయలేదని కాదుకస్తూరి అనే కుక్కపిల్ల విషయంలో ఉదాసీనంగా ప్రవర్తించిన పెద్దల ప్రభావంతో క్రూరుడిగా మారిన కుర్రాడికథ ఒకటి కుటుంబరావు ఏనాడో రాశారు. మంచి రచయితలు మిస్ చెయ్యలేని సున్నితమయిన విషయాల్లో ఇదొకటి. కుటుంబసంబంధాల కన్నా ప్రగాఢమయిన, ప్రభావశీలమయిన మానవసంబంధాలెన్నో ఉంటాయి. సున్నితమైన మానవసంబంధాలనే ఇతివృత్తంగా తీసుకుని రాజుగారు రాసిన కథల్లో ‘భోగం మనిషి’, ‘యశోద కొడుకు’ మర్చిపోలేనివి. ఆర్థిక
సామాజిక భవబంధాలకు అతీతమైన మానవ సంబంధాలు ప్రాయికంగా
స్నేహ సంబంధాలే అయివుంటాయి. అవి ఇద్దరు మగవాళ్ళ మధ్య ఏర్పడినవయినా కావచ్చుఇద్దరు ఆడవాళ్ళ మధ్య ఏర్పడినవీ కావచ్చు
లేదా, స్త్రీపురుషులమధ్య ఏర్పడినవయినా కావచ్చు! ఈ కథానికల్లోని ఇతివృత్తాలు కుల వ్యవస్థ లాంటి సంక్లిష్ట సామాజిక సంబంధాలతో పాటు తల్లీ తండ్రీ
కొడుకు లాంటి సున్నితమైన వ్యక్తిగత సంబంధాలనుకూడా చక్కగా చర్చించాయి. జీవితం పట్ల తాత్విక దృక్పథంలేని రచయితలు ఇటువంటి కథలు రాయడానికి సాహసించలేరు!
కుడిచేతా, ఎడం చేతా కథానికలు రాసే రచయితల కోవకు చెందినవారు కారు మునిపల్లె రాజు. ఆరున్నర దశాబ్దాల రచనా జీవితంలో ఆరున్నర దశకాల కథలు కూడా రాసినట్టులేరాయన! తెలుగు సమాజానికి భిన్నమైన పరిసరాలను చూసి గడిరచిన అనుభవం రచయితగా ఆయన నైపుణ్యానికి కొంత నైశిత్యం సమకూర్చే వుంటుంది. తెలుగు వాతావరణానికి దూరం కావడంవల్ల పాన్ఇండియన్ సంస్కృతి కూడా ఒంట బట్టి వుంటుంది! తర్వాతి దశలో ఆయన కథానికల్లో ఆ లక్షణం మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మంచి రచయితలందరికి మల్లేనే మునిపల్లె రాజు కథానికల్లో కూడా పాత్రలు కనిపించవు` మనుషులే కనిపిస్తారు! ప్రాణంలేని చెక్కబొమ్మలు కావవి రక్తమాంసాలున్న సజీవ వ్యక్తులు! ఈ మేరకు ఇది ఓ అద్భుతమే వాస్తవికం కూడా! ‘అస్తిత్వ నదం ఆవలివైపు’లాంటి కథానికల్లో పౌరాణిక వాస్తవికతలాంటి శిల్పం సమర్ధంగా నిర్వహించడం కూడా కనిపిస్తుంది. కానీ, అంతమాత్రం చేతనే రాజుగారి కథానికల్లో మ్యాజిక్ రియాలిజం అనే ‘‘అద్భుత వాస్తవికత’’ ఉందనగలమా? ప్రాచీన ఆఫ్రోఆసియన్ సంస్కృతులూ, లాటిన్ అమెరికాలాంటి విశిష్ట సంకీర్ణ సంస్కృతులూ వర్ధిల్లిన ప్రాంతాల్లో పుట్టి పెరిగిన సాహిత్యాలలో ప్రచురంగా కనిపించే ఈ మ్యాజిక్ రియలిజం, కేవలం అద్భుతమనిపించే వాస్తవికత మాత్రమే కాదు! దానికి నిర్దిష్ట చారిత్రక రాజకీయ స్వభావం, సందర్భం వుంది. విజేతల పరాజితుల మనోభావాలు సాధారణంగా పరస్పర విరుద్ధంగా వుంటాయి. వాటి మధ్య కుదిర్చే విడ్డూరమయిన సాహిత్యసయోధ్య మ్యాజిక్ రియలిజంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మూడో ప్రపంచ ప్రజాస్వామ్య సమాజాల్లో, వలసవాద యుగం ముగిసిన తర్వాత తలెత్తిన విరోధాభాసల్లాంటి వ్యవస్థల గురించి నిజం చెప్పలేని దురవస్థ అక్కడి రచయితలకు ఎదురయింది. దీనికి ఉత్తమ ఉదాహరణగా గాబ్రియెల్ గార్సియా మార్కెజ్ డాక్యుఫిక్షన్ రూపంలో రాసిన ‘‘ద స్టోరీ ఆఫ్ ఎ షిప్రెక్డ్ సోల్జెర్’’ పుస్తకాన్నే చెప్పొచ్చు. దాన్ని జరిగింది జరిగినట్టుగా రాయక పోయినా, కొలంబియా పాలకుల తీవ్రాగ్రహానికి గురయ్యాడు మార్కెజ్. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పలాయనం చిత్తగించాల్సిన దుస్థితి ఆయన పాలబడిరది. సల్మాన్ రష్దీ కథ కూడా అదేదారిన, అదేతీరున మలుపులు తిరిగింది. అలాంటి ఇతివృత్తాలు మునిపల్లె రాజు కథల్లో నాకెక్కడా కనిపించలేదు. పౌరాణిక, అద్భుతఅంశాలున్న ప్రతిరచనలోనూ మ్యాజిక్ రియలిజం వుందనడం భావ్యంకాదు. దాన్ని సర్వనామంగా వాడడం సాహిత్య మర్యాద అనిపించుకోదు! నిర్దిష్ట అర్థంలో మాత్రమే ఆ పేరును వాడడం భావ్యం!! అయితే, రాజుగారి కథలు సాదాసీదారచనలు కావనడం ఆయన పాఠకులందరికీ అనుభవంలోకి వచ్చిన విషయమే వాటిని, తాత్విక కథలనడమే సవ్యం! పైగా, మునిపల్లె రాజు గారి మాదిరిగా, ఆది నుంచి అంతం దాకా తాత్విక కథలు మాత్రమే రాసిన వాళ్ళు తెలుగులో బహుశా ఇద్దరు ముగ్గురిని మించి లేరేమో!!
‘‘ఆశ్రమ ప్రవేశద్వారం నీలోనే వుందని మర్చిపోకు!’’ అన్నాడట పదమూడో శతాబ్దానికి చెందిన పారశీక మహాకవి, ప్రపంచ ప్రసిద్ధ సూఫీ సాధువు జలాల్ ఉద్దీన్ రూమీ. రూమీ మాటల్లోని సత్యాన్ని రుజువుచేసిన మహర్షి మునిపల్లె రాజు.
వ్యాస రచయిత సెల్: 8179691822