Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

అనువాద సాహిత్యంలో మేటి జిల్లేళ్ళ బాలాజీ

ప్రముఖ కథా రచయిత, అనువాదకులు జిల్లేళ్ళ బాలాజీకి అనువాదంలో ‘కె.ఎస్‌.విరుదు’ పురస్కారం లభించింది. కోయంబత్తూరులోని ‘విజయ రీడర్స్‌ సర్కిల్‌’, విజయా పబ్లిషర్స్‌ ద్వారా ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ప్రతి ఏడాది… ఇతర భాషల నుండి తమిళంలోకీ, తమిళం నుండి ఇతర భాషల్లోకి సాహిత్యాన్ని అనువాదం చేసే ఇద్దరికి ‘విజయ రీడర్స్‌ సర్కిల్‌’ ‘కె.ఎస్‌.విరుదు’ పురస్కారాన్ని అందిస్తారు. అలాగే ఈ ఏడాదికి (2023) గాను జిల్లేళ్ళ బాలాజీకి వచ్చే అక్టోబరు నెల 8వ తారీఖున కోయంబత్తూరు వేదికపై సన్మానించి, జ్ఞాపికతో పాటు పురస్కారంగా 50,000/-లు నగదు ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా బాలాజీతో విశాలాంధ్ర సంక్షిప్త ముఖాముఖి నిర్వహించింది.
ప్రశ్న: మీరు రచనలు చేయడం ఎప్పటినుండి ప్రారంభించారు?
జవాబు: 1983 నుండి సొంతంగా కథలు రాస్తున్నాను. ఇప్పటిదాకా 150 కి పైగా కథానికలు, 120 కి పైగా కవితలూ రాశాను. కొన్ని కథలు తిరుపతి, కడప రేడియో కేంద్రాల నుండి ప్రసారమయ్యాయి.
ప్రశ్న: మీ కథలు పుస్తక రూపంలో…?
జవాబు: 1) మాట్లాడే పక్షి 2) సిక్కెంటిక 3) వొంతు 4) ఉండు నాయనా దిష్టి తీస్తా! 5) పగడాలు పారిజాతాలూ…6) నిరుడు కురిసిన వెన్నెల 7) కవన కదంబం (కవితా సంపుటి)… పేర్లతో పుస్తకాలుగా వెలువడ్డాయి.
ప్రశ్న: అనువాదం రంగంలోకి ఎలా ప్రవేశించారు?
జవాబు: తమిళ భాష కూడా తెలిసినందున, 2002 నుండి తమిళం నుండి అనువాదాలు చెయ్యటం ప్రారంభించాను. ఇప్పటివరకూ 130కి పైగా కథలు, 12 నవలలు, 2 నవలికలు, 1 కవితా సంపుటి, 1 వ్యాస సంపుటి, 1 వచన రామాయణ గ్రంథం… అనువదించాను.
ప్రశ్న: అనువాద కథల సంపుటాల గురించి…?
జవాబు: 1) కాల ప్రవాహం 2) జయకాంతన్‌ కథలు 3) నైలు నది సాక్షిగా… 4) శిథిలం 5) జీవనాడి 6) నీళ్లకోడి… పేర్లతో పుస్తకాలుగా వెలువడ్డాయి.
ప్రశ్న: అనువాద నవలలు కూడా వెలువడ్డాయి కదా?!
జవాబు: అవునండీ…… 1) కల్యాణి 2) ఒక మనిషి…ఒక ఇల్లు…ఒక ప్రపంచం…3) ప్యారిస్‌కు పో! 4) గంగ ఎక్కడికెళుతోంది? 5) యామం 6) సంచారం పుస్తకాలుగా వెలువడ్డాయి. అలాగే 7) మహారాజశ్రీ మంత్రిగారు(ఉజ్జ్వల మాసపత్రిక సీరియల్‌గానూ) 8) ఓ వర్షం కురిసిన రాత్రి 9) 1G1R3 (చివరి రెండు నవలలూ చతురలోనూ ప్రచురించబడ్డాయి) 10) చెల్లని డబ్బు 11) అలల సవ్వడి (ఈ రెండు నవలలూ సాహిత్య అకాడమీ ప్రచురించవలసి ఉంది) 12) వాల్మీకి ధర్మం(అముద్రితం) 1 కవితా సంపుటి, 1 వ్యాస సంపుటి ప్రచురణ కావలసి ఉంది.
ప్రశ్న: మీకు లభించిన ఇతర విశిష్ట పురస్కారాల గురించి..?
జవాబు: అనువాద నవల ‘కల్యాణి’కి 2010లో ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం, ‘నల్లి-దిశై ఎట్టుమ్‌’ పత్రిక నుండి ‘ఉత్తమ అనువాదకుడు’ గా పురస్కారం లభించాయి.
ప్రస్తుతం అనువాదంలో నేను చేస్తున్న విశేష కృషికి గాను కోయంబత్తూర్‌ ‘విజయ రీడర్స్‌ సర్కిల్‌’ ప్రతి ఏటా ఇచ్చే ‘కె.ఎస్‌.విరుదు’ పురస్కారాన్ని అందుకోనున్నాను.
ప్రశ్న: ఎవరీ కె.ఎస్‌?…ఏమిటా విరుదు?
జవాబు: అభిమానులచేత కె.ఎస్‌గా పిలవబడే డా. కె.ఎస్‌.బాలసుబ్రమణియన్‌ 1937లో తిరునల్వేలిలో జన్మించారు. వీరు జయకాంతన్‌కు అత్యంత ఆత్మీయ మిత్రులు. సాహిత్యంపైన విశేషమైన అభిమానం కలవారు. 1960-75 మధ్య కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా (ఐ.ఆర్‌.ఎ.ఎస్‌.) బాధ్యతల్ని నిర్వర్తించారు. 1998లో మేనేజర్‌/డైరెక్టర్‌ గా రిటైర్‌ అయ్యారు. 1975-1998 మధ్య మనీలాలో ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకులో ఉద్యోగం చేశారు. ఫిజిక్స్‌, హిస్టరీలలో పి.జి. పట్టాలు, ఫిలిప్పైన్స్‌ విశ్వవిద్యాలయంలో ఎం.బి.ఏ., పిహెచ్‌.డి పట్టాలు పొందారు.
1998లో మాతృదేశానికి తిరిగొచ్చాక సాహిత్యమూ, సామాజిక సేవా రంగాలలో విశేషమైన కృషి చేశారు. ముఖ్యంగా తమిళ సాహిత్యాన్ని ఆంగ్లంలోకి తీసుకెళ్లారు. జయకాంతన్‌ 5 నవలలు, 2 నవలికలు, ఒక వ్యాస సంపుటి, ఒక కథల సంపుటి, తమిళ ఆధునిక కవితా సంకలనం, ఒక ప్రముఖ తమిళ కవి మొత్తం సాహిత్యంపై విమర్శనాత్మక గ్రంథం ఇంగ్లీషులోకి తెచ్చారు. జయకాంతన్‌ పై ‘రీడర్‌’ నూ, అలాగే భారతరత్న సి.ఎస్‌.పై వ్యాసాలు రాయటమేకాక వీటికి సంపాదకత్వమూ వహించారు. తమిళ సాహిత్య, సామాజిక, అభివృద్ధిపై వీరు రచించిన మొత్తం వ్యాసాలు 4 సంపుటాలుగా వెలువడ్డాయి. ఇంకా భాష/సంస్కృతి రంగంలో కృషి చేస్తున్న ‘భాష’ సంస్థ నిర్వహణలోనూ, సాహిత్య అకాడమీ తమిళ విభాగంలోనూ భాగస్వామ్యం వహించారు.
వీరి మరణానంతరం వీరి అభిమానులు/అనుయాయులు ‘విజయ రీడర్స్‌ సర్కిల్‌’ గా ఏర్పడి ‘కె.ఎస్‌.విరుదు’ పురస్కారాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఏటా ఇద్దరు అనువాదకులకు చెరో 50,000/- రూపాయలను బహుకరిస్తున్నారు.
చలపాక ప్రకాష్‌, 9247475975

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img