Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

అభివృద్ధిలో అమ్మ భాషే కీలకం

డా॥పి.వి.సుబ్బారావు, సెల్‌: 9849177594

మాతృభాషకు ప్రధాన అవరోధాలుగా గాంధీజీ రెండు కారణాలు పేర్కొన్నారు. పుడుతూనే పిల్లలు ఇంగ్లీషులో ఏడవాలనే కోరుకొనే తల్లిదండ్రుల అత్యాశ మొదటి కారణం. తెలుగులో బలమైన భావ వ్యక్తీకరణ సాధ్యం కాదనే అపోహ. ఆంగ్ల మాధ్యమంలో చదువుకుంటే తప్ప ఉద్యోగాలు రావనే కార్పొరేట్‌ విద్యా సంస్థలు ప్రచారాన్ని నమ్మి అధిక ఫీజులు చెల్లించి తల్లిదండ్రులు అప్పులు పాలవుతున్న స్థితి రెండో కారణం. మాతృభాషలో కాకుండా పరభాషలో చదివే విద్యార్థులు ఎక్కువ మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్న మహాత్ముడి అభిప్రాయం అక్షర సత్యం. పరాయి చదువు పిల్లల జన్మహక్కును హరిస్తుంది. విదేశీ బోధనా భాష అంటే పసికందుల నెత్తిన వారి మేధాశక్తిని చంపే బండ నెత్తడమే. అది వారి పురోభివృద్ధిని నిరోధించి స్వగృహం నుండి వేరుపరుస్తుంది. ఇలాంటి విషయాలను ప్రథమ శ్రేణికి చెందిన జాతీయ వినాశకాలుగా నేను పరిగణిస్తాను అని విదేశీ ఆంగ్ల మాధ్యమాన్ని తీవ్రంగా నిరసించాడు. మాతృభాష జీవశక్తిని అందిస్తుందనీ, ఆత్మికశక్తి, మనో వికాసాలను విద్యార్థులకు కలిగించి తమంతట తాము ఉన్నత పౌరులుగా ఎదిగేలా చేసే విద్య మాతృభాషలోనే సాధ్యమని మహాత్ముడు స్పష్టంగా చెప్పారు. సామాజిక, సాంస్కృతిక సమాచార మార్పిడి, సామాజిక బంధాలు ఏర్పడటం, సామాజిక అభివృద్ధి వంటి అంశాలు అమ్మభాషతో ముడిపడి ఉంటాయని అమ్మభాష ఆవశ్యకతను గాంధీజీ వివరించాడు.
విశ్వకవి రవీంద్రనాధ్‌టాగూర్‌ మహాత్ముడి అభిప్రాయాన్ని సమర్థిస్తూ ‘‘పరభాష ద్వారా విద్యా బోధన అంటే సోపానాలు లేని సౌధం వంటిదన్నారు.’’ కొమర్రాజు లక్ష్మణరావు ‘మాతృభాష తల్లి పాల వంటిది. పరభాష దాది పాలు వంటిదని’ మహాత్ముడి మార్గాన్ని సమర్థించాడు. మహోన్నతమైన మన మాతృభాష జాతీయస్థాయిలో ఒకప్పుడు రెండో స్థానంలో ఉంది. ఇప్పుడు నాల్గో స్థానానికి చేరడం శోచనీయం. జాతీయ స్థాయిలో హిందీ మాధ్యమంలో 6,62,31,904 మంది విద్యార్థులున్నారు. రెండో స్థానంలో బెంగాలీ విద్యార్థులు 1,04,62,343 మంది ఉన్నారు. మూడో స్థానంలో మరాఠీ విద్యార్థులు 79 లక్షల 18వేల 420 మంది ఉన్నారు. నాలుగో స్థానంలో తెలుగులో చదివే విద్యార్థులు 47,71,981 మంది ఉన్నారు. మధురమైన మన మాతృభాష మృతభాషల అంచున ఉందన్న యునెస్కో గణాంకాల ప్రకారం (2002) హెచ్చరిక మాతృభాషాభి మానులకు అశనిపాతం లాంటిది. ఏ భాషా వ్యవహర్తల సంఖ్య 30 శాతానికి తక్కువగా ఉంటుందో దాన్ని మృతభాషగా పరిగణిస్తారు. మన మాతృభాష ఆ స్థితికి చేరితే దానికి కారకులెవ్వరు? మాతృభాష ఉనికిని దెబ్బ తీసే అనాలోచిత నిర్ణయాలు చేసే ప్రభుత్వా లదా? తల్లిభాష ఉనికి దెబ్బ తింటున్నా ఉపేక్షాభావంతో ఉన్న మనందరిదీనా? ప్రపంచ తెలుగు మహాసభలు, మాతృభాషా దినోత్సవాలు జరిపినంత మాత్రాన మాతృభాషా పరిరక్షణ జరగదు.
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ నేపథ్యం:
యునెస్కో 199 ఫిబ్రవరి 21వ తేదీని అంతర్జాతీమ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించింది. 2000 ఫిబ్రవరి 21 నుండి ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. పాకిస్తాన్‌ 1947లో తూర్పు పాకిస్తాన్‌ (ప్రస్తుత బంగ్లాదేశ్‌) పశ్చిమ పాకిస్తాన్‌ (ప్రస్తుత పాకిస్తాన్‌) గా విభజించారు. అత్యధిక సంఖ్యాకులు బెంగాలీ భాషను మాట్లాడేవారు. 1948లో అప్పటి పాకిస్తాన్‌ ప్రభుత్వం ’ఉర్దూను’జాతీయ భాషగా ప్రకటించింది. అందుకు తూర్పుపాకిస్తాన్‌ ప్రజలు వ్యతిరేకించారు. ఉర్దూతో పాటు బెంగాలీ భాష కూడ జాతీయభాషగా ఉండాలని తూర్పు పాకిస్తాన్‌కు చెందిన దీరేంద్రనాధ్‌దత్తా 1948 ఫిబ్రవరి 23న పాకిస్తాన్‌ రాజ్యాంగ సభలో లేవనెత్తారు. తూర్పు పాకిస్తాన్‌ (ప్రస్తుత బంగ్లాదేశ్‌) ప్రజలు తమ భాష గుర్తింపు కోసం ఉద్యమాన్ని నిర్వహించారు. ఢాకా నగరంలో 1952 ఫిబ్రవరి 21వ తేదీన వేలాది మంది విశ్వవిద్యాలయ, కళాశాలల విద్యార్థులు, సాధారణ ప్రజలు ర్యాలీ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వారిపై పోలీసులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సలాం, బర్కాట్‌, రఫీక్‌, జబ్బర్‌, షఫిమూర్‌ అనే విద్యార్థులు మరణించారు. వందలాది మంది గాయ పడ్డారు. ఇది చరిత్రలో అరుదైన సంఘటన. అమ్మభాష కోసం జరిగిన ఆత్మ బలిదానాలివి. 1971లో బంగ్లాదేశ్‌ ఏర్పడిన తర్వాత బెంగాలీని రాష్ట్ర భాషగా ప్రవేశపెట్టింది. యునెస్కో మానవ భాష సాంస్కృతిక హక్కులను పురస్కరించుకొని బంగ్లాదేశ్‌ ప్రజల విన్నపాన్ని అనుసరించి 1999 ఫిబ్రవరి 21వ తేదీని అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవంగా ప్రకటించింది. ఫిబ్రవరి 2000సంవత్సరం 21వతేదీ నుండి ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాలు జరుపుకుంటున్నారు. ప్రభుత్వాలు, ప్రజలు చిత్తశుద్ధితో మాతృభాషను పరిరక్షిస్తే లక్ష్యం నెరవేరుతుంది. రాష్ట్రప్రభుత్వాలు మాతృభాషను పరిరక్షించేందుకు కొన్ని సూచనలను పాటించాలి.
తమిళ, కన్నడ రాష్ట్రాల వారు మాతృభాషా మాధ్యమాల్లో చదువుకున్న పట్టభద్రులకు 5 నుంచి 20 శాతం వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పిస్తున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వాల అధినేతలు తెలుగు మాధ్యమంలో పట్టభద్రులైన వారికి తమిళ, కన్నడ రాష్ట్రాల మాదిరిగా ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలి. 1970 ప్రాంతాల్లో తెలుగు మాధ్యమంలో ఇంటర్మీడియట్‌, డిగ్రీ ప్రవేశపెట్టినప్పుడు అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పి.వి.నరసింహారావు అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు మాధ్యమంలో డిగ్రీ చదివిన వారికి ఉద్యోగాల్లో 5 శాతం ప్రాధాన్యత కల్పించాలని తీర్మానించి కొన్నాళ్లు అమలుపరచారు. తర్వాత న్యాయస్థానాలు అడ్డుకోవటంతో ఆగిపోయింది. తెలుగులో మాట్లాడిన విద్యార్థులను శిక్షించే ఆంగ్ల మాధ్యమ పాఠశాలల యాజమాన్యాల గుర్తింపు రద్దుచేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ఐచ్ఛికంగా ప్రవేశపెట్టాలి. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల సర్వీసు కమిషన్‌ అధికారులు గ్రూపు1, 2 పరీక్షల ఐచ్ఛిక పాఠ్యాంశంగా తెలుగు భాషా సాహిత్యాల పేపరును గతంలో మాదిరిగా ఏర్పాటు చేయాలి. గతంలో ఎందరో అభ్యర్థులు తెలుగు పేపరును ఎన్నిక చేసుకుని ఉన్నత ఉద్యోగాల్లో రాణించి గొప్పగా సేవచేసి మెప్పు పొందారు. ఐచ్ఛిక పాఠ్యాంశాన్ని ప్రస్తుత సర్వీసు కమిషన్‌ అధికార్లు రద్దు చేయడం శోచనీయం. తెలుగు భాషా సాహిత్యాల సామర్థ్యాన్ని పరీక్ష పేపరును కనీస అర్హత మార్కులు పొందే విధంగా నియంత్రించాలి.
ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహించే ఆంధ్రప్రదేశ్‌ గ్రామ సచివాలయాల ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్షల్లో తెలుగు భాషా సాహిత్య పాఠ్యాంశాలు ప్రస్తుతం 5 మార్కులకున్నాయి. వీటిని 20 మార్కులకు పెంచాలి. కార్పొరేట్‌ కళాశాలల్లో నిర్బంధ సంస్కృత పాఠ్యాంశ బోధన తెలుగు భాష ఉనికిని దెబ్బతీస్తుంది. దేవనాగర లిపిలో రాయగలిగిన విద్యార్థులకు మాత్రమే సంస్కృత పాఠ్యాంశాన్ని ఇవ్వాలి. ఇతర విద్యార్థులు విధిగా తెలుగు పాఠ్యాంశాన్ని చదివేట్లు చేయాలి. ప్రాచీన హోదా కేంద్రం ద్వారా తెలుగు భాషా సాహిత్యాల అభివృద్ధికి కృషి చేయాలి. పాలనా భాషగా ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు భాష అమలును రాష్ట్ర అధికార భాషా సంఘంవారు ప్రత్యేక శ్రద్ధతో జిల్లా అధికార భాషా సంఘాలు పాలనా భాష విధిగా అమలు జరిగేట్లు సభ్యులను నియమించి పర్య వేక్షించాలి. బోధనా భాషగా, పాలనా భాషగా తెలుగు అమలు జరిగితే మాతృభాష మృత భాష కాకుండా అమృత భాషగా విలసిల్లుతుంది. అంత ర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఆశయం నెరవేరుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img