Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

అభ్యుదయ సాహిత్య వేదిక` పెనుగొండ వ్యాస సంపుటి ‘దీపిక’

డా॥తక్కోలు మాచిరెడ్డి, సెల్‌: 9666626546

పునరుద్ధరణవాదులు దేశాన్ని శాసించే స్థితికి వచ్చిన ప్రస్తుత సందర్భంలో అరసం, విరసం, సాహితీ స్రవంతి, జనసాహితి కలిసి దీన్ని ఎదుర్కొనాల్సిన అగత్యం ఉంది. మరి ఈ ఉద్దేశంతోనేమో సాహితీస్రవంతికి చెందిన వరప్రసాద్‌తో పుస్తకం వెనుకట్ట మీద అభిప్రాయం ప్రచురించారు పెనుగొండ. ఇది ఆహ్వానించగ్గదే. పెనుగొండ లక్ష్మీనారాయణ అభ్యుదయ రచయితల సంఘంఅరసం జాతీయ కార్యదర్శి. కాని ఆయన తనను అరసం కార్యకర్తగానే భావించుకంటారు. అది ఆయన వినయశీలతకు నిదర్శనం. ఆయన రాసిన వ్యాససంపుటిలో 36 సాహితీ వ్యాసాలున్నాయి. కొన్ని ప్రసంగాలకు వ్యాసరూపం ఇవ్వడం జరిగింది. అటువంటి వ్యాసరూపమే ‘సజీవ స్రవంతి అభ్యుదయ కవిత్వం.’ ఇదో సోదాహరణ ప్రసంగం. సిరికి స్వామినాయుడు పేద రైతును గురించి అన్నాడు ఇలా..చేసిన అప్పులు తీర్చలేక/ నేల చూపులు చూస్తూ నడివీధిలో అతడు తల దించుకుంటే/ ఒక దేశం తల దించుకున్నట్టు ఉంది. ‘దీపిక’ రెండవ అధ్యాయం దళిత జీవన చిత్రణకు కేటాయించారు పెనుగొండ. ఇందులో భాగంగా రామనపల్లెలో జరిగిన ఘటనపై గజ్జెల మల్లారెడ్డి చెప్పిన కవితను ఉటంకించారు. జరిగిందేమిటంటే, కడప దగ్గర రామనపల్లెలో దళితుల గుడిసెలను అగ్రవర్ణాల వారు తగులబెట్టించారు. ఆ పేదల గుడిసెలు తగులబడుతుంటే, చూసి, ఆవేశంతో, ఆవేదనతో ఆశువుగా గజ్జెల మల్లారెడ్డి చెప్పిన గేయంలోని కొన్ని పంక్తుల్ని ఉటంకించారు
పూరిగుడిసెలకు అగ్గిపెడితే మేడలు, మిద్దెలు మిగలవురా
కష్టజీవి ముక్కంటి మంటలో కాలిబూడిదైపోవురా
తరతరాల మీ దోపిడీ మీదను తిరుగుబాటు చెలరేగునురా
వెట్టిచాకిరీ దౌర్జన్యాలు ఇకపై చెల్లవు చెల్లవురా!
మా ఆహ్వానంపై కడపకు విచ్చేసి పెనుగొండ చేసిన ప్రసంగానికి అక్షర రూపం ఈ వ్యాసం. ప్రసంగం చివరిలో మార్క్స్‌, అంబేద్కర్‌ సిద్ధాంతాలు రెండూ విమోచన మార్గాలుగా గుర్తిద్దామని పిలుపు ఇస్తూ లాల్‌ నీల్‌ జెండాలు ఏకం కావాలి అంటారు పెనుగొండ. కరోనాతో 54 వ యేటనే అకాల మరణం పాలైన ‘విశాలాంధ్ర’ దినపత్రిక సంపాదకులు ముత్యాల ప్రసాద్‌ను ‘నిజమైన పాత్రికేయ ముత్యం’ అంటూ ప్రశంసించారు పెనుగొండ. గురజాడ రచనలకు సంపాదకత్వం వహించి ప్రచురించారు సెట్టి ఈశ్వరరావుగారు. ‘కన్యాశుల్కం’ నాటకాన్ని నవలికగా మలిచారు. కొన్ని ఈశ్వరరావు రచనల్ని, ప్రచురణకై ‘విశాలాంధ్ర’ కు పంపారు పెనుగొండ లక్ష్మీనారాయణ. అరసం మహాశక్తి రాంభట్ల కృష్ణమూర్తిని ఓ విజ్ఞాన సర్వస్వం అని పేర్కొంటూ, ప్రాథమిక స్థాయిలో చదువు ఆగిపోయినా, స్వయంకృషితో ఆంగ్లం, తెలుగు, సంస్కృతం, ఉర్దూ భాషల్ని అభ్యసించి పాండిత్యాన్ని సంపాదించాడని తెలియజేశారు రచయిత. 1948లో ‘విశాలాంధ్ర’ మాసపత్రికలో ప్రచురితమైన కడలూరు జైలు నుండి తుమ్మల వెంకట్రామయ్య రాసిన గేయం ‘చెల్లీ’ నేపథ్యాన్ని పెనుగొండ వివరించారు ఇలా..తుమ్మల చెల్లెలు జగదాంబ. ఆమెభర్త గోగినేని తాతయ్య రైతు కూలీ సంఘనేత, పార్టీ కార్యకర్త. కృష్ణాజిల్లా దివిసీమ నాగాయలంక వద్దగల తలగడదీవి కొత్తపాలెం గ్రామంలో ఏర్పాటైన పోలీసు క్యాంపులో తాతయ్యను ఆ పోరాటానికి సహకరిస్తున్నాడని చెట్టుకు కట్టి కాల్చి చంపారు. ఈ వార్తను విన్న తుమ్మల తన చెల్లిని సంబోధిస్తూ రాసిన ఆర్ద్రగీతం ‘చెల్లీ’.
ఒక వీరుడు మరణిస్తే/ వేలకొలది ప్రభవింతురు! ఒక నెత్తుటిబొట్టు లోనె/ ప్రళయాగ్నులు ప్రజ్వరిల్లు! అని సోమసుందర్‌ భరోసా యిస్తూ ‘వజ్రాయుధం’ అందించాడు 1949లో. ఇది వెలువడిన వెంటనే నిషేధానికి గురైంది. అజ్ఞాత జీవితం గడిపాడు కవి సోమసుందర్‌. నైజాం తెలంగాణాలో రజాకార్ల అకృత్యాలకు బలైపోయిన మహిళల దుస్థితిపై ‘కృష్ణాపత్రిక’ లో ప్రచురితమైన వార్తా కథనానికి చలించి ఆరుద్ర ‘త్వమేవాహం’ కావ్యం రాశాడు. మృత్యువు ఒక వ్యక్తితో నువ్వే నేనుత్వమేవాహంఅంటుంది. సమాజంలోని ఘటనల్ని గడియారంతో పోల్చుతూ ప్రతీకాత్మకంగా వర్ణిస్తాడు ఆరుద్ర. గడియారంలోని గంటల ముల్లు ధనికస్వామ్యానికి ప్రతీక. నిముషాల ముల్లు మధ్యతరగతి వారి మానసిక స్థితికి ప్రతీక. సెకన్ల ముల్లు కష్టజీవులకు ప్రతీక. ఒక స్టాపువాచీని విప్లవానికి కొలబద్దగా/ అలారంను మనల్ని జాగ్రత్తపరిచే సాధనంగా కాలాన్ని నిర్వచించిన దీర్ఘకావ్యం ‘త్వమేవాహం’ అంటూ వివరించారు పెనుగొండ.
గంగినేని వెంకటేశ్వరరావు రచించిన ‘ఉదయిని’ కవితా సంపుటిని ఆంధ్ర అరసం 1950అక్టోబరులో ప్రచురించింది. గంగినేనిని పోలీసుక్యాంపులో చిత్ర హింసలు పెట్టారు. ‘ఉదయిని’ ని సమర్పిస్తూ అంటాడుఅనామకంగా, అమాయకంగా అడవులలో ఆత్మార్పణ చేసిన విశాలాంధ్ర వీరులారా!మీ గౌరవ చిహ్నంగా మీ కాళ్లముందు తలదించుతున్నా! మీ స్మృతి చిహ్నంగా మీ చేతుల్లో ‘ఉదయిని’ ఉంచుతున్నా! అంటూ అమరవీరులకు అంకితం చేశాడు ఈ కవితా సంపుటిని. ఇకపోతే, నాటక సాహిత్యానికి వస్తే సుంకర సత్యనారాయణ రాసిన ‘మా భూమి’, వాసిరెడ్డి భాస్కరరావు రచించిన ‘ముందడుగు’ నాటకాలు ప్రసిద్ధం. ‘మా భూమి’ నాటకాన్ని ఆనాటి మద్రాసు ప్రభుత్వం నిషేధించింది. అది తెలంగాణ రైతుగాథ. ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి రాసిన ‘మరో చర్చ’ ను సమీక్షిస్తూ ఓ వ్యాసం ఉంది. ఈ సంపుటిలో తెలుగు సాహిత్య విమర్శపై సాధికార విశ్లేషణ అనే శీర్షికతో మార్క్సీయ విమర్శకుడు కా॥బి.సూర్యసాగర్‌ రాసిన ‘శ్రుతి’ ని విశ్లేషిస్తూ రాచపాళెం ‘‘సూర్యసాగర్‌ కమ్యూనిస్టు పార్టీ రాజకీయ ధోరణుల మీద కూడా చాలా విమర్శలు పెట్టారు. కొన్ని సందర్భాలలో ఇటు పార్లమెంటరీ కమ్యూనిస్టులను, అటు విప్లవ పార్టీలనూ విమర్శించి తనదైన ఒక మార్గాన్ని సరైనదిగా చెప్పకనే చెప్పుకొంటూ వచ్చారు. దీనిని నిశితంగా పరిశీలించాల్సి ఉంది అని అన్నట్లు సందర్భోచితంగా ఉటంకించారు పెనుగొండ.
‘సామాజిక, సాహిత్య ఉద్యమజీవి ఎస్వీ’ అనేశీర్షికన ఎస్‌.వి. సత్యనారాయణను గురించి రాస్తూ, ఆయన తెలుగులో ఉద్యమ గీతాల అనే పరిశోధన గ్రంథం, ‘తెలంగాణా సాయుధపోరాట సాహిత్యం’, ‘జీవితం ఒక ఉద్యమం’ అనే కవితా సంపుటి లాంటి అనేక రచనలు చేశారని తెలియజేశారు పెనుగొండ. అరసంలో అనేక హోదాలలో ఇద్దరూ కలిసి పనిచేశారని తెలియ జేస్తూ, ‘జీవితం ఒక ఉద్యమం’లోని ఆత్మీయగీతం’ తన గురించేనని కొన్ని పంక్తులు ఉటంకించారు. ఎస్వీరాశాడు: ‘అతడొక మౌన కృషీవలుడు/ నిర్విరామ పథికుడు/ అతనొక అభ్యుదయ సాహిత్యోద్యమ కార్యకర్త/ అరుదుగా అద్భుతమైన కవితలల్లే కార్యకర్త/ ఆధునిక కథా సరిత్సాగరంలో/ ఆణిముత్యాల నేరుకుంటూ ఉంటాడు/
‘దీపిక’ లో కథలు రాయడం ఎలా? అనే శీర్షికన ఓ వ్యాసం ఉంది. ఈ అంశంపై వివిధ రచయితల అభిప్రాయాన్ని ఉటంకించిన పెనుగొండ లక్ష్మీనారాయణ కథానికా రచన గురించి శ్రీమతి కనుపర్తి వరలక్ష్మమ్మ తన ‘కథ ఎట్లా ఉండాలి?’ అనే అంశం మీద రాసిన కథాంశం ప్రస్తావిస్తూ ఈ వాక్యాలు ఉటంకించారు. ఆమె అంటారు ‘‘మనోహరమైన ఒక గులాబీ పువ్వు యొక్క ఆకృతి, రంగు, మృదుత్వము, పరిమళము, మకరందము మనల నెట్లా ఆకర్షిస్తూ ఉంటాయో, అలాగే కథా కుసుమం కూడా కల్పన అనే ఆకృతి, వర్ణన అనే రంగూ, శైలి అనే మృదుత్వము, రసమనే పరిమళము, నీతి అనే మకరందము కలిగి ఆకర్షవంతమైనవిగా ఉండాలి. ఇందులో ఏది లోపించినా కథా కుసుమం రాణించదు.
కథా సంకలనాల విషయానికొస్తే, సుప్రసిద్ధ కథా రచయిత చాసో (చాగంటి సోమయాజులు) మార్చి 1985లో సంకలనం చేసిన ‘కళింగ కథానికలు’ మొదటి ప్రాంతీయ సంకలనం అయినా, ఇందులో కళింగ ప్రాంతానికి చెందిన కథలు కనపడవు. కాని రచయితలందరూ ఆ ప్రాంతానికి చెందిన వారే. 1992 ఆగస్టులో ‘సీమకథలు’ అనే సంకలనాన్ని సింగమనేని నారాయణ సంపాదకత్వంలో విశాలాంధ్ర ప్రచురణాలయం ప్రచురించింది. నిర్దిష్ట ప్రాంతీయ స్వభావం గల కథలివి. రాయలసీమ జీవితాన్ని విమర్శనాత్మక వాస్తవికతావాద దృష్టితో రాసిన కథలివి. అనంతపురం జిల్లా రచయితల సంఘం వారు ‘ఇనుప గజ్జెల తల్లి’ అనే శీర్షికతో సింగమనేని నారాయణ, శాంతినారాయణ అనంతపురం కరువు కథల సంపుటిని వెలువరించారు.
మరోఅధ్యాయంలో విరసం ప్రచురణల్ని పేర్కొన్నారు పెనుగొండ. ‘దీపిక’ లో అంతిమవ్యాసం` మనం సాధించాల్సిన సాంస్కృతిక విధానం. ఒక సాంస్కృతిక విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని సూచిస్తూ, ఒక అనువాద అకాడమీని నడపాలని కోరారు. పెనుగొండలక్ష్మీనారాయణ విస్తృత అధ్యయనం, అరసాన్ని గురించిన సాధికార సమాచారం, సంస్కృతికీ, అనువాదానికి సంబంధించిన అమూల్య సూచనలు ‘దీపిక’ ప్రత్యేకతలు. వరప్రసాద్‌ అన్నట్లు రచయితలకు, ఔత్సాహికులకు, ముఖ్యంగా సాహిత్య పరిశోధకులకు ఈ దీపిక నిజంగానే కరదీపిక.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img