Saturday, June 10, 2023
Saturday, June 10, 2023

అసమర్థతకు ఆనవాలు మోదీ

సవ్యంగా ఆలోచించగలిగే వారు కూడా మోదీ ప్రభుత్వ సమర్థతా రాహిత్యాన్ని గుర్తించలేక హిందుత్వ రాగా లాపనకు పాల్పడుతున్న దశలో మోదీని నిలదీయడం సాహసమే. ఒక వేపు అకడమిక్‌ అర్హతలు, ఇంకోవేపు ఆర్థికశాస్త్రంలో సంపూర్ణ అవగాహన, మరో వేపు తల్లిదండ్రులు కూడా రాజకీయాలలో ఉండడం వీటన్నింటికీ తోడు స్వయంగా సామాజిక-రాజకీయ-ఆర్థిక పరిణామాల మీద క్షుణ్నమైన అవగాహన ఉన్నందువల్లే పరకాల ప్రభాకర్‌ మోదీ అసమర్థతను ‘‘ది క్రుకెడ్‌ టింబర్‌ ఆఫ్‌ న్యూ ఇండియా: ఎస్సేస్‌ ఆన్‌ ఎ రిపబ్లిక్‌ ఇన్‌ క్రైసిస్‌’’ లో నిర్మొహమాటంగా బయట పెట్టగలిగారు. పరకాల తల్లి, తండ్రి కూడా రాజకీయాలలో ఉన్నవారే. తల్లి కాళికాంబ శాసనసభ్యురాలిగా ఉండేవారు. తండ్రి పరకాల శేషావతారం మూడు మంత్రివర్గాలలో పని చేశారు. అంతకు ముందు ఆయన కమ్యూనిస్టు పార్టీలో ఉండేవారు.
పరకాల గ్రంథం లాంఛన ప్రాయంగా ఆవిష్కరణ జరగకపోయినా ఆలోచనాపరులను ఆకర్షించింది. ‘‘ది వైర్‌’’ వెబ్‌ పోర్టల్‌ లో రచయితను కరణ్‌ థాపార్‌ ఈ గ్రంథంపై సుదీర్ఘంగా ఇంటర్వ్యూ చేశారు. ప్రేం ఫణిక్కర్‌ కూడా ఆయనను ఇంటర్వూ చేశారు.
పరకాల ప్రభాకర్‌ కు రాజకీయ ఆర్థిక శాస్త్రంలో అభినివేశం ఉంది. రాజకీయ, సామాజిక వ్యాఖ్యాతగా ఆయన గురించి అనేకమందికి తెలుసు. ఈ టీవీలో ‘‘ప్రతిధ్వని’’ కార్యక్రమాన్ని పరకాల కొన్నేళ్ల పాటు నిర్వహించారు. ఏన్‌ టీవీలో ‘‘నమస్తే ఆంధ్రప్రదేశ్‌’’ పేర ఇలాంటి కార్యక్రమం కొనసాగించారు. ఒకప్పుడు ఆయన బీజేపీలో ఉన్నారు. కొంతకాలం ఆంధ్ర ప్రదేశ్‌ లో బీజేపీ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంతకాలం సమాచార వ్యవహారాల సలహాదారుగా కాబినెట్‌ హోదాలో ఉన్నారు. ప్రజా రాజ్యం పార్టీ ఏర్పడినప్పుడు ఆయన వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగానూ, అధికార ప్రతినిధి గానూ బాధ్యతలు నిర్వర్తించారు. ‘‘మిడ్‌ వీక్‌ మాటర్స్‌’’ అన్న ఆయన యూట్యూబ్‌ కార్యక్రమానికీ బహుళ జనాదరణ దక్కింది.
ఈ విస్తారమైన అనుభవమే ఆయన ఈ తాజా గ్రంథం వెలువరించడానికి కారణం కావొచ్చు. ఈ గ్రంథం ఆవిష్కరణ బెంగళూరులో ఆదివారం జరిగింది. ఈ గ్రంథంలో అనేక విషయాలను ఏ మాత్రం బెరుకు లేకుండా, మొహమాటాలకు, తెచ్చిపెట్టుకున్న మర్యాదలకు పోకుండా రాయడం ఒక రకంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. మోదీ అధికారం చేపట్టిన తరవాత నెలకొన్న ప్రస్తుత వాతావరణమే ఈ ఆశ్చర్యానికి కారణం. అయితే ఈ గ్రంథాన్ని ప్రచురించాలా లేదా అని కొంత కాలం పరకాల సందిగ్ధంలో ఉన్నారట. చివరకు సాహసించారు. ఈ గ్రంథ ప్రచురణ నిజంగా సాహసమే. ఎక్కడైనా తప్పు జరిగినప్పుడు దాన్ని ఎత్తి చూపడం పరకాల నైజం. పరకాల రాజకీయాలను ఆమోదించినా, ఒప్పుకోక పోయినా ఆయన నిజాయితీని శంకించలేం. మోదీ హయాంలో ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయిపోయిందంటారు ప్రభాకర్‌. అక్కడితో ఆగకుండా మోదీ ప్రభుత్వానికి ఆర్థికాంశాలలో నిర్దిష్టమైన సిద్ధాంత ప్రాతిపదిక లేదని చెప్పారు. ఎక్కడైనా తప్పు జరుగుతోందని అనిపించినప్పుడు కిమ్మనకుండా ఉండలేని తత్వం ఆయనది. ఆర్థిక విషయాలలో మోదీ అసమర్థత కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని రుజువు చేయడానికి ఆయన అనేక గణాంకాలను మన ముందుంచారు. నిరుద్యోగం సగటున ఏడు శాతం ఉన్నా యువతలో అది 18 శాతం దాకా ఉండడం ఆందోళనకరం అంటారు ప్రభాకర్‌. మన జనాభాలో అత్యధికులు యువతే ఉన్నప్పుడు వారికి జీవనోపాధి లేకపోవడంతో పరిస్థితి వికటిస్తుందన్నఆందోళన ఆయనను వేధిస్తోంది. సంపద సృష్టిలో దేశ పరిస్థితి ఆశాజనకంగానే ఉన్నప్పటికీ ఆ సంపద అతి కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కావడం, విస్తారమైన జనాభా పేదరికంలో కూరుకుపోవడం కల్లోలాన్ని సృష్టించే ప్రమాదం ఉందంటారు పరకాల.
మన గణతంత్రానికి పునాదులు వేసిన వారి కృషి, ఆ నాటి విలువలు మోదీ హయాంలో శీఘ్రంగా పతనం అవుతున్నాయన్నది ఆయన ఆవేదన. ఇదే వ్యథ చాలా మందికి ఉంది. దీనికంతటికీ మోదీ, ఆయన నాయకత్వం లోని ప్రభుత్వ అసమర్థతే కారణం అన్న అభిప్రాయం ఈ గ్రంథం అంతా పరుచుకుని కనిపిస్తుంది. కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైన మాట వాస్తవమే అయినా ఆ గడ్డు రోజులు తొలగిపోయి నప్పటికీ మనం కరోనాకు ముందున్న స్థితికి చేరకపోవడానికి మోదీ ప్రభుత్వ అసమర్థతే కారణం అన్నది పరకాల గ్రంథంలో ప్రధానాంశంగా కనిపిస్తుంది. మన స్థూల జాతీయోత్పత్తి ఇప్పటికీ కరోనాకు ముందున్న స్థాయికి చేరుకోలేక పోయింది. 1980లో వాజపేయి, అడ్వాణీ లాంటి ఉద్దండులు బీజేపీని ఏర్పాటు చేసినప్పుడు గాంధేయ సోషలిజం తమ సిద్ధాంతం అన్నారు. ఆ తరవాత ఆ ప్రస్తావనే తీసుకురావడం లేదంటారు పరకాల. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు 1991లో ప్రవేశ పెట్టిన ఉదారవాద ఆర్థిక విధానాలు ఆ తరవాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ వేగవంతంగా అమలు చేయడం లేదని బీజేపీ తూర్పార పట్టేది. కానీ ఇదే బీజేపీ 1991లో అమలు చేసిన ఉదారవాద ఆర్థిక విధానాలను దుయ్యబట్టింది. దీనికంతటికీ కారణం నికరమైన ఆర్థిక సిద్ధాంత ప్రాతిపదిక లేకపోవడమేనని పరకాల తేల్చారు. మోదీ సర్కారు సరఫరా వేపే చూస్తోంది తప్ప గిరాకీ అంశాన్ని పట్టించుకోవడం లేదన్నది ఆయన అభ్యంతరం. పెద్ద నోట్లను రద్దు చేసి మోదీ ప్రభుత్వం దేశవాసులందరినీ దొంగ దెబ్బ తీసింది. ఇది అత్యంత వినాశకరమైందిగా తేలింది. నల్ల ధనం అంటే నోట్ల కట్టల్లో మాత్రమే ఉండదని పరకాల అంటారు.
మరుగు దొడ్లు నిర్మించడం, ఆర్థిక లావాదేవీలను డిజిటలీకరించి యు.పి.ఐ.లాంటి వాటిని ప్రవేశ పెట్టడం, గ్యాస్‌ కనెక్షన్లు ఉచితంగా ఇవ్వడం లాంటివి జనానికి కొంత మేర ఉపకరించి ఉండవచ్చు. కానీ అది ఆర్థిక వ్యవస్థను ప్రోది చేయడానికి ఎంత మాత్రం ఉపకరించలేదు అని చాలా మందిలో ఉన్న అభిప్రాయాన్ని పరకాల నిర్భయంగా ఈ గ్రంథంలో చెప్పారు. ప్రజలకు వెసులు బాట్లు కల్పించడం, ఆర్థికాభివృద్ధి సాధించడం ఒకటే కాదన్నది పరకాల వాదన. మన దేశంలో కోట్లాది స్మార్ట్‌ ఫోన్లు, ఆపిల్‌ ఫోన్లు తయారు చేయడం ఆర్థికాభివృద్ధికి సూచిక కాదంటారాయన. హిందుత్వ బీజేపీ రాజకీయా లలో పాతుకు పోయింది. అయితే మోదీ ప్రభుత్వం అనుసరించే ఈ విలోమ విధానాలను మోసపూరితంగా అమలు చేస్తున్నారంటారు పరకాల. విచ్ఛిన్నకర రాజకీయాల ఆధారంగా బీజేపీ, మోదీ జన సమీకరణ చేయడంవల్ల అపారమైన ముప్పు పొంచి ఉందన్నది ఆయన బాధ. పది పదిహేనేళ్ల కింద విరివిగా వినిపించే సెక్యులరిజం అన్నమాటను సైతం బీజేపీ వికృతీకరించింది. తామే నికరమైన సెక్యులర్‌ వాదులమనీ, మిగతా పార్టీలన్నీ కుహనా సెక్యులర్‌పార్టీలని బీజేపీ ఊదరగొట్టిన సందర్భా లను గుర్తు చేసుకుంటే పరకాల భాష మనకూ అర్థం అవుతుంది. తామే అసలైన సెక్యులర్‌ వాదులమని బీజేపీ చెప్పుకోవడంలో పెద్దమోసం ఉందని పరకాల సూత్రీకరించారు.
దేశ విభజన సమయంలో ఉన్న వాతావరణం ఒక వర్గాన్ని పనిగట్టుకుని ద్వేషించడానికి ఎక్కువ ఆస్కారం ఉన్నా అప్పుడు అలా జరగలేదు కానీ ఇప్పుడు జరుగుతున్న దంతా అదేనంటారు పరకాల. 2014లో బీజేపీ అధికారం లోకి రావడానికి ముందు మతతత్వం గురించి మాట్లాడ లేదు. అభివృద్ధి, అవినీతినే ప్రధాన సమస్యలుగా ముందుకు తోసింది. అధికారంలోకి వచ్చిన తరవాత అసలు రంగు బయటపెట్టింది. మోసకారితనం అంటే ఇదే కదా! ఈ గ్రంథం పొడవునా ఆయన వ్యక్తులను ఎక్కడా విమర్శించ లేదు. మోదీ అసమర్థత, పాలనా విధానమే సకల రుగ్మతలకు కారణం అని మాత్రం మొహమాటం లేకుండా చెప్పారు. ఉత్తర భారతంలో ఉన్న విద్వేష వాతావరణం దక్షిణభారతాన్ని కూడా ఆవహించే ప్రమాదం ఉందంటారు. మోదీ సామర్థ్యం అంతా మతతత్వాన్ని ప్రోత్సహించడం, విద్వేషం రెచ్చగొట్టడం, జనాన్ని చీల్చడంలో మాత్రమే ఉందని ఈ గ్రంథంలో నిర్భయంగా వెల్లడిరచడం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.
-ఆర్వీ రామారావ్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img