Saturday, June 10, 2023
Saturday, June 10, 2023

అస్తిత్వ వేదనే కవిత్వమైతే…

తన విశాల నేత్రాలతో వసుధైక జీవన సౌందర్యాన్ని దర్శించాలనుకుంటుంది కవిత్వం. అందుకోసం మానవ జీవన పార్శ్వాలను ఆత్మీయతాసుగంధంతో నింపుతూవుంటుంది. మనిషి మనిషికీ మధ్య అనుబంధపు ప్రవాహమైపోవాలని తహతహలాడి పోతుంటుంది. మనిషి హక్కుల్ని కాలరాసే సామాజిక అసమానతల్నించీ, కొండంతగా పాకిపోతున్న వివక్షల్నించీ పెల్లుబికే అస్తిత్వ వేదనను చూసి కవిత్వమూ చలించిపోయింది. ఆ అసమానతల్నీ, ఆ వివక్షల్నీ కూకటివేళ్లతో పెకళించడానికి అది కొండంత సామాజిక బాధ్యతను భుజానెత్తుకొని ఒక ఆయుధమై పోయింది. అస్తిత్వ పోరాటమైపోయింది. పూలపరిమళాల్ని గుప్పిట పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక దోపిడీలకు పాల్పడుతూ పితృస్వామ్య వ్యవస్థ నిర్మించిన మహిళల మౌనవేదనల కోటలపై విర్రవీగే పురుషాహంకారపు పతాకాలను కూలద్రోయడానికి, బహుజనుల ఆత్మగౌరవపు తోటల్లోకి చొరబడిన కులాధిపత్యపు శిశిరాలను కాలరాయడానికి కవిత్వం తన అక్షరాలనిండా చైతన్యప్రవాహాన్ని వొంపుకుంటూనే వుంది. నిరంతర అస్తిత్వ అన్వేషణలో అది ఒక అనివార్య యుద్ధగీతమైపోయింది. బిగుసుకున్న పిడికిలి అయిపోయింది. ఆకాశమంత స్వేచ్ఛ కోసం, వెన్నెలంత ఆత్మగౌరవం కోసం అది తపిస్తూనేవుంది.
‘మొగ్గలు పువ్వులవకుండా కిటకిట్లాడే క్రిముల నిఘా
చుక్కలు పదునెక్కకుండా మబ్బు మబ్బు రాజుకున్న పొగ
రెక్కలు ఎగరనీకుండా క్షతపవనాలు చుట్టిన పగ
వీళ్లు కదా మన మిత్రులు, పుత్రులు, తండ్రులు
తీరని శాపాలు, తలకొరివి దీపాలు అని పాడుకుంటూ
పహారాలతో, పరదాలతో జీవితం మీద పేరుకుంటున్న
చావునీటిమట్టాన్ని తోడి పారబోసుకోవడం పూర్తికానేలేదు’
(‘స్లీపింగ్‌ పార్టనర్‌’ ఖండిక నుంచి)
అంటూ స్త్రీ అస్తిత్వాన్ని తన పదఘట్టనలతో అణచివేసే పితృస్వామ్యవ్యవస్థ మీద ధ్వజమెత్తింది కొండేపూడి నిర్మల కలం. పూల సరాగాలు కాకముందే మొగ్గల నిండా విరాగాల్ని నింపే సామాజిక కీటకాల నిఘాపై నిఘాపెట్టింది కవిత్వం. నిండుగా కాంతులు చిమ్మకముందే నారీనక్షత్రాలను కప్పేసిన పురుషాహంకారపు మబ్బుల పొగకు పొగ పెట్టాలని యత్నిస్తోంది. రెక్కలస్వేచ్ఛకు అడ్డుపడే ప్రచండ పవనాల పగను పసిగడుతోంది. ప్రియతములనే వాళ్లతో గడిపే క్షణాలన్నీ తీరని శాపాలైపోతుంటే, వారంతా తమపాలిట కొరివి దీపాలైపోతుంటే ఆ మహిళ వేదనంతా తానే అయిపోయింది కవిత్వం. ఆమె పాలిట పహారాలుగా, పరదాలుగా పెత్తనం చెలాయిస్తున్న పురుషాధిపత్యపు శృఖలాల్ని చేధించడానికి చైతన్యప్రవాహమై పోయింది. సన్నని నీటిపాయలు సెలయేళ్లైపోవాలని, సెలయేళ్లు నదులైపోవాలని, నదులు సముద్రాలైపోవాలని, ఆ సముద్రాలు అస్తిత్వపు అలలతో ఎగిసిపడుతుండాలని అది తపిస్తోంది.
‘నేనూ/ నా వేసబాసలు వెక్కిరింతలైనచోట
నా ఇల్లు ఊరవతల కాలనీగా మొలుస్తున్నపూట
నన్ను ఎక్కడికక్కడ వేరుచేస్తున్న చోట
జివ్వుమనే నొప్పితో నవ్వుల తోటనెలా అవుతాను
……………….
నా చెప్పులపై నడిచి/ నా డప్పులతో ఊరేగి
నా సప్పరంలో కొలువుదీరేదాకా/ నేను ఇలాగే ఇలాగే
నా నెత్తురుతో మాట్లాడుతుంటాను
నేనేందో తెల్సుకున్నాకా/ నాను నాలాగే మాట్లాడుతుంటాను’
(‘నేను పలానా’ ఖండిక నుంచి)
అంటూ బహుజన అస్తిత్వ వేదనను అక్షరీకరించింది వర్తమానకవి పల్లిపట్టు నాగరాజు కలం. తన ఉనికికి అడ్డుపడే కులాధిపత్యపు వెక్కిరింతల్ని ప్రశ్నించే బాధితుడికి కవిత్వం తోడైంది. మనిషి నుంచి, సామూహిక మనిషితనం నుంచి తనను వేరుచేసేసామాజిక బాధ అతడిది. ఆధిపత్యం తన ఆత్మగౌరవానికి తూట్లు పొడిచేబాధ అతడిది. అతడి వేదనతో కవిత్వం మమేకమైపోయింది. పనిగట్టుకొని అతడిని ‘పలానా’ చేసేస్తున్న సామాజికశక్తులపై యుద్ధం ప్రకటించాలని, అతడు తల ఎత్తుకొనే నవ్వులతోట కావాలని, ఆత్మీయతా పరిమళాల మధ్య అతడు తొక్కుడుబిల్లాట ఆడాలని, అతడిని బాధిస్తున్న తరతరాల జివ్వుమనే నొప్పి రివ్వుమని ఎగిరిపోవాలని అది తపిస్తోంది. ఆత్మవిశ్వాసపు డప్పులతో ఊరేగి సంకల్పపు కొలువుదీరేదాకా కుతకుతలాడే నెత్తుటితో మాట్లాడే అతడి అనంతమైన బాధతో జతకట్టి ఓదార్పునిస్తుంది కవిత్వం. మనిషి విభిన్న జీవన పార్శ్వాలలోకి తొంగిసూస్తూ అతడిలో సంలీనమైపోతూ వుంటుంది. అందుకే అది నిరంతరం ఆరళ్ల కాసారంలో మగ్గిపోయే గానుగెద్దు జీవితం లాంటి అమ్మ దుఃఖమైపోతుంది. బానిసత్వపు కొలిమిలో ఇనుప దిమ్మెలా రగిలిపోయే అయ్య వేదనైపోతుంది. కవిత్వం తనలోని సహస్ర ముఖాలను అస్తిత్వ పతాకాలుగా ఎగరేస్తుంటుంది.
-డాక్టర్‌ కొత్వాలు అమరేంద్ర, సెల్‌: 9177732414

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img