Tuesday, December 5, 2023
Tuesday, December 5, 2023

ఆధునిక తెలుగు కవిత్వంలో ‘నాన్న’

చలపాక ప్రకాష్‌ . సెల్‌ నం. 9247475975

నాన్న! రెండక్షరాల ఈ పదం వెనుక ఎన్ని కష్టనష్టాలు దాగున్నాయో కదా! కుటుంబ వ్యవస్థకు ‘అమ్మ-నాన్న’ రెండు కళ్ళులాంటి వాళ్ళు. ఏ ఒక్కరు లేకున్నా ఒంటి కన్ను చూపులా ఉంటుందా కుటుంబం. అంతటి కుటుంభ వ్యవస్థని ఒంటి చేతితో నడిపే ధీరుడు నాన్న ఒక్కడే. అమ్మ లాలనా పాలనా చూస్తూంది. కాని నాన్న మాత్రమే కుటుంబం మొత్తానికి ఇంటి పైకప్పులా నిలిచి నీడ అవుతాడు. బిడ్డల భవిష్యత్తుకు ఊతమవుతాడు. మన పురాణాలలో తండ్రి గుణగణాలను తెలిపే అనేక పాత్రల రూపంలో చదివి వుంటాం. కాని ఆధునిక కవిత్వంలో ‘అమ్మ’ పై వచ్చినంత కవిత్వం ‘నాన్న’పై రాలేదనే చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. కాని 2000 శతాబ్దం తదుపరి వచ్చిన మార్పులలో తెలుగు కవిత్వంలో ‘నాన్న’పై మమకారం పెరిగినట్లు కనిపిస్తోంది. అంతకు ముందువరకు కేవలం ఎక్కడో ఒకటి అరా తప్పించి నాన్న పై వచ్చిన కవిత్వం, పూర్తిగా నాన్నపై వెలువడిన దీర్ఘకవిత్వం వచ్చినట్లు ఆధారాలు లేవు. కాని 2000 తరువాత ‘నాన్న’ ఔన్నత్యాన్ని తెలుగు కవులు గుర్తించారని చెప్పడానికి ఈ కాలంలో ‘నాన్న పై వెలువడిన దీర్ఘకవితలే అందుకు సాక్షాలుగా నిలుస్తున్నాయి…. అలా వెలువడిన ‘నాన్న’ కవితా సంపుటాలలో లభ్యమైన కొన్ని సంపుటాలనుండి ‘నాన్న’ ఔన్నత్యాన్ని తెలుగుకవులు ఎలా వ్యక్తం చేసారో గమనిద్దాం.
తెలుగులో అనేక ప్రక్రియలలో రచనలు చేసిన ఎస్‌.ఆర్‌.ఫృథ్వి అక్టోబర్‌ 2005 సంవత్సరంలో ‘నాన్న జ్ఞాపకాలు’ అంటూ ఒక చిన్న దీర్ఘ కవితను, మళ్ళీ జూన్‌ 2010లో పునఃముద్రణ కూడా పొందడం గమనార్హం. అందులో – ‘‘అమ్మకోసం! శక్తికి మించిన స్వర్ణాభరణాలు/ ఈయన వంటి మాత్రం/ వీసం ఎత్తు బంగారం కనిపించదు’’ అంటూ తనకంటూ ఏమీ మిగుల్చుకోని తండ్రి గుణాన్ని ఆవిష్కరించారు పృథ్వీ. 2005లో తోటకూర వేంకట నారాయణ ‘పితృదేవోభవ’ అంటూ మరో ‘నాన్న పై దీర్ఘ కావ్యం రచించడం విశేషం. ‘‘నీ జీవితం/ కొవ్వొత్తిలా కరిగింది/ మా జీవితాలకు/ వెలుగు మిగిలింది! వడ్డించిన విస్తరి/ మాకందింది/ నీకేమో / ‘సల్లన్నం’ దక్కింది’’ అని నాన్న సర్దుకుపోయే తత్వాన్ని, కుటుంబం నాన్నను చిన్నచూపు చూసే భావాన్ని తేటతెల్లం చేశారు. ‘‘క్రింది పెదవి/ లోనికి మడిచి/ పై పళ్లతో అదిమి పెట్టి/ గుడ్లురిమి ఖంగుమంటూ! ‘చెమడాలొలుస్తా గాడిదా..! అని ఒక్క/ గాండ్రిరపు గాండ్రిస్తే/ ఎంతటి పులైనా/ అవుతుంది నీముందు పిల్లి/ ఎంతటి హీరోjైునా/ అవుతాడు నీ ముందు జీరో’’ అని పిల్లల్ని సరైన దారిలో పెట్టేందుకు తండ్రిగా ఎంతటి భీకర అవతారమెత్తవలసి వస్తుందో చెప్తారు. ‘‘నాన్నా/ రూపమెంతో రమ్యం/ సంస్కారమెంతో ఉన్నతం/ స్థితిగతులు మహోన్నతం/ నాన్నా… చెమట కష్టం నీది/ సుఖసంతోషాలు మావి…. మా అందరి అవసరాల కోసం/ అరిగే సుద్దముక్కవు అయ్యావు! కరిగే కొవొత్తివి అయ్యావు..’’ అనే సత్యాన్ని గుర్తుచేస్తారు కవి.
పేరుకు ‘నాన్న’ శీర్షికతో కవితా సంపుటాలు వెలువడినా పూర్తి కవిత్వం నాన్న వస్తువుగా తీసుకోని మరో కొన్ని కవితా సంపుటాలు కూడా ఈ కాలంలో వెలువడి కవులుగా తమ తండ్రులను స్మరించుకోవడం కూడా గమనించొచ్చు. సెప్టెంబర్‌ 2006లో చిత్తలూరి సత్యనారాయణ వెలువరించిన ‘మానాయిన’ (దీర్ఘ కవిత కాకపోయినా)లో ‘‘రక్తాన్ని పాలుగా మార్చి అమ్మ ప్రాణం పోస్తే/ రక్తాన్ని చెమటగా స్రవించి/ నాయిన జీవం ప్రసాదిస్తాడు’’ అంటూ తలిదండ్రలు యొక్క ఔన్నత్యాన్ని రెండు కళ్లుగా సాగించే వైనాన్ని వివరిస్తారు. మరో కవి డాక్టర్‌ గూటం స్వామి మార్చి 2012లో ‘‘నాన్న మా గోదావరి’ వెలువరించారు. ఇందులో రెండు కవితలు నాన్న పై కవికున్న ప్రేమాభిమానాలను చాటుకున్నారు. ‘‘మా నాన్న ఇప్పటికీ/ కాలంతో పోటీ పడుతుంటాడు/ చీకటికీ మా నాన్నంటే భలే భయం/ మా నాన్న లేవడంతోనే! చీకట్లను తన రెండు కళ్ళతో తరిమేస్తాడు’’ కుటుంబ బాధ్యతలను తన భుజస్కందాలపై మోసే తండ్రి సుఖనిద్రను వొదులుకొని శరీరకశ్రమకు ఎలా అలవాటు పడతాడో ఈ కవితలో చూపిస్తారు. కవి. మరో కవితలో- ‘‘నాకు తెలిసి నువ్వు సుఖపడిరది లేదు! నువ్వెప్పుడు గానుగెద్దులా కష్టపడి/ మాకోసం నీ జీవితాన్ని కరిగించావు/ నీ సంపాదనంతా ఖర్చు చేశావు/ నీ రక్తాన్ని మాకోసం ఆవిరి చేసావు/ ఇంత చేసినా నీకు తృప్తి కలగలేదా నాన్నా?! చివరికి నీ ఆఖరి సంస్కారాలకు/ మేం ఇబ్బంది పడకూడదని (డబ్బు) దాస్తున్నావా నాన్నా’’ ఎంతటి విషాద గాథ, చివరికి తన చివరి రోజులలోనూ తన బిడ్డను కష్ట పెట్టకూడదని తండ్రి మనసు ఎలా ఆలోచిస్తుందో ఈ కవితలో చదివితే మనకు అం్థమవుతుంది. ‘‘నువ్వు క్రొవొత్తిలా కరిగిన వైనం తెలుసు/ నా చిన్నప్పుడు/ నువ్వు జొన్న చేల కాపలాకు వెళ్తుంటే/ లేగ దూడలా నీవెంట రావడం తెలుసు/ మాకు ఏం కావాలన్నా క్షణాల్లో అమర్చి పెట్టిన/ నీ హృదయం తెలుసు/ క్రమశిక్షణ తప్పితే/ సైకిల్‌ పంపు ట్యూబ్‌ తో దండిరచడం తెలుసు’’ అని కవి జ్ఞాపకాలలో తండ్రి సున్నిత హృదయము, క్రమశిక్షణ కోసం దండిరచిన వైనపు తండ్రిలోని రెండు కోణాల్నీ చూడవచ్చు. అలాగే ‘నాన్నలేని గది’ ఎలా వుంటుందో కవితాత్మకంగా చెప్తారు గూటం స్వామి. ‘‘నాన్నలేక పోవడం అంటే/ పెరట్లో అరటిచెట్టు/ అకస్మాత్తుగా కుప్పకూలిపోవడం/ నాన్నలేక పోవడం అంటే/ బలంగా వేళ్ళూనిన చింతచెట్టు/ మొదలకంటూ పడిపోవడం/ జీవితపు నౌక అనుకోకుండా! భళ్ళున బద్దలైపోవడం…!!’’ అంటారు.
మరో కవి బోజంకి వెంకట రవి తన తండ్రి మరణంతో ‘గుండె పలక’ పేరుతో ‘ఎలీజీ’ వెలువరిస్తూ ‘‘కొడుకు కవిగా మారిన తృప్తి/ ఈ జన్మకు చాలనుకున్నావా నాన్నా’’ అంటూ ‘‘కలం పట్టకురా.. వదిలెయ్‌ రా…. కల్లంపట్టున నాలుగు రాళ్ళేరుకు తెచ్చుకోరా, నీ బిడ్డలకు బ్రతుకవ్వరా అని మొత్తుకున్నావే…! పై పైకి విసుక్కుంటూనే, లోలోపల సంతృప్తిగానే వెలిగిపోయావ్‌’’ అని కొడుకు కవి అవ్వడం గర్వంగా ఉన్నా, కడుపునింపని వైనానికి తండ్రిగా బాధపడిన సందర్భాన్ని సుస్పష్టంగా చెప్పారు కవి. శతాధిక గ్రంథకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్‌ రచించిన ‘నాన్న శతకం’లో కళ్ళు చెమర్చే విధంగా 108 పద్యాల్లో నాన్న ఔన్నత్యాన్ని భిన్న కోణాల్లో చూపారు. ‘‘కష్టమంతా బయటికి చెప్పక/ గుట్టుగాను బాధగుండె దాచి/ సంతసమ్ము పంచు వింత జీవియె నాన్న/ ఘనుడు నాన్న త్యాగధనుడు నాన్న!’’ లోన ఎంత మధనపడుతున్నా చెరగని చిరునవ్వుతో కనిపించే నాన్న నిజస్వరూపాన్ని దర్శింపచేసారు చిగురుమళ్ళ. జూన్‌ 2020లో డాక్టర్‌ భీంపల్లి శ్రీకాంత్‌ వెలువరిచిన ‘నాన్న మొగ్గలు’ లో కూడా మొత్తం పుస్తకం నాన్న ఔన్నత్యాన్ని చెప్పినదే మళ్ళీ మళ్ళీ చెప్పి నాన్నపై మమకారాన్ని మరింత పెంచుతారిలా- ‘‘నన్ను భుజాలమీద ఎత్తుకుని తిరుగాడినప్పుడల్లా! ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కినంత సంబరమయ్యేది/ నాన్నంటే ఎవ్వరికీ అందని ఎవరెస్టు శిఖరాగ్రం’’. ‘‘జీవనపయనంలో పరుగులు పెడుతూనే! ఇంటికి వెలుగులను ప్రసరింపజేసినవాడు/ అమ్మ దీపమైతే నాన్న కరిగిపోయే
ఈ విధంగా కవులందరూ దృష్టిలో ‘నాన్న’ కరిగిపోయే కొవ్వొత్తిగా ఏకాభిప్రాయం వ్యక్తం కావడం స్థూలంగా కనిపిస్తుంది. తండ్రిపై వచ్చిన కవితా సంపుటిలో ఇవి కొన్ని మాత్రమే. మరెన్నో ఈ కాలంలో వెలువడి నాన్న ఔన్నత్యాన్ని తల్లితో సమానంగా మరింత ఇనుమడిరపదిశలో కొనసాగుతూ ఉండడం విశేషం. కవిత్వంతో పాటు నాన్న గొప్పతనం వ్యక్తం అయ్యే పాటలూ, షాట్‌ ఫిలిమ్స్‌ రావడం, అవి ప్రజలను ఆకర్షించి గుర్తించే స్థాయిని కలిగి ఉండడం.. బహుశా అంతర్జాతీయలో ‘ఫాదర్స్‌-డే’ ఏర్పాటు ప్రభావమేమో అనిపిస్తోంది?!! కావొచ్చునేమో.
(జూన్‌ 20న ‘ఫాదర్స్‌-డే’ సందర్భంగా)

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img