Saturday, November 26, 2022
Saturday, November 26, 2022

ఆధునిక స్త్రీ హృదయాన్ని ఆవిష్కరించిన నీలిగోరింట

అద్దేపల్లి ప్రభు

‘‘ఇంద్రధనుస్సుకే సరికొత్త సొగసులందిస్తాం
సీతాకోక చిలుక్కే కొత్తరంగులద్దుతాం
వీచేగాలితో పోటీపడి ఈలవేస్తాం/ పారేనీటితో పందెంవేస్తాం
ముట్టుకుంటే ముడుచుకుపోయే అత్తిపత్తిలా గాక
పలకరిస్తే చాలు చిరునవ్వు విరి గుత్తులమై
సిరులెవెన్నొ పంచుతాం
రెచ్చగొట్టేలా వస్త్రాలు ధరిస్తాం/ విచ్చల విడిగా విహరిస్తాం
కాళ్ళు విరిగిన కుంటి గుర్రంలా
రెక్కరెక్కలు తెగిన విహంగంలా
ఒక మూల పడి ఉండక/వామన వృక్షంలా ఒదిగి ఉండక
సాటి వారితో సమానంగా’’ ఉంటాం.
కవిత్వమూ ఉద్యమమూ పరస్పర పూరకాలు. రెంటి మధ్యా ఉండే ఒక గతితార్కిక సంబంధం ఒక దాన్ని మరొకటి బలపరిచి పెంచడమే కాదు ఒకదానికొకటి ఒక సౌందర్యాన్ని కూడా ఇస్తాయి. మనకి సంబంధించినంత వరకూ తెలుగులో కవిత్వమే ఒకఉద్యమంగా నడవడమూ మనందరికి పరిచయం. అంటే సాహిత్య ధోరణిగా ఒక తాత్విక ఆలోచన రావడమే కాదు అది అనేక మందిలో ఒక చైతన్యాన్ని తీసుకు రావడం.
తెలుగునాట అలా వచ్చిన కవిత్వోద్యమాలో ఫెమినిజం ఒకటి. స్త్రీలు రాయడంస్త్రీ గురించి రాయడం మనకి ఉన్నప్పటికీ స్త్రీవాదపు ప్రత్యేకతఅది వ్యక్తిగతమూ రాజకీయమే అని ప్రకటించడం. సమాజ పరిణామపు మూలాల్లోకి వెళ్ళి స్త్రీ అణిచి వేతకి కారణమైన అన్ని అంశాలనీ వెలికి తీయడం. స్త్రీ అణచివేతకి సంబంధించి మనకి సంస్కరణోద్యమ కాలం నుండే సహానుభూతి ఉంది.
అయితే స్త్రీ వాదులు మన ఆలోచన మీద బలమైన ముద్ర వేయగలగడానికి కారణం స్త్రీవాదుల స్త్రీ ఆధునిక స్త్రీ. విద్య, ఉద్యోగం, స్వతంత్ర భావాలను కలిగిన సంపూర్ణ స్త్రీ. ఎనభై తొంభైల నాటికి స్త్రీలు ఉత్పత్తి ఉద్యోగ రంగాలలోకి పూర్తిగా ప్రవేశించడం జరిగింది. భార్యాభర్తలు ఇద్దరూ కచ్చితంగా ఉద్యోగం చేయాలి అనే స్థితి మన సమాజంలోకి అనివార్యంగా ప్రవేశించింది. స్త్రీ కి సంబంధించిన చాలా అంశాలు ఇక్కడ మలుపు తిరిగినాయి. స్త్రీకి ఆర్థిక స్వాతంత్య్రం కావాలని గురజాడ నించి చలం వరకూ అందరూ అన్నారు. చలం స్త్రీ సెక్సువాలిటీ గురించి మాట్లాడాడు. సామాజిక స్థితి, ఆర్థికం, స్త్రీ శరీరం, వ్యాపారం ,సంతానం పెంపకం యివన్నీ ఈవేళ స్త్రీలు ప్రశ్నిస్తున్న అంశాలు.
మందరపు హైమవతి స్త్రీవాద దృక్పథంతో కవిత్వం రాస్తున్నారు. నీలి గోరింట అనే కవితా సంపుటిని ఇటీవల వెలువరించారు. యాభై ఏడు కవితలున్న ఈ సంపుటి పాఠకుల్ని ఆకట్టుకుంటుంది.
మాటలు లేని ఎడారిలో అనే కవితలో
మరణించడానికి కూడా/ సమయం లేదని అన్న నువ్వే
ఎక్కణ్ణుంచో సెల్‌ మోగగానే/ఒక్కసారిగా ఊపిరి వచ్చినట్టు
విరామచిహ్నం లేని/ మాటలప్రవాహానికి తలుపు తెరుస్తావు.
మన చేతుల్లోకి మాయమరాఠీలా చేరిన సెల్‌ కలిసి ఉన్న మనుషులమధ్య మాటల్లేని ఎడారుల్ని ఎలా సృష్టిస్తోందో చెపుతుంది.
ఉద్యోగం చేస్తున్న స్త్రీకి అదనంగా చేరిన బాధలు కొన్ని ఉన్నాయి. వంటచేయడం, పిల్లలను కనడం, పెంచడం, అంట్లు తోమడం లాంటి ‘స్త్రీత్వపు’ పనులోకి ఈవేళ ఉద్యోగం కూడా చేరింది. ఉద్యోగం మగవారిని మగ మహారాజుని చేసింది. కానీ అది స్త్రీకి అదనపు పనిగా అయింది.
‘ఏటిఎం కార్డు శాశ్వత చిరునామా
ఎప్పుడూ మా ఆయన జేబే’
నీళ్ళు నమిలే మాటలూ, చల్లకొచ్చి ముంత దాయడాలు లేని సూటి ఎత్తుగడ. ప్రేమా,అనుబంధం లాంటి మాటలన్నీ ఈ జేబు చుట్టే తిరగాలి.
చాలామంది ఉద్యోగినుల జీతం మీద వారికి ఏ అధికారమూ ఉండదు. ఉద్యోగం ఆర్థిక స్వాతంత్రంగా కాక బానిసత్వపు అదనపు అర్హత అయింది. యిది ఆధునికత్వం పైన అజమాయిషీ సాధించిన మగతనం తెచ్చిన కొత్త పెయిన్‌.
అద్దెకో గర్భం కవితలో కాపిటలిజంలోని ప్రధాన అంశం ప్రతి దాన్నీ మార్కెట్‌ సరుకుగా మార్చడం. ప్రపంచీకరణ దాని తాలూకూ అతి విశ్వరూపం. ఇది సంస్కృతినీ, మానవ సంవేదనల్ని కూడా సరుకుగా మారుస్తున్నది. గర్భాన్ని ఒక సరుకుగా మార్చి మానవ సంబంధాన్ని వికృతంగా ఎగతాళి చేసే అద్దెకో గర్భం ప్రకృతి సహజాతాన్నీ, మానవ గౌరవాన్ని కూడా మంట కలుపుతోంది. దీనిపట్ల వ్యతిరేకత రెండు విధాలుగా ఉంది. ఒకటి పవిత్రమాతృమూర్తి అంటూ చెక్క భజనలు చేసే సాంప్రదాయ వాదులు. రెండు మానవ సంబంధాల పరిపూర్ణత కోరుతూ స్త్రీ గురించి మాట్లాడే ప్రగతిశీలురు.
నాన్న కవితలో సాధారణంగా తల్లి గురించి రాసినట్టుగా తండ్రి గురించి రాయడం అరుదు. కానీ ఈ మధ్య తండ్రి గురించిన కవితలు విస్తారంగా వస్తున్నాయి.
‘ఒకప్పుడు చందమామ కథల్లో రాక్షసునిలా
జానపద గాథల్లో మాంత్రికునిలా
నాన్నంటే పిల్లలకు సింహస్వప్నం’’
పిల్లల పెంపకంలో మనకి రెండు పద్దతులే తెలుసు. ఒకటి చావగొట్టి చెవులు మూయడం. రెండు గారాబంతో నెత్తిన పెట్టుకోవడం అని కొడవటిగంటి కుటుంబరావు ఒక చోట రాసాడు. ఒకప్పుడు తండ్రుల దగ్గర ఉండే ఈ సింహ స్వప్న బాధ్యతని కార్పోరేట్లు తీసుకున్నాయి. దాంతో తండ్రి యిప్పుడు స్నేహితుడు. పిల్లల్లో పిల్లాడు. ఆరాధ్య దైవం.
ఈ దేహం ఎవరిది కవితలో బహుశా ఈ ప్రశ్న మగ వాడికి ఎన్నటికీ అర్థం కాదు. నిక్కర్లు, గోచీలు, బనీన్లు యిలా అర్థనగ్నంగా తమ కిష్టమైన ఫేషన్లని చిత్తానుసారం అనుసరించే మగవారికి స్త్రీ దేహం ఎవరిది అనే ప్రశ్న అర్థమౌతుందా?
‘‘నిన్ను నిర్ద్వందంగా తిరస్కరించినపుడు
నిర్దాక్షిణ్యంగా నాపై దాడి చేసి
ఆమ్ల వర్షం కురిపించినపుడు
నా దేహ దేశ సార్వభౌమాధికార హక్కు
భ్రమగానే మిగిలిపోతుంది.’’
నిత్య జీవితంలో జరిగే కనిపించే అనేక విషయాలుతన మనసుని కదిలించినపుడల్లా కవిత్వంగా మార్చారు హైమవతి. నిషిద్ధాక్షరి తరువాత చాలా ఏళ్ళకు ఈ సంపుటిని తెచ్చారు. నిజానికి వస్తు వైవిధ్యం, స్త్రీవాద దృక్పథంతో పాటు ఆమె ఉపయోగించిన ప్రబంధాల తరహా భాష ఆమెకి చాలా గుర్తింపు తెచ్చింది. అయితే నీలిగోరింటలో ఈ భాషే ఆమె వ్యక్తీకరణకి అడ్డుతగలడం గమనించవచ్చు. ఉద్యమాలు సాహిత్య వస్తువుకి కొత్త రక్తాన్నిచ్చినట్టే భాషకీ, వ్యక్తీకరణ ధోరణులకీ కూడా ఇస్తాయి. అందుకే ముందుమాటలో శివారెడ్డి హెచ్చరించినట్లు ‘‘…..కవితలో మొనాటనీ ఏర్పడి విసుగు పుట్టిస్తుంది. నిత్యకవి చాలా వాటికి మెలకువగా ఉండాలి. నిర్దాక్షిణ్యంగా తన్ను తాను వినిర్మాణం చేసుకోవాలి.’’

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img