Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

ఎవరు మహాకవి?

చందు సుబ్బారావు

‘మనకు నచ్చినవాడు మహాకవి’ అని యించక్కా పిలుచుకోవచ్చును. ఎదుటివాడు ముహం చిట్లించు కోవచ్చును. అయితే యిది ప్రజాభిప్రాయ సేకరణ విషయం కాదు. సాహిత్య విమర్శకుల, పండితుల, భాషాకోవిదుల, ప్రాపంచిక సారస్వత విశ్లేషరులు ఉమ్మడి విశ్లేషణ. దాదాపు సార్వజనీన అంగీకర ప్రకటన. సాహిత్యంలో పలు విభాగాలున్నందున, ఏ విభాగానికావిభాగాభిమానులు (ఇతిహాసం, పురాణాలు, ప్రబంధాలు, ప్రజారంజక విభాగాలు, ప్రబోధక చైతన్య రూపాలు) ఉన్నారు. కనుక ఎవరికి వారు మహాకవుల్ని ప్రకటించుకోవచ్చును. గతంలో యిది జరిగింది కూడాను. ఇరవైఒకటో శతాబ్దిలో యిది సాధ్యపడదు. భాషాభిమానులు కావ్యాభిమానులు వందలు వేలల్లో ఉన్నందున ప్రజాస్వామ్య వ్యక్తీకరణ అవసరమవుతుంది. ఒకరో యిద్దరో మహాకవులని ఏకాలం వారైనా భావించి గౌరవించుకోవచ్చును. విశ్వనాథ, శ్రీశ్రీలు యిద్దరూ మహాకవులే అంటే ఎవరూ పేచీ పెట్టకపోవచ్చును. అద్దేపల్లినో, అవసరాల రామకృష్ణనో మహాకవి అని వ్యాసం రాస్తే తీవ్రమైన అభ్యంతరాలు చెప్పవలసి రావొచ్చును. అంతకు ముందు మనం తేల్చుకోవలసింది మహా కవి తెలుగులోనో, ఒరియాలోనో ఎవరని కాదు. ఏ కవి మహాకవి బిరుదుకు అర్హుడవుతాడు. కవి సమూహంలో ఎవరిని ఆధిపత్య గౌరవానికి ఎంపిక చేసుకుంటాం. ఓటింగులతో పనిలేదు. సత్య సందర్శనాదర్శంలోని విశేష సమూహంతోనే ప్రమేయం. ఆంగ్లంలో మేజర్‌ పొయిట్‌ అన్న పదాన్ని ఆచితూచి వాడేవారు! ఆంగ్ల భాషా కోవిదుల అభిప్రాయాలు ప్రాపంచిక విస్తృతికి వెళతాయని వాళ్లెరుగుదురు. చుట్టూ ఉన్న కవి సమూహం, సాహిత్యాభిమాన సందోహం ఏమంటారోనన్న సందిగ్థావస్థే తప్ప, తమ నిర్ణయం ఓడిపోతుందేమోనని ఎవరూ భయపడరు. శ్రీశ్రీకి మహాకవి కిరీటం ఇచ్చిన నవ్య సాహితీ సైన్యం ఆరుద్రనూ, సినారెనీ, దాశరథినీ, కరుణశ్రీ, నండూరి, సోమసుందర్‌ యిత్యాదుల నెవ్వరినీ మాట వరుసక్కూడా మహాకవి అనలేదు. మరోరకంగా గౌరవించి ఉండవచ్చును. కవి సార్వభౌమ, కవి చక్రవర్తి, కవి కంఠీరవ యిత్యాది బిరుదులతో సత్కరించి ఉండవచ్చును. ‘‘మహాకవి’’ నామధేయాన్ని ఉదారంగా యిచ్చివేయలేదు. ఆంగ్లంలో మేజర్‌ పొయిట్‌ నామం నాల్గు కొలబద్దలతో ఏర్పడుతుందని ఏట్స్‌, ఎలియట్‌ వంటి ‘‘మహా కవులే’’ ప్రకటించారు. అవి రెండు నెగెటివ్‌ లక్షణాలు. రెండు పాజిటవ్‌ లక్షణాలుగా విడగొట్టారు. మొదటివి: కవి రాసిన గ్రంథ పరిణామాల్ని బట్టిగాని, కాల పరిచయ భావాల్ని బట్టిగాని నిర్ణయం జరగకూడదు. రెండోవి: ఆ కవికి వెలువడే ప్రశంసల ప్రభావాన్ని బట్టి కాని, స్తుతి కీర్తనల విస్తృతి వల్ల కాని నిర్ణయం సాధ్యపడదు. మరి ఎలాగయ్యా అంటే ‘ఫ్రాన్సిస్‌స్క్రాఫ్‌’ అనే సాహిత్య విమర్శకుడు ‘ధార్మిక ప్రసార శక్తి’ వలన ఆయనను లేక ఆమెను ‘మహాకవి’తో సత్కరిస్తాం అని భావించాడు.
ఏ ధార్మిక ప్రసార శక్తి (పవర్‌ ఆఫ్‌ రేడియేషన్‌) అని ప్రశ్న తలెత్తింది. సమకాలీన సమాజం ఉన్న స్థితి నుండి ఒకడుగు ముందుకు, సామూహికసద్వర్తన వేపు, సాధారణ జీవనంతో సహా ‘‘మానవుని’’ ఒక్క అంగుళం ఎత్తుకు సుఖ సంతోషాల సమాన పంపిణీ చైతన్యం దిశగా ఒక్క కుదుపునిర్భాగ్యుల నిరాదరణను గుర్తించి తొలగించి సమూహంతో కలిపివేసి కాలు కదిపి కదిలే ఒక్క చిరునవ్వు వేపుఅజ్ఞానకవచాల్ని ఛేదించి ఆధునిక చైతన్యం అందించే వర్గ, వర్ణ, ప్రాంత, దేశ, కాల, రాజ్యాధికారాలకతీతమైన ‘సంతోష’ జీవనం వేపు నడిపించగల కలం వీరుల్నే మహాకవులనాలని తీర్మానించారు. ఎవరు మహాకవులు, ఎవరు కాదు అన్న సమస్య వారి పరిధిలోకి రానందున వివేచన విజ్ఞాన ప్రాపంచిక తత్వాలతోటే నిర్ణయం జరిగింది. ఆ నిర్ణయం తర్వాత పలువురు భాష్యకారులు ‘ఆతడు’ మహాకవి యీతడు కేవలం కవి, ఆమె ఉత్తమ జ్ఞాని, ఈమె మహాకవి అని చేసిన నిర్ణయాలను ఎవరూ తప్పుపట్టకపోవటం చేతనే ఆ ‘పద’ గౌరవం నిలిచింది.
తెలుగునాటి విశ్వనాథ, శ్రీశ్రీ, జాషువాలకు తప్ప ఆ పద ప్రయోగం జరగలేదు. ఒకవేళ ఏ షష్టిపూర్తికో, సప్తతి ఉత్సవానికో, జ్ఞానపీఠ మహోత్సవాభినందన సభకో వాడినా ‘పండగనాటి దండ’ గానే తప్ప ప్రాచుర్యం పొందిన సందర్భాలు లేవు. అత్యంత ప్రతిభావంతులైన గుంటూరు శేషేంద్రను మహాకవి, యుగకవి, కవిసేనాధిపతి, చక్రవర్తి అని ఎన్ని బిరుదులతో పొగిడినా మనం అనుకున్న తుఫాను చలనమే తప్ప ఏమీ మిగల్లేదు. ఎంతో కీర్తినార్జించిన అభ్యుదయ కవి సోమసుందర్‌ ‘యుగకర్త శేషేంద్ర’ అని గ్రంథం రాశాడు. శేషేంద్రను వదలి సోమసుందర్‌ను తిట్టిపోశారు. ఏ పదం ఎపుడు వాడాలో తెలియదా అంటూ. మంచి కవి, శక్తిమంతుడు, పద్యాన్నీ వచన కవిత్వాన్నీ రెండు చేతులా రాయగల్గిన ధీశాలి. ‘‘యుగకర్త’’ పదవిని యోగం మీద తప్ప ఆయన్ను ఏమీ అనగూడదని సాహితీ విశ్లేషకులు నానా బాధలు పడ్డారు. ఈ ‘కాంట్రవర్సీ’ ని బాగా పరిశీలించిన సాహిత్య చరిత్రకారుడు, కవీ అయిన ఆరుద్ర ‘‘శేషేంద్ర ప్రతిభావంతుడు. ఈ మెరమెచ్చులను వదిలేద్దాం..ఆతన్ని అభినందిద్డాం’’ అని ప్రకటించాడు. చూశారు గదా..ప్రశంసా వ్యాసాల వరద ప్రవాహాల మధ్య కూడా ఒక్క పద వినియోగంపై ఎంతటి ఆక్షేపణలు వెలువడ్డాయో! ఆంగ్లంలో కీట్స్‌, వరడ్స్‌వర్త్‌, షెల్లీ, ఎలియట్‌లను మేజర్‌ పొయిట్స్‌ అనే వాళ్లు…!!
వ్యాస రచయిత సెల్‌: 9441360083

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img