Wednesday, September 28, 2022
Wednesday, September 28, 2022

ఐతిహాసిక నవల బహుళ

రాచపాళెం చంద్రశేఖరరెడ్డి

‘‘మార్చుకోవాలిగదా సార్‌ అన్నీ. గతాన్ని అలాగే ఫాలో అయిపోవడం కాదు, వర్తమానానికి పనికొచ్చేట్టు మార్చుకోవాలి గదా?’’ (బహుళలో సత్యకామ్‌ మాట)
క్రీ.శ.19వ శతాబ్దమంతా భారతీయ భాషలలో ఆధునిక సాహిత్యం విభిన్న సాహిత్యప్రక్రియల్లో పురుడుపోసుకుని,ఒక స్పష్టమైన రూపం ఏర్పరచుకుంది. 20వ శతాబ్దంలో ఆధునిక భారతీయసాహిత్యం తనను తాను విస్తరించుకుంది. వస్తువులో, రూపంలో అనంతమైన వైవిధ్యాన్ని సంతరించుకుంది. 21వ శతాబ్దం ఆ విస్తరణను మరింత విస్తృతం చేసుకుంటున్నది. 20వ శతాబ్ది ఆధునిక భారతీయ సాహిత్యం ఎలా వుండాలో 19వశతాబ్ది స్థూలంగా నిర్ణయించింది. 21వ శతాబ్ది ఆధునిక భారతీయసాహిత్యం ఎలా వుండాలో 20వ శతాబ్ది చివరిభాగం నిర్ణయించింది. ప్రపంచంలో యే భాషాసాహిత్యమైనా ఈ చారిత్రకం కొనసాగుతుంది. ఆధునిక భారతీయ సాహిత్యంలో నవల ఒక ప్రధాన ప్రక్రియ. ఈ నవల ప్రపంచమంతా తిరిగి భారతీయభాషల్లో 19వ శతాబ్ది ప్రధమార్ధంలో ప్రవేశించింది. తెలుగులో 1819 ప్రాంతాలనుండి కవిత్వం నుంచి వచనం విడిపోయి 1872 నాటికి నవలారూపం తీసుకుంది. తర్వాత కథానిక మొదలైంది.
తెలుగునవలకు నూటయాభయ్యేళ్ల చరిత్ర వుంది. ( 18722022) ఈ నూటయాభయ్యేళ్లలో వందల కొలది రచయితలు వేలకొలదీ నవలలు రాశారు. అలా వచ్చిన నవలల్లో కాలక్షేప నవలలు ఎక్కువ. సమాజ జీవితాన్ని అంటిపెట్టుకొన్నవి, సమాజ పరివర్తనను లక్ష్యంగా పెట్టుకొన్నవీ చాలా పరిమితం. ఇదొక పార్శ్వం కాగా, మరోపార్శ్వం వేలాదిగా వచ్చిన తెలుగునవలల్లో చాలావరకు పెద్దకథలే ఎక్కువ. కథానికకు రెండిరతలో, మూడిరతలో వుండేవే ఎక్కువ. ఐతిహాసిక నవలలు చాలా పరిమితం. మాలపల్లి (ఉన్నవ లక్ష్మీనారాయణ), వేయిపడగలు (విశ్వనాధ సత్యనారాయణ), అతడు ఆమె (వుప్పల లక్ష్మణరావు), అంటరాని వసంతం (జి.కళ్యాణరావు), మట్టిమనిషి (వాసిరెడ్డి సీతాదేవి), జానకివిముక్తి (రంగనాయకమ్మ) వంటివి ఐతి హాసిక నవలలు. నవలలు పెద్దకథలు అన్నంతమాత్రాన అవి తక్కువరకం నవలలనికాదు. ప్రజలమనిషి (వట్టికోట ఆళ్వారు), చదువు (కొ.కు), పంచమం (చిలుకూరి దేవపుత్ర, బండి నారాయణ స్వామి, డాక్టర్‌. కేశవరెడ్డి గార్ల నవలల వంటివి కొన్ని పదుల నవలలు తెలుగునవలా సాహిత్య ఔన్నత్యాన్ని చాటుతున్నాయి. చారిత్రకపరిణామ క్రమంలో ఒక మలుపునో, ఒక కేంద్రబిందువునో, ఒక విశిష్ట సందర్భాన్నో, ఒక పరిమిత కాల జీవితాన్నో యివి అద్భుతంగా చిత్రించాయి. ఒక సుదీర్ఘకాల సమాజపరిణామాలను చిత్రించేది ఐతిహాసిక నవల. ఒక సుదీర్ఘకాల సమాజ పరిణామాలను రెండు, మూడు నవలలుగా రాసిన గొప్పరచయితలు మనకు తెలుగులో వున్నారు. ఒకే నవలలో మూడు, నాలుగు తరాల సమాజ పరిణామాలను చిత్రించిన నవలలు చాలా పరిమితం. అలాంటి పరిమితమైన ఐతిహాసిక నవలల్లో అట్టాడ అప్పల్నాయుడు ‘బహుళ’ ఒకటి. బహుశా దీనికిముందు ‘శతాబ్ద సూరీడు’ (మాలతీ చందూర్‌) ఇలాంటి నవల కావచ్చు. మూడు, నాలుగు తరాల సమాజ పరిణామాలను చిత్రించిన నవలలు కొన్ని వుండొచ్చు. కానీ సమాజ పరిణామాలను ప్రస్తావించి ఒదిలేయకుండా, వివరంగా చిత్రించి పాఠకులకు చరిత్ర పరిణామం పట్ల ఎరుక కలిగించేది ఐతిహాసిక నవల. ‘బహుళ’ ఆ పనిచేసింది! పెదనారాయుడు, అయన ఇద్దరు కొడుకులు గుంపస్వామి, రామస్వామి, కూతురు వరహాలమ్మ, ఈమె కొడుకు నారాయుడు. నారాయుడి ఇద్దరు భార్యలు, వీరిలో బంగారమ్మకు పుట్టిన కొడుకు రాధేయ, రాధేయ భార్య...బలరాం అనే విప్లవకారుని కూతురు...వీరి సంతానం.. మధ్యలో కనకంనాయుడు వంటి వాళ్లు ఇలా నాలుగు తరాలకు చెందిన పాత్రల ద్వారా రచయిత ఉత్తరాంధ్రకు చెందిన నూరేళ్ల సామాజిక ప్రయాణాన్ని చిత్రించి నవలను ఐతిహాసికం చేసారు. ఇది కేవలం ఒక కుటుంబ కథగా, లేదా ఒక వంశ గాథగా మిగిలిపోయి వుంటే ఇది ఐతిహాసిక నవల అయ్యేదికాదు. ప్రతీపాత్ర యెవరికో ఒకరికి బంధువుగా (తల్లి, తండ్రి, కొడుకు వగైరాగా) వుంటూ బయట సమాజంలో ఉద్యమ సంబంధం కలిగివుంటుంది. స్వాతంత్య్రోద్యమం మొదలు విప్లవోద్యమం దాకా. భూస్వామ్యవ్యవస్ధ నుండి ప్రపంచీకరణ దాకా భూమిని పూజించే దశ నుండి భూమిని అంగడిసరుకుగా మార్చేదాకా, వలస వ్యతిరేకత నుండి ఆధిపత్య వ్యతిరేకత దాకా కొనసాగే ఆర్ధిక, సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక పరిణామాలను, ఆ పరిణామాలలో మారే మానవ సంబంధాలను యీ నవల చిత్రించింది…అందుకే ఐతిహాసిక నవలయ్యింది.
‘బహుళ’ నవలలోని పాత్రలు ప్రతీపాత్ర నవలా వస్తువుతో సంబంధం కలిగివుంటుంది. కథతో నిమిత్తం లేని పాత్ర కన్పించదు. నవలానిర్మాణం చేతనయిన రచయితలు ఉబుసుపోక కల్పనలు చేయరు. ఏ పాత్రను పిలిచి ‘‘ఈ నవలలో నువ్వెందుకు ఉన్నావని’’ అడిగితే నేను ఫలానా పనిమీద నవలలోకి వచ్చేనని ఆ పాత్ర సమాధానం చెప్పాలి…అది పటిష్టమైన నిర్మాణం. అసంఖ్యాకమైన పాత్రలను సృష్టించినంత మాత్రాన నవల ఐతిహాసికం కాదు.ఆ సృష్టి అనివార్యతను, అవసరఙ్ఞతను కలిగివుండాలి. అట్టాడ ‘బహుళ’ నవలలో పాత్రలను అనివార్యతా ప్రాతిపదికన సృష్టించారు.
ఒకతరానికీ మరో తరానికీ మధ్య సమాజంలో వచ్చే మార్పులు, ఆ మార్పులు మానవసంబంధాలలో తీసుకొచ్చే మార్పులువీటిని గుర్తించి చిత్రించడం రచయిత ఙ్ఞానం మీద, రచయిత సామర్ధ్యం మీద ఆధారపడి వుంటుంది. ఈ చిత్రణ కోసం రచయిత సమాజచరిత్రను అధ్యయనం చేయాలి. ఆ చరిత్రకు గల వర్గ, వర్ణ స్వభావాన్ని గుర్తించాలి. ఆ చరిత్రలో రచయిత ఆమోదించే, ఆమోదించని పరిణామాలను విశ్లేషించుకోవాలి. ఆ రెండిరటికీ కారణాలను వెదుక్కోవాలి. వాటికి అవసరమైన సంఘటనలను, సందర్భాలను, సన్నివేశాలను, పాత్రలను స్ధలకాలబద్ధంగా సృష్టించుకోవాలి. పాత్రల సామాజికచైతన్యాన్ని బట్టి వాటిని తీర్చి దిద్దాలి. పాత్రలతో చైతన్య పరిధి దాటకుండా మాట్లాడిరచాలి. రచయితలు యీ హోం వర్కంతా చేసుకోవాలి. అట్టాడ ‘బహుళ’లో యీ కృషి శక్తికొలదీ చేశారు. ‘‘నవలా రచయిత ఒక చిన్న జీవితంలో అనేక జీవితాలు జీవించాలి’’ అన్నారు ‘రచయితా శిల్పమూ’ అనే రష్యన్‌ గ్రంధరచయిత ఇల్యా ఎహ్రెన్‌ బర్గ్‌. ‘బహుళ’లో యీ మాటలు ఎంత వాస్తవమో రుజువయ్యింది. పెదనారాయుడి నుండి సత్యకామ్‌ దాకా అనేక పాత్రలలో, అనేక కాలాలలో రచయిత జీవించి చిత్రించాడు. పెదనారాయుడి కాలం, అతని కొడుకులు గుంపస్వామి, రామస్వామిల కాలం, మనుమడు నారాయుడి కాలం, నారాయుడి కొడుకు రాధేయకాలం ఈ కాలాలు వేరు కావడమే కాదు, వీళ్ల ఉద్యమాలు, వాటి స్వభావాలు కూడా వేరువేరు! అవి సాధించిన సాఫల్య, వైఫల్యాలు వేరు, వేరు. వాటిని అనుభవించిన ప్రధాన, అప్రధాన పాత్రలు వేరు, వేరు. ఈ వైవిధ్యాన్ని రచయిత జాగ్రత్తగా చిత్రించడంతో ‘బహుళ’ ఐతిహాసిక నవల అయ్యింది! ప్రజాధృక్పధం గల రచయితకు చరిత్రపట్ల ఆరాధనా భావం వుండదు. విమర్శనాత్మక ధృక్పదమే వుంటుంది. ‘బహుళ’ నవల గత, వర్తమానాలను విమర్శనాత్మకంగానే చిత్రించింది. ఆరాధనా భావం కలగడమంటే ఆలోచన ఆగిపోవడం. విమర్శనాత్మక ధృక్పధం వుండడమంటే గత, వర్తమానాలలోని వెలుగు, చీకట్లను శాస్త్రీయంగా అవగాహన చేసుకొని చిత్రించడం. ‘బహుళ’ నవల అనేక సామాజిక పరిణామాలను విమర్శనాత్మకంగా వ్యాఖ్యానించింది. ఏ ప్రశ్ననూ లేవనెత్తని రచనయెందుకూ కొరగాని రచన. సాహిత్యం ప్రజలకు ఆలోచనలు రేకెత్తించాలి. పాఠకులను మభ్యపెట్టకూడదు. ఇందుకు ప్రశ్నలు, వ్యాఖ్యలు సరైన కొరముట్లు. వ్యాఖ్యలైనా, ప్రశ్నలైనా పాత్రల ద్వారా జరిగితే వాటికి విలువవుంటుంది. గుర్రం జాషువా స్వాతంత్య్రం వచ్చిన మూడేళ్లకే ‘ప్రజల కామితాలు పాటింపలేని స్వరాజ్యమేల?’ అని ప్రశ్నించారు. 1952లో ‘భారతదేశంలో హరిజనులందరూ ఇంత తిండి, ఇంత బట్ట సంపాదించుకోవాలంటే శాసనసభ్యులవ్వాలా?’ అని అడివి బాపిరాజు ‘నరసన్న పాపాయి’ కధలో ప్రశ్నించారు. 1992లో ‘‘పాలనాధికారం వుండికూడా దళితుడు పీడిరపబడవలసిందేనా?’’ అని శాంతినారాయణ ‘ఉక్కుపాదం’ కథలో ప్రశ్నించారు. 1950లలోనే అందే నారాయణస్వామి రచించిన ‘శిల్పి’ కథలో చేనేత కార్మికుడు శివయ్య స్వాతంత్య్రం కోసం త్యాగం చేసినా మాకు స్వాతంత్య్రం ఏమిచ్చింది?’ అని ప్రశ్నించాడు. అక్కినేని కుటుంబరావు నవల ‘సొరాజ్జెం’ స్వాతంత్య్రఫలాల మీద ప్రశ్న. ‘యఙ్ఞం’ కధలో స్వాతంత్య్రానంతర జీవితమ్మీద వ్యాఖ్యలున్నవి. మంజీర రాసిన ‘పెద్దకొడుకు’ (1993), ‘ఉప్పుతిని’ (1995) కధలు స్వాతంత్య్ర ఫలాల మీద ప్రశ్నలు వేసాయి. స్వాతంత్య్రానంతర తెలుగుసాహిత్యంలో స్వాతంత్య్రోద్యమం దాని సాఫల్య, వైఫల్యాల మీద అనేక ప్రశ్నలూ, వ్యాఖ్యానాలూ పుట్టేయి. ఇది ఒక పరిశోధనాంశం. ‘బహుళ’ నవల కూడా యిలాంటి ప్రశ్నలు వేసింది...‘‘దేశానికి స్వతంత్రమొచ్చింది, ఇక మనల్ని మనం పరిపాలించుకోవచ్చు, మన సమస్యలు మనం తీర్చుకోవచ్చనుకున్నాం గానీ రాలేదు. మనకి స్వతంత్రం రాలేదు. జమీందార్లకీ, పెద్దపెద్ద సావుకార్లకీ స్వతంత్రమొచ్చింది. ఏదో సెయ్యొచ్చు, మన ఊరిని మనం పరిపాలించి బాగు సెయ్యొచ్చనుకున్నాను. రెండు పర్యాయాలు పెసిడెంటు నయ్యాను. ఏటీ సెయ్యలేకపోనాను. సెయ్యనియ్యరు. మన ఊరినీ, ఆళే పరిపాలన సేత్తారు..’’ అన్నది కనకంనాయుడి అనుభవం. ఇది స్వాతంత్య్రా నంతర భారత రాజకీయవ్యవస్ధ మీద కనకంనాయుడిచ్చిన తీర్పు! అనుభవసారం! ఇది స్వాతంత్య్రోద్యమాన్ని గానీ, దాని నాయకత్వాన్నిగానీ ఆ ఉద్యమాలనుగానీ అవమానించడం కాదు. ఆ ఉద్యమాలానంతర పరిణామాలను ఆలోచింపచేసే తీర్పు! ‘బహుళ’ నవలను ఐతిహాసిక నవల చేయడంలో ఇలాంటి వ్యాఖ్యలు, ప్రశ్నలూ దోహదం చేసాయి! ‘బహుళ’ నవలలో అనేక రకాల సామాజిక వైరుధ్యాలను చిత్రించారు అట్టాడ. అవి ఆర్ధికాలు, సాంఘికాలు, సాంస్కృతికాలూ! ఒక్కటి చూద్దాం. 17వ శతాబ్దంలోనే అప్పకవి కళలను కులానికి అంటగట్టి, శూద్ర కవిత్వం ఎంతబాగున్నా స్వీకరింపరానిది అన్నాడు. గుర్రం జాషువా గొప్పకవిగా ఉంటూ కులవివక్షను ఎదుర్కొన్నాడు. తిరగలతి ‘‘కళలు మోహించుట ఏమోకాదు, కులము లేదన్న వాని గూడ వలచి’’ అన్నాడు. బహుళ నవలలో సాంఘిక వైరుధ్యం కళల్లో కూడా ప్రవేశించిన తీరు మొదట్లోనే కనిపిస్తుంది. గొల్ల సింహాద్రప్పన్న గొప్ప జానపదకళాకారుడు. తప్పెటగుళ్ల కళాకారుడు. ఆయనదగ్గర ఆ విద్యను నేర్చుకోవడానికి నారాయుడు ప్రయత్నిస్తాడు. ఈయన కాపు. ఈయన మేనమామ కొడుకు కనకం నాయుడు పద్య నాటకం నేర్చుకుంటుంటాడు. తప్పెటగుళ్ల కళపట్ల ఆసక్తి చూపుతున్న నారాయుడిని గొల్లోడి ఆటలేటి? పాటలేటి? కులంతక్కువ విద్యలేటి? అని ఆక్షేపిస్తాడు. తెలకలి కులానికి చెందిన పరమేశు సిన్మాపాటల డేన్సులు, రికార్డింగు డేన్సులు నేర్చుకోమంటాడు. అంతా వినిన నారాయుడు ‘ఆట,పాటలకు కులమేటి?’ అని ప్రశ్నించుకుంటాడు. ఇలాంటి వైరుధ్యఅంశాలు యీ నవలలో యింకావున్నాయి. బహుళ నవల పెదనారాయుడి జమీందారీ వ్యతిరేకపోరాటం నుండి అనేక ఉద్యమాలను చిత్రించింది. ఉద్యమకారులను దుర్మార్గవ్యవస్ధ చంపటాన్ని కూడా ఈ నవల చిత్రించింది. ఉత్తరాంధ్ర నేల, తెలంగాణ లాగే పోరాటాల నేల. అప్పల్నాయుడు పోరాటాల స్పృహ, పోరాటాల ఙ్ఞానం బాగా ఉన్న రచయిత. బహుళ నవలను ఉద్యమనవల... పాఠకులకు విసుగు కలగకుండా సృజనాత్మకంగా, ఆసక్తికరంగా చిత్రించారు. ఉద్యమ కారులు ప్రజలకు మిత్రులు, రాజ్యానికి శతృవులు ఎలా అవుతారో యీ నవల చదివితే తెలుస్తుంది. కులాంతర వివాహాలకు రాజ్యాంగం నుండి అభ్యంతరం లేకపోయినా సమాజం మాత్రం యీ విషయంలో అప్రకటిత రాజ్యాంగంగానే ప్రవర్తిస్తున్నది. ఇవాళ, ప్రపంచీకరణయుగంలో అనేక కారణాలవల్ల కులాంతర, మతాంతర వివాహాలు చేసుకుంటూ వుంటే ఆధిపత్య కులాల వాళ్లు, మతాల వాళ్లు పరువుహత్యలకు పూనుకుంటున్నారు. బహుళ నవలలో నారాయుడు బంగారమ్మ కులాంతర వివాహం చేసుకున్నా, వాళ్లెంత సంఘర్షణ పడ్డారో ఈ నవల ఆవిష్కరించింది. కులాంతర వివాహాల ద్వారా కులనిర్మూలన చేయాలని డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ పిలుపిచ్చినా యింకా మనసమాజంలో అది దేశవిధానంగా రూపొందలేదు. వ్యక్తిగత యిష్టంగానే కొనసాగుతోంది. భౌతికవాద ధృక్పధంగల రచయిత గనక కులాంతర వివాహచిత్రణ చేసారు. నవలలో కధసుదీర్ఘంగా వుంటుంది గనక, కధ కాలక్రమంలో జరగదు. మధ్యలో ఎక్కడో మొదలై గత, వర్తమానాలమధ్య సంచరిస్తుంది. చేనేత మగ్గంలో కండెలాగా ఈ కధనపద్ధతిని అట్టాడ చాలా సౌకర్యవంతంగా వినియోగించుకున్నారు. చరిత్రంతా ఈ గత, వర్తమాన సంచారంలో అతికినట్లు చిత్రించారు. బహుళ అనేక రాజకీయపరిణామాలను, రాజకీయ ఉద్యమాలనూ చిత్రించింది. రచయితకు స్పష్టమైన రాజకీయపరిజ్ఞానం ఉండడం వలన నవలకు రాజకీయస్వరం కుదిరింది. ‘దేశోద్ధరణమా? గృహోద్ధరణమా? అని ఒకప్పుడు ఒకకథ వచ్చింది. అంటే సంఘసంస్కరణ, దేశస్వాతంత్య్రంఈ రెంటిలో ఏదిముఖ్యం అని అర్ధం. డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ …ఆర్ధిక, రాజకీయ విప్లవాలకన్నా ముందు సాంఘికవిప్లవం రావాలన్నారు. అలా జరగలేదు. బహుళ నవలలో రామకృష్ణంనాయుడి ఉద్యమ జీవితాన్ని చెబుతూ ఆంతరిక జమీందారీవ్యతిరేకపోరాటం, వలసపాలన వ్యతిరేకపోరాటం మధ్య ఏర్పడిన వైరుధ్యాన్ని స్పష్టం చేసారు రచయిత. మొదట జమీందారీ వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న రామకృష్ణం నాయుడు జైలునుంచి విడుదలై, ఆ ఉద్యమాన్ని ఒదిలి స్వాతంత్య్రోద్యమ బాట పట్టేడు. అప్పుడు రచయిత ‘‘రైతుల పోరాటం మళ్లించడమైనది దేశ స్వాతంత్య్ర పోరాటం వేపు’’ అన్నాడు. ఆ సమయంలోనే రైతులు బొబ్బిలి జమీందార్ని ఎన్నికల్లో ఓడిస్తారు. దానిని ప్రస్తావిస్తూ రచయిత..‘‘ గెలిపించింది రైతులే కానీ గెలిచింది రైతులు కాదు’, అదే మన ఎన్నికల విచిత్రం..’’ అంటారు. అంతేకాదు, దేశరాజకీయాల గురించి మాట్లాడుతూ…‘‘ఈ రాజకీయాలు రైతులకు అర్ధమయితే దేశం వేరుగా వుండేది. దేశరాజకీయాలు వేరుగా వుండేవంటారు.’’ ఈ సందర్భాలు రచయిత రాజకీయధృక్పధాన్ని ధ్వనించేవి.
సాహిత్యంలో స్థల, కాల పాత్ర చిత్రణ అంత సులభమేమీకాదు. రచయితలు శోధించి, సాధించాల్సిన అంశం. అట్టాడ గొప్ప సాధకుడు. తన రచనలో ప్రతీ చిన్నవిషయాన్నీ జాగ్రత్తగా చిత్రిస్తారు. అట్టాడ కథలూ, నవలలూ చదివితే కా.రా.మాస్టారిలా సూక్ష్మాంశ చిత్రణలో అప్రమత్తంగా వుండడం కన్పిస్తుంది. అట్టాడ సాహిత్యం చదివినపుడు నాకు పింగళి సూరన పద్యం గుర్తుకు వస్తుంది…
ఏయంగతమును భావాన/సేయక వ్రాయంగరాదు, వ్రాసిన నానమ్‌
దాయెత్తత మది చొక్కుప/ రాయత్తపు బుధ్ది జెలువ నలవియ వ్రాయన్‌ అంటారు ప్రభావతి ప్రద్యుమ్నంలో. అట్టాడ ప్రతి చిన్న అంగాన్నీ సంపూర్ణంగా మననం చేస్తారు. ఆ మననం నుండి బయటకి వచ్చి ఆబ్జెక్టివ్‌గా చిత్రిస్తారు. ఉత్తరాంధ్రలోని పల్లెల, గూడేల ప్రజల జీవితాలను, అక్కడి ప్రకృతిని, అక్కడి భూమి, కుల, స్త్రీ సమస్యలను వాటి పరిష్కారాలను, వాటికి ప్రత్యామ్నాయాలను, అక్కడి రాజ్య స్వభావం, అది ప్రజాజీవితంతో ఆడుకోవడం వంటి` ఈ రెంటిలో ఏదిముఖ్యం అని అర్ధం.
20వ దశాబ్ది ఉత్తరాంధ్రచరిత్ర రచనకు బహుళ నవల విశ్వసనీయమైన ఆధారం అవుతుంది. గంగువాడ కేంద్రంగా నడిచిన ఈ నవల విశాల దేశ చరిత్రకు నమూనాగా నిలుస్తుంది.
‘‘…దేనికైనా ప్రజల్లోవుండడం ముఖ్యం..’’
(బహుళలో రాధేయ మాట యిది!)

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img