మూలం: రష్యన్
అనువాదం: కేశవ్గోపాల్,
సెల్: 7989001058
కడలి తీరాన్ని కెరటాలతో ఢీ కొడుతోంది నురగలు గక్కుతూ... పక్షులు
నా అసూయాద్వేషాలకూ
వ్యథాభరిత అపేక్షలకూ, గీతాలకూ
అతీతంగా రెక్కలు చాపి విహరిస్తున్నాయి గగనంలో స్వేచ్ఛగా కేరింతలు కొడుతూ..! పవనాలు
నేర్పుతున్నాయి కెరటాలకు
కన్నీరు మున్నీరు కావడమెలాగో,
నేర్పుగా నర్తించడమెలాగో,
ఉవ్వెత్తున ఎగసి పడటమెలాగో,
కిందకు జారి నా పాదాల్ని
ముద్దాడడమెలాగో..!
కెరటాలు లాలిస్తూ, బుజ్జగిస్తూ సుతారంగా హత్తుకుంటున్నాయి నన్ను తమ స్వేచ్ఛకు మురిసిపోతూ విరగబడి ముప్పిరిగొంటూ వెదజల్లుతున్నాయి నీటి తుంపర్లును..! ఒకనాడు
బాధతో బరువెక్కి
రుజాగ్రస్తమయ్యాయి నా గుండెలు..
ఈనాడు నా కష్టాలన్నీ కడతేరాయి చివరికి నాకిప్పుడు తోడున్నది జలమూ, అనిలమూ, నీలాకాశాలే..! సూర్యతప్తమైన నా వదనం ఎంత మనోజ్ఞంగా భావిస్తోందో..! పురులు విచ్చుకున్న నా కురులు యథేచ్ఛగా పారాడుతున్నాయి నా బాహువుల తీరాన..! నీలి దూరాలు నా ధవళ విహంగాన్ని కబళించాయి. ఎవరో సమీపిస్తున్న సవ్వడి... అది నువ్వేనా ప్రియతమా..? కడలీ..ఓ కడలీ..! అంకురించింది ప్రేమ నా ఎదలో...!!! (ఈ కవిత ప్రఖ్యాత లిథుయేనియన్ కవయిత్రి సలమేయా నోరిస్ రాసింది. ఆవిడ లిథుయేనియన్ కోకిలగా పేరుగాంచింది. జననం
నవంబరు 17, 1904, మరణం` జూన్ 7, 1945.)