Saturday, June 10, 2023
Saturday, June 10, 2023

కథన శిల్పి వివిన మూర్తి

రాచపాళెం చంద్రశేఖరరెడ్డి

‘‘ఈనాటి జీవితాన్ని, దానిని నడిపిస్తున్న చలన సూత్రాలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. అర్థం చేసుకున్న వాటిని కథలుగా మలచుకుని వాటికి సాహిత్యతను ఇవ్వడం మరింత కష్టం. రచయిత శిల్ప సామర్థ్యం తక్కువగా ఉన్నవాడైతే ఆ కథలు ఉపన్యాసాలుగానో, శుష్కమైన చర్చలు గానో, రచయిత తెలివితేటల ప్రదర్శనగానో దిగజారి పోతాయి.’’ (వల్లంపాటి వెంకటసుబ్బయ్య ముందుమాట - దిశ)

తెలుగు కథను ఆ ప్రమాదం నుండి, దిగజారిపోకుండా కాపాడిన శిల్ప సమర్థులు వివిన మూర్తి. వివిన మూర్తి కథా జీవితం తెలుగునాట విప్లవ సాహిత్యం పుట్టుకతో ముడిపడి ఉంది. 1879లో ముతక రూపంలో మొదలైన తెలుగు కథ 1970 నాటికి చాలా పరిణత దశను చేరుకుంది. అనేక ఉద్యమాలకూ, అనేక భావజాలాలకు, అనేక సామాజిక సందర్భాలకు, సంఘటనలకు తెలుగు కథ అక్షర సాక్షిగా అప్పటికే రుజువు చేసుకుంది. వస్తు విస్తృతికీ, శిల్ప వైవిధ్యానికీ అప్పటికే తెలుగు కథ మూలస్తంభమైంది. అపరిణిత దశ నుండి తెలుగు కథను మరింత పరిపక్వదశకు తీసుకుని పోవడంలో వివిన మూర్తి పాత్ర తప్పకుండా ఉంది. ఆయన చిన్న వయసు నుండే కథలు రాసి ప్రచురణకు దూరంగా ఉన్న సమయంలో, మిత్రులెవరో వాటిని పత్రికలకు పంపిస్తే అవి అచ్చయ్యాయి. అలా ఆయన కథ 1971 నవంబరు ఆంధ్రజ్యోతిలో తొలిసారిగా అచ్చయింది. అందువల్ల వివిన మూర్తి కథా జీవితానికి అయిదు దశాబ్దాల చరిత్ర ఉంది. ఆయన ఇప్పటిదాకా వాల్‌ పేపర్‌, ప్రవాహం, దిశ, తీర్థపురాళ్లు, జగన్నాటకం, కథా ప్రహేళిక అన్న ఆరు కథాసంపుటాలు ప్రచురించారు. ఆయన కథలోని శిల్ప నైపుణ్యాన్ని స్థాలీపులాకన్యాయంగా పరిశీలించే ప్రయత్నమే ఈ వ్యాసం. ఈ వ్యాసానికి దిశ (2002), తీర్థపురాళ్ళు (2003), జగన్నాటకం (2006) అనే మూడు సంపుటాలు ఆధారం. ఈ మూడు సంపుటాలలో కొన్ని కథలలోని శిల్పాన్ని పరామర్శిస్తాను. వాటిలోని కథలన్నీ 1976 2003 మధ్య వివిన మూర్తి రాసినవి. అత్యవసర పరిస్థితి చీకటి రోజుల నుండి ప్రపంచీకరణ తొలి దశాబ్దం వరకు గల కాలం ఈ కథా కాలం. సాధారణంగా వివిన మూర్తి కథలు భారతదేశంలో ప్రబలిపోతున్న పెట్టుబడిదారీ వ్యవస్థ దుర్మార్గాలను అనేక భంగిమలలో అధిక్షేపిస్తాయి.
వస్తువును పాఠకునికి చేరవేయడానికే శిల్పం. అయితే కథకు వస్తువును ఎన్నుకోవడం సులభం. దానికి అనువైన శిల్పాన్ని ఎన్నుకోవడం కష్టం. ఎందుకంటే, వస్తువు కంటి ముందు కనిపిస్తూ ఉంటుంది. శిల్పం కథకుని భావనలో నుంచి వెలికివస్తుంది. వస్తువు తనరూపాన్ని తాను ఎన్నుకుంటుంది అనే అభిప్రాయం ఒకటి ఉన్నా, శిల్ప నిర్మాణంలో రచయిత భావుకత పాత్ర ముఖ్యమైనది. ఏ వస్తువును ఏ శిల్పంలో చెప్పాలి అన్నది రచయిత మేధస్సు పైన ఆధారపడి ఉంటుంది. కథకుని శిల్ప పరిజ్ఞానం అతని కథలకు ప్రాణం పోస్తుంది. కథ రాయడం మొదలు పెడితే ఏదో ఒక రూపం వస్తుంది. కానీ కథానిక కళా శోభితం కావాలంటే కథకుని పనితనం, శ్రమ అవసర మౌతాయి. ఏట్లో ఇసుకరేణువుకు కూడా ఒక రూపముంటుంది. దానికి మెరుగులు పెడితే అది కళాఖండమౌతుంది. అలాగే కథను కళాఖండం చేయాలంటే రచయిత శిల్ప శక్తి అవసరం. కథలో ఒక పాయింటు ఉంటుందనీ, కథంతా ఆ పాయింటు చుట్టూ తిరుగుతుందని తెలుగునాట అందరూ ఆమోదించిన అభిప్రాయం. కథలోని అనేకాంశాలను పాయింటు చుట్టూ తిప్పడంలో తెలుగు కథకులు అనేక పోకడలు పోయారు. వివిన మూర్తి మార్గం ఆయనదే. అంతమాత్రం చేత ఆయనది ఒంటి స్తంభవు మేడ కాదు. ఉత్తరాంధ్ర కథా సాహిత్య వాస్తవికతా సంస్కారమంతా ఆయనకు నేపథ్యంగా ఉంది. ఆయన మార్క్సిస్టు పరిజ్ఞానం ఆయన కథలను నడిపిస్తుంది. కథలో పాయింటు ముఖ్యమైనా, వివిన మూర్తి ఆ పాయింటు చిత్రణకే పరిమితం కారు. ఆ పాయింటు వెనకాల ఉండే ఆర్థిక రాజకీయ చరిత్రను దాని చుట్టూ అల్లుతారు. ఆయన కథలన్నీ సామాజిక చరిత్ర పరిణామాల ప్రతిఫలాలే. కానీ అవి, వల్లంపాటి చెప్పినట్లు ఉపన్యాసాలు గానో, రచయిత తెలివితేటలుగానో తేలిపోవు. చాలా ఒడుపుగా ఆయన చరిత్రను కథలో బిగిస్తారు. కథానిక కిటికీలోంచి చూస్తే కనిపించేంత జీవితాన్నే చూపిస్తుందనే అభిప్రాయానికి భిన్నంగా వివిన మూర్తి కథలు చిన్న పరిధిలో సుదీర్ఘమైన చరిత్రను సూచిస్తాయి. అలా చేయడానికి, కథా స్వరూప స్వభావాలు చెడిపోకుండానే, ఆయన తనదైన నిర్మాణ పద్ధతిని అనుసరించారు.
1970ల నాటికే వివిన మూర్తికి కమ్యూనిజంతో పరిచయం కలిగింది. వాస్తవికతకు కల్పనకు మధ్య అంతరం అర్థమైంది. ఇతరుల సమస్యలలో నుంచి తన సమస్యలనూ అర్థం చేసుకోవటం తెలిసింది. కాళీపట్నం రామారావు సాహిత్యంతో పరిచయం కలిగింది (ముందుమాట: జగన్నాటకం) ఈ సమయంలో వివిన మూర్తికి సమాజాన్ని వర్గ దృక్పథంతో చూడడం అలవాటయ్యింది. వర్గ సంఘర్షణలో తుది విజయం పేదలదేనన్న ఎరుక కలిగింది. ఈ ఎరుకలోనుంచి ఆయన వాస్తవికవాద శిల్ప రీతిలో అనేక కథలు రాశారు. ముడి మనిషి (1978) వివిన మూర్తి అవర్గీకరణ చెంది రాసిన కథలలో ఒకటి. నరిసి అనే ఒక దళిత స్త్రీలోని పోరాట శక్తిని వాస్తవికంగా ఆవిష్కరించిన కథ ఇది. వివిన మూర్తి ‘అగ్గిపుల్ల, రొట్టె ముక్క’ అని రెండు కథలు రాశారు. అగ్గిపుల్ల గ్రామీణ భూస్వాముల రాజకీయాలలో నలిగిపోతున్న దళితుల జీవిత ప్రతిఫలనం. ఇద్దరు ఆధిపత్య భూ యజమానుల దగ్గర ఇద్దరు దళితులు జీతగాళ్ళుగా ఉంటారు. యజమానుల ప్రయోజనాలు కాపాడడంలో దళిత సేద్య గాళ్ళు తమ జీవితాలను పణంగా పెట్టడానికి వెనుకాడరు. పెత్తందారులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం దళితుల మధ్య చిచ్చు పెడతారు. చివరికి పెత్తందారులు కలుసుకుంటారు. నష్టపోయింది మాత్రం దళితులే. ఈ వస్తువు మీదనే డా. పి. కేశవ రెడ్డి ‘స్మశానం దున్నేరు’, వీరపల్లి వీణావాణి ‘రాకాసి కోన’, వి ఆర్‌ రాసాని ‘చీకటి రాజ్యం’ నవలలు రాశారు. తిమ్మాపురం ఈ కథా స్థలం. ఈ కథ ‘‘అదిగో అదే తిమ్మాపురం’’ అని మొదలవుతుంది. ‘అదిగో అదో తిమ్మాపురం’ అని ముగుస్తుంది. బ్రహ్మయ్య, వీరయ్యలు దళితులు. ఇద్దరివీ రెండు వేరే శాఖలు. వీళ్లు వీర రాఘవులు, జోగి రాజుల దగ్గర సేద్య గాళ్ళు. కాలువ నీళ్ల దగ్గర బ్రహ్మయ్య, వీరయ్యలు తగాదా పడతారు. కథ మొదలయ్యే సరికి వీర రాఘవులు, జోగి రాజుల మధ్య శత్రుత్వం ఉంటుంది. కథ ముగిసేసరికి దళితులు విడిపోతారు. ఈ ఇద్దరూ ఏకమవుతారు. ఈ వాస్తవాన్ని రచయిత చక్కని చిత్రణ లో ఆవిష్కరించారు. బ్రహ్మయ్య పాత్రచిత్రణ వివిన మూర్తి వర్ణనాత్మకంగా చేశారు. చెప్పులు తీసి చేత్తో పట్టుకుని, అరుగు మీద కూర్చుని ముఖాలు కడుక్కుంటున్న ఒకరిద్దరికి దణ్ణాలు పెట్టుకుంటూ, పెద్దవీధి దాటాడు బ్రహ్మయ్య. పచ్చటి వరిచేల మధ్యనుండి నడుస్తుంటే కష్టజీవులు వాళ్ల చెప్పులను తాకగలుగుతున్న సంబరంతో భూమి చేస్తున్న నాట్యంలా చల్లగాలికి లయగా పరవశిస్తోంది చేను. ఇది శ్రమ జీవన సౌందర్య చిత్రణ. బ్రహ్మయ్యతో మమేకమయ్యారు
రచయిత బ్రహ్మయ్య వీరయ్యతో తగాదాపడతాడు యజమాని ప్రయోజనం కోసం. అతని హడావిడి చూసి వీరయ్య ‘‘యీ బావులు నీయీ కావు, నాయీ కావు. మనలో మనకు గొడవేల?’’ అంటాడు. వీరయ్యకున్న తెలివి బ్రహ్మయ్యకు లేకపోవడంతో ఈ కథలో సంఘర్షణ పుట్టింది. ఈ కథలో మధ్యలో ‘‘మందు అమిరింది’’ అని, మరోచోట ‘‘అగ్గిపుల్లకి అగ్గిపెట్టె అమిరింది’’ అని, చివర్లో ‘‘అగ్గిపుల్ల భగ్గున మండిరది’’ అని అన్నారు రచయిత. ఇది కథ పరిణామ దశలను సూచించే శిల్పరీతి. అగ్గిపుల్ల గ్రామీణ పెత్తందారుల వర్గ స్వభావాన్ని ఆవిష్కరిస్తే, ‘సమవర్తి’ కథ (1981) రైతు జీవిత విషాద పరిణామాలను ఆవిష్కరించింది. వివిన మూర్తి. కథకుడిగా నిలదొక్కుకున్నాక, తన కథలలో తీసుకున్న వస్తువుకు సంబంధించిన చరిత్ర వికాసాన్ని అద్భుతంగా పొదిగిస్తారు. ఆ శిల్పనైపుణ్యం వారికుంది. యముడిని సమవర్తి అంటారు. అందరి పట్ల సమానంగా ప్రవర్తించేవాడు సమవర్తి. అయితే భౌతికంగా వర్గాలతో నిండిన సమాజంలో అన్ని వర్గాల పట్ల సమానంగా ప్రవర్తించడం సాధ్యం కాదు. ఏదో ఒక వర్గం వైపు మొగ్గాలి. బహుశా వివిన మూర్తి, విప్లవ సాహిత్యోద్యమ నేపథ్యంలో శాంతియుత సహజీవన సిద్ధాంతాన్ని పూర్వపక్షం చేసి ఈ కథను రాశారనిపిస్తుంది. వర్గ సంఘర్షణ తప్ప వర్గ సామరస్యం కుదరదని చెప్పటం రచయిత ఉద్దేశ్యం.
‘సినీవాలి’ (1984) కథ చాలా బరువైన కథ. నిరుద్యోగం మానవ సంబంధాల మీద చూపే దుష్ప్రభావం ఎలా ఉంటుందో అనే భయంకర సత్యాన్ని ఈ కథ అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. ‘కలల రాజ్యం’ (1992) వివిన మూర్తి రాసిన కథలలలో చాలా చిన్నది. అంతేకాదు ఆ కథను ఆయన ఒక ప్రత్యేకమైన శిల్పంతో రాశారు. అన్ని పొడి పొడి వాక్యాలు కావడం ఆ ప్రత్యేకత. ‘లలిత’ అనే స్త్రీ జీవితం వ్యవస్థలోని సాంఘిక రాజకీయకారణాల వల్ల ఏయే పరిణామాలు పొందిందో ఈ కథ చెబుతుంది. తుపాకి పట్టుకునే పోలీసు కూతురైన లలిత ‘‘ఆయుధాలు లేని.. అవసరం లేని… రాజ్యంబీ ప్రతి మనిషి పూర్ణాయుష్కునిగా బతకటానికి అవకాశమిచ్చే సమాజం… మంచి కలలు కావాలి అమ్మా’’ ప్రశ్నించడం ఈ కథలోని సారం.
అమ్మ ఆలోచనలో పడిరది. నేను ఆచరణలో పడ్డాను.
అనే ముగింపు పాఠకునిలో తీవ్రమైన ఆలోచనలను రేకెత్తిస్తుంది. పొడి పొడి వాక్యాలు కథనంలో వేగం పెంచాయి. వర్ణనలు లేకుండా కథను ఎంత వేగంగా నడిపించవచ్చునో రచయిత చూపించారు. కథను ఏడు చిన్న ముక్కలుగా తుంచడం చూస్తే నిజానికి ఆ కథని చాలా పెద్ద కథగా ఉంచాల్సిందనిపిస్తుంది. ఆ నిడివిని పాఠకులే ఊహించుకునేటట్లు చేయడం ఈ కథా నిర్మాణ సూత్రం. ‘సమవర్తి’ కథలో రైతు జీవితం విభిన్న వ్యవస్థల మధ్య ఎలా పరిణామం చెందిందో చిత్రించిన వివిన మూర్తి, ‘దిశ’ (1992) కథలో వైద్యరంగం విభిన్న వ్యవస్థల మధ్య ఏ ఏ పరిణామాలకు లోనయిందో విమర్శనాత్మకంగా చిత్రించారు. భూస్వామ్య, పెట్టుబడిదారీ వ్యవస్థలో దోపిడీ స్వభావాన్ని ఆవిష్కరించి పాఠకులను సామ్యవాదం వైపు మళ్లించడాకి రచయిత ఒక్కో కథలో ఒక్కో సామాజిక రంగాన్ని ఎన్నుకున్నారు. ప్రపంచీకరణ మొదలైన తొలినాళ్లలోనే దాని దుర్మార్గాన్ని ‘దిశ’ కథలో చిత్రించడం విశేషం. ‘మాయ మహామాయ’ (1994) కథలో మరకతం, మాణిక్యం, చిన్న దిక్కు, పెద్ద దిక్కు వంటి పాత్రలతో వివిన మూర్తి పెట్టుబడిదారీ వ్యవస్థలోని పోటీ సంస్కృతిని వ్యంగ్యంగా ఆవిష్కరించారు. వస్తువుల ఉత్పత్తి, వాటి అమ్మకంలో సర్వత్రా పోటీ, దాని నుండి బయటపడడానికి పెట్టుబడిదారుల ఎత్తుగడలు ఈ కథలో పాఠకులను ఆశ్చర్యపరుస్తాయి. ఒక చిన్న చిన్న కథల పేర్లు చెప్పకుండా ప్రపంచ పెట్టుబడిదారుల స్వభావాలను ఆవిష్కరించాడు రచయిత. మరకతం, మాణిక్యం లాంటి పేర్లే ఈ కథా శిల్పంలో ముఖ్యాంశాలు. ‘మాయ – మహామాయ’ అనే శీర్షిక ధ్వన్యాత్మకమైంది. ‘వీరుడు – మహా వీరుడు’ అనే పేరును తలపిస్తుంది.
వివిన మూర్తి కథా నిర్మాణ ప్రతిభ మనకు ‘కృష్ణ స్వప్నం’ (1995) కథలో కనిపిస్తుంది. పౌరాణిక కథలను పునర్‌ వ్యాఖ్యానం చేసే సంప్రదాయం తెలుగులో బాగా విస్తరించింది. చలం, నార్ల, త్రిపురనేనిల నుండి ఓల్గా, డి.అర్‌.ఇంద్రల దాకా ఈ ప్రక్రియ బాగా అభివృద్ధి చేశారు. ప్రాచీన కథలను వర్తమాన దృష్టితో వ్యాఖ్యానించే సంప్రదాయమిది. అయితే ఇప్పటిదాకా పురాణ కథలను పురాణ కథల పరిధిలోనే వ్యాఖ్యానించారు మనవాళ్లు. కృష్ణ స్వప్నం వీటికి భిన్నమైన కథ.
వివినమూర్తి ప్రపంచీకరణ విస్తృత పరిణామాలను, రూపాలను కాలమహిమ (1996), జగన్నాటకం వంటి అనేక కథలలో తనవైన అధిక్షేపం, వ్యంగ్య సాధనాలతో ఆసక్తికరంగా చిత్రించారు. ‘స్పర్శ’ (1995) – ఈ కథను వివినమూర్తి ప్రత్యేక శ్రద్ధతో కథగా మలచినట్లు అనిపిస్తుంది. కోస్తా ప్రాంతం నుంచి సుబ్బారావు సునీత దంపతులు తమ కుమారుని రాయలసీమలోని హార్సిలీ హిల్స్‌ పాఠశాలలో చేర్పించడానికి వచ్చి, మధ్యలో సుబ్బారావు స్నేహితుడు మోహన రెడ్డిని కలవడానికి కందులపల్లికి పోతారు. ఆ మిత్రుడు ఫ్యాక్షన్‌ గొడవల్లో చిక్కుకొని ఉంటాడు. సుబ్బారావు అక్కడి బీభత్స వాతావరణాన్ని చూసి బెంబేలెత్తుతాడు. అక్కడి జీవితం చాలా అభద్రంగా ఉందని అర్థం చేసుకుంటాడు. తమ కుమారుని అలాంటి చోట చదివించడం ఇష్టం లేక సునీత తిరిగి వెళ్ళిపోదాం అంటుంది. ఈ కథలో రాయలసీమ ఫ్యాక్షన్‌ నేపథ్యంలో సమాజంలోని అనేక ఘర్షణలు ఒడుపుగా గుదిగుచ్చారు రచయిత. భద్రత అనేది ఈ కథలో కేంద్ర బిందువు. స్నేహితుని ఇంటి దగ్గర వాతావరణాన్ని రచయిత పరిశోధన చేసినట్లు చిత్రించారు. ఉత్తరాంధ్ర మరో ప్రాంత రచయిత రాయలసీమ ప్రాంత జీవితం పట్ల గల అవగాహనను చెప్పే కథ ‘స్పర్శ’. గతంలో షేక్‌ నాజర్‌ ‘నేటి రాయలసీమ’ అనే బుర్ర కథ రాశారు. అంతకుముందే నారాయణ బాబు రాయలసీమ కరువు మీద ఒక నాటిక రాశారు. ఇటీవల సింహప్రసాద్‌ ‘జీవధార’ నవల రాయలసీమ నీటి సమస్య మీద రాశారు.
నల్లూరి రుక్మిణి 2003 -04 నాటి కరువు మీద కథ రాశారు. ద్వానా శాస్త్రి వంటి వాళ్లు కవితలు రాశారు. వివిన మూర్తి ఫ్యాక్షన్‌ మీద చాలా నిగ్రహంతో ఈ కథను రాశారు. ‘‘నీతో జీవితం ఎంత సెక్యూర్డ్‌గా ఉంటుందో’’ అనే సుబ్బారావు మాటతో మొదలైన కథ ‘‘ఇన్‌ సెక్యూర్డ్‌ ప్రపంచంలో జీవిస్తూ సెక్యూరిటీ అనే మృగతృష్ణ వెనకాల ఎన్నాళ్ళీ పరుగు సుబ్రావ్‌?’’ అనే భార్య సునీత మాటతో కథ ముగుస్తుంది. ‘‘భద్రమైనది బలమైనదిగా భావించే ప్రతి దాని పునాది డొల్ల!! డొల్ల! డొల్ల!!! అని కూడా తెలుసుకున్నాను’’ అనే సునీత ఎరుకతో కథ ముగుస్తుంది. 26 పుటల కథంతా రాయలసీమ నిర్దిష్ట సామాజిక వాస్తవికత మీద నడిచి, చివరికి ఒక తాత్వికతతో ముగించడం వల్ల ‘స్పర్శ’ కథకు అదనపు బలం చేకూరింది. ఇలా వివిన మూర్తి కథలు అనంతమైన శిల్ప రీతులతో కూడుకొని తెలుగు కథను-108-108 బలోపేతం చేశాయి. ఆయనది గంభీర శిల్పం. శరత్‌ రుతువులో పైన గంభీరంగా పారుతూ లోన సుడులు తిరిగే నదీ ప్రవాహం వంటిది. కథను ఇతిహాసంగా మార్చడానికి ఆయన చేసే వ్యాఖ్యలు చరిత్రను తవ్వి చూడమని సూచిస్తాయి.
‘‘మానవ వేదనను సాహిత్యం మాత్రమే సమర్థవంతంగా ఇంతకాలం మోసింది. ఏ వేదనా లేని సమాజం మానవుడు చూసుకోగలిగితే బహుశా సాహిత్యం అవసరం తీరిపోతేవచ్చు’’ (వివినమూర్తి – ముందుమాట: దిశ)

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img