Tuesday, March 21, 2023
Tuesday, March 21, 2023

కర్తవ్య నిర్వహణకు అరసం ప్రతిన

ఆంధ్రప్రదేశ్‌ అభ్యుదయ రచయితల సంఘం ఒక చారిత్రక కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు నడుంగట్టింది. త్రికాలజ్ఞతతో కూడిన తన ప్రణాళికకు వర్తమాన కార్యాచరణను రూపొందించుకుంది. ‘‘దోపిడీ పాలనను, నియంతృత్వ పాలకులను, అనేక మతాల, అనేకానేక సంస్కృతుల సమాహారమై భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిరూపమైన భారత జాతీయతా భావనను విచ్ఛిన్నం చేస్తున్న హిందూ మతోన్మాదాన్ని ప్రతిఘటించాలి. అందుకు కలాలే ఆయుధాలవ్వాలి. అభ్యుదయ రచయితలు రచనలు చేయటమే కాదుÑ ఉద్యమించాలి. ఆ దిశగా ప్రగతిశీల రచయితల సంఘాలను సంఘటిత పరచాలి!’’ అని తీర్మానించుకుంది. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో ఫిబ్రవరి 11, 12 తేదీలు రెండు రోజులు అరసం 19వ రాష్ట్ర మహాసభలు, 80వ వార్షికోత్సవాలు జరిగాయి.
సరిగ్గా 80 ఏళ్ళ క్రితం ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం ప్రథమ మహాసభలకు ఆతిథ్యం ఇచ్చిన తెనాలి ఇప్పుడు మరోసారి మహాసభలకు వేదిక అయింది. ఇది యాదృచ్ఛికమే అయినప్పటికీ తగిన సందర్భం.
మన ముందు ఒక మహాస్వప్నం: అరసం ప్రయాణం అలవోకగా సాగలేదని ఎన్నో ఒడిదుడుకులను ఆటుపోట్లను ఎదుర్కొన్నదని మహాసభల ప్రారంభ సభకు అధ్యక్షత వహించిన అరసం అధ్యక్షులు రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గుర్తు చేశారు. అరసం ఆవిర్భవించి 80 ఏళ్ళయినా దాని ప్రాసంగికత తగ్గలేదన్నారు. ‘‘మన ముందు ఒక మహాస్వప్నం ఉంది. అది స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వంతో కూడిన వ్యవస్థ నిర్మాణం. అందులో సామాజిక న్యాయం, సామ్యవాదం ఉంటాయి.’’ అన్నారు.
రచయితలు ఉద్యమకారులు కావాలి: రచయితలు రాయటమేకాదు పోరాడాల్సిన సమయమిదని అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి సుఖదేవ్‌ సింగ్‌ సిర్సా మహాసభల ప్రారంభోపన్యాసంలో రచయితలకు పిలుపునిచ్చారు. రచయితలను పాలక వర్గాలు, కార్పొరేట్‌ శక్తులు ప్రలోభపెడుతున్నాయని, వీటికి లొంగని వారిపై దాడులు చేస్తున్నాయన్నారు. దేశంలో భిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతుల ప్రజలు ఐక్యంగా ఉన్నారు. ఈ ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు హిందుత్వ శక్తులు పనిచేస్తున్నాయి. దేశ సంస్కృతిని పరిరక్షించేందుకు, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పాటుబడేవారిపై దాడులు జరుగుతున్నాయి. ప్రశ్నించేవారిని అర్బన్‌ నక్సలైట్లుగా, పాకిస్థానీ వాదులుగా చిత్రీకరిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజాస్వామిక వాదులు, లౌకికవాదులు అయిన గోవింద్‌ పన్సారే, కల్బుర్గీ, గౌరీ లంకేష్‌లను హత్యచేశారని, వరవరావు తదితర మేధావులను అక్రమంగా జైళ్ళలో నిర్బంధించారని అన్నారు. ఈ నేపథ్యంలో రచయితలు మరింత చైతన్యవంతమైన పాత్రను నిర్వహించాలి. ఆ చైతన్యం రచనలలో ప్రతిఫలించాలి అన్నారు. ఢల్లీిలో జరిగిన రైతాంగ ఉద్యమ ప్రభావంతో పంజాబ్‌లో నవతరంలో ఒక కొత్త ఒరవడి బయలుదేరింది. వారి గుండెల్లో ఉన్న ఆవేశం, ఆవేదన గేయాలుగా ఇతర రచనా ప్రక్రియలుగా బయటకొచ్చాయని. ఇది దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించాలన్నారు.
మార్క్స్‌, అంబేద్కర్‌ ఫూలే భావాలే మార్గదర్శకం: హిందూ మతోన్మాద శక్తులు, కార్పొరేట్‌ శక్తులు కలిసి లౌకిక ప్రజాస్వామ్య సామాజిక భావనలను అణచివేస్తున్నాయి. ఈ దశలో సామాజిక ఆర్థిక విప్లవానికి రచయితల కలాలు, గళాలు పదునెక్కాలని అభ్యుదయ సాహితీవేత్త, దళిత ఉద్యమ నాయకులు డా॥ కత్తి పద్మారావు అన్నారు. అందుకు మార్క్స్‌, అంబేద్కర్‌, ఫూలే భావాలే మార్గదర్శకం. లాల్‌-నీల్‌ శక్తులు సంఘటితం కావాలన్నారు. అభ్యుదయ సాహిత్య ఉద్యమం మరింత బలంగా ప్రజల్లోకి వెళ్ళాలన్నారు.
ఉద్యమాల్లో ముందువరుసలో…: మహాసభల ప్రారంభ కార్యక్రమం అనంతరం అరసం 80వ వార్షికోత్సవాల గౌరవార్థం ప్రత్యేక సదస్సు జరిగింది. ప్రధాన వక్త, అరసం జాతీయ నాయకులు, తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ కులపతి ప్రొఫెసర్‌ ఎస్వీ సత్యనారాయణ మాట్లాడుతూ స్వాతంత్య్రోద్యమం, ఆంధ్రరాష్ట్ర సాధన ఉద్యమంతో పాటు అనేక రాజకీయ, ఆర్థిక, సామాజిక ఉద్యమాలలో అరసం తన కలానికి పదును పెట్టిందని, ముందువరుసలో నిలబడి గళమెత్తిందని అన్నారు. సామాజిక పరిణామక్రమంలో మార్పుకు లోనవుతున్న మానవ సంబంధాలు, కుటుంబ విలువలను సాహిత్యంలోకి ప్రధాన ఎజెండాగా అరసం తీసుకువచ్చిందన్నారు. అనంతరం వినీత్‌ తివారి, వేల్పుల నారాయణ, తెలంగాణ రాష్ట్ర అరసం ప్రధాన కార్యదర్శి డా॥ రాపోలు సుదర్శన్‌, ప్రజానాట్యమండలి జాతీయ కార్యదర్శి గని, సందేశాలు ఇచ్చారు.
సామాజిక మార్పులపై అవగాహన: అభ్యుదయ రచయితలు సామాజికంగా వస్తున్న మార్పులను అవగాహన చేసుకుని ప్రజలను చైతన్యపరిచే విధంగా రచనలు చేయాలి అని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ మేడిపల్లి రవికుమార్‌ అన్నారు. తెలుగు సాహిత్యం – దశ దిశ అంశంపై జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి అరసం కార్యదర్శి జి.ఎస్‌. చలం అధ్యక్షత వహించారు. నేటి సాహిత్యం దశ దిశల్లో అనూహ్యమైన, వేగవంతమైన మార్పులు చోటుచేసుకున్నాయని వాటిని రచయితలు అవగాహన చేసుకోవాలని రవికుమార్‌ అన్నారు. సాహితీవేత్త ముత్తేవి రవీంద్రనాథ్‌్‌్‌, ద్రవిడ విశ్వవిద్యాలయం తెలుగుశాఖ అధ్యక్షులు ప్రొఫెసర్‌ కె.శ్రీదేవి సదస్సులో ప్రసంగించారు.
ప్రభుత్వం ప్రజల్ని భ్రమల్లో ఉంచుతోంది: ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజల్ని భ్రమల్లో ఉంచుతోందని ఇది సరికాదని యోగి వేమన విశ్వవిద్యాలయం తెలుగు విభాగం అధ్యక్షులు ప్రొఫెసర్‌ ఎన్‌. ఈశ్వరరెడ్డి అన్నారు. తెలుగునాట తెలుగు భాష గమనం-గమ్యం అంశంపై జరిగిన సదస్సుకు ఆయన అధ్యక్షత వహించారు. రాష్ట్రంలో ప్రభుత్వం తెలుగును అధికారభాషగా అమలు చేయకపోవటం సరికాదన్నారు. ప్రభుత్వం పాఠశాలల్లో తెలుగు మాధ్యమానికి మారుగా పూర్తిగా ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేయడం, ఆంగ్ల మాధ్యమంలో విద్యాభ్యాసం తోనే అన్నీ అయిపోతాయనే భ్రమను ప్రభుత్వం ప్రజలకు కల్పించడం సరికాదన్నారు. సదస్సులో ప్రజాసాహితి నాయకులు దివికుమార్‌, సాహితీ స్రవంతి ఉపాధ్యక్షులు సత్యాజీ, అరసం నాయకులు సాకం నాగరాజు ప్రసంగించారు.
రచయితల పాదయాత్ర: అరసం మహాసభలకు ప్రతినిధులుగా, అతిథులుగా విచ్చేసిన ప్రముఖ రచయితలు, కవులు, కళాకారులు 11వ తేదీ సాయంత్రం సభాప్రాంగణం నుండి తెనాలి పట్టణంలోని రణరంగ చౌక్‌ వద్దకు పాదయాత్రగా వెళ్ళారు. స్వాతంత్య్ర సమరంలో బ్రిటీష్‌ పాలకుల తూటాలకు బలైన మృతవీరులకు వారి స్మారక స్థూపాల వద్ద నివాళులర్పించారు.
అప్రకటిత ఎమర్జెన్సీని ప్రతిఘటిద్దాం!: ఒకప్పుడు పాలకులు దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించి అమలు చేశారని, నేటి పాలకులు ఏ రకమైన ప్రకటనలు హెచ్చరికలు లేకుండానే ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారని అరసం జాతీయ కార్యదర్శి వినీత్‌ తివారి అన్నారు. ప్రగతిశీల సాహిత్యం, సంస్కృతిక శక్తులపై దాడులు-కర్తవ్యాలు అంశంపై రెండవరోజు ఉదయం జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. రాష్ట్ర కార్యదర్శి కె. శరచ్చంద్ర జ్యోతిశ్రీ అధ్యక్షత వహించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన బి.జె.పి ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను హరిస్తోందని, భావప్రకటనా స్వేచ్ఛపై దాడులకు తెగబడుతోందని తివారి అన్నారు. ప్రశ్నించే మేధావులను రచనల ద్వారా ధిక్కరించే రచయితలను కొందరిని పాలకవర్గం భౌతికంగా అడ్డు తొలిగించు కుంటుంది అన్నారు. వరవరరావులాంటి మరికొందరిని అక్రమకేసులు బనాయించి నిర్బంధిస్తోందన్నారు. ఈ దాడులను ప్రతిఘటించేందుకు రచయితలు సిద్ధంకావాలని రచయితలకు పిలుపునిచ్చారు. ఈ సదస్సులో విప్లవరచయితలసంఘం నాయకులు సి.ఎస్‌.ఆర్‌.ప్రసాద్‌, ప్రజానాట్య మండలి నాయకులు చిన్నం పెంచలయ్య ప్రసంగించారు. ప్రగతిశీల సాహిత్య సాంస్కృతికరంగాలపై పథకంప్రకారమే దాడులుజరుగుతున్నాయని వారన్నారు.
నూతన తరాన్ని ఆకర్షిస్తున్న కథాస్రవంతి: అరసం ఈతరం కోసం కథాస్రవంతి శీర్షికతో కథాసంపుటాలను ప్రచురిస్తోంది. మహాసభల సందర్భంగా 8 కథాసంపుటాలను ప్రచురించింది. పెనుగొండ లక్ష్మీనారాయణ, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి పుస్తకాలను ఆవిష్కరించి ప్రసంగించారు. ప్రధాన సంపాదకులు వల్లూరు శివప్రసాద్‌ కార్యక్రమానికి అధ్యకతవహించారు. అరసం ఇప్పటికి వరకు 51కథా సంపుటాలను ప్రచురించిందన్నారు.
నూతన నాయకత్వ ఎన్నిక: అరసం అధ్యక్షులు రాచపాళెం చంద్రశేఖరరెడ్డి అధ్యక్షతన ప్రతినిధుల సభ జరిగింది. గత మహాసభల నుండి ఇప్పటివరకు మరణించిన ప్రముఖ సాహితీ వేత్తలకు, కరోనా కల్లోలంలో మరణించిన వారికి సభ సంతాపం ప్రకటించి రెండు నిముషాలు శ్రద్ధాంజలి ఘటించింది. ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్‌ కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు. చర్చల అనంతరం నివేదిక ఆమోదం పొందింది. తదుపరి నూతన నాయకత్వం ఏకగ్రీవంగా ఎన్నికయింది. గౌరవాధ్యక్షులు డా॥ పి. సంజీవమ్మ, అధ్యక్షులు డా॥ రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, అధ్యక్షవర్గంగా డా॥ కేతు విశ్వనాథరెడ్డి, ప్రొఫెసర్‌ ఎన్‌.ఈశ్వర రెడ్డి, సాయి మాధవ్‌ బుర్రా, ప్రొఫెసర్‌ కిన్నెర శ్రీదేవి, నల్లి ధర్మారావు, ప్రధాన కార్యదర్శిగా వల్లూరు శివప్రసాద్‌ , కార్యనిర్వాహక కార్యదర్శి జి. ఎస్‌. చలం, కార్యదర్శివర్గం, కార్యవర్గం ఎన్నిక జరిగింది.
సదస్సుల మధ్య విరామ సమయాలలో అరసం రాష్ట్ర మహాసభల గౌరవార్థం ప్రచురించిన అమరావతి మిర్రర్‌ మాసపత్రిక ప్రత్యేక సంచికను అరసం కార్యవర్గ సభ్యులు జి. ఓబులేసు ఆవిష్కరిం చారు. జీవని, ఇరవైలో అరవై వ్యాస సంపుటాలు, దాపల, నాగేటి సాళ్ళలో, ఉక్కు కవనం కవితా సం పుటాలను అరసం నేతలు ఆవిష్కరించారు. మహాసభల సందర్భంగా పాఠశాల, కళాశాల స్థాయిల్లో విద్యార్థు లకు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.
అరసం 19వ రాష్ట్ర మహాసభలు అర్థవంతమైన, ఫలవంతమైన చర్చలు, తీర్మానాలతో ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి.
` కె. శరచ్చంద్ర జ్యోతిశ్రీ, కార్యదర్శి, అరసం

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img