Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

కవిత్వం వెన్నెల కురిపించిన ‘విశాల నయనం’

మందరపు హైమవతి
సెల్‌: 9441062732

వచన కవితా పితామహుడు కుందుర్తి కథ, నవల, నాటకం, ఆత్మకథ అన్నిటినీ వచన కవితా ప్రక్రియలోనే రాయాలని చెప్పారు. చెప్పడమే కాకుండా రాసి చూపించారు. శీలా వీర్రాజు కూడా అలాగే రాశారు. ఇప్పుడు ఈతకోట సుబ్బారావు కూడ విశాలాక్షి పత్రికకు గత పదమూడేళ్లుగా సంపాదకీయాలను కవిత్వ ప్రక్రియలోనే రాశారు. ఈ కవిత్వ సంపాదకీయాలను ఏర్చి కూర్చి ‘విశాల నయనం’ గా తెచ్చారు ఇటీవల. సుబ్బారావు సుప్రసిద్ధ కవి, రచయిత కొన్ని ప్రత్యేక సంచికలకు సంపాదకులుగా వ్యవహరించారు. ‘విశాలాక్షి’ సాహిత్య పత్రికే అయినా సమకాలీన సంఘటనలపై, రాజకీయాలపై పదునైన అస్త్రాలను సంధించారు. ఏ పత్రికకైనా సంపాదకులు కవులైనపుడు వారి వాక్య విన్యాసాలు అన్యాయాల పట్ల కొరడా దెబ్బల్లాగానే ఉంటాయి. పాలకులను నిగ్గదీస్తాయి. అదే కదా కవిత్వం శక్తి.
శ్రీశ్రీ, ఆరుద్ర రాజకీయ కవిత్వం రాశారు. సిరిసిరి మువ్వలు, ప్రాసక్రీడలో శ్రీశ్రీ ఆనాటి రాజకీయాల మీద బాణాలు సంధించారు. ఆరుద్ర ‘కూనలమ్మ పదాలు’ లో సమకాలీన సంఘటనలపై తన కలం కత్తిని రaళిపించారు. దేవీప్రియ రన్నింగ్‌ కామెంటరీ, గజ్జెల మల్లారెడ్డి వ్యాసాలు, రాంభట్ల కృష్ణమూర్తి కార్టూన్‌ కవితలు అశేష పాఠకులను అలరించాయి. సంపాదకీయం, కవిత్వం రెండూ పరస్పర విరుద్ధాలు. సంపాదకీయం అంటే వాస్తవం పరిస్థితులపై వ్యాఖ్యానం. కవిత్వం ఊహాకు సంబంధించినది. ఈతకోట సుబ్బారావు మాత్రం ఈ రెండిరటికీ సమన్వయం సాధించి విశిష్టమైన కవిత్వ సంపాదకీయాలు రాశారు. రాజధాని వీధుల్లో రైతుల పోరాటాన్ని గురించి రాసినా, సోనూసూద్‌పై ఆదాయపు పన్ను శాఖ వాళ్లు దాడి చేసినా తన ఆగ్రహాన్ని నిర్భీతిగా ప్రకటిస్తారు.
దిల్లీలో రైతుల ఆందోళన గురించి ‘మట్టిబడి’ లో లక్షలాది భూమి కవుల స్వేద ఘోష/ కరకు కసాయి కత్తులపై రాసిన కన్నీటి భాష అంటూ ఈ ఉద్యమంలో వారు విజయాన్ని సాధిస్తారని ‘స్వాతంత్య్రాన్నే త్యాగాలతో సాధించుకొన్న జనాలకి విజయం అసాధ్యం కాని దుక్కి కాదు’ అని అంటారు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా బీద, ధనిక భేదాలు తొలగిపోలేదు. ఒకపక్కగా ఆకాశ హార్మ్యాలు, మరోపక్క చెట్టు నీడల ఇళ్లు. చేపలు పట్టేవారిని కొంతకాలం వేటకు వెళ్లొద్దు అని ప్రభుత్వం నిషేధిస్తుంది. సముద్రం మీద వేటకు వెళ్తేనే వారి కడుపులు నిండడం అంతంత మాత్రం. అసలు వెళ్లకపోతే వాళ్ల ఆకలి ఎలా తీరుతుందని కవి ప్రశ్నిస్తారు. తళుకు ముక్కల్ని బోటు నిండా నింపుకొని/ ఉదయ సంధ్యల్లో తీరం చేరినవేళ/ ఎదురొచ్చే యిల్లాలి మోముపైన/ చిరునవ్వుల జాతరకి మూడు మాసాల నిషేధం/ ఈ మూడు మాసాలూ ఉప్పునీటి కన్నీళ్ల సంగమమే’’ అని వారి దుర్భర స్థితిని అక్షర చిత్రంగా ఆవిష్కరిస్తారు ‘నిషిద్ధ రుతువు’ లో.
కవికి మాతృభాషంటే అభిమానం. ఇప్పుడు పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమానికే పట్టం కట్టారు. ప్రాథమిక దశలో పిల్లలు మాతృభాషలోనే విద్యాభ్యాసం చేయాలని కొఠారి కమిషన్‌ చెప్పినా ఇరుగు పొరుగులైన తమిళులు, కన్నడిగులు తమ మాతృభాషాభిమానాన్ని చాటుకొంటున్నా తెలుగువారికి చీమ కుట్టినట్లుండదు. దీనినే ‘అమ్మచేతి వంట’ లో రాష్ట్ర గీతాన్ని ఇంగ్లీషులో పాడగలరా?/ మాతృభాషలో చదువు చప్పిడి కూడు కాదు/ అవి మెదడుకు మేత పెట్టే మృష్టాన్న భోజనం/ ’’ అని మాతృభాష ప్రాముఖ్యాన్ని చాటి చెప్తారు.
ఏ విషయం మీద రాయాలో, దేనికి స్పందించాలో కవికి బాగా తెలుసు. అంబేద్కరు విగ్రహాన్ని అవమాన పరచిన సంఘటన మనకు తెలుసు. ఆ సంఘటనకి మనం సిగ్గుతో తలదించుకోవాల్సిన దుస్థితి. దీనికి కలవరపడి కవి చెప్పులు మెళ్లో వేసుకొని నడుస్తున్నాను/ చౌరస్తాలో నీ విగ్రహం మీదట/ మోకాళ్లపై వంగి క్షమాపణలను కోరాలని/ అంటారు. ‘నిష్కృతి’ కవితలో చదివిన బడిలోనే అంటరానితనంతో/ పసి హృదయం మీది గాయంమరకతో/ నిలువెత్తు మనసు పుండైననాడు అని సమాజం తనపైచేసిన గాయాన్ని గురించి దుఃఖపడువారు. తరాలుగా చేసిననేరానికి/ ఇప్పుడైనా నిష్కృతికావాలి’’ అంటారు.
ప్రపంచీకరణ నేపథ్యంలో నేడు మానవుడే వినియోగదారుడు. మనిషికి అవసరమున్నా లేకపోయినా ఒకటి కొంటే ఒకటి ఉచితమని, ఒక చీర ఖరీదుకే నాలుగు చీరలు వస్తాయని పదేపదే ప్రకటనల మాయాలోకంలో విహరింప చేస్తున్నారు పెట్టుబడిదారులు. దీనినే ‘వైకుంఠపాళీ’ లో మార్కెట్‌ మనిషిని ఎలా దోచుకుంటుందో, దాని వికృత స్వరూపాన్ని చిత్రీకరించారు. గుజరాత్‌లో పటేల్‌ భారీ విగ్రహాన్ని నిర్మించారు. ఎన్నో వేల కోట్లు ఖర్చుపెట్టి, గొప్పవారిని గౌరవించాల్సిందే కానీ విగ్రహాలు నెలకొల్పికాదు. వారి ఆశయాలను పాటించాలి ప్రతి ఒక్కరు. ఈ విషయం గురించే ‘రెండుపుంజాల మధ్య’ లో అభివృద్ధి విగ్రహాల్లో కాదు/ నిగ్రహం లాంటి ఆశయంలో ఉండాలి/ ప్రపంచం యావత్తూ నావైపు కాదు/ నా దేశం వైపు చూడాలి/ అని విగ్రహాలు మాత్రమే నిర్మిస్తే చాలదని అంటారు. కాలక్రమంలో బాలు, మంగళంపల్లి, బాపు, శ్రీశ్రీ, పెద్దిభొట్ల, సినారె, సోమసుందర్‌ మొదలగు వారు మరణించినపుడు స్పందించిన సంపాదకీయాలు హృదయాలను కదలిస్తాయి. శివారెడ్డి గురించి విరసం, నేలపట్టులో వలసపక్షుల పండుగ గురించి ఎన్నో వైవిధ్యమైన విషయాలపై ఆర్ద్రమైన కవితలు రాశారు.
కథల మేష్టారు ‘పెద్దిభొట్ల మరణానికి’ ఒక మహావాక్యం మధ్యలోనే ఆగిపోయిందని/ కథా సాహిత్యం తల్లడిల్లిపోతుంది’’ అని అంటారు. శివారెడ్డి గురించి అలుపెరుగని కవితా యాత్ర గురించి ‘నడుస్తూనే ఉన్నాడు’ కవితలో హృదయాస్తమయాల మధ్య సంధిగీతంలా/ చరణాలు చరణాలుగా నడుస్తూనే ఉన్నాయి/ అని శివారెడ్డి వారి అలుపెరుగని కవితాయాత్ర గురించి పద చిత్రాన్ని చిత్రిస్తారు. పఠాభి, సి.పి.బ్రౌన్‌ జయంతి సందర్భంగా రాసిన సంపాదకీయాలు వారి గురించి ఎన్నో విశేషాలను తెలియజేస్తాయి. పత్రికారంగంలో సంపాదకుల పాత్ర విశిష్టమైనది. వార్తా రచనలో, వాక్య నిర్మాణంలో ఏ పత్రిక పద్ధతి ఆ పత్రికకే ఉంటుంది. సంపాదకీయం అనగానే అది మరింత విలువైనది.
తెలుగు కవిత్వానికి అపరిచితమైన ఈ ప్రక్రియలో సంపాదకీయాలు రాసి, పాఠకులను మెప్పించారు. సమకాలీన సంఘటనలను తీసికొని, వాటికి కవిత్వ పరిమళాలు అద్దిన ఈ కవిత్వ సంపాదకీయాలు అందరినీ అలరిస్తాయి. ‘భాషానది, మట్టిబడి, స్వేదఘోష, శాంతిలయ మొదలైన పదబంధాలు ఆకర్షిస్తాయి. జలపాత శైలితో మొదట నుంచి చివరి వరకు ఏకబిగిన చదివింపచేస్తాయి. ఈ విశాలనయనానికి ‘విశాలాక్షి’ కి కవిత్వపుకాటుక పేరుతో ఆంధ్రజ్యోతి సంపాదకులు రాసిన ముందుమాట విలువైనది. గుబాళించే కవిత్వంతో కూడిన ఈ సంపాదకీయాలు తెలుగు సాహిత్యంలో ఒక విభిన్న ప్రక్రియకు చెందినది. సమకాలీన రాజకీయం గురించి, భాషా సంస్కృతుల గురించి రాసిన సంపాదకీయాలు ఆలోచింపజేస్తాయి. అందరూ చదవదగ్గ పుస్తకంగా మలిచినందుకు రచయితను అభినందించాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img