Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

కవిత్వపు అరలయ్యే జ్ఞాపకాల దొంతరలు

మానవ జీవనయానంలో మైలురాళ్లు జ్ఞాపకాలు. ఒక జ్ఞాపకం దిగులు దిగులుగా పగుళ్లు దీస్తూ ముల్లులా గుండెకు గుచ్చుకుంటూ కన్నీరై ప్రవహిస్తే మరో జ్ఞాపకం తొలకరి జల్లుగా రaల్లురaల్లుమంటూ ఆమనిగా హృదయాన్ని అధిష్టించి ఆనందపు పూలపరిమళమై వ్యాపిస్తుంది. జ్ఞాపకాల దొంతర్లలో మనిషి నిరంతరం ఎన్నో వంకర్లు పోతూనే వుంటాడు. జ్ఞాపకం ఎదచెట్టుపై పల్లవించే నిత్యహరితమవుతూ వుంటుంది. వర్తమానవర్షం చొరబడకుండా తలదాచుకునే ఆరామం అవుతూవుంటుంది. నిట్టూర్పుల గులకరాళ్లపై ప్రవహించే జలపాతం అవుతూవుంటుంది. జ్ఞాపకం దీపమై వెలిగితే హృదయతిమిరం తొలగిపోతుంది. తెమ్మెరగా స్పర్శిస్తే బ్రతుకు చేను పులకరిస్తుంది. అది గుండెబిడ్డను లాలించేందుకు అవుతూవుంటుంది మాతృత్వపు జోల. జ్ఞాపకాల్ని వయసు ఫ్రేముల్లో దాచుకొని ఆనందంగా చూసుకుంటూ వుంటాం. చీకటివెలుగులు ప్రపంచాన్ని పరిభ్రమింపజేస్తున్నట్టే జ్ఞాపకాలు మనసును తమచుట్టూ ప్రరిభ్రమింపజేస్తుంటాయి. జ్ఞాపకం జీవితపు ఎడారిలో ఒయాసిస్సులా మనిషికి కొండంత ఓదార్పునిస్తుంటుంది. అది లావాలా మనిషి హృదయకడలిలోని అగ్నిపర్వతాల్ని బద్దలు చేస్తుంటుంది. జ్ఞాపకాల వెల్లువలో మనిషి హృదయం గట్టుతెగిన నదిలా తపించిపోతూవుంటుది. గతం అనే మ్యూజియంలో జ్ఞాపకాల్ని పది కాలాలపాటు భద్రపరుస్తుంది జీవితం. ఎన్నెన్నో అనుభవాల తాలూకు ఆ జ్ఞాపకాలకు అక్షరాలను తొడుగుతూవుంటుంది కవిత్వం.
‘జ్ఞాపకం/ తొడిమలాంటిది/ అది ఎప్పుడో రాలిన పువ్వుకు/ సంకేతం
అగరువత్తి కొసమెరుపులా/ అది మనసు అంచున వెలుగుతుంది
అరవిందం పొత్తిలిలో హిమబిందువులా/అది అంతరంగాన చేరుతుంది’ (‘అనుభూతి గీతాలు’ నుంచి)
అంటాడు అనుభూతి కవి ఇంద్రగంటి శ్రీకాంతశర్మ. ఒక అనుభవం రాలిపోతే దాని తాలూకు తొడిమ లాంటిది జ్ఞాపకం. అది ఆ అనుభవం తాలూకు గత కాలపు దృశ్యాలను హృదయఫలకంపై మళ్లీ మళ్లీ ప్రతిబింబింపజేస్తూనే వుంటుంది. అది అగరువత్తిలా హృదయపు అంచుల్లోనే వెలుగుతూ అనుభూతుల ధూపాన్ని వ్యాపింపజేస్తుందని, అది తామరపుష్పం పొత్తిళ్లలో మెరిసే స్వచ్ఛమైన హిమబిందువులా అంతరంగానికే వన్నె తెస్తుందని అంటూ జ్ఞాపకాల మధురిమలకు అక్షరాల సరిగమలను మనోహరంగా కూర్చాడు. అనుభవాలకూ, జ్ఞాపకాలకూ వున్న అవినాభావ సంబంధాన్ని వివరిస్తున్నాడు కవి.
‘మనసుపాప జ్ఞాపకాల బొమ్మ కావాలని/ మారాం చేస్తూనేవుంటుంది
అడిగినప్పుడల్లా ఇవ్వాలా వద్దా అనేదే/ నేను తేల్చుకొవలసింది
జ్ఞాపకాల నుంచి పారిపోవడం/ జ్ఞాపకాలతోనే ఆగిపోవడం
ఈ రెండూ నాకు సరిపడవు/ కాసేపు జ్ఞాపకాల కుటీరంలో సేదతీరి
అంతలోనే జ్ఞాపకాల వేసంగిలో మాడిమాడి/ నా పయనం సాగుతూనే వుంటుంది’
(‘జ్ఞాపకంలో మెలకువగా’ ఖండిక నుంచి)-అంటూ జ్ఞాపకం పట్ల మెలకువగా వుండాలని మనిషిని హెచ్చరిస్తాడు ఆధునిక కవి ఫణీంద్ర. తప్పించుకోలేనివిధంగా జ్ఞాపకాలు మనిషిని వెంటాడుతూనే వుంటాయి. అయితే వాటి బారిన పడడమూ, పడక పోవడమూ మనిషి విచక్షణ మీదే ఆధారపడి వుంటుంది. కొన్ని జ్ఞాపకాలు వాసంత సమీరాలై మనిషిని సేదదీరిస్తే మరికొన్ని జ్ఞాపకాలు పెల్లుబికే లావా ప్రవాహాలై మనిషిని రగిలిస్తుంటాయి. అందుకే మనిషి జ్ఞాపకాల గమనంలో సంయమనం పాటించాలంటాడు కవి. మనసుపాప తను ఆడుకోవడానికి తనకెంతో ఇష్టమైన జ్ఞాపకపు బొమ్మ కావాలని మారాం చేస్తుందనడం విలక్షణమైన భావ చిత్రం. జ్ఞాపకాల నుంచి పారిపోవడమూ, జ్ఞాపకంలోనే నిలిచి పోవడమూ రెండూ తగదంటాడు కవి. జ్ఞాపకాల్లోని ఆనందాల్నీ, విషాదాల్నీ అనుభవిస్తూ జీవిత పయనం సాగించాలంటాడు. ‘వెలుగు మిషతో ఎక్కడెక్కడో దాక్కున్న బాధలూ, జ్ఞాపకాలూ బిలాల్లోంచి బైటికొచ్చి వెంటాడుతాయి’ అంటూ బరువు గుండె వెతల జ్ఞాపకాలను వెంటాడే పాములతో పోలుస్తాడు కవిపుంగవుడు వజీర్‌ రెహ్మాన్‌. జ్ఞాపకాల దొంతరలోని వెలుగును చూడాలని కవి తపించాడు. అయితే బిలబిలమంటూ తనను వెంటాడే వాటినుంచి తప్పించుకోలేని నిస్సహాయస్థితి ఇక్కడ కవిత్వీకరణ చెందింది. సెగలు కక్కే దిగులు రాగాలను పలికించింది. జ్ఞాపకంలోని రెండు ముఖాలనూ ప్రతిబింబిస్తుంది కవిత్వం.
-డాక్టర్‌ కొత్వాలు అమరేంద్ర, సెల్‌: 9177732414

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img