Saturday, August 20, 2022
Saturday, August 20, 2022

గరిమెళ్ళ బహుముఖీన విశ్వరూపం

సన్నిధానం నరసింహశర్మ, 9292055531

వర్తమాన తరానికి మనం మన స్వాతంత్య్ర సమరయోధుల గురించి స్ఫూర్తిదాయకంగా తెలియపరచవలసినంత తెలియజేస్తున్నామా? అంటే లేదు అని నిస్సిగ్గుగా ఒప్పుకోవచ్చు. వివిధ పాఠ్య గ్రంథాలను చూస్తే కూడా ఇది అర్థమవుతుంది.స్వాతంత్య్ర సమరయోధుల గురించే కాదు, ఆ కాలం నాటి స్వాతంత్య్ర సమర సాహిత్య సృజనల గురించి ఆయా కవుల్లో ముఖ్యులైన వారి గురించీవారి ఉన్నత చరిత్రల గురించి ఈ తరానికి భవిష్యతరానికి తెలపవలసి బాధ్యత మనపై ఉంది. ముఖ్యంగా తెలుగు ప్రాంతాల వారి గురించి విశదపరచడంలో. జాతీయ స్థాయిలో స్థాన కల్పనల గురించి యోచించాలి. అలా యోచించేటప్పుడు వేళ్ల లెక్కింపులోనే గణించదగిన స్వాతంత్య్ర సమర ప్రబోధ కవి గరిమెళ్ళ సత్యనారాయణ. శ్రీకాకుళంజిల్లాలో నరసన్నపేట ప్రయోగ్రహారంలో 1893 జూలై 15న పుట్టి 1952 డిసెంబరు 18వ తేదీన చెన్నపట్టణంలో కీర్తిశేషులైన గరిమెళ్ళ 59 ఏళ్ళ జీవితప్రస్థానంలో సాధించినవి ఎన్నో! రచించినవి ఎన్నో!
గరిమెళ్ళ సత్యనారాయణ అనగానే ఠకీమని గుర్తుకువచ్చేది ‘మా కొద్దీ తెల్లదొరతనమూ’ అనే ప్రసిద్ధమైన పాట. ఆ పాట చిన్నది కాదు, పెద్దది. అంతా పాడుకోలేక కొంత భాగాన్ని పాడుతూ గుర్తు చేసుకుంటాం. ఆ పాట కీర్తితెరను ఒకసారి పక్కకు తొలగించి చూస్తే గరిమెళ్ళ విశ్వరూపాన్ని చూడగలం. సమకాలీన రాజకీయ ఆర్థిక పరిజ్ఞానమున్న వ్యాస రచయిత. కళలపై అవగాహన అధ్యయనాలతో తర్కించిన కళాశీలి. ప్రయోజనకర గ్రంథాలను ప్రచురించిన ప్రచురణ/ ప్రకాశకర్త. ఉన్నవాటిలోనే తిరుగాడక కొత్త తలంపులుగల ప్రయోగశీలి. పెద్ద, చిన్న అది చూడకుండా, స్వీయ స్పందనలకు అనుగుణంగా రచనలు చేసిన విమర్శకుడు. జాతీయ భావాగ్నులు ప్రజ్వలింపజేసే చలనశీల ఉద్యమరూపుడు.
నూనుగు మీసాల నూత్నయౌవనదశలోనే తానున్న ప్రియాగ్రహారంలో ‘జ్ఞానోదయసమాజం’ అనే పొత్తపుగుడిని స్థాపించిన గ్రంథాలయోధ్యమ భాగస్వామి. ఇన్ని పార్శ్వాల ఉన్నతమూర్తిని అర్థం చేసుకోవాలంటే ఆయన రాసిన వందల పాటలగ్రంథాలను, అనువాద గ్రంథాలను, ఆనందవాణి, కిన్నెర, ఆంధ్రపత్రిక, ఢంకా, అంకుశం, భారతి, ప్రబుద్ధాంధ్ర వంటి పత్రికల్లోని వివిధ అంశాల వ్యాసాలను పరిశీలించాలి. వ్లాడిమిర్‌ కిషన్‌, భోగరాజు పట్టాభి సీతారామయ్య వంటి గ్రంథాలను ఆయన చేసిన అనువాదాలు చదవాలి. లేదా చల్లా రాధాకృష్ణ, బి. కృష్ణకుమారి, పరకాల పట్టాభిరామారావు, డా.కె.ముత్యం వంటివారు రాసిన పరిశోధనాత్మక గ్రంథాలు, సంకలనాలు చదవాలి. ఇప్పటికీ గ్రంథస్థ రూపం పొందని ఆయన వ్యాసాలు సంపుటాలుగా రావల్సి ఉండటం బాధాకరం. నవaత్‌ీ శీట Iఅసఱa అనే ఆయన ఆంగ్ల గ్రంథాన్ని ప్రీత్‌కుమారి అనే రచయిత్రి ఆచార్య జయధీర్‌ తిరుమలరావు ప్రోత్సాహంతో ప్రకాశింపజేశారు. రాజకీయ, ఆర్థిక, సాంస్కృతికరంగాలలో గరిమెళ్ళ అధ్యయనం ఆయన పత్రికావ్యాసాల్లో ప్రస్ఫుటమవుతుంది. కమ్యూనిజం పట్ల మంచి అవగాహన ఉన్న వ్యక్తి.కలెక్టరాఫీసులో క్లర్కుగాను, విజయనగరంలో ఉపాధ్యా యునిగా గరిమెళ్ళ పనిచేశారు. బిపిన్‌ చంద్రపాల్‌ ఉపన్యాసాలకు ఉత్తేజితుడైన గరిమెళ్ళ జాతీయభావాలు స్వాతంత్య్ర సమరభావాలు కలనేతగా నేతగా తయారయ్యాడు. రాజమండ్రిలో ఉపాధ్యాయుల బోధనాభ్యాసన కళాశాలను స్వాతంత్య్ర సమరాభినివేశంలో వదిలేశారు. గాంధీ ప్రబోధాలకు ప్రేరితుడై తెల్లదొరతనం తల్లడిల్లేలా ‘మా కొద్దీ తెల్లదొరతనమూ’ పాటను రాశారు. గాయకుడై గానం చేశారు. అలా ఆ పాట పాడుకుంటూ ప్రయాణించేవారు. 35 చరణాలను మించిన ఆ పెద్ద పాటకు సైక్లోస్టయిలు ప్రతులు తీసి పంచుకుంటూ వెళ్లేవారు. కారాగారవాస క్లేశాలకు ఆ పాట ప్రధానకారణమయింది. కారాగారంలో తమిళం నేర్చుకోవడమే కాదు. ఆ భాషలోని నీతి గ్రంథం తిరుక్కురళ్‌కు తెలుగు అనువాద గ్రంథం సంతరించిన తీక్షణదృష్టిగల రచయిత. ‘సాహిత్యగాంధీ’గా ప్రజా ప్రశంసపొందిన భావోజ్జ్వలుడు. ప్రజాసాహిత్యంతో పెనవేసుకున్నా జంగం కథా ప్రక్రియలో ‘ఆంధ్ర రాష్ట్రం’ రాసిన రాష్ట్ర ప్రేమికుడు. దేశభక్తి గీతాగానం చేసిన గరిమెళ్ళను కర్కశమైన తెల్లదొరతనం రెండున్నర ఏళ్ళు జైల్లో మ్రగ్గజేసింది. స్వాతంత్య్రసమర విప్లవగీతం ‘మా కొద్దీ తెల్లదొరతనం’ రాజమహేంద్రిలో బ్యాండుమేళాలవారు ఆ పాటను పాడారంటే ఒక వివాహ సందర్భంలో సైతం ఆ పాట పాడబడిరదంటే విజయనగరంలో మాలపేటలో రెల్లికులంవారు ఈ పాట పాడుకునే వారంటే దాని ప్రభావం ఆనాటి ప్రజల్లో ఎలా ఉందో తెలియడానికి కొన్ని సాక్ష్యాలు మాత్రమే. ఆ పాటలో మాటల ఫిరంగిధ్వనులున్నాయి. మాటలే తూటాలై తెల్లవారిని భయపెట్టాయి.పాటపఠనం ద్వారా భావాన్ని గ్రహించగలిగినా అది గానయోగ్యమైనపుడే దాని అందం, చందం. ఈ పాటలో భావుకత కూడా ఉంది కనకే జైల్లో స్వేచ్ఛ అనే వధూమణి ఓ ప్రజలారా! మీకై వేచి చూస్తోంది. పుష్పగుచ్ఛాలనుధరించి మిమ్మల్ని అభినందించడానికి సంసిద్ధు రాలైఉంది. విచ్చలవిడిగా హాయిగా రెక్కలువిప్పి జైల్లో విహరించవచ్చు. మాతృఋణాన్ని తీర్చుకోవడానికి జైళ్ళకు రండి అంటారీ పాటలో. గరిమెళ్ళ వారు చివరిదశలో చెన్నపురిలోసంపాదన లేక, మెరీనాబీచ్‌లో చేయిసాచి డబ్బు అడుక్కుని బ్రతికారట. ఎంత బాధాకరం. పరిశోధనా రచయిత డా.కె. ముత్యం బాధతో ఆ అడుక్కున్నది గరిమెళ్ళ రూపంలో ‘తెలుగుజాతే’ అని మన కళ్ళతడి పెంచారు. గరిమెళ్ళను ప్రజలలోకి ఇంకా తీసుకెళ్ళడానికి మనం కళ్ళు తెరవాలి. ఆయన బహుముఖ సేవలు బహిర్గతం కావాలి.
(జూలై 15న గరిమెళ్ళ సత్యనారాయణ 129వ జయంతి సందర్భంగా)

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img