Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

గుబాళించిన మాడభూషి కవిత్వం

‘‘కవి నిరంతరం ప్రవహిస్తూ ఉంటాడు
నదిలా ప్రక్షాళన చేస్తూ. కొండల్ని, నదుల్ని, బండల్ని, లోయల్ని/ ప్రపంచంలోని మాయల్ని, దాటుకుంటూ మోసుకుంటూ ప్రవహిస్తూ ఉంటాడు’’ అని సుప్రసిద్ధ కవి, రచయిత, అనువాదకులు, పరిశోధకులు, పర్యవేక్షకులు, పాత్రికేయులు, బహుభాషావేత్తలైన ఆచార్య మాడభూషి సంపత్‌కుమార్‌ అన్నారు.
ఇలాంటి నిరంతరం ప్రవహించి, పలువరించే కవిత్వాన్ని వెలువరించిన వీరి కవిత్వం గురించి ప్రఖ్యాత రచయిత కొండ్రెడ్డి వేంకటేశ్వరరెడ్డి ‘కవిత్వమై కురిసిన కవి’ అనే పేరుతో చక్కని గ్రంథాన్ని 2022 నవంబర్‌లో వెలువరించారు. ఇది ఆచార్య మాడభూషి సంపత్‌కుమార్‌ కవిత్వ పరిమళాల్ని పరిశోధనాత్మకంగా విరబూయిం చిందని చెప్పాలి. ఈ గ్రంథం గొప్ప పఠనీయ అనుభూతి నిస్తుంది. అంతేకాకుండా ఒక కవి హృదయాన్ని మనసుకు హత్తుకునేలా ఆవిష్కరించింది. దీనిలో ప్రధానంగా ఆచార్య సంపత్‌కుమార్‌ కలం నుండి జాలువారిన ‘జీవితం కవిత్వం’ (2013), ‘ఆలోచనలు’(2015), ‘శత్రువుతో ప్రయాణం’ (2015), ‘చివరకు నువ్వే గెలుస్తావు’ (2016), ‘మూడో మనిషి’ (2017) , ‘వికారి’ (2019) కవితా సంపుటాల్లోని కవిత్వంపై లోతైన విశ్లేషణ కనబడుతుంది. మొత్తం పన్నెండు భాగాల్లో సుమారు 184 పుటల్లో రూపుదాల్చింది.
తొలుత ‘ఉపోద్ఘాతం’లో కొండ్రెడ్డి వేంకటేశ్వరరెడ్డి కవిత్వ ఉద్దేశ్య, లక్ష్యాల్ని స్థూలంగా పరిచయం చేశారు. మాడభూషి సంపత్‌కుమార్‌ను ఎంతో నిర్మలమైన మనసున్న కవిగా అభి వర్ణించారు. వీరి కవిత్వంలో భాగమైన సామాజిక, సాంఘిక, రాజకీయ, స్త్రీ, దళిత దృక్పథాల్ని సూచీ ముఖంగా క్రమబద్దీకరించారు. మొత్తం కవిత్వంలో పదాలు, భావాలు ఎంత జాగ్రత్తగా ప్రయోగించారో చెబుతూ… సంపత్‌కుమార్‌ కవిత్వం నాలుగు కాళ్లమీద నడుస్తుందని ఉగ్గడిరచారు. రియాలిటీ, హ్యుమానిటీ, క్లారిటీ, కమిట్‌మెంట్‌ అనేవి వీరి కవిత్వంలో సుగుణాలన్నారు. సమాజశ్రేయస్సు కోసమే ఈయన కవిత్వం రాశారని గ్రంథకర్త ఉద్ఘాటించారు. కవిత్వం మనిషిలో మార్పు తీసుకురావాలని ఆరాటపడిన కవుల్లో సంపత్‌కుమార్‌ ఒకరని గుర్తుచేస్తారు. జీవితంలో ఎదురైన కష్టాల్ని మాడభూషి దీక్షతో ఎదుర్కొని వృద్ధిచెందిన విధానాన్ని కళ్లకు కట్టించారు. చిత్తూరుజిల్లా మాండలిక పదాలు, చెన్నైలోని తెలుగు పలుకులు సందర్భాను సారంగా ఆయా కవితల్లో పెనవేసుకున్న క్రమాన్ని ఈ అధ్యాయంలో పేర్కొన్నారు.
‘మాడభూషి జీవన రేఖలు’ భాగంలో కవి పుట్టు పూర్వోత్తరాలతో పాటు కుటుంబ నేపథ్యాన్ని, విద్యా భ్యాసం, వివాహం, ఉద్యోగ జీవితం, లభించిన పదవులు, రచనా వ్యాసంగం, సంపాదకత్వంలో వచ్చిన పుస్తకాలు, అనువాద రచనలు, కవితా సంపుటాలు, సంకలనాలు, అవార్డులు, బిరుదులు మొదలైన వివరాల్ని తెలిపారు. కాగా వీరి విదేశీ పర్యటనలు, మద్రాసులో ఈయన ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుల వివరాలు, ఆయా కార్యక్రమాంశాలు ఇందులో పొందుపరిచారు.
‘కవిత్యం రాయడానికి సూక్ష్మ పరిశీలన, గాఢ వివేచన, అమోఘమైన నిష్కర్ష వుంటే అది జీవితాల్లో వివేకాన్ని మేల్కొలుపుతుంద’ని రచయిత కొండ్రెడ్డి తెలుపుతూ… ‘జీవితం- కవిత్వం-కలపోతల తన్మయత్వం’ అనే భాగాన్ని మొదలు పెడతారు. కవిత్వం జీవితానికి ఏమి అందిస్తుందన్న అంశాల్ని ఇక్కడ ప్రస్తావిస్తూ… ప్రధానంగా ఆచార్య మాడభూషి సంపత్‌కుమార్‌ రాసిన కవిత్వాన్ని ఉదహరించారు. వీరి కవిత్వం జీవితాన్ని, జీవితంలో కవిత్వాన్ని ఏ విధంగా రంగరించిందో చూద్దాం. ‘‘పండు వెన్నెల్లో / కవిత్వాన్ని ఆరబోసి/ జీవితమంతా కాపలా కాస్తాను/ జీవితానికి పండువెన్నెల్ని/ ఆసరా చేస్తాను/ కవిత్వానికి జీవితాన్ని ధారబోస్తాను’’ అంటాడు. మరో చోట జీవితాన్ని ఏ ఒడిదుడుకులు లేకుండా అధిరోహించాలంటే కవిత్వాన్ని ఆరాధన పూర్వకంగా అధ్యయనం చేయమని సలహాయిస్తాడు. (పుట: 45) తర్వాత జీవితాన్ని అంత ఈజీగా తీసుకోవద్దు. అలాగే కవిత్వాన్ని కూడా వెటకారం చేయ వద్దన్న కవితా వాక్యాలు మనసుల్ని కదిలిస్తాయి. ‘‘జీవితానికి పోరాటం తప్పదు/ కవిత్వానికి ఆరాటం తప్పదు/ జీవితానికి, కవిత్వానికి వెటకారం నప్పదు’’ (పుట:45) జీవితం మీద కవిత్వం మీద నమ్మకం ఉన్న కవి మాడభూషి ఇలా ప్రకటిస్తారు. ‘‘జీవితం/ ఎవరికీ గులాంగిరికాదు/ కవిత్వం ఎవరికీ వంగి సలాం చెయ్యదు/ నిలువెత్తు కవిత్వంలో/ జీవితం తలెత్తుకు తిరుగుతుంది’’ (పుట:48) అనే కవితా కుసుమాలు ఎంతో స్ఫూర్తిని నింపుతాయని కొండ్రెడ్డి వివరించారు. ఇందులో కవి సంపత్‌ కుమార్‌ పోతన, వేమన కవిత్వ తత్త్వాన్ని ఎంతో గొప్పగా ఆవిష్కరించిన తీరును కూడా చూడవచ్చు. జీవితం, కవిత్వం గురించి ఇంతలా చర్చించిన కవి నాకు మరొకరు కనిపించలేదని రచయిత చెప్పారు.
‘‘కవిత్వం మీద కవిత్వమై కురిసిన కవి’’ అనే అధ్యాయం ఈ పుస్తకానికి టైటిల్‌సాంగ్‌ లాంటిదని చెప్పాలి. కవి సంపత్‌కుమార్‌ కవిత్వాన్ని గుడ్డిగా రాయ కుండా దానిమీద నిర్మొహమాటమైన విమర్శకూడా చేశారని వేంకటేశ్వరరెడ్డి అన్నారు. దీన్ని నిరూపించడానికి ‘వికృతులు, ప్రత్యక్షసాక్ష్యాలు అనే కవితల్ని ఉదహరించారు. అసలు కవిత్వాన్ని వ్యాపారం చేయ కూడదని సంపత్‌కుమార్‌ భావన. శ్రీశ్రీ రాసిన కవితా ఓకవిత, జయభేరి లాంటి కవితల్ని ఈయన పేరడీలుగా రాశారు. దీన్నిబట్టి వీరిపై శ్రీశ్రీ ప్రభావం బలంగా కనబడుతుందని రచయిత అభిప్రాయం. ఇందులోనే ‘శత్రువుతో ప్రయాణం’ మూడో మనిషి’ కవితా సంపుటాల్లోని కొన్ని కవితల్ని పేర్కొంటారు. కవులు ఎలా ఉండాలి. ఎటువంటి కవిత్వం రాయాలనే సూక్ష్మాంశాల్ని ఆయా కవితల్లో మాడభూషి ఎంతో ఔచిత్యంతో రాశారని గ్రంథకర్త అన్నారు. ఈ కవిత్వం అనేది ‘గుడికికాదు బడికి నడిపించాల’ని చెప్పిన మాటల్లో ఎంత అభ్యుదయం దాగుందో మనం అర్థం చేసుకోవాలి. కవి ఆచార్య మాడభూషి సంపత్‌కుమార్‌ మహిళాభ్యుదయాన్ని కాంక్షిస్తూ వారి హక్కుల్ని పరిరక్షించుకోవాలనే తపనతో కొన్ని కవితల్ని రాశారని ‘మహిళా సాధికారిత మార్గాన్వేషణ’ లో కొండ్రెడ్డి వేంకటేశ్వరరెడ్డి తెలిపారు. పురుషులతో సమానంగా మహిళలు కూడా అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నారని సంపత్‌కుమార్‌ అంటారు. భర్తలు భార్యలకు తగినంత గౌరవాన్ని ఇవ్వాలని, ఎక్కడ స్త్రీలు గౌరవాన్ని కోల్పుతున్నారోనన్న అంశాల్ని చాలా బాధ్యతగా గుర్తు చేసి, స్త్రీల పక్షం వహించిన విధానాన్ని గ్రంథకర్త బాగా తెలియజెప్పారు. ఇందులో ‘మగాడు’, ‘బావి’, ‘తల్లి’, ‘ఆకురాలిన కాలం’ వంటి కవితల్ని ఉదహరించారు.
‘రైతరికానికి రక్షణ’ శీర్షికతో రాసిన భాగంలో కవి సంపత్‌కుమార్‌ రైతుల పక్షం ఏవిధంగా వహించారన్న దాన్ని తెలుసుకోవచ్చు. ‘మూడోమనిషి’ కవితా సంపుటిలో ‘రైతు’ శీర్షికతో రాసిన కవిత కళ్ళు తెరిపిస్తోంది. మచ్చుకు కొన్ని వాక్యాల్ని చూద్దాం. మట్టిని పిసుక్కుంటూ/ ఆనందించే/ రైతు/ ఇప్పుడా చేతులు పిసుక్కుంటూ/ఆవేదన చెందుతూ ఉంటాడు’’ (పుట: 85) ‘రైతు ఆత్మకథ’ లో ‘రైతు కథకు/ విశ్రాంతి ఉండదు/విరామం ఉండదు/ తరతరాలకు/సాగుతూనే ఉంటుంది/ఆత్మ వంచన/ చేసుకునే వాళ్ళు/ ఉన్నంతవరకు/ రైతు ఆత్మకథ/ రాసు కోలేడు’’ (పుట: 89) ఇలా సంపత్‌కుమార్‌ కవితల్లో నేటి కాలపు రైతుల పరిస్థితులు అగుపడతాయి.
కలుషితమవుతన్న ప్రకృతిని చూసి కవి ఎలా తల్లడిల్లారన్నది కొండ్రెడ్డి ‘ప్రకృతి పరిరక్షణకు సత్తువ’ భాగంలో చూపించారు. ప్రకృతి పరిరక్షణకు తీసుకోవా ల్సిన చర్యల్ని ఏకరువుపెట్టిన తీరు మనల్ని ఉన్ముక్తుల్ని చేస్తుందని ‘విరోధి’ కవితను ఉదహరిస్తూ… మనిషి పర్యా వరణాన్ని ఎలా నాశనం చేస్తున్నాడో చెప్పాడు. ‘భుమ్యా కాశాలు’, ‘గుణపాఠం’ కవితల్లో ప్రకృతో వికృత చేష్టలు చేయడం కద్దని కవి మాటల్ని ఇందులో క్రోడీకరించారు.
అనాదికాలం నుండి కులమనేది సమాజంలో వేళ్ళునూ కొంది. దీన్ని రూపుమాపడం కోసం చాలామంది చాలా ప్రయత్నాలు చేసిన ఇంకా మగ్గుతూనే ఉందన్నది విదితమే. ఈ జటిలమైన అంశంపై ఆచార్య మాడభూషి సంపత్‌కుమార్‌ ఎంతో చొరవతో కవిత్వం రాసిన విధానాన్ని ‘దళిత దృక్పథమే ఆత్మఘోష’ భాగంలో కొండ్రెడ్డి ప్రస్తావించారు. అలాగే నేటి మోసపూరిత రాజకీయాలపై కవి సంపత్‌ కుమార్‌ అవకాశం దొరికనప్పుడల్లా తమ కలాన్ని రaుళిపించారని కొండ్రెడ్డి భావించారు.
కవి మాడభూషి సంపత్‌కుమార్‌ మరణం గురించి ‘ప్రయాణం’ కవిత రాస్తూ… జీవితం నీటి బుడగలాంటిది అది ఎప్పుడు పగిలిపోతుందో చెప్పలేం. మంచులాగా కరిగిపోయే జీవితాన్ని వీలైతే నలుగురికి పంచాలన్న కవి ఆలోచనల్ని రచయిత కొండ్రెడ్డి ‘మరణం మీద అక్షర రణం’ అనే భాగంలో చర్చించారు. ‘శవం లేచిన ఇల్లు’ ‘ఏడుపు’, ‘మరణం’, ‘మరణ శాసనం’, ‘మరణం నా శాశ్వత చిరునామా’, ‘అడవిలో పొద్దుగూకింది’ మున్నగు కవితల్లో చావు గురించి రాసిన విషయాలు పాఠకుల్ని ఆలోచింపజేస్తాయని పుస్తక రచయిత పేర్కొన్నారు.
‘వ్యక్తిత్వాన్ని సంభావించిన అక్షరం’ లో కొండ్రెడ్డి వేంకటేశ్వరరెడ్డి కవులు గొప్ప వ్యక్తిత్వాన్ని పెంచుకోవాలని ఆచార్య మాడభూషి చెప్పిన అభిప్రాయాల్ని గుర్తుకు తెచ్చారు. పాత విద్యార్థులు, నేను, అభివృద్ధిపథం లాంటి కవితలు చదివితే మన మనస్సు నిర్మలత్వాన్ని పొందుతుందని రచయిత కొండ్రెడ్డి అన్నారు.
ఇక ‘ముగింపు’లో సాధారణంగా కవులు తమ జీవిత అనుభవాల్లోనుంచి కవిత్వాన్ని మలిచి సమాజాన్ని ప్రభావితం చేస్తారని కొండ్రెడ్డి వేంకటేశ్వరరెడ్డి చెబుతూ… మాడభూషి సంపత్‌కుమార్‌ ఎంతో నిబద్ధతగల కవి. త్రికరణశుద్ధితో కవిత్వాన్ని రాశారు. దీన్ని చదివినవారు తప్పకుండా చైతన్యులవుతారని అభిప్రాయపడ్డారు. ఇందులో ‘మీరు మేము’, ‘వృథా! వృథా’, ‘రెండంచుల కత్తి’, ‘అంతదాక’, ‘చింతన’ లాంటి గొప్ప కవితల్ని ఉదహరించి వాటిలోని విశేషాల్ని పరిచయం చేశారు. కొండ్రెడ్డి వేంకటేశ్వరరెడ్డి గొప్ప రచయిత, సహృదయ విమర్శకులు, పాత్రికేయులుగా తమదైన శైలిలో పద్యకవిత్వం, వచనకవిత్వం, సాహిత్యవిమర్శ లాంటి అంశాలపై ముప్పైకి పైగా గ్రంథాల్ని రాసిన అనుభవం వీరిసొంతం కాబట్టి. వీరు ఏవిషయాన్ని రాసిన లోతైన విశ్లేషణ, సుస్పష్టమైన అభిప్రాయాలు, సునిశితమైన పరిశీలన చేయడం పరిపాటి. ‘‘సాహిత్యాన్ని జీవితంలోనూ జీవితాన్ని సాహిత్యంలోనూ దర్శించే దార్శనిక సాహితీవేత్త సంపత్‌కుమార్‌. వారి రాతల్లో చేతల్లో సమాజం పట్ల ఉన్న నిబద్ధత, నిమగ్నత, సామాజికన్యాయం పట్ల ఉన్న ఆరాటం, చిత్తశుద్ధి, నన్ను బాగా ఆకర్షించాయి. అందుకే వారి సాహిత్యాన్ని సమాజానికి పరియం చేయాలనే తలంపు కలిగినది. ఆ తలంపే ‘కవిత్వమై కురిసిన కవి’గా వారి సాహిత్యాన్ని విశ్లేషించడం జరిగింది.’’ (పుట:13) అని కొండ్రెడ్డి వేంకటేశ్వర రెడ్డి పుస్తకానికి రాసిన ‘నా మాట’ లోని ఈ వాక్యాలే గ్రంథాన్ని తప్పకుండా చదివింప జేస్తాయడంతో పాటు నూతన కవులను కవిత్వోన్ముక్తుల్ని గావించడం కాయం.
డా. బడిగె ఉమేశ్‌, ఫోన్‌ : 9494815854

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img