అవును !
నాకు నచ్చిన దారి యిదే
నేను ఎంచుకున్న గమ్యం యిదే
అమరుల త్యాగాలు
అడుగడుగునా భుజం తడుతున్నాయి.
పోరుబాటలో నేలకొరిగిన ఎర్రమందారాలు
సమరోత్సాహంతో ముందుకు సాగమంటున్నాయి.
నా నేపథ్యం
పోరుబాటకు దర్పణం.
నా ప్రియ మిత్రులు
నేల నాలుగు చెరగులా
ఉషస్సులా వెలుగుతున్నారు.
పోరుబాటకు
కొత్త రంగులద్దుతున్నారు.
రాజ్యం పెట్టే చిత్ర హింసల్ని
భవితపై ఆశతో భరిస్తున్నారు.
ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు అని
నా పయనాన్ని గెలిచేసేవారికి
నా సమాధానం
పులిపై లేడి విజయం సాధించే వరకు
మట్టి మనిషి
మరో ప్రపంచాన్ని సృష్టించే వరకు
అని గుండె నిండా గాలి పీల్చి
గొంతెత్తి గర్జిస్తాను.
` జంగాల అజయ్ కుమార్
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు.