Monday, December 5, 2022
Monday, December 5, 2022

చదవదగిన ‘గుర్తుకొస్తున్నాయి’

టి.వి.ఎస్‌.

టి.వెంకట్రావు చాలామంది పరిచయస్తులకు మంచి కార్టూనిస్ట్‌గా తెలుసు. సాదా, సీదాగా కనిపిస్తూ సుతిమెత్తగా మాట్లాడే టివి ‘గుర్తుకొస్తున్నాయి’ పుస్తకం నేటి తరంలో వివిధ రంగాలలో నిపుణులైన వారు తమను తాము పరిచయం చేసుకోవలసిన అవసరాన్ని గుర్తు చేస్తుంది. శాంత స్వభావుడైన టివిగారికి సామాజిక విప్లవ భావాలున్నాయా? అన్న సందేహమూ అప్పుడప్పుడూ మాట్లాడే వాళ్లకు సహజంగా అనిపిస్తుంది. తనను తాను పరిచయం చేసుకోవడం ఎక్కడా అతిశయోక్తులు కనిపించవు. కమ్యూనిస్టు కార్యకర్తలు ఎలా ఉంటారో, ఎలా ఉండాలో ఇందులో వివరించిన అంశాలు నేటి తరానికి ఆచరణీయమైనవి. జీవిత భాగస్వామి అరుణగారితో సహా సిపిఐ చీలక అనంతరం సాయుధ పోరాటంలో పనిచేయటం, అనివార్య పరిస్థితుల్లో బయటికి రావటం, జైలు జీవితం అంశాలు సైతం తెలుసుకోదగినవి. నేను 1976 లో విశాలాంధ్ర పత్రికలో ఉప సంపాదకుడిగా శిక్షణ పొందుతున్న సమయంలో రచయిత కె.రాజేశ్వరరావు, ప్రసిద్ధ చిత్రకారుడు మోహన్‌లతో పాటు నాకు టి.వి పరిచయమయ్యారు. విశాలాంధ్రకు కేవలం కార్టూనిస్టుగా పని చేస్తున్నారని భావించాను. అయితే నాకు వార్తల అనువాదంలో అక్షరాలు దిద్దించిన మోహన్‌, టి.వి నక్సల్స్‌ ఉద్యమంలో పనిచేసి వచ్చారని, కొండకోనల్లో ఉండే సమయంలో సవరల జీవితాలను అధ్యయనం చేసి, వారి భాషను సైతం నేర్చుకున్నారని చెప్పినప్పుడు గట్టివాడేనని అర్థమైంది. సవరలు, జాతాపుల జీవన విధానాన్ని ప్రజలకు తెలియజేయడానికి వ్యాసాలు రాయడాన్ని జైలు జీవితాన్ని వినియోగించుకోవడమూ ప్రత్యేకతే. విద్యార్థిగా, విద్య ముగిసిన తర్వాత జీవించిన విధానం నేటి విద్యార్థులు తెలుసుకోవలసిన విషయం. నాస్తికుడిగా పత్రికా ప్రకటన చేసి జ్యోతిష్యులకు 1996 లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై పోటీ పెట్టి వారి అంచనాలన్నీ తప్పని నిరూపించిన ఘనత టివిదే. జ్యోతిష్యులు చెప్తున్న అంశాలు ఎలా నిజం కాదోనని నిరూపించిన సంఘటన ఇది. నేటి కేంద్ర పాలకుల మూఢ నమ్మకాలను పెంచి పోషించేందుకు జ్యోతిష్యం పాఠ్యాంశాలలో చేర్చడానికి పూనుకున్న దశలో ఈ సంఘటన కనువిప్పు కలిగించాలి. శ్రీశ్రీ లాంటి గొప్ప రచయితలతో పరిచయాలు, తన జీవితంలో జరిగిన సంఘటనలు, వృత్తి జీవితం, 70 ఏళ్ల తర్వాత ప్రశాంత జీవనం ప్రణాళిక, కేన్సర్‌ను జయించిన విధానం తదితర అనేక అంశాలను తెలుసుకొనేందుకు ‘గుర్తుకొస్తున్నాయి’ ని తప్పక చదవవలసిన పుస్తకం.
అమెరికాలో ఒక గ్రంథాలయంలో టివి కార్టూన్ల పుస్తకం ఉండటం భారతదేశ కార్టూనిస్టులకు దక్కిన గౌరవంగా భావించాలి. తనకు అపార పరిజ్ఞానం ఉన్న విద్యను నలుగురికి పంచాలన్న తపన ఆయన జరిపిన శిక్షణా శిబిరాలు, ఆయన వేసిన కార్టూన్ల పుస్తకాలు, ఇతర రచనలు మనకు తెలియజేస్తాయి. అలాగే విప్లవకారుల జీవితాలను టివి రచనలు కొంత పరిచయం చేస్తాయి. ఆయన జీవితమంతా పాటించిన క్రమశిక్షణ ఆదర్శనీయం. కమ్యూనిస్టు పార్టీ అగ్రనేతలతో గల సన్నిహిత పరిచయాలు, పార్టీ నిషేధ సమయంలో రహస్యంగా తిరిగిన అనుభవాలు తెలుసుకోదగినవి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img