‘‘ముసల్మాన్ కే దో హీ స్థాన్Ñ పాకిస్థాన్ యా కబ్రస్థాన్’’ అన్న మానసిక ధోరణిలో ఉన్న వారికి ఒక కన్ను మూసుకుపోయినట్టే. విద్వేషం చూపును మసకబరచడంతో పాటు ఆలోచన బండబారేట్టు చేస్తుంది. దేశ విభజనకు ప్రధాన కారకులు ముస్లింలేననీ, హిందువులందరూ విభజనను వ్యతిరేకించారని వాదిస్తున్న వారికి దేశవిభజన జరిగి 77 ఏళ్లు గడిచినా లోటు లేదు. రాం ప్రసాద్ బిస్మిల్‌లో కనిపించిన దేశభక్తి చాలా మందికి దేశం కోసం అష్ఫాకుల్లా ఖాన్ ప్రాణ త్యాగం చేసిన సంగతి గుర్తే ఉండదు.మహమ్మద్ అలీ జిన్నా ద్విజాతి సిద్ధాంతాన్ని లేవదీయడంవల్లే పాకిస్థాన్ ఏర్పడిరదని భావించే వారికి అంతకన్నా చాలా ముందే ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రవచించింది హిందుత్వ వాదులేనని అంగీకరించే ధైర్యమే ఉండదు.
మత ప్రాతిపదికన దేశం విడిపోయి ఉండొచ్చు. కానీ ఆ విభజన భౌగోళికంగా కూడా జరిగిందని, ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న పశ్చిమ పంజాబ్, తూర్పు బెంగాల్ ప్రాంతాలు కలిపి పాకిస్థాన్ ఏర్పాటు చేశారని ఒప్పుకోరు. అన్నింటికన్నా మించి దేశవిభజన జరిగినప్పుడు, స్వాతంత్య్రం రావడానికి ముందు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వారు పొలోమని పాకిస్థాన్‌కు వెళ్లి పోలేదు. అనేక మంది ముస్లింలు పాకిస్థాన్‌కు వెళ్లకుండా భారత్‌లోనే ఉండాలన్న సంకల్పబలం కారణంగానే ఇక్కడే ఉండిపోయారు. మన దేశంలో హిందూ, ముస్లిం మతాలను అవలంబించే వారు మాత్రమే లేరు. ప్రపంచంలోని సర్వ మతాలవారూ ఎప్పటి నుంచో ఈ దేశంలో ఉంటున్నారు. కానీ ద్వేషించడానికి దగ్గరికి వచ్చేటప్పటికి ముస్లింలు మాత్రమే గుర్తొస్తారు.
దేశ విభజనను ససేమిరా అంగీకరించని వారు కోట్లాది మంది దేశ విభజన సమయంలోనూ ఉన్నారు. దేశ జనాభా పెరుగుదలతో పాటు ఇప్పుడు కూడా దేశ విభజనను జీర్ణించుకోలేని వారు అదే దామాషాలో పెరిగి ఉంటారు. సందేహమే లేదు. దేశ విభజనను వ్యతిరేకించిన అనేక మంది ముస్లింలు అపారంగా నష్టపోవాల్సి వచ్చింది. త్యాగాలు చేయవలసి వచ్చింది. ఈ అంశం చరిత్రలో చీకటి కోణంగానే మిగిలి పోయింది. ఈ చీకటిని చీల్చి అసలైన చరిత్ర ఏమిటో తెలియజెప్పడానికే షంసుల్ ఇస్లాం ‘‘ముస్లింస్ అగేనెస్ట్ పార్టీషన్’’ గ్రంథం రాశారు. దేశ విభజనకు ముస్లింలు మాత్రమే కారకులన్న దుష్ప్రచారాన్ని తునా తునకలు చేయడానికే షంసుల్ ఇస్లాం ఈ గ్రంథం రాశారు. ద్విజాతి సిద్ధాంతం పొట్ట విప్పి చూపించారు. అందులోని లోపాలను ఎత్తి చూపించారు. ద్విజాతి సిద్ధాంతాన్ని మొట్ట మొదట ప్రవచించింది ఎవరో, ఆ తరవాత జిన్నా లాంటి వారు ఎలా వినియోగించు కున్నారో ఈ గ్రంథంలో నిరూపించారు. షంసుల్ ఇస్లాం ఆషామాషీ పరిశోధకుడు కాదు. చరిత్ర గర్భంలో కలిసి పోయినా ప్రతి రాయిని తిరగేసి చూడగలరు. అంతకు ముందు గ్రంథస్థమైన ప్రతి వాక్యం వెనక ఉన్న ఉద్దేశం ఏమిటో కనిపెట్టడానికి ఎంత కష్టమైనా పడడానికి సిద్ధ పడగలరు. చరిత్రలో దాగిన చీకటి సత్యాల మీద వెలుగు ప్రసరింప చేయడానికి ఎన్ని కాగడాలైనా వెలిగించగలరు. భారత జాతీయవాదాన్ని మతతత్వ వాదులు ఎన్ని వంకర్లు తిప్పారో చూపడానికి ఆ చిక్కు ముళ్లన్నీ విప్పి చూపించారు. ముస్లింలలో అధిక సంఖ్యాకులు అసలైన జాతీయవాదానికే కట్టుబడి ఉన్నారని ఈ గ్రంథంలో రుజువు చేసి చూపించారు.
షంసుల్ ఇస్లాం ఏ వాక్యం రాసినా, ఏ పరిశోధన చేసినా మతోన్మాదాన్ని, అమానవీయకరణను, నిరంకుశత్వాన్ని, మహిళలను, దళితులను, అల్పసంఖ్యాక వర్గాలవారిని వేధించడాన్ని వ్యతిరేకించడమే ఆయన పరమ లక్ష్యం.
కాంగ్రెస్ అగ్ర నాయకుల్లోనే ద్విజాతి సిద్ధాంతాన్ని సమర్థించిన వారు అనేకమంది ఉన్నారని చెప్పిన పరిశోధకులు ఉన్నారు. ద్విజాతి సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన ముస్లింల గురించి చెప్పిన షంసుల్ ఇస్లాం లాంటి పరిశోధకులు మాత్రం తక్కువే. ఈ లోటును ‘‘ముస్లింస్ అగేన్ స్ట్ పార్టీషన్’’ పూడుస్తుంది.
వి.డి.సావర్కర్, ఎం.ఎస్.గోల్వాల్కర్ మాత్రమే ద్విజాతి సిద్ధాంత ప్రవర్తకులు కారు. మదన్ మోహన్ మాలవియా, లాలా లజపతి రాయ్ లాంటి వారూ ద్విజాతి సిద్ధాంతాన్ని సమర్థించిన వారేనని షంసుల్ ఇస్లాం దాఖలాలతో సహా చూపించారు. కాంగ్రెస్ అగ్రనాయకులైన చక్రవర్తుల రాజగోపాలాచారి, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ఈ విషయంలో తక్కువేం కాదు అని ఈ గ్రంథం చదివితే అర్థం అవుతుంది.
మహమ్మద్ అలీ జిన్నా, ప్రసిద్ధ కవి ఇక్బాల్ ఒకప్పుడు సమ్మిళిత సంస్కృతికి కట్టుబడిన వారే. కానీ తరవాత తరవాత ద్విజాతి సిద్ధాంతం పేరెత్తితే జిన్నా గుర్తొచ్చే పరిస్థితి ఏర్పడిరది. మతాన్ని, రాజకీయాలను కలగాపులగం చేస్తే ఇలాంటి వికృత పరిణామాలే మిగులుతాయి. ప్రస్తుత దశలో ఈ ధోరణి మరింతగా ప్రకోపిస్తోంది.
జిన్నా నాయకత్వంలోని ముస్లిం లీగ్ విచ్ఛిన్నకర రాజకీయాలను గట్టిగా వ్యతిరేకించింది ‘‘ఆజాద్ ముస్లిం కాన్ ఫరెన్స్’’ పార్టీ ఏర్పాటు చేసినది అల్లా బక్ష్ అని ఎంతమందికి తెలుసు? దేశ విభజనను నిరోధించడానికి ఆయన చాలా పాటుబడ్డారు. జనాన్ని సమీకరించారు. ఇలాంటి వారిని షంసుల్ ఇస్లాం ‘‘దేశభక్త ముస్లిం’’లు అంటారు. మామూలుగా అయితే వీరిని జాతీయవాద ముస్లింలు అంటారు. దేశ విభజనను వ్యతిరేకించడం సామాన్యమైన విషయం కాదు గనక ఇస్లాం వారిని దేశభక్త ముస్లింలు అన్నారు. అంతటి దేశభక్తిని ప్రదర్శించినందువల్లే అల్లా బక్ష్‌ను హత్య చేశారు.
అధికారం కోసం ముస్లిం లీగ్, హిందూ మహాసభ ఏకమైన తీరును ఈ గ్రంథంలో మరోసారి ఎత్తి చూపారు. బెంగాల్‌లో అలాంటి సంకీర్ణ ప్రభుత్వంలోనే భారతీయ జనసంఫ్‌ు వ్యవస్థాపకుడు డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ అని కచ్చితంగా ఈ తరం వారికి గుర్తు చేయాల్సిందే. ఈ రెండు పార్శ్వాల వారూ అల్లా బక్ష్‌కు బద్ధ విరోధులు. ఆ నాటి కాంగ్రెస్ కూడా అలాబక్ష్ ను సమర్థించిన దాఖలాలు లేవు.
వలస పాలకులు, ముస్లిం లీగ్, కాంగ్రెస్ మధ్య ఒప్పందం కారణంగానే దేశ విభజన సాధ్యమైంది. ఈ మూడు పక్షాల అంగీకారమే జాతీయ ఏకాభిప్రాయం కింద చెలామణి అయిపోయింది. అల్లా బక్ష్ వాదంతో ఏకీభవించేవారు నిస్సహాయులుగా మిగిలి పోయారు. ఇలాంటి కీలక నిర్ణయాలు ఎప్పుడూ అగ్రస్థానాల్లో ఉన్న నాయకులే తీసుకుంటారు తప్ప జనాభిప్రాయానికి ఇసుమంత చోటు కూడా ఉండదు. కానీ మూల్యం చెల్లించవలసింది జాతి జనులే.
షంసుల్ ఇస్లాం ఈ గ్రంథంలో ప్రస్తావించని మరో ప్రధానమైన అంశం ఉంది. దేశ విభజన సమయంలో తాము నివసిస్తున్న ప్రాంతం పాకిస్థాన్‌లో భాగం అయినందువల్లో, ముస్లింలకు ప్రత్యేకదేశం ఏర్పడిరది కనక అక్కడికే వెళ్దాం అనుకుని పాకిస్థాన్ వెళ్లిపోయిన వారిలో భారత్ తిరిగి వచ్చిన ప్రముఖులు చాలా మందే ఉన్నారు. మచ్చుకు ప్రసిద్ధ గాయకుడు బడే గులాం అలీ ఖాన్, ప్రముఖ కవి సాహిర్ లుధియాన్వీ, ప్రసిద్ధ రచయిత్రి ఖుర్రతులైన్ హైదర్, నటి బేగం పర లాంటి వారు మొదట పాకిస్థాన్‌లో భాగమై తరవాత ఇండియాకు తిరిగి వచ్చిన వారే. బడే గులాం అలీ ఖాన్ సమాధి హైదరాబాద్ పాతబస్తీ లోని దాయరా మీర్ మోమీన్‌లో ఉందని ఎంతమందికి తెలుసు. ఈ తెలియని తనం నుంచి జాతిని బయటకు లాగడానికి షంసుల్ ఇస్లాం చాలా కృషి చేశారు.
ఆర్వీ రామారావ్