డా॥ కత్తి పద్మారావు,
9849741695
ఆకలి, అవమానం, దరిద్రం, దుఃఖం, కష్టం, సంగీతం ఇవీ నా జీవితం అన్న నాజర్ హిందూ సంస్కృతికి ప్రత్యామ్నాయంగా దళిత కళల్ని ఈ రాజ్యంలో తెలుగు నేలలో పండిరచిన కళా తేజస్వీ, దళితుల జీవన విధానం కళలకు పుట్టినిల్లు. ఆ కళలలో సహజీవనం, సమైక్యత, సమత, సమరం, సంతోషం, సముత్తేజం దాగున్నాయి. వాటిని ఈ యుగంలో రసావిష్కరణ చేసి వాటికి రంగస్థలాన్ని రూపొందించిన వాడే నాజర్. ఈ సామాజిక కళలను అణచివేయడానికి హిందూ మతవాద, కులవాద కళలు హిందూ దేవాలయాల్ని సృష్టించుకున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా దళిత సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమ వేదికను పల్లెగుండెల్లో రూపొందించినవాడే నాజర్.
అందుకే నాజర్ ప్రత్యామ్నాయ దళిత సంస్కృతి ఎక్కడోలేదు అది కింది కులాల్లోనే ఉంది. ‘నేను అట్టడుగు కులాల సాంస్కృతిక ప్రతినిధుల్లో ఒకడిగా ఎప్పటికి ఉంటాను’ అని అన్నారు. ఇలా ప్రకటించుకొన్న నాజర్‌కు ఒక స్పష్టమైన తాత్విక దృక్పథం వుంది. సామాజిక తత్వం వుంది. సాంస్కృతిక పునాది వుంది. కింది కులాలుగా చెబుతున్న దళితులు, కళాజీవులు వారి జీవితం అడుగడుగున కళామయమే. సుఖంలో, దుఃఖంలో, బాధలో, వ్యధలో వారు సంగీతాన్ని, సాహిత్యాన్ని వివిధ కళా రూపాలను ఆశ్రయించారు. నవరసాలు వారి జీవితంలో నిరంతరం ప్రవహిస్తాయి.
దళిత కులాల్లో కళే జీవనంగా బతికే కులాలు వున్నాయి. ఇందులో ప్రధానమైనవారు ‘జంగములు’ వీరే అసలు బుర్రకథను చెప్పేది. అందుకే ఈ బుర్రకథలను మొదట జంగం కథలనేవారు. వీరినే బుడిగె జంగాలని పిలిచేవారు. ఎందుకంటే వీళ్ళు కథకు ‘‘బుడిగె’ను వాయిద్యంగా ఉపయోగించేవారు. ఈ బుడిగెనే ‘డక్కీ’ అని డిక్కీ అని పిలిచేవారు. బుడగ జంగం వారు ఈ బుర్ర కథకు ఎలా మూలమో నాజర్ వివరించారు. బుడగ జంగంలు లోతైన కళా జీవులు. వారు ‘డక్కీని’ కనిపెట్టిన తరువాతే కథ పాటగా రగడగా ఒక వరుసలో సాగడం ప్రారంభమైంది. ఈ విషయాన్ని వివరిస్తూ నాజర్ ‘‘తెలుగు పాటకు చెందిన బాణీలన్నీ అట్టడుగు కులాల వాళ్ళ దగ్గరే వున్నాయి.’’ ఆ మూలం నుంచి వచ్చిన వాడిని కనుక నేను వెంటనే పట్టుకోగలిగాను. భజన పాటలు, కోలాటం పాటలూ, వీధి భాగవతుల పాటలు, సాయలూ, ఎరుక చెప్పే సింగిసోది బాణీలు, ముస్లిమ్‌ల పెళ్ళిలో వాయించే చిన్న షహనాయల్లో వినిపించే సాయిలూ, కృష్ణ చెంచులు జేగంట వాయిస్తూ ఆలపిస్తూ పాడే సాయిలు, దేవచెంచులు వీణరణం వాయిస్తూ వీర తాళ్ళు మోగిస్తూ పాడే సాయలు వారి ఆడంగులు ముద్దకోసం ఇంటి ఇంటి ముందు పాడేవి. బమినీలు, పంబల, జంకుల, మాదిగోళ్ళ డప్పులు కొట్టుకొంటూ పాడే పాటలూ, డ్యాన్సులు, చిందూ మూడిళ్ళ సాయలు…. ఇలాంటి అట్టడుగు కులాలకు చెందిన గొప్ప కళా సాహిత్య సంపదను అనుసరిస్తూ, అనుకరిస్తూ అవసరమనుకున్న చోట బుర్రకథసాయలో కలుపుతూ వచ్చాను’’ అన్నారు. నిజానికి నాజరు ఈ మాటల్లో ఎంతో లోతైన దళిత జాతుల కళా చరిత్ర వుంది. నాజర్ చాలా లోతైన సామాజిక జీవనం కలవాడు. అగ్రవర్ణాలుగా చెప్పుకొనే వారెవ్వరూ ఒక యుగాన్ని నడిపించే కళాజీవులు కాలేక పోయారు. నాజర్, గద్దర్ ఇద్దరూ దళిత జాతుల నుండే రావడం మనం గమనించాలి.
నాజర్ జీవిత గాథ చాలా సంఘర్షణతోను పట్టుదలతోను, పోరాటంతోను కూడుకొన్నది. ఆయన బుర్రకథతో వీరరసాన్ని ఆవిష్కరించేటపుడు కొరికే పళ్ళు శబ్దం మైకులో నుండి వినిపించినపుడు తరతరాల బానిసత్వంలో మగ్గుతున్న బడుగు జీవుల గుండెల్లో వీర రసావిష్కృతం చేసి వారిలో ఉగ్రత్వాన్ని కలిగించేది. ఈ విషయాన్ని గూర్చి నాజర్ చెబుతూ ‘‘ఈ దుర్భర దరిద్ర జీవితం, కష్టాలు, వాటి కారణాలు నాకు జరిగిన అవమానాలు నా మదిలో పాముల్లా మెదులుతూనే వుంటాయి. తలచుకొని దుఃఖాన్ని దిగమింగుకొని, కసిని పెంచుకొని మైకుద్వారా అందరికి వినిపించేంత గట్టిగా పండ్లు పటపటాకొరికి ఈ రగడను పోరాట ఘట్టంతో నేను పాడితే జనంలో నుంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి రగడలు చెబుతున్నపుడు కొన్ని చోట్ల జనంలో ఉరికిలేస్తుండే వాళ్ళు. వాళ్ళ నెత్తిన నీళ్ళుపోసిన ఊళ్ళుకూడా అనేకం. నాజర్ చెప్పిన ఈ మాటలు అక్షర సత్యాలు. ఆయన పలనాటి యుద్ధంలో ‘పటపట పళ్ళు కొరుకుతూ’ అనే ఘట్టం వచ్చినపుడు కళ్ళు సూర్యగోళాలై కనుబొమ్మలు విల్లంబులై అడుగులో ఒక అద్భుతమైన చిందు వీర రసావిష్కృతంగా ఆయన తాళం వాయిస్తూ దానికి అనుగుణమైన డక్కీలు మోగుతున్నపుడు ప్రజలు ఒక్కసారి ఆవేశానికి గురయ్యేవారు. నిద్రాణమైన వారిలోని చేతన ఒక్కసారి విజృంభించి తమపై పెత్తనం చేయు అగ్రకులాల దౌర్జన్యాన్ని ఎదిరించి పోరాడ గలమన్న ధైర్యాన్ని కలిగించేది. గుండె గుండెలో ఆయన వెలుగు దివ్వెలు వెలిగించేవాడు, జన సందోహంలో ఎర్రని మంటలు రేగేవి. తలపాగల్లో వారు ఎవరి మీసాన్ని వారు ఒకసారి తడిమి చూసుకునేవారు. స్త్రీలైతే కొంగులపై చేయి వేసేవారు. ఇది వారి అతిశయోక్తికాదు. నాజర్ పద ఘట్టనకు లేచిన కళాసమరం పల్లెల్లో పెద్దవాళ్ళు రచ్చబండలపై నిరంతరం వినే కథనం నాజర్ బడుగు జీవుల శరీర ధ్వనిని పసిగట్టారు. వైదిక నాట్య శాస్త్రంలోని వైయక్తిక కళాభ్యసనానికి భిన్నంగా గుంపుకళల గుండెలని నాజర్ పట్టుకున్నారు. అందుకే నాజర్ ‘‘వాళ్ళ శరీరంలో వున్నటువంటి ధ్వనికి అనుగుణంగా జాతి సంగీతాన్ని సరైన విధంగా సమన్వయం చేయగలిగినానేమోనని నేను భావిస్తున్నాను. అలాగే నాట్యం కూడా మన గొల్ల భాగవతుల కుప్పీలు, గంతులు, అలాగే యుద్ధ ఘట్టంలో ఎట్లా వుండాలి. రౌద్ర రసాన్ని ఎలా పోషించాలి. బీభత్సాన్ని ఎలా రక్తి కట్టించాలి. నాయకురాలి నాగమ్మను ఏరకంగా ప్రవేశపెట్టాలి. మగువ మంచాలను ఏవిధంగా తీసుకురావాలి. బ్రహ్మనాయుడుని విధంగా నడపాలి వంటి ప్రతి చిన్న విషయాన్ని గురించి కూడా నేనే జాగ్రత్త తీసుకున్నాను. ఆయా పాత్రల నడక దగ్గరనుంచి, కులుకు దగ్గర నుంచి వాళ్ళ హావ భావాలు, మాట్లాడే తీరు అన్నిటి మీద దృష్ట్టిని కేంద్రీకరించి మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దటానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేశాను’’ అన్నారు. నాటకంలోని లక్షణాలను, ఏకాంగికలోని లక్షణాలను జానపద భాషల్లో సమన్వయించారు.
నాజర్ పల్నాటి యుద్ధం బుర్రకథలో అద్భుతమైన శిల్పాన్ని ఆయన చూపించారు. సామాజిక సందేశాలతోపాటు, కరుణ వీర రసాలను మహోజ్వలంగా సమన్వయం చేశారు. నుగాలీల నృత్యాలలో వున్న కులుకు నృత్యాలు. ఈ కులుకు నృత్యంలో ‘‘గజ్జె’’కు ప్రాధాన్యం ఎక్కువ ఈ గజ్జెల మోతను నాజర్ ఇక్కడ నుండే తీసుకొన్నాడు. సుగాలీలు ఒకే గూడెంలో నివసిస్తారు. ఈ గూడాలని ‘తండాలు’ అని పిలుస్తారు. సుగాలీ స్త్రీలు చేసే నృత్యమే కులుకు నృత్యం. సుగాలీ స్త్రీల వేషధారణ ప్రత్యేకంగా ఉంటుంది. బుర్రకథలో పాడుతూ ఎగరటం అనేది ముఖ్యమైన అంశం. ఇది కింది కులాల కోలాటం, చెక్క భజనలు, స్త్రీల గొబ్బిళ్ళు, జక్కీకి మొదలైన వేడుకల్లో పాడే పాటలన్నీ నృత్య గీతాలే ఈ నృత్య గీతాలు. బుర్రకథల్లో రగడలుగా రూపొందాయి. ముఖ్యంగా భజనల్లో ఉన్న ‘బిందును’ తాళానికి, గజ్జెలను, తంబురకు రగడను సమన్వయించటం బాగా చేశాడు. చెక్క భజనలు, పలకల భజనలు, జటితాళ్ళ భజనలు, వాటిలో వచ్చిన ‘గమకాలను’ బుర్రకథలో గొప్పగా అన్వయం చేశాడు. నాజర్ వీరశైవులను కూడా జనంలోని కళా రూపాలను బాగా ముందుకు తెచ్చారు. పాల్కురికి సోమన బసవ పురాణంలో చెప్పినట్లు ‘‘తుమ్మేద పదాలు పర్వత పదాలు, వెన్నెల పదాలు, గొబ్బె పదాలు, ‘సంజపదాలు’ వంటి గీతాలెన్నో ఆనాడు వాడుకలో ఉన్నాయి. అవన్ని ఈనాటికీ దళిత కులాల్లో, వారి జీవన విధానాల్లో సాక్షాత్కరిస్తున్నాయి. వాటిలో ప్రజలనుత్తేజపరిచే అంశాలన్నిటిని నాజర్ బుర్రకథలో సమన్వయించాడు. ఆధునిక యుగంలో వాటి జవజీవాలను ఒడిసిపట్టి బుర్రకథ కళగా ఆయన మలిచారు. ప్రజల జన జీవనంలో దాగున్న శ్రామిక గీతాలను, పిల్లల పాటలని, వేడుక పాటలని, వలపు పాటలని, హాసన గీతాలని, కన్నీటి పాటలని బుర్రకథలో సందర్భోచితంగా పొదిగాడు. అట్టడుగు కులాల వారి జీవితంలోని, దుఃఖరసం ఆయన బుర్రకథలో అంతర్లయగా ప్రవహించింది. అదే సమయంలో వారిలో నిక్షిప్తమైన హాస్యాన్ని నాజర్‌లో వంతగా ఉన్న రామకోటి బాగా పోషించారు. పొట్టచెక్కలయ్యేటట్లు ఆయన నవ్వించేవారు. కష్టజీవులంతా ఒక్కసారిగా వారి కష్టాన్ని మరచిపోయి కడుపారా నవ్వుకునేవారు. అనేక చారిత్రక కారణాల వలన పేదలయిన దళితుల జీవన స్రవంతి సాంస్కృతిక సంపద ఉన్నదనే విషయాన్ని నాజర్ బాగా గమనించారు. ‘‘ఈ కళా సంపత్తి అంతా వీరిదే. (యానాది, చెంచుల మొ॥వారి) నేను ప్రతిస్పందించింది వీళ్ళ జీవితాలకే. నేను ప్రతిబింబించింది వీళ్ళ కష్ట సుఖాలనే, నేను నిలబెట్టింది అనేక కళారూపాల్లో ఒకటి మాత్రమే. ఈ గొప్పతనం ఈ గౌరవం అంతా వీళ్ళదే. వీళ్ళకే చెందాలి. గర్భదరిద్రులై సాంస్కృతిక సంపన్నులైన నా జాతికి చెందిన అట్టడుగు కులాల బిడ్డల తరపున నేను ఈ గౌరవాన్ని అందుకున్నాను’’ అన్నారు.నాజర్ ఏదీ దాచుకోలేదు. తన జీవితాన్ని సంఘర్షణని, తాను గ్రహించిన అంశాలను తనను మోసగించిన తీరును ఆయన అనేక సందర్భాలలో తన సంభాషణల్లో అభివ్యక్తం చేశారు. నాజర్‌కు లోతైన సామాజిక అవగాహనతో పాటు సాహిత్య అధ్యయనం ఉంది. ఆయన కింది కులాల పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకున్నారు. నిజానికి దళిత స్త్రీలే కథా గేయములు కతలుగా పాడేవారు. అందులో నుండి నాజర్ బుర్రకధకు ప్రాణం పోశారు. జక్కులు తెలుగు నేలలో కళావంతులుగా పేరుపొందారు.’’ కళల కోసం కులాలు రూపొందిన నేలలో కళలు అనుభవించే వాళ్ళు అగ్రకులాలు, కళలను సృష్టించే వారు నీచ కులాలు అయ్యారు. కళ మానవ మస్తిష్కం నుండి సృజనాత్మకంగా వెలుపడుతుంది. నాజర్ బుర్రకథ యక్షగానాల నుండి రూపొందిందని స్పష్టం చేశారు. నిజానికి యక్షగానం దేశీ కళలన్నింటికి మూలమైంది. ఆంధ్ర, కర్ణాటక, తమిళ, తుళు భాషలలో ఇది ప్రసిద్ధి చెందింది. అయితే బుర్రకథ మాత్రం తెలుగునేలలోనే ప్రసిద్ధి చెందింది. అది నాజర్ వల్లే జరిగింది. బుర్రకధలోని తందాన తాన’-‘తందనాన’ అనికాని ‘తందనాన’ అనికాని ఊత పదము ప్రతి పాదాంతమున ఆవృత్తముగా వస్తుంది. ఇది యక్షగానం నుండే తీసుకున్నారు. నాజరుకు ముందే బుర్రకథ కూడా వున్నప్పటికి దానికి ఒక నిర్దిష్ట కళారూపాన్ని తీసుకోవడంలో నాజర్ ఒక కళా సృష్టికర్తగా వ్యవహరించారు, యక్షగానాల్లో తాళ ప్రధానమైన దరువులు, ద్విపదలు, పద్యము, వచనములు, బుర్రకథకు నాజర్ అన్వయించారు. అందుకే బుర్రకథలోనే ఆయన ప్రవేశ పెట్టిన నాగమ్మ, బహ్మనాయుని పాత్రలు నడిచి వస్తునట్లే వుండేవి. తెలుగు నేలలో దళితవాడల్లో దినాలకు, పెండిరడ్లకు ఈ బుర్రకధలు చెప్పించుకుంటారు. అయితే ఈ కధలప్పుడు ‘నాజర్‌ని తలుచుకోని వారుండరు.నాజర్ ఈ నాటక లక్షణాలన్నీ ఒడిసిపట్టుకుని తానే ఒక కళారూపంగా ప్రజ్వరిల్లాడు. నిజానికి బుర్రకథ భారతదేశంలో క్రీ.శ 1150 నాటికే జంగమ కథ పేరుతో ప్రచారంలో వుంది. తెలుగు నేలలో దానికి ఒక సమగ్రత సాధించింది. వీటె పట్టింది. నాజర్‌గారే, కోడి పందేలను వర్ణిస్తూ పల్నాటి యుద్ధంలో నాజర్. అందెవేసిన పందెగాండ్లురా సై/ అందమైన పుంజులై తిరి సై/ పాతలు కత్తులు దీసి సౖెె / సానల మీదేసాదిరీ సై/ ‘తందానా తందానే’ ఊతపదానికి బదులు ‘సై. అని పలికి వీరరసాన్ని పోషించారు. ఈ జంగమ గాథలకు ఊతపదాలు కథను బట్టివుంటాయి.రాజకీయోద్యమంలో భాగంగా నాజర్ తీసుకువచ్చిన కష్టజీవి, పల్నాటి యుద్ధం, బెంగాల్ కరువు మొదలగునవి నాజర్ స్వయం సృజనం. అందులో కమ్యూనిస్టు ఉద్యమాన్ని ఉద్ధరింపచేస్తూ బడుగు వర్గాల సామాజిక జీవనాన్ని ప్రతిబింబిస్తు తానొక కళా స్రవంతిగా ప్రజలకు కళాలోపాలు తీర్చాడు నాజర్. నాజర్‌కు ముందున్న జంగమల కథలో కళాసృజనం వుండేది కాని స్పష్టమైన సామాజిక దృక్పథం లేదు. వాటిపై కొంత కాలానికి హిందూవాద ప్రభావం పడి ‘గాసట బాసట’గా తయారయ్యాయి. నాజర్ ఈ జంగమ కథలలోని కళను తీసుకొని వాటిలోని అతిశయోక్తులైన సన్నివేశాలను తొలగించి, సామాజిక చారిత్రక-దృక్పథం తోనూ సమకాలీన రాజకీయ అవగాహనతోనూ, బుర్రకధను ఒక సామాజిక ప్రయోజనం కలిగిన సాధనంగా మార్చాడు. కళాకారుడు సమకాలినంగా మలచగలిగినప్పుడే సృజనాత్మకశక్తి కాగలడు. పల్నాటి యుద్ధం నాజర్ సృష్టి. ఈ విషయాన్ని గూర్చి చెబుతూ ఎల్లోరా ‘‘దీనిని రచించినది ప్రసిద్ధ బుర్రకధకుడు నాజర్ స్వయంగా రచించుకొని, స్వయంగా కధను చెప్పి పేరు సంపాదించుకున్న ఆంధ్రుడు ఈయనే అనుకొంటాను’’ పల్నాటి యుద్ధంలో కొన్ని చరణాలు చూస్తే నాజర్ కళా సాహితీ సృష్టి మనకు అవగత మవుతుంది. ‘‘ఎక్కువ తక్కువ మత విభేదము/ అక్కర లేదనుచూ/ ఒక్కటి ప్రజలందరుండ తా/ చక్కగ యోచించి/ చాకలి మంగలి మాల మాదిగ/ సర్వజనులకెల్ల /్ల ఏక పంక్తిలో విందు భోజనము/ ఏర్పాటు చేసి/ చాపకూటి సిద్ధాంతం పేరిట/ సాగించే ఘనుడు
’’ సామాజిక సమైక్యత కోసం బ్రాహ్మణము పేర నాజర్ ఎలుగెత్తాడు. నాజర్‌లో ఒక సామాజిక వైతాళికుడు మనకు దర్శనమిస్తాడు. ‘బ్రహ్మనాయుని’ పాత్రకు ఆ ఔదార్యం ఔన్నత్యాన్ని నాజర్ తీసుకువచ్చాడు. బ్రహ్మనాయుని ‘‘చాపకూటి సిద్ధాంతం’’ లో ఉన్న కులనిర్మూలన దర్శనాన్ని మహాద్భుతంగా నాజర్ సమాజానికి అందించారు.