Sunday, August 14, 2022
Sunday, August 14, 2022

జయంతి తే సుకృతినో రస సిద్ధాః కవీశ్వరాః

….నాస్తి యేషాం యశఃకాయే జరా మరణజం భయమ్‌’’ అన్నాడట భర్తృహరి తన ‘నీతిశతకం’లో. ‘రససిద్ధులైన కవీశ్వరులు కలకాలం మాన్యులుగా నిల్చిపోతారుÑ ముసలితనంవల్ల, మృత్యువువల్ల సంక్రమించే భయాలు ఈ యశఃకాయులకు వుండ’’వన్నదే సుభాషిత కర్త భావన. ఇది కేవలం కవీశ్వరులకే పరిమితమయ్యే సుభాషితం కాదుÑ రససిద్ధమైన రచనలేవి చేసినవాళ్ళకైనా వర్తించే ‘మంచిమాటే’ ఇది. ఆ రకంగా ఇది ఇప్పుడు యశఃకాయులుగా మనమధ్య వున్న చక్రవర్తుల రాఘవాచారి(సి.రా.) గారికీ అంతగానూ వర్తిస్తుందన్నమాట! రాఘవాచారిగారికి ఈ సుభాషితమంటే ప్రత్యేకమైన అభిమానమేదో వున్నట్టుంది. అందుకే, ఆయన దాన్ని చాలా సంపాదకీయాల్లో వాడుక చేశారు. అది మనసులో పెట్టుకునే ఇదే సుభాషితాన్ని ఈ సమీక్ష వ్యాసానికి తలకట్టుగా వుంచాను!
ఉన్నతశ్రేణి తెలుగు మేధావుల్లో అక్కడక్కడ కనిపించే కొన్ని విశిష్టతలు సి.రా.లో పుష్కలంగా కనిపిస్తాయి. తెలుగునాట ఏదో ఒక ప్రాంతానికే పరిమితం కాని సంస్కారం ఆయనది. పుట్టింది ఉత్తర తెలంగాణలోÑ బాల్యంనుంచీ కోస్తాజిల్లాలతో ఆయనకి సన్నిహిత సంబంధ బాంధవ్యాలున్నాయి. ఆమాటకొస్తే, తెలుగునాట అన్నిప్రాంతాలతోనూ ఘనిష్టమైన సంసర్గ ఉందాయనకు. ఇక్కడి సామాజిక పరిణామాలపై ప్రత్యేకమైన అభిమానం, మన సాహిత్యంపట్ల ప్రగాఢమయిన అభినివేశం ఉన్నవారు సి.రా. ఇక, తెలుగు ప్రజల జీవన విధానంతో ఆయనకు వున్నంత చనుమానం అక్షరాలా అనుపమానం! తెలుగు పలుకుబడిపై సి.రా.కున్న పట్టు కేవలం అనన్యదృశ్యం! భారతీయ తత్వశాస్త్రం, సంస్కృత సాహిత్యం, సంప్రదాయ సంగీతం, తెలుగు కవిత్వం, నాటకంసినిమా, సమకాలీన ఆలోచన ధోరణులూ, న్యాయ వైజ్ఞానికరంగాలపైనా రాఘవాచారి గారికి వున్నంత పట్టు, ప్రవేశం వున్నవాళ్ళను లెక్కించడానికి ఒక చేతివేళ్ళే ఎక్కువేమో! ఇన్ని లక్షణాలున్నవాళ్ళు వేరే రంగాల్లో వున్నారో లేదో కానీ, పత్రికలరంగంలోమరీ ముఖ్యంగా మన తెలుగు పత్రికల రంగంలోకచ్చితంగా మరెవ్వరూ లేరు! అలాంటి అసాధారణ మేధావి దాదాపు మూడు దశాబ్దాల కాలం ఒకే పత్రికలో వేర్వేరు విషయాలపై రాసిన సంపాదకీయాలు చదువుతూ పెరిగి పెద్దయిన తరానికి చెందినవాళ్ళం మేము. సి.రా. సంపాదకీయాల సంపుటాలు రెండురెండు వందలకు మించిన ఖండికలతో కూడినవిచూసినప్పుడు నాలాంటివాడికి సహజంగానే సంబరంగానే అనిపిస్తుంది మరి. మొదటి సంపుటికి ముందుమాట రాసిన ఇప్పటి ‘విశాలాంధ్ర’ సంపాదకులు ఆర్వీరామారావ్‌ చెప్పినట్లు ఈ తరం పాఠకులకు కందుకూరి, గురజాడ, గిడుగు, కొమర్రాజు, గరిమెళ్ళ, అడివి, చంద్రం, తుమ్మల, పుట్టపర్తి, బలరామమూర్తి, విద్వాన్‌ విశ్వం తదితరుల పేర్లు ప్రత్యేకించి గుర్తు చెయ్యవలసివస్తోంది. ఇతర రంగాల పరిస్థితి ఇంతకన్నా గొప్పగా లేదుÑ అందుకేనేమో రాజకీయ రంగంలో ప్రాత:స్మరణీ యులయిన కొమ్మారెడ్డి సత్యనారాయణ, కంభంపాటి (సీనియర్‌), పుచ్చలపల్లి, చండ్ర, నీలం, వావిలాలలాంటివారికి తన సంపాదకీయాల్లో అంజలి ఘటించారు సి.రా. వినోబా, మొరార్జీ, జయప్రకాశ్‌ నారాయణ్‌, వి.వి.గిరి, కృష్ణయ్యర్‌, మధు లిమాయే తదితరులను సందర్భోచితంగా ప్రస్తావించిన సి.రా. సంపాదకీయాలను ఈ తరం పాఠ్య ప్రణాళికలో చేర్చడంజాతికిమంచిది! కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, ఆరుద్ర, అనిసెట్టి, దాశరథి, సి.నా.రె. తదితరులు సినిమాపాటల రచయితలుగానే ఈతరానికి తెలుసేమో అనిపిస్తుంది! 1952 సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ లోక్‌సభకు ఎన్నికైన హరీన్‌ ఛట్టో, ఆయనకు ‘అక్షరాలా’ అక్కగారైన సరోజినీ నాయుడు, హరీన్‌ మేనల్లుడు గొప్ప వైద్యుడు జయసూర్య, ‘‘బిశ్బకొబీ’’ రబీంద్రనాథ్‌ టాగూర్‌నే మెప్పించగల్గిన మహాకవికార్మిక నాయకుడు కమ్యూనిస్టు యోధ మఖ్దూమ్‌ల పేర్లను ఈతరం పాఠకులు విని వుండక పోతే, ఆ నేరం కచ్చితంగా తెలుగు పత్రికల సంపాదకులదే! అయితే, ఈ నేరారోపణకు అపవాదంగా నిలిచిన అరుదైన సంపాదకులు సి.రాఘవాచారి. తెలుగునాట అనేకమంది సంపాదకులకు అభిమాన సంపాదకుడుగా దశాబ్దాల తరబడి మెప్పించగలిగిన వ్యక్తి సి.రా. ఎప్పుడూ, ఏ రంగంలోనూ, ఏ ఒక్కరికీ అప్పనంగా గుర్తింపు వచ్చిపడదని మనం గ్రహించాలి!! హడావిడిగా నమోదు చేసే చరిత్రగా పత్రికా రచనను అభివర్ణించాడట మాథ్యూ ఆర్నాల్డ్‌. హడావిడిగా చేసినా, నిదానంగా చేసినా పత్రికల్లో రాయడమనేది చరిత్ర రచనేనన్న స్పృహ మరెవరికీ లేకపోయినా పర్వాలేదు కానీ, సంపాదక మహాశయుడికి వుండి తీరాలి! లేనట్లయితే, జాతి మెదడు పొరల మధ్యన మరుగున పడిపోయే ప్రమాదంవున్న మహనీయుల పేర్లనూ, వాళ్ళ కృషినీ తరచు పాఠకులకు గుర్తు చెయ్యాలనే బాధ్యత స్ఫురించకపోవచ్చును. అలాగే, ప్రతి సంఘటననూ స్థలకాలాల పరిధిలో పెట్టి చూడకపోతే, దాని చారిత్రక స్వరూపస్వభావాలు మనకు బోధపడకపోవచ్చుననీ అనిపించకపోవచ్చు.
రాఘవాచారి సంపాదకీయాల్లో కొట్టొచ్చినట్లు కనబడే లక్షణం ఒకటుంది. అది ఆయన శైలీవిన్యాసం! మంచివక్త కావడంచేత, తెలుగుఉర్దూసంస్కృతంఇంగ్లిష్‌ భాషల్లో లోతయిన ప్రవేశం వున్న రచయిత కావడం చేత, అన్నిటికీ మించి విద్యార్థి దశ నుంచీ ప్రధానమయిన పత్రికలన్నీ చదివే అభ్యాసమున్న ఉత్తమశ్రేణి పాఠకుడు కావడంచేత సి.రా. అలా మేలిరకం సంపాదకీయాలు సృజించగలిగారు. ఆలంకారిక ప్రయోగాలను పూర్తిగా అనూహ్యమయిన సందర్భాల్లో ప్రకటించడం ద్వారా సంపాదకీయానికి ఓ అసాధారణమైన అర్థగౌరవాన్ని ఆపాదిస్తారు సి.రా. ఒక ఉదాహరణ చూడండి ఎన్‌.టి.రామారావు మృతి సందర్భంగా రాసిన ఓ సంపాదకీయంలో ‘కుమార సంభవం’ లో కాళిదాసు ప్రయోగం ఒకటి ఉట్టంకించారు సి.రా. హిమాలయాల పైన నిరంతరం వుండే చల్లదనంపై కాళిదాసు చేసిన వ్యాఖ్య ఇది‘ఏకోహి దోషో గుణ సన్నిపాతోనిమజ్జతీందోః కిరణోష్వివాంకః’. (‘అనేకగుణాల మధ్యన ఒక దోషం, చంద్రునికాంతిలో మరుగునపడే కళంకం మాదిరిగా కరిగిపోతుంది’’ అంటున్నాడు కాళిదాసు.) దీన్ని అర్థాంతరన్యాసం అనే అలంకారానికి మచ్చుగా సంస్కృత పఠనపాఠనాల్లో చెప్తుంటారు. దాన్ని తీసుకొచ్చి ఎన్‌టిఆర్‌ కుటుంబజీవనం తాలూకు చివరిరోజుల విపరీత ప్రవర్తనతో పోల్చారు సి.రా. ఈ పోలికతో ‘ఉపమా రాఘవాచార్యస్య’ అనిపించారు! (‘తెలుగుతేజం’ నిద్రపోయిందిరెండోసంపుటి పేజీ 238). నిజమైన విశేషం ఎక్కడుందంటే, ‘విశాలాంధ్ర’ పాఠకులకోసం ఇటువంటి సంక్లిష్టమయిన ప్రయోగాలు చెయ్యడానికి రాఘవాచారి ఏ మాత్రం వెనకాడకపోవడంలో వుంది! పిల్లల ఎదుగుదల కోసం వ్యాయామశాలల్లో ఏర్పాటుచేసే నిచ్చెనమెట్లను ఎప్పటికప్పుడు రీఎరేంజ్‌ చేస్తుంటారట. అలా చెయ్యకపోతే వాళ్ళ ఎదుగుదల వేగంగా జరగదట! పత్రిక పాఠకుల సాంస్కృతికస్థాయిని కూడా అలాగే సంపాదకుడు ఎప్పటికప్పుడు రీఎరేంజ్‌ చేస్తూండాలి. అందుకు, చిన్ననాట నేర్చుకున్న సంస్కృత సాహిత్యాన్ని వినియోగించడం సి.రా. విశిష్టతను నిరూపిస్తోంది.
సమాచార సాధనంగా పత్రికను దిద్ది తీర్చే క్రమంలో, సందర్భోచితమయిన సంపాదకీయాలు రాయడమో, రాయించడమో ఎడిటర్‌ బాధ్యతల్లో కీలకమయిందనే మాట వాస్తవమే. మన దేశజనాభాలో అది కూడా పన్నెండేళ్ళకు మించినవారిలో దాదాపు 40శాతం మంది అచ్చయిన వార్తా పత్రికలు చూస్తున్నారని ఓ సర్వే చెప్తోంది. వారిలో సగానికి సగంమంది గ్రామీణ, చిన్నపట్టణ ప్రాంతాలకు చెందినవారేనట. ఈ వర్గానికి చెందిన పాఠకులు దాదాపు అందరూ ప్రాంతీయభాషల్లో అచ్చయ్యే పత్రికల పాఠకులు కాగా, వాళ్లలో ఏడు శాతం మాత్రమే సంపాదకీయం చదువుతారట. అంటే మొత్తం పత్రికల పాఠకుల్లో మూడున్నరశాతం మాత్రమే చదివే సంపాదకీయాలకు ఎందుకీ ప్రాధాన్యం? ఎందుకంటే, అది ఆయా పత్రికల విధానప్రకటన లాంటిది కనక! అంతేకాదు తెలుగుతో సహా భారతీయ పత్రికారంగం పాటించేది బ్రిటిష్‌ పత్రికారంగ సంప్రదాయాలనే. ఆయా ప్రజాస్వామ్య సమాజాల్లో అభిప్రాయాలను గాఢంగా ప్రభావితం చేసే సాధనాల్లో పత్రికల సంపాదకీయాలు ముఖ్యమయినవి. మతాలూ కులాలూ ప్రాంతాల మధ్య చిచ్చు రగిలినప్పుడు, ఒక పక్షాన్ని భుజాన వేసుకోకుండా, అన్ని పక్షాలమధ్య ఏకాభిప్రాయం సాధించగలిగే సాధనాల్లో సంపాదకీయాలు ముఖ్యమయినవి. ఈ కారణం చేతనే మంచి సంపాదకీయం ఎప్పుడూ తూకం తప్పకుండా నిదానంగా సాగిసోతుంది. ఈ మూడు లక్షణాలూ రాఘవాచారి లీడర్స్‌లో కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి.
ఇక్కడ ఓ చిన్న వివరణ అవసరంజర్నలిజానికి సంబంధించిన మరో వివరంకూడా ఇక్కడే చెప్పుకోకపోతే, విశాలాంధ్రకు రాఘవాచారి చేసిన సేవను తగ్గించి చెప్పినట్లవుతుంది. సంపాదకీయాలు అనే సంపాదక వ్యాఖ్యలు, ఎడిటరే రాయాలన్న నిబంధన ఎక్కడా లేదు. పత్రిక సిబ్బందిలో మరెవరూ సంపాదకీయం రాయకూడదనే నిషేధమూ లేదు! పత్రిక ఏ ఆలోచన ధోరణికి కట్టుబడి వున్నదో దానికి ప్రాతినిధ్యం వహించగల అనుభవజ్ఞుడూ, ప్రతిభావంతుడూ ఈ బాధ్యత తీసుకోవడం తరచు జరుగుతూవుంటుంది. ఈ పాత్రకు రాఘవాచారి చేసినంత న్యాయం ఇతరులెవరూ చెయ్యలేదంటే అతిశయోక్తి కాదు. ఇందుకు దారితీసిన కొన్ని వ్యక్తిగత కారణాలుకూడా వున్నాయి. రాఘవాచారి ప్రత్యేకంగా అధ్యయనం చేసిన న్యాయశాస్త్రవిభాగం జ్యురిస్‌ప్రుడెన్స్‌. ప్రాచీన భారతీయులు దీన్ని ‘ధర్మశాస్త్రం’గా భావించారు. న్యాయశాస్త్ర తాత్వికతను విశ్లేషించి అధ్యయనం చేసే సైద్ధాంతిక విభాగమే జ్యురిస్‌ప్రుడెన్స్‌. ఈ విభాగంలో రాణించడానికి న్యాయశాస్త్రం ఒక్కదానిలోనే ప్రావీణ్యముంటే సరిపోదు తత్వశాస్త్రంలోనూ తగినంత అభినివేశం వుండితీరాలి! క్రీస్తుకు పూర్వం 1500ఏళ్ళనాటి రుగ్వేద ఆర్యులు, క్రీ.పూ. 800ఏళ్ళనాటి బోధాయనుడు, అతనికి 300ఏళ్ళ తర్వాతి కాలంవాడయిన సోక్రటిస్‌, తదితరులు ధర్మశాస్త్రం గురించి చెప్పినవాళ్ళే. అటువంటి తత్వవేత్తల, ధార్మికుల ప్రబోధాలను అధ్యయనం చేసే వారికి ఆలోచనలోనూ, భావప్రకటనలోనూ సమతూకం ఏర్పడు తుంది. దానికి మార్కి ్సజంలాంటి ఆధునిక, సమకాలీన చైతన్యమూ తోడయితే రాఘవాచారిలాంటి సంపాదకీయ రచయిత రూపుదిద్దుకుంటాడు.
ఇంతకుముందు, రాఘవాచారి సంపాదకీయాల సంపుటులు చూసినప్పుడు నాకు కలిగిన సంబరం గురించి చెప్పాను. అయితే, సమీక్షకుల కళ్ళకు ఏ సంబరాలూ, సంభ్రమాల పొరలు కమ్మేయకూడదంటారు పెద్దలు. అందుకే, ఈ ఖండికల్లో నాకు బొత్తిగా కిట్టని అంశం ఒక్కదాన్ని గురించి మాత్రమే చెప్తున్నాను. రాఘవాచారి సంపాదకీయాల రెండో సంపుటి ‘‘నివాళి’’, 262వ పేజీలో ‘‘మంచి కమ్యూనిస్టు’కో మచ్చు’’ అనే సంపాదకీయం గురించి ప్రస్తావించకుండా వుండలేకపోతున్నాను. ఇది, దాదాపు దశాబ్దంనర కాలం చైనా అధినేతగా కొనసాగిన డెంగ్‌ షియావో పింగ్‌కు సమర్పించిన శ్రద్ధాంజలి. 1949నుంచి 78 వరకూ చైనాలో కొనసాగిన నకిలీ సోషలిజం స్థానంలో మార్కెట్‌ ఆర్థికవ్యవస్థను రాజ్యాంగబద్ధంగా ప్రవేశపెట్టి, చైనాలోనూ బయటా కూడా ‘ఆధునిక చైనా నిర్మాత’గా ఆరతులందుకున్నవాడు డెంగ్‌. మావో అధినాయకత్వంలోని చైనా కమ్యూనిస్టుపార్టీ ప్రధాన కార్యదర్శిగానూ, ఆ దేశానికి ఉపప్రధాని గానూ పనిచేసిన డెంగ్‌కు ‘సాంస్కృతిక విప్లవం’ చీకటి రోజుల్లో పదేళ్ళపాటు గ్రహణం పట్టించారు. కానీ, మావో మరణానంతరం డెంగ్‌ నాయకత్వానికి ఎగబాకి ప్రతీకారం తీర్చుకున్నారు. పాతకాలపు రాచరికాల్లో జరిగాయని చెప్పే కుట్రలూకుహకాలను తలదన్నేరీతిలో ఈ పరిణామాలు చోటుచేసు కున్నాయి. ‘డెంగ్‌ అభివృద్ధి పథం’ వికృతరూపం వర్తమాన చరిత్ర తెలిసినవారందరికీ తెలిసిందే! ఏ దేశంలోనూ లేని రీతిలో చైనాలో మాత్రమే లక్షలాది స్వెట్‌ షాపుల్లో కార్మిక స్త్రీలతో రేబవళ్ళు పనిచేయిస్తున్నారని మీడియావర్గాలు గొంతు చించుకుని చెప్తున్నాయి. డెంగ్‌ అభివృద్ధి పథంలో భాగంగా జరిగిందే ఈ పరిణామం! ఇటువంటి అభివృద్ధిపథాన్ని కనిపెట్టి, ప్రపంచంలోని అత్యధిక జనసంఖ్య కలిగిన దేశం నెత్తిన రుద్దినవాడు ‘‘మంచి కమ్యూనిస్టు’కో మచ్చు’’ ఎలా కాగలడన్నదే అంతుపట్టని విషయం. పైగా సోషలిస్టు వ్యవస్థ పునాదులు చైనాలో బలంగా వున్నాయనీ, పెట్టుబడిదారీ దోపిడికి అక్కడ తలుపులు బార్లా తెరవలేదనీ వ్యాఖ్యానించడం మరీ విడ్డూరంగా వుంది. అసలు ‘డెంగ్‌ అభివృద్ధి పథం’ లక్ష్యమే ఈ రెండు విషయాలకూ రాజ్యాంగ బద్ధత కల్పించడం! 19971999 సంవత్సరాల్లో జనచైనా రిపబ్లిక్కులో భాగమైన హాంకాంగ్‌, మకావు ప్రాంతాల్లో ‘‘ప్రత్యేక పాలనవ్యవస్థలు’’ ప్రవేశపెట్టింది ఈ మంచి కమ్యూనిస్టే! దీనికి డెంగ్‌ పెట్టిన ముద్దుపేరు ‘‘ఒక దేశంరెండు వ్యవస్థలు!’’ అయితే, ఇటువంటివి ఈ సంపుటులలో ఒకటిరెండు కన్నా కనిపించకపోవడం చూస్తే, మళ్లీ కాళిదాసు చెప్పిన అర్థాంతరన్యాసాన్ని గుర్తు చేసుకోవాలనిపిస్తుంది.
సంపాదకీయ రచనను ఒక కళారూపంగా సాధన చేసిన చక్రవర్తుల రాఘవాచారి గారికి ‘విశాలాంధ్ర’ పాఠకకోటి తరఫున నమస్సులు!!
మందలపర్తి కిషోర్‌, 8179691822

  • చలపాక ప్రకాష్‌, సెల్‌: 9247475975

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img