Wednesday, September 28, 2022
Wednesday, September 28, 2022

జాతీయ పతాక

`పులుపుల వెంకటశివయ్య

జోహారులు జాతీయ పతాకా।
జోహారులు స్వాతంత్య్ర పతాకా।
త్రివర్ణ రంజిత అశోక చక్రాం
కిత పరిపూతా। జోహారుల్‌।
స్వతంత్ర భారత వినిర్మలాంబర
విజయ విహారీ।జోహారుల్‌।
బుద్ధ తపో నేత్రాంచల విలసిత ధర్మరేఖ వెలుగుల్లో
వీర కళింగ, ప్రజా హృదర్పిత, రక్తారుణ తర్పణతో,
జనియించిన ఓ శాంతి పతాకా। న్యాయము పాలిస్తానని.
వైరుల నెదిరిస్తానని లోకానికి చాటించవే॥
నీవు గరుత్మంతుడవై నింగిపైకి ఎగిరిపోయి
అరిగాపులు పెట్టబడిన అప్రమత్త యోధుని లాగున
దేశపు నలుమూలల్లో దేశావధి తీరాల్లో
పొంచియుండు శత్రులపై కాపుండవె మా కొరకై॥
నవభారత యుద్ధంలో మృతినందిన వీరులారా।
మీ త్యాగం మా కిచ్చిన యీ పతాక నీడ నిలచి
మీ యెడదల నిద్రించిన బంగారపు కలలన్నీ
మోసులెత్తి పుష్పించగ శపధమ్మిదే చేస్తున్నాం॥
చిరదాస్యపు చీకట్లో చిటిలిన మా సీమల్లో
జాతి మత ద్వేషమ్ములు మరచి ప్రజాతంత్ర రాజ్య
నవ జగతీ నిర్మాణం వివరించే సుకృతిలో
నలువది కోట్లేకమ్మై వీరులమై పోరెడమే॥
జోహారులు జాతీయ పతాక
జోహారులు స్వాతంత్య్ర పతాక॥

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img