Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

నవ్వుల వెన్నెల పూలు

కొన్నేళ్ళ క్రితం సీపీ వాళ్ళింట్లో పెళ్ళికి పిలిచారు. నేనొక్కడినే వెళ్ళా ఇంట్లోంచి. వధూవరులిద్దరూ వేదికపై ఉపస్థితులై వుండగా ఆహూతులు లైను కట్టి తాము తెచ్చిన బహుమతులిచ్చి నవ్వుల ఫోటోలు తీయించుకుంటున్నారు. ‘అభినందనలతో…. సరసి’ అని రాసి, గిఫ్టు ప్యాకెట్‌తో లైనులో నిలబడ్డాన్నేను కూడా. తీరా దగ్గరకొచ్చేక డవుటొచ్చింది. పెళ్లి సీపీ అమ్మాయిదా అబ్బాయిదా అని. గుండె లటుక్కు మంది. గిఫ్ట్‌ ఎవరి చేతిలోపెట్టాలి? శుభలేఖ తెచ్చుకోలేదు. పక్కవాళ్ళ నడిగితే బాగోదు. బుర్ర గోక్కుని లైను లోంచి బయటికొచ్చా సీనియారిటీని వదులుకుని. ఇంటికి ఫోనుచేశా శుభలేఖ చూసిచెప్పమని. చెప్పింది. గండంగడిచింది! ఇలాంటి సంఘటనలు ‘హాస్యకారు’లకేకాదు అందరికీ ఎదురవుతాయి. అందరూ చెప్పుకోరు. సీపీ చెప్పుకుంటారు వారం వారం. (‘వారం చెప్పుకోవడం’ అంటే వేరే అర్ధం వస్తుంది. అది కాదిది.) ‘మావిడి కాయలు కాయంగానే సరిపోదు, వాటినికోసి ఊరగాయ పెట్టినపుడే వాటికి సార్ధకత’ అని శ్రీ రమణ అంటూ ఉంటారు. అందుకే వారం వారం చెప్పిన కబుర్లన్నింటినీ పోగేసి ఇలా పుస్తకరూపంలోకి తెచ్చారు సీపీ. పైగా ఇది ఊరగాయ సీజను కూడా.
ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తారని మా సీపీని ఎవరూ తక్కువ అంచనా వెయ్యకండి. జర్నలిస్టుగా, ఎడిటర్‌గా మానవ జీవితాలని చదివి, కాచి వడకట్టిన మేధావి ఈయన. ‘సెలబ్రిటీ’ అని ఒకరంటే ‘లెజెండ్‌’ అని ఒకరంటారు. అది తేల్చమని శ్రీమతి సీపీ నాగమణిని అడిగితే ఆమె ఓ చిరునవ్వు సమాధానంగా చెప్పేసి వొంటింట్లోకి వెళ్ళిపోయారు. ‘ఈనాడు’ వంటి ఓ ప్రతిష్ఠాత్మకమైన సంస్థలో పనిచేసి, పదవీ విరమణ చేసారంటే అది చాలదూ వారి ప్రతిభని అంచనా వెయ్యడానికి? అక్కడ పనిదొరకడం, ఆ పనిచేస్తూ నెగ్గుకురావడం ఆషామాషీ వ్యవహారం కాదు. మహా మహులెందరో ఆ సంస్థలో పని చేసారు. దినపత్రికలో నిత్యకృత్యాలు చిత్రంగా ఉంటాయి. వార్తా సేకరణ, ప్రజెంటేషన్‌, ప్రచురణ, పంపిణీ.. ఇవన్నీ చెబుతూ ఉంటే ఇంటరెస్టింగుగా ఉంటాయి. సీపీ చెబితే మరీనూ. ‘కోతికొమ్మచ్చి’ లో ముళ్ళపూడి కూడా ఇలాగే భలేగా చెప్పారు. ఇకపోతే భాషాదోషాల్ని సరి చేయాల్సి వచ్చినపుడు సీపీ శషభిషలేం పెట్టుకోలేదు. అదే నాకు ముచ్చటనిపిస్తుంది. వారి భాషాభిమానానికి జోహార్లు. భాష విషయంలో నిజానికి టీవీల కంటే కాస్తంత పత్రికలే బెటరు. మొన్న ‘రావిశాస్త్రి’ శతజయంతి సందర్భంగా ‘రవి శాస్త్రి’ ఆని ప్రవచించింది ఓ ప్రఖ్యాత టీవి తల్లి. ‘బాపూ’, ‘సుశీలా’ అంటారు కొందరు. వారిని పిలవనపుడు దీర్ఘాలెందుకు??శాసనసభలో కొన్నేళ్ళక్రితం (ఆనాటి) ముఖ్యమంత్రి ఒకరు ‘రాయలసీమలో ప్రెట్టీ కేసులు’ అంటూ తరచూ ప్రస్తావించేవారు. ‘పెట్టీ కేసులు’ అని అనాలని ఆయనకి ఎవరు చెబుతారు? చెప్పి చివాట్లు తినడం కన్న ‘నాకెందుకొచ్చింది’ అని కింది అధికారులు అనుకుని ఉండొచ్చు. అటువంటి ఇబ్బంది సీపీ కూడా ఉద్యోగ నిర్వహణలో వచ్చినట్టు ఈ వ్యాసాలు చదివితే తెలుస్తుంది. అయితే ఆయన ఉదాసీనత ప్రదర్శించలేదు. సరిదిద్ది కాని ఊరుకోలేదు.
అనువాదాల విషయంలో ‘దారుణానువాదాలు’ ఎలా ఉంటాయో సోదాహరణంగా చెప్పారాయన. నా చిన్నపుడు ‘గుడిమెట్ల బంగారయ్య’ కి ‘టెంపుల్‌ స్టెప్స్‌ గోల్డెన్‌ సర్‌’ అని అనువాదంచేసి పిల్లలు గోలచేసేవారు. పెద్దవాళ్లు కొందరు ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారట!! ‘విజిటింగ్‌ కార్డుల పంపిణీ’ పనిలో ‘ఇస్తినమ్మ వాయనం’ అంటే నవ్వొస్తుంది. అలాగే ‘వాక్సుద్ధి’, ‘ఫేసుబుక్కు’, ‘మాస్కు’ తిప్పల గురించి, వాళ్ళ పెదనాన్న గురించి ఆసక్తికరంగా చెప్పారు. ‘రంభ’ అంటే ‘అరటిపండు’ అని వొలిచి చెప్పారు. అమరావతి రైతుల గురించి చెప్పినపుడు బాధ కలుగుతుంది.
ఏ రచనకైనా ప్రధానంగా చదివించే గుణం ఉండాలి. ఈ ‘వెన్నెల హాసం’ లో ఆ గుణం పుష్కలంగా ఉంది అని ఒక్కపేజీ చదివితే చాలు అర్ధమవుతుంది. బంగారానికి తావి అబ్బినట్టు చక్కని శైలికి హాస్యం జోడిరచి ఈ పూలకి మరింత పరిమళాన్ని తెచ్చారు రచయిత. ఘుమఘుమల తోటలో ఇవి కొన్ని పువ్వులు మాత్రమే. ఇంకా పాఠకుల ముందుకు రావలసినవి ఎన్నో ఉన్నాయి. వాటిని కూడా త్వరగా తీసుకురావాలని డిమాండు చేస్తున్నాం. ధర్నాలు, ఆందోళనలూ చేసే పరిస్థితి వరకూ తెచ్చుకోవద్దని చదువరుల తరపున నేను హెచ్చరిస్తున్నాను – ప్రేమగా.
సరసి, సెల్‌: 94405 42950

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img