Saturday, August 20, 2022
Saturday, August 20, 2022

నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం శీలా వీర్రాజు

దివికుమార్‌
సాధారణంగా మంచుకొండలా, నిండుకుండలా ఆవేశ కావేషాలు లేకుండా ఉండే శీలా వీర్రాజు ఆరోజు తనలోని ఆవేశాన్ని, దాచుకున్న భావాగ్నిని వ్యక్తం చేసిన సందర్భం.
అది 1996 జనవరినెల. బహుశా సంక్రాంతిరోజులు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రఖ్యాత రచయిత మధురాంతకం రాజారాంకు అప్పా జోస్యుల, విష్ణుభొట్ల ఫౌండేషన్‌వారు విశిష్టసాహితీ పురస్కారాన్ని అందజేస్తున్న సభ. సభ కిటకిటలాడుతోంది. సింగమనేని నారాయణ మధురాంతకం సాహిత్య విశిష్టతను సభాముఖంగా తెలియజేసిన తరువాత పురస్కార ప్రదాన కార్యక్రమానంతరం శీలా వీర్రాజును మాట్లాడమని నిర్వాహకులుకోరారు. తాను ఉపన్యాసకుడినికానంటూ మధురాంతకం సాహిత్యం గురించి నిరాడంబర వ్యక్తిత్వంగురించి రెండు మంచిమాటలు చెప్పి సమకాలీన సాహిత్యకారులలో అవకాశవాదం ఉందంటూ తన సాధారణపద్ధతికి భిన్నంగా విమర్శనాత్మకంగా మాట్లాడ సాగారు. విజయనగరంజిల్లా పేరుని విజయరామ గజపతినగరంగా మారుస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించటాన్ని తప్పుపట్టారు.
గురజాడ లాంటి గొప్ప సాహితీకారులు, ఇంకా అనేకమంది ప్రఖ్యాత కళాకారులుండగా పట్టించుకోకుండా తన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం రాజుల రంగప్పల పేర్లు పెట్టడాన్ని సాహిత్యకారులు ఎందుకు చూస్తూ ఉంటున్నారు? జనసాహితిలాంటి వారు తప్ప మిగిలినవారు ఎందుకు ఖండిరచడం లేదు. కనీసం తప్పుపట్టడం లేదు? అది మనందరి బాధ్యత కాదా? అని ప్రశ్నించారు. నిజానికి పైవిషయం అంటే విజయనగరం జిల్లా పేరు మార్పు గురించి పత్రికలలో వచ్చివున్నా చాలామంది దృష్టి దానిపై పడ్డట్టులేదు. ఆనాటికి సెల్‌ఫోన్లు, వాట్సాప్‌లు లేవు కదా!
జరిగింది ఏమిటి అంటే ఆయన వేదిక ఎక్కడానికి ముందు నాకు కనిపించి నప్పుడు ఆ నెల ప్రజాసాహితి ఇచ్చాను. అందులో పై అంశంపై సంపాదకీయం ఉంది. నిజానికి అది సంపాదకీయం కాదు. కొద్ది మార్పులతో విజయనగరం జనసాహితి శాఖ విడుదల చేసిన కరపత్రం అది. దాన్ని రాసింది నేనే. అది ఎలా జరిగిందంటే…అంతకు కొద్దివారాల ముందు విజయనగరం జనసాహితి శాఖ ఏర్పాటుచేసిన ఒక బహిరంగసభలో మాట్లాడడానికి వెళ్లాను. ఆ సభలో జిల్లా పేరుని మార్చాలనుకుంటే అది గురజాడ లాంటి తెలుగు జాతి ప్రజాస్వామ్య సాంస్కృతిక వైతాళికుని పేరు పెట్టాలి కానీ రాజుల రంగప్పల పేర్లు పెడితే ప్రజా రచయితలు కళాకారులు ఆమోదించరని, అలాంటి ఆలోచనలను జనసాహితి ఖండిస్తోందని, ‘‘రాజుల సంస్కృతి ప్రజలది అంటే చెల్లదు చెల్లదు చెల్లదులే’’ అనే చెరబండరాజు కవితా వాక్కులను ఉటంకిస్తూ నా సహజ ఆవేశ ధోరణిలో మాట్లాడాను. సభ అయిపోయిన తర్వాత ఇద్దరు ముగ్గురు జర్నలిస్టులు, ఒక రచయిత నేను ఉన్న చోటుని వెతుక్కుంటూ ఈ అంశంపై కరపత్రం రాయాలని కోరగా రాసి ఇచ్చాను. విజయనగరంలో బహిరంగసభ ఏర్పాట్ల దగ్గర్నుంచి కరపత్రం విడుదల దాకా నిర్మలానంద గారున్నారు. కరపత్రాన్ని జనవరి 1996 సంచికలో సంపాదకీయంగా ప్రచురించాం. అదే సభకు గుంటూరు నుంచి వచ్చిన పెనుగొండ లక్ష్మీనారాయణ మనం వెంటనే రచయితల సంతకాలతో కూడిన ఒక విజ్ఞాపన పత్రాన్ని ప్రభుత్వానికి పంపుదాం రాసి ఇవ్వండి అని సంచిలో నుండి తెల్ల కాగితం తీసి ఇచ్చాడు. నేను అక్కడికక్కడ ఒక విజ్ఞాపన పత్రం రాసి, ముందు శీలా వీర్రాజుగారితో సంతకం పెట్టించి అక్కడినుంచి ఒక్కొరొక్కరే రచయితలతో సంతకాలు చేయించాము. దాన్ని పోస్ట్‌ చేసే బాధ్యత పెనుగొండ తీసుకున్నాడు. అప్పట్లో బాలగోపాల్‌ కూడా చంద్రబాబు వైఖరిని ఖండిస్తూ ఏదో పత్రికలో రాశాడు. కారణాంతరాలు ఏమైనా విజయనగరం జిల్లా పేరు మారలేదు.
గుత్తికొండ సుబ్బారావు చొరవతో మరొక నలుగురిని కలుపుకుని ‘‘స్పందన సాహితి’’ అనే సంస్థను ఏర్పాటు చేసుకున్నాము. ‘స్పందన’ అనే కవితా సంకలనం తీసుకురావాలని నిర్ణయించుకున్నాము. కవులకు ఉత్తరాలు రాసే బాధ్యత అంతా సుబ్బారావుది. వరవరరావు నుండి ‘స్పందన’ అనే కవిత వచ్చింది. అదే ముందు వేయాలని అనుకున్నాము. కుందుర్తి ఆంజనేయులుతో ఆ సంకలనానికి ముందుమాట రాయించాలని, శీలా వీర్రాజుతో ముఖచిత్రం వేయించాలని అనుకున్నాము. వీర్రాజు కూడా మా స్పందన సాహితి గదికి వచ్చేవారు. తక్కువ మాట్లాడే వారు కానీ వయసులో సాహిత్య రంగ ప్రవేశంలో చాలా చిన్నవాళ్ళం అయినా బాగా కలిసిపోయి ఉండేవారు. తర్వాత ఆలోచించు కుంటే స్పందన కవితా సంకలనానికి మా అందరి కంటే ఎక్కువ శీలా వీర్రాజు కృషి చేశారు అని అర్థం అవుతోంది. చిక్కడపల్లిలోనే వారి బంధువు ప్రెస్‌ ఒకటి ఉంది. అందులో మా కవితాసంకలనం ముద్రణ. వీర్రాజుతోపాటు నేనుకూడా ప్రెస్‌కి వెళ్ళేవాడిని. ప్రూఫులు ఆయన, సుబ్బారావు చూసేవారు. మా ఏడుగురిలో ఐదుగురుకవితలు ఆ సంకలనంలో వచ్చాయి. అందులో ‘కార్మికుడా’ అనే నేను రాసిన కవిత జీవితంలో మొదటిసారి వరవరరావు కవితతో పాటు కుందుర్తి, ఏబీకే ప్రసాద్‌లవి కూడా అందులో ఉన్నాయి. దానిపై విశాలాంధ్ర పత్రికలో ఉమారాజ్‌ పేరుతో సమీక్ష వచ్చింది. ఆయన నిడమర్తి ఉమా రాజేశ్వరరావు అని తర్వాతకాలంలో నేను తెలుసుకున్నాను.
వీర్రాజు ముఖచిత్రం గీసి ఇచ్చారు, ఒక ఎర్రటి సిరా చుక్క కాగితంపైపడి అన్ని వైపులకు విస్తరించుకున్నట్లు! బావుంది అనుకున్నాము. ఒక ఆదివారం సుబ్బారావు, శీలా వీర్రాజుతో పాటు నేను కూడా మలక్పేట ఎన్‌.జి.ఓ. కాలనీలో ఉండే కుందుర్తి ఆంజనేయులు ఇంటికి వెళ్ళాము. ఆయన చాలాసేపు మాట్లాడారు. వీర్రాజు నోటివెంట ఒక్క పరుష మైన వాక్యం కూడా వచ్చేది కాదు. అప్పటికే ఆయన రాసిన ‘మైనా’ నవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఎన్నో కథలు రాశారు. చిత్రాలు గీశారు కానీ ఇసుమంత కూడా ఆడంబరం లేకుండా, అప్పుడప్పుడే సాహిత్య రంగంలోకి కాలిడుతున్నమాలాంటి కొత్తకారుతో స్నేహసంబంధాలు కలిగి ఉండేవారు. అప్పట్లో కుందుర్తి, గోపాల చక్రవర్తి (గోల చక్రవర్తి పేరుతో పత్రికల్లో రాసేవారు) రాష్ట్ర ప్రభుత్వ సమాచారశాఖలో కలిసి పనిచేసేవారు. నాకు కాలేజీలో చదువుకునే రోజుల్లోనే ఈ సమాచారశాఖ వారు నడిపే ఆంధ్రప్రదేశ్‌ పత్రికతో పరిచయం ఉండేది. ఒకసారి మమ్ములను నిఖిలేశ్వర్‌ ఇంటికి వీర్రాజు తీసుకువెళ్లారు. ఆయన హిందీ పత్రికల్లో వచ్చిన తన వ్యాసాలు కూడా చూపించారు. ఒకసారి గుత్తికొండ సుబ్బారావుని నన్ను వీర్రాజు యువభారతి బృందం దగ్గరకు తీసుకువెళ్లారు. నాలో అప్పటికే విప్లవోత్సాహం ఉరకలేస్తున్న కారణంగా ఆ బృందం అంతగా నన్ను ఆకట్టు కోలేదు. ఆ తర్వాత వీర్రాజు సూచనలతో, స్పందన సాహితి పేరుతో మేము నిర్వహించిన మరొక సాహిత్య కార్యక్రమం, శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయంలో 1970 జనవరి నెలలో దేవరకొండ బాలగంగాధర తిలక్‌ కవిత్వ సంకలనం ‘‘అమృతం కురిసిన రాత్రి’’ పై సాహిత్యగోష్టి. అరిపిరాల విశ్వం, శశాంకలతోపాటు కె.శివారెడ్డి కూడా ఆనాటి ఉపన్యాసకుడు. నన్ను బాగా ఆకట్టుకున్నవాడు శివారెడ్డి. అప్పటికే సంవేదనపత్రికలో రాచమల్లు రామచంద్రా రెడ్డి తిలక్‌ కవిత్వంపై రాసిన విమర్శనాత్మక వ్యాసం మేము చదివి ఉన్నాం. ‘‘తిలక్‌ను స్వాప్నికుడు అన్న రారా విమర్శపై మీ అభిప్రాయం ఏమిటి’’ అనే ప్రశ్నను చీటీ రూపంలో వేదిక మీదకు పంపించాము. దానికి జవాబు ఎవరు చెప్పారు? ఏం చెప్పారు? అనేది ఇప్పుడు నాకు గుర్తులేదు. 1970 ఫిబ్రవరి, విశాఖపట్నంలో జరిగిన శ్రీ శ్రీ షష్టిపూర్తి సభలో మొదటిసారి శీలా వీర్రాజు నిర్మలానందని కలిసారు. శ్రీ శ్రీ కవితలు కొన్నింటిని హిందీలోకి అనువాదం చేసి చిన్న పుస్తకం తీసుకు వస్తే దానికి ముఖచిత్రం వీర్రాజు వేశారు.
శీలా సుభద్రాదేవి ఆయనకు మేనమామ కూతురే! కానీ వారిది పెద్దలు కుదిర్చినపెళ్లి కాదు. వారిరువురు ఇష్టపడి చేసుకున్నది. సుభద్రాదేవి వీర్రాజు ఉత్తమ పాఠకురాలు. విమర్శనాదృష్టితో ఆమె ఆయన రచనలను పరి శీలించారు. వారిరువురి సాహిత్యఅభిలాష, అభిరుచి తమ తమ అభీష్టానుసారం వివాహం చేసుకునేట్లు పురి గొలిపింది. 1971లో అంటే 50 ఏళ్లకు పూర్వం వారి వివాహం అయిన తర్వాత సుభద్రాదేవి వీర్రాజు మొదటి పాఠకురాలు. ఆయన సాహచర్యంతో సహజీవనంతో తాను కూడా స్వయంకృషితో గుర్తింపు కలిగిన రచయిత్రిగా ఎదిగిన స్వతంత్ర వ్యక్తిత్వం సుభద్రాదేవిది. వారిద్దరిదీ ఎదుటివారిని నొప్పించకుండా మాట్లాడే అత్యుత్తమ కళాత్మక జీవనం. వీర్రాజు నిరాడంబరతలో నిజాయితీఉంది. స్నేహశీలతలో అంతులేని ప్రేమ ఉంది. సాటిరచయితల పట్ల సౌహార్ద్రతతో కూడిన అనురాగం ఉంది. ఆచరణలో గందరగోళం ఎరుగని స్పష్టత, తేటదనం ఉన్నాయి.
వ్యక్తిగత కీర్తి కాంక్షకు వెంట్రుక వాసి విలువ కూడా ఆయన ఎప్పుడూ ఇవ్వలేదు. సాహిత్యానికి కళలకు సామాజిక ప్రయోజనం ఉండి తీరాలనే బలీయమైన ఆకాంక్ష ఆయనలో ఉంది. అందుకే ఆయన రచయితలకు కళాకారులకు ఆదర్శనీయుడు. ఒక ఉత్తమ నమూనా.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img