Wednesday, June 7, 2023
Wednesday, June 7, 2023

నెహ్రూ, ఎడ్వీనా అమలిన శృంగార గాథ

బ్రిటిష్‌ వలస పాలన నుంచి భారత్‌ విముక్తమయ్యే దశలో వైస్రాయ్‌గా ఉన్న మౌంట్‌ బాటెన్‌, ఆయన భార్య ఎడ్వీనా మౌంట్‌ బాటెన్‌తో భారత తొలి ప్రధానమంత్రి పండిత్‌ నెహ్రూకు ఉన్న సంబంధాల గురించి ఉన్నవీ లేనివీ కల్పించి ఉబుసుపోక కబుర్లు చెప్పుకోవడానికి బాగా ఉపకరిస్తాయి. నెహ్రూ పేరెత్తితే చిర్రెత్తిపోయే వారికి ఈ కథలన్నీ చాలా ఆసక్తి కలిగించడమే కాక నెహ్రూను అపఖ్యాతిపాలు చేయడానికి వాటంగా ఉపయోగపడతాయి.
భారత్‌ వలస సంకెళ్లు తెంచుకునే సమయంలో జరిగిన పరిణామాలను బ్రిటిష్‌ రచయిత్రి అలెక్స్‌ వాన్‌ టుంజెల్మన్‌ ‘‘ఇండియన్‌ సమ్మర్‌: ది సీక్రెట్‌ హిస్టరీ ఆఫ్‌ ది ఎండ్‌ ఆఫ్‌ అన్‌ ఎంపైర్‌’’ అన్న గ్రంథంలో రేసు గుర్రంలో పరుగెత్తే శైలిలో వివరించారు. ఆనాటి పరిణామలలో ప్రధాన పాత్ర పోషించిన మహాత్మా గాంధీ, పండిత్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ, మహమ్మద్‌ అలీ జిన్నా, ఆఖరి వైస్రాయ్‌ లార్డ్‌ మౌంట్‌ బాటెన్‌, ఆయన భార్య ఎడ్వీనా నిర్వహించిన పాత్రను తుంజెల్మన్‌ చాలా ఆసక్తికరంగా ఈ గ్రంథంలో వివరించారు. భారత ఉపఖండ విభజన, ఆ తరవాతి పరిణామాలు, ఆ దశలో కీలక పాత్ర పోషించిన వారి వ్యక్తిత్వాలు, వారి అంతరంగ మథనాలు, ఆంతరంగిక అంశాలు ఈ గ్రంథం నిండా పరుచుకుని ఉన్నాయి. ఆ దశలో మౌంట్‌ బాటెన్‌ భార్య ఎడ్వీనాతో నెహ్రూకు ఉన్న సాన్నిహిత్యం, ప్రేమానురాగాలు, చరిత్ర, మతం, రాజకీయ కుట్రలను కలగలిపి అత్యంత పఠనీయంగా రాయడం ఈ గ్రంథం ప్రత్యేకత. తుంజెల్మన్‌ ఈ గ్రంథం 2007లోనే రాశారు. కానీ భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా పునర్ముద్రించారు. అయితే మొదటి ప్రతిని ఏ మాత్రం మార్చకుండానే పునర్ముద్రించానని రచయిత్రే చెప్పుకున్నారు. ఈ గ్రంథం ఆధారంగా సినిమా కూడా తీయాలనుకున్నారు. రెండు కారణాలవల్ల అది జరగలేదు. మొదటిది ఆర్థిక భారం. రెండవది భారత ప్రభుత్వం వ్యతిరేకిస్తుందన్న అనుమానం.
1947 ఆగస్టు 15 అర్ధరాత్రి ప్రపంచ చరిత్రలోనే రెండు పెద్ద పరిణామాలు జరిగాయి. దాదాపు 40 కోట్ల జనాభా ఉన్న భారత్‌లో బ్రిటిష్‌ సామ్రాజ్యం అంతమైంది. రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యం అని గర్వంగా చెప్పుకునే అవకాశాన్ని బ్రిటన్‌ కోల్పోయింది. భారత్‌ తమ గుప్పెట్లోంచి పోవడం వల్ల బ్రిటిష్‌ రాజు ‘‘రెక్స్‌ ఇంపరేటర్‌’’ అని సంతకం చేసే అవకాశమూ పోయింది. అధికార మార్పిడి, దేశ విభజన మొదలైన వ్యవహారాలను తుంజెల్మన్‌ చాలా సూక్ష్మమైన వివరాలతో ఈ గ్రంథం వెలువరించారు.
ప్రపంచ చరిత్రలో విస్మరించడానికి వీలులేని భారత స్వాతంత్య్రం గురించి చాలా మంది రాసినా చదువరులు ఈ గ్రంథం విడవకుండా చదివించే శైలి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిందే. దేశ విభజన ఎంతటి రక్తపాతానికి దారి తీసిందో, శరణార్థుల శిబిరాల్లో ఉండక తప్పని వారికి నెహ్రూ, ఎడ్వీనా మౌంట్‌ బాటెన్‌ అందించిన సహాయం అందులోనూ ఎడ్వీనా చూపిన చొరవ చారిత్రక సత్యాలకు దర్పణంగా నిలుస్తుంది.
తుంజెల్మన్‌ గ్రంథంలో నాలుగు అంశాలు – రచనా శైలిÑ లోతైన అధ్యయనంÑ మాట జారని, మర్యాద తప్పని సమతూల్యతÑ విస్తృతాంశాల ప్రస్తావన చాలా బలంగా కనిపిస్తాయి.
ఈ గ్రంథంలో ప్రేమ కార్యకలాపాలు లాంటి అంశాలు చాలా ఉన్నాయన్న ప్రచారం దండిగానే జరిగింది. కానీ చాలా చారిత్రక అంశాలతో పాటు, స్వాతంత్య్రం సిద్ధించే దశలో గాంధీ, జిన్నా, నెహ్రూ, మౌంట్‌ బాటెన్‌, ఆయన భార్య ఎడ్వీనా పాత్రలను తుంజెల్మన్‌ చాలా సంయమంతో చిత్రించారు. అనాటి భయాలు, ఆకాంక్షలు, నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి, జనంలో ఉన్న ఆశలు మొదలైన వాటిని చాలా బలంగా విశదీకరించారు. ఈ గ్రంథంలో అనేకమంది తరచి చూసే నెహ్రూ, ఎడ్వీనా మధ్య సంబంధాల వివరాలతో పాటు కంట తడిపెట్టించే అనేక సంఘటనలు కూడా ఉన్నాయి. చరిత్రను సరిగ్గా అర్థం చేసుకోవాలనుకునే వారికి ఈ పుస్తకంలో చాలా సమాచారం దొరుకుతుంది.
నెహ్రూకు మౌంట్‌ బాటెన్‌ దంపతులకు మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధాలు చాలా క్లిష్టమైనవి. నెహ్రూ అంటే ఎడ్వీనాకే కాదు లూయీ మౌంట్‌ బాటెన్‌కు కూడా వల్లమాలిన అభిమానం. నెహ్రూ ఉదారవాదం లార్డ్‌ మౌంట్‌ బాటెన్‌కు అమితంగా నచ్చేది. బ్రిటన్‌కు నిజమైన స్నేహితుడు నెహ్రూయేనన్నది ఆయన ప్రగాఢ విశ్వాసం. అయితే లూయీ మౌంట్‌ బాటెన్‌, పండిత్‌ నెహ్రూ కూడా ఒకే స్త్రీని తీవ్రంగా అభిమానించారు. నెహ్రూ, ఎడ్వీనా స్నేహంగా ఉండడాన్ని చూసి లార్డ్‌ మౌంట్‌ బాటెన్‌ ఎన్నడూ కుళ్లుకోలేదు. పైగా వారిద్దరి ఏకాంతానికి అవకాశం కూడా కల్పించే వారు. కానీ తుంజెల్మన్‌ గ్రంథాన్ని ఆసాంతం చదివితే నెహ్రూకు, ఎడ్వీనాకు మధ్య ఉన్న సాన్నిహిత్యం స్పష్టంగా గోచరిస్తుంది కానీ వారిద్దరి మధ్య ఉన్నది అభిమానం, పరస్పరానురాగమేనని అది అమలిన శృంగారం అని తుంజెల్మన్‌ తేల్చేశారు.
గ్రంథ రచయిత్రి అమ్మాయిలంటే గాంధీకి ఉన్న బలహీనతను కూడా అన్యాపదేశంగా వివరించారు. తుంజెల్మన్‌ ఆనాటి ప్రముఖ మహిళలు – లేడీ మాక్బెతెస్క్‌, ఫాతీమా జిన్న, పద్మజా నాయుడు, రాజ్‌ కుమారి, అమృత్‌ కౌర్‌ గురించి కూడా విస్తారంగానే ప్రస్తావించారు. తద్వారా భారత రాజకీయాల్లో మహిళల పాత్ర ఎంత విశిష్టమైందో తెలియజెప్పారు. గాంధీ ప్రవచించిన అహింసా మార్గం మహిళలు స్వాతంత్య్రోద్యమంలో గణనీయంగా పాల్గొనడానికి కారణం అంటారు తుంజెల్మన్‌. బ్రిటన్‌ లేబర్‌ పార్టీలో, అమెరికాలోని డెమొక్రాటిక్‌ పార్టీలో లేని మహిళల అద్వితీయమైన పాత్ర భారత్‌లో ప్రస్ఫుటంగా కనిపిస్తుందంటారు రచయిత్రి.
తుంజెల్మన్‌ ఈ గ్రంథంలోని అధిక భాగాన్ని ఆ సమయంలోని కీలక వ్యక్తుల మానసిక చిత్రణకే కేటాయించారు. శరణార్థుల ఆసుపత్రి శిబిరంలో దీపాలు లేకపోతే వెంటనే వాటిని ఏర్పాటు చేయించింది ఎడ్వీనా. దేశ విభజనకు ముందే నర్సింగ్‌ కౌన్సిల్‌ బిల్లు ఆమోదించడంలో ఆమె పాత్ర కీలకమైంది. పేదలు నివసించే అనేక ప్రాంతాలను ఆమె సందర్శించే వారు. పరిపాలనా నిర్వహణ విషయాల్లో భర్తకంటే ఎడ్వీనానే సమర్థురాలు అంటారు తుంజెల్మన్‌.
మసాలా మీద ఆసక్తి ఉన్న వారికోసం ఒక్క ఉదాహరణ చాలు. నెహ్రూ, ఎడ్వీనా రాసుకున్న లేఖలను దేశ విభజన తరవాత పాకిస్తాన్‌ విదేశాంగ శాఖ మంత్రి అయిన ఎస్‌.ఎస్‌. పీర్జాదా పాక్‌ అధినేత జిన్నాకు అందించారు. రాత్రి పది తరవాత డికీ (లార్డ్‌ మౌట్‌ బాటెన్‌) ఉండరు. మీరు రండి అని ఎడ్వీనా రాసిన లేఖ ప్రస్తావన కూడా ఉంది.
చరిత్ర మీద ఆసక్తి ఉన్న వారికి ఈ గ్రంథంలో కశ్మీర్‌ గురించిన అధ్యాయం ఉపయుక్తంగా ఉంటుంది. కశ్మీర్‌ సమస్యను నెహ్రూ ఐక్య రాజ్య సమితికి నివేదించడం సరైందేనన్న అభిప్రాయం ఈ అధ్యాయం చదివితే తెలుస్తుంది.
ఈ గ్రంతం అంతా చదివితే చరిత్రకు ప్రాధాన్యం ఇచ్చిన ప్రేమ కథ అనిపిస్తుంది.

  • ఆర్వీ రామారావ్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img