Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

పరిశోధనాత్మక బృహత్‌ సంకలనం చరితార్థులు`2

‘‘ఇతిహాసపు చీకటికోణం/అట్టడుగున పడి కాన్పించని కథలెన్నో కావాలిప్పుడు’’శ్రీశ్రీ. ప్రముఖ చారిత్రక పరిశోధకులు సయ్యద్‌ నజీర్‌ అహమ్మద్‌ ఎన్నో గ్రంథాలు పరిశోధించి 1780 నుండి 1947 వరకు బ్రిటీషు పోరాటంలో పాల్గొని విస్మృతి పాలైన 155 మంది అజ్ఞాత ముస్లిం స్వాతంత్య్ర సమరయోధుల సంక్షిప్త చరిత్రను సచిత్రంగా ప్రామాణికంగా రూపొందించిన ప్రామాణిక గ్రంథం చరితార్థులు2. గతంలో చరితార్థులు1 ప్రచురించి పాఠకులకు అందించాడు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న రాజులు, రాజప్రముఖులు, సైనిక ప్రముఖులు, సైన్యాధి కారులు, ప్రభుత్వాధికారులు, సాహసోపేతులైన సైనికులు మొదలు సామాన్య ప్రజల చిత్రాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. వీటిలో చాలావరకు అస్పష్టంగా ఉన్నందున ప్రముఖ చిత్రకారులు షేక్‌ అబ్దుల్లా సహకారంతో చిత్రాలు రూపొందించారు. వీటిలో కొన్ని ఊహా చిత్రాలున్నాయి. కొందరు చరిత్రకారుల పాక్షిక దృష్టి వల్ల అల్ప సంఖ్యాక వర్గాలైన ముస్లిం స్వాతంత్య్ర పోరాట యోధులను ద్వేష పూరితంగా చిత్రించారు. అపోహల మూలాలు మధ్యయుగ భారతదేశ చరిత్రలోనూ, స్వాతంత్య్రోద్యమంలోనూ, ముస్లింల జీవన పరిస్థితుల్లోనే ఉన్నాయి. ‘ముస్లింలు వేర్పాటువాదులే’ అనే అపోహను తొలగించేందుకు కొందరు పరిశోధకులు గణనీయమైన కృషి చేశారు. ప్రత్యేకించి నజీర్‌ అహమ్మద్‌ అమేయమైన పరిశోధనా కృషితో జాతీయ స్థాయిలో ఎక్కువ మంది పాఠకులకు విషయాన్ని అందించేందుకు వీలుగా తెలుగు, ఇంగ్లీషు భాషలతో పాటు, ఇతర భాషల్లో కూడా తన గ్రంథాలను ప్రచురించాడు. తొలి భారత స్వాతంత్య్ర సంగ్రామంలో హిందువులు, ముస్లింలు భుజం భుజం కలిపి బ్రిటీషు వారికి వ్యతిరేకంగా పోరాడారు. ఈ పోరాటం బ్రిటీషు వారిని కుదిపివేసింది. అందవల్ల బ్రిటీషు వాళ్లు ‘విభజించు పాలించు’ సిద్ధాంతాన్ని పెంచి పోషించారు. మతోన్మాదంతో హిందూ మహాసభ, ఆర్‌.యస్‌.యస్‌ ఒకవైపు, ముస్లింలీగ్‌ మరోవైపు నిలిచాయి. మధ్యయుగపు చరిత్రంతా మత విద్వేషపు పునాదుల మీద రచించారు. హిందూ మహాసభకు చెందిన సావర్కర్‌ 1924 లో ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. పాకిస్థాన్‌ అనే పదాన్ని చౌదరీ రహమత్‌ ఆలీ సృష్టించాడు. ముస్లింలు అధికంగా ఉన్నందున పాకిస్థాన్‌ను విడగొట్టాలన్న తీర్మానాన్ని ముస్లింలీగ్‌ అధినేత జిన్నా ప్రతిపాదించాడు. ‘ముస్లిం లీగ్‌’ కాంగ్రెస్‌ హిందువుల పార్టీగా పరిగణించినా, అన్నీ మతాల వాళ్లు సమానంగా పాల్గొనే విశాల వేదికగా ఉంది. ఎక్కువ సార్లు కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్న మౌలానా అబ్దుల్‌ కలాం అజాద్‌ చివరి వరకు దేశ విభజన డిమాండ్‌ను పూర్తిగా వ్యతిరేకించాడు. ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ఖాన్‌, బరేల్వి, దేవ్‌బంద్‌లకు చెందిన మౌలానాలు కూడా దేశ విభజనను పూర్తిగా వ్యతిరేకించారు. ఈ విషయాలన్నీ వెలుగులోకి రాకుండా చరిత్రకారులు మభ్యపెట్టడం దురదృష్టం. 1908లో ఆవిర్భవించిన ముస్లింలీగ్‌ దేశ విభజన వరకు సాగిన ప్రస్థానంలో బ్రిటీషు వారి ప్రమేయం ఉంది. సయ్యద్‌ నజీర్‌ అహమ్మద్‌ ఎంతో శ్రమించి పరిశోధనాత్మకంగా మాతృభూమి విముక్తి కోసం ప్రాణాలర్పించిన ముస్లిం స్వాతంత్య్ర సమరయోధుల ఛాయాచిత్రాలను, వారి జీవిత విశేషాలను సేకరించి ప్రచురించడం అభినందనీయం. అంకిత భావంతో 2014 లో చరితార్థులు1 గ్రంథాన్ని ప్రచురించారు. 2014 నుండి 2022 వరకు అవిశ్రాంత పరిశోధనా కృషితో 155 మంది ముస్లిం వీరుల సంక్షిప్త జీవిత రేఖాచిత్రాలను చరితార్థులు2 లో ప్రచురించాడు. ఎంతోమంది మిత్రుల సహకారంతో ఈ గ్రంథాన్ని రూపొందించానని సవినయంగా పేర్కొన్నాడు. 155 మంది ముస్లిం పోరాటయోధుల్లో ‘మౌల్వీ ఇమాంబక్స్‌ సహబాయి, బేగం అజీజున్‌ వంటి 20 మంది మహిళా పోరాటయోధులున్నారు. అప్పట్లో మహిళా చైతన్య స్ఫూర్తి ఉండడం గర్వకారణం. ముస్లిం పోరాటయోధుల సంక్షిప్త జీవిత చరిత్రలను సచిత్రంగా సేకరించి ప్రచురించిన నజీర్‌ అహమ్మద్‌ అభినందనీయుడు. చరితార్థులు2 గ్రంథం ప్రతి విద్యాసంస్థలో, ప్రతి గ్రంథాలయంలో ఉండదగిన ప్రామాణిక చారిత్రక గ్రంథం. పాఠకులు విధిగా చదువదగిన గ్రంథం చరితార్థులు`2.
డా॥ పి.వి.సుబ్బారావు, సెల్‌: 9849177594

గ్రంథ సమీక్ష

చరితార్థులు2 సయ్యద్‌ నజీర్‌ అహమ్మద్‌, ఆంగ్లానువాదం: బి.వి.కె పూర్ణానందం, వెల: రూ.1000/లు.
ప్రతులకు:
అజాద్‌హౌస్‌ పబ్లికేషన్స్‌,
ప్లాట్‌ నెం:సి2, శ్రీరామ్‌ ఆర్కేడ్‌, అమరావతిరోడ్‌, ఉండవల్లి522501,
తాడేపల్లి మండలం, గుంటూరుజిల్లా, తెలుగు బుక్‌హౌస్‌ హైదరాబాద్‌ నుండి పొందవచ్చును.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img