Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

పెద్దిభొట్ల కథలు – మధ్యతరగతి వ్యధలు!

ప్రస్తావన
అదో తెలుగుమాస్టారి ఇల్లు. ఆయన గొప్ప రచయిత కూడా. శిష్యులంతా ఆయన చుట్టూ చేరి కూర్చున్నారు. గురువుగారు గంభీరంగా ప్రసంగిస్తున్నారు.
‘‘మీరంతా తెలుగు సాహిత్యం చదువుకుంటున్నారు. ముందుముందు కథలో, కవితలో, వ్యాసాలో ఏదో ఒకటి రాయొచ్చురాయకపోవచ్చు! కానీ, సాహిత్య విద్యార్థులందరూ సగం రచయితలే!! ఎందుకంటే, సాహిత్యం చదివేవాళ్ళంతా పరకాయ ప్రవేశం చేసి రావల్సిందే!. అంచేత సాహిత్యంతో పాటు రచయితల గుణగణాల గురించి కూడా తెలుసుకుంటూ వుండాలి. పోతే, రచయితకి నిలకడ ప్రాణం! అతగాడి అభిప్రాయాలు స్థిరంగా వుంటేనే పాఠకులకు స్పష్టమయిన సందేశం ఇవ్వగలడు. నావిషయమే తీసుకోండి. నేను పాతికేళ్ళకింద రాసిన విషయం గురించి ఇవాళ రాసినా అదే అభిప్రాయం చెప్తా, ఎందుకని? నాకు నిలకడ, స్థిరత్వం ఉన్నాయి కనక….’’
శిష్య పరమాణువుల్లో ఒకతను గురువు మాటలు విని, ఆలోచనలో పడ్డాడు. అతనికేదో విషయం తట్టినట్టుంది. గురువును ఏదో అడుగుదామనుకుని, ఒక్క క్షణం ఆగాడు. మిగతా శిష్యులు వెళ్ళిపోయేదాకా వేచివుండి, అప్పుడు గురువుగారి దగ్గర చేరాడు. అప్పటికే గురువు అతన్ని గమనించి వున్నారు. ‘‘ఏమిరా అబ్బీ, ఏదో అడగాలనుకుని తటపటాయిస్తున్నా వెందుకు? నిర్భయంగా అడుగు!!’’ అని ప్రోత్సహించాడు. ‘‘మాస్టారూ, మీరిందాకా నిలకడ, స్థిరత్వం గురించి చెప్పారు కదా, అవి నిజంగా అంత ముఖ్యమయినవంటారా??’’ అని వినయంగానే అడిగాడు శిష్యుడు. ‘‘ఏం? ఎందుకొచ్చిందా అనుమానం??’’ కాస్త కటువుగానే అడిగాడు గురువుగారు. ఆయన మాటతీరుకు శిష్యుడు ఒకింత జంకాడు కానీ, అనుమానం తీర్చుకోక పోతే, అతని ప్రాణం కుదుటనపడదనిపించి తెగించాడు. ‘‘వివాహేతర సంబంధాల గురించి మీరు రెండు నవలల్లో రాశారు. ఒకదాంట్లో దాన్ని ఖండిరచారు, మరో దాంట్లో దాన్నే గొప్పగా చూపించారు. మీకు నిలకడ వున్నట్టా? లేనట్టా?’’ గురువు నిర్ఘాంతపోయాడు. ‘‘ఏవిట్రా నువ్వనేది? వివాహేతర సంబంధాల గురించి నేను పరస్పర విరుద్ధ అభిప్రాయాలు ప్రకటించానా? ఎక్కడ?? ఏయే రచనల్లో??’’ అంటూ నిలదీశాడు. ‘‘చెలియలి కట్ట’ నవల్లో వివాహేతర సంబంధాలను మీరు అభిశంసించారు ‘బద్దన్న సేనాని’లో దాన్నే గొప్పగా చూపిం…. ’’ అంటుండగానే గురువు ఒక్క వురుము వురిమాడు- ‘‘నీ మొహం నాకు చూపించకు! దయచెయ్యింక!!’’ ఆ రోజున అలా తలవంచుకువెళ్ళిపోయిన శిష్యుణ్ణి నెల రోజుల తర్వాత పిలిపించి, ‘‘ఊ, పెద్దవాడివయిపోయినావ్‌ రా! దర్శనమే కరువైపోయింది!’’ అని ప్రశాంతంగా అన్నాడు గురువు. ఒక్క క్షణం ఆశ్చర్యపడినా, ‘‘ఇంట్లో పన్లన్నీ అమ్మ ఒక్కతే చేసుకోలేకపోతుంటేనూ….. ’’ అంటూ నసిగాడు శిష్యుడు. ‘‘ఈ నెల ‘భారతి’లో ఏదో కథ వచ్చినట్టుంది దొరగారిది? అదేనా అమ్మకి సాయం!! సంతోషించాంగానీ, రేపట్నుంచీ మామూలుగా వస్తూండు. కథ బావుందిరా అబ్బీ!! రాస్తూండు.’’ అనేసి మరేదో విషయం మీదకి మళ్ళిపోయాడు గురువు. ఆ గురువుగారి పేరు విశ్వనాథ సత్యనారాయణ (1), ఆ శిష్యుడి పేరు పెద్దిభొట్ల సుబ్బరామయ్య అని చెప్పాలంటారా? ఆ గురుశిష్యులిద్దరికీ పరస్పరం ఎన్ని అభిమానాలున్నా సాహిత్యం విషయంలో ఎవరి దోవ వాళ్ళదే! జ్ఞానపీఠగ్రహీత, పద్మభూషణ్‌, కళాప్రపూర్ణ ‘కవిసమ్రాట్‌’ విశ్వనాథ సత్యనారాయణ సనాతన హిందూ ధర్మం ఆదర్శంగా బోధిస్తూ కడదాకా రచనలు చేస్తూ పోయారు. పెద్దిభొట్ల సుబ్బరామయ్య మాత్రం మధ్యతరగతి మందభాగ్యుల మూగ వేదనకు గొంతుకనిస్తూ, పట్నవాసం జీవితంలోని చీకటి నీడల్లాంటి ‘‘చింపిరి’’ బతుకులను చిత్రిస్తూ పోయారు. సుబ్బరామయ్య మీద మరే రచయిత ప్రభావమూ పెద్దగా లేనట్లే, విశ్వనాథ ప్రభావం కూడా లేదన్నది వాస్తవం!
2012 సంవత్సరానికి కేంద్ర సాహిత్య ఎకాడమీ పురస్కారం పొందిన తెలుగు కథకుడు పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారిని, సమకాలీన రచయితలు అనేకులు, అనేక విధాలుగా అభివర్ణించారు. అవి చూస్తే, ‘‘ఏకం సత్‌ విప్రాః బహుధా వదన్తి’’ (2) (వాస్తవానికి ఉన్నది ఒకటే ఉనికి – అయితే, దాన్నే పండితులు పలుపేర్లతో పిలుస్తారు) అనే రుగ్వేద ప్రవచనం జ్ఞాపకానికి వస్తుంది.
కరుణరసానికి పట్టం కట్టిన పెద్దిభొట్లని, ‘‘బాల్యం పారేసుకున్న భవభూతి భ్రాత’’అన్నారు కప్పగంతుల మల్లికార్జునరావు (3). శవవాహకులు, శనిదానం పట్టేవాళ్ళు, తద్దినాల భోక్తలూ, వంటబ్రాహ్మలూ ఇలాంటి వాళ్ళ జీవితాల్లోని చీకటి కోణాలను వెలుగులోకి తీసుకొచ్చినందుకేనేమో- ‘‘దళితబ్రాహ్మణుల చరిత్రకారు’’డని పెద్దిభొట్లను అభివర్ణించారు వేగుంట మోహన ప్రసాద్‌. (4) ప్రపంచ ప్రసిద్ధ రష్యన్‌ మహారచయిత ఫ్యోదర్‌ దస్తయేఫ్‌ స్కిమ్‌ (5) రాసిన ‘‘నేరము-శిక్ష’’ నవల్లో ప్రధాన పాత్ర రాదియన్‌ రస్కల్నికోఫ్‌ తో పెద్దిభొట్లగార్ని పోల్చారు మునిపల్లె రాజు. (6) పెద్దిభొట్ల పాత్రల రూపకల్పనను వివరిస్తూ, నినవ ఱం జూaత్‌ీఱషబశ్రీaతీశ్రీవ స్త్రశీశీస a్‌ షతీవa్‌ఱఅస్త్ర జూవశీజూశ్రీవ షష్ట్రశీ aతీవ ంశీషఱaశ్రీ ఎఱంటఱ్‌రు అన్నారు, సుబ్బరామయ్యగారి సహోద్యోగి, చిరకాల మిత్రుడు పి.రామానుజం. (7) ఇవీ, ఇలాంటివే మరికొన్ని వచనాలూ, ప్రవచనాలూ, నిర్వచనాలూ పెద్దిభొట్ల సుబ్బరామయ్య బహుముఖీనతను ఒక్కొక్క కోణంలో (ప్ర)దర్శిస్తాయి. దాదాపు ఆయన రచనల గురించి రాసినవాళ్ళందరూ, ఓ విషయంలో మాత్రం ఏకీభావం వ్యక్తం చేసిన విషయం వాస్తవం. అది పెద్దిభొట్ల రచనల్లో వెల్లువెత్తే కరుణరసం గురించి! ఆయన రాసిన మూడున్నర వందల కథానికలయినా, ఎనిమిది నవలలయినా అన్నింటా కరుణ రసం చిప్పిల్లుతూనే వుంటుంది.
సుబ్బరామయ్యగారి కథలకు ఉండే మరో సామాన్య లక్షణం ఆ పాత్రల ఆర్థిక శ్రేణి.
ఆయన రాసిన కథల్లో నూటికి తొంభై మధ్యతరగతి జీవితాల గురించిన కథలే. ఇంటర్వ్యూల ఎండమావుల్ని తరుముకు వెళ్ళే యువ దాహార్తుల ఆశలు అడియాసలూ, రిటయిరయిన ఉద్యోగులఅవస్థలూ, వాళ్ళ పెళ్ళి కాని కూతుళ్ళ పగటికలలూ, డిగ్రీ చదువుకున్న పాపానికి వృద్ధకన్యలుగా మిగిలిపోయిన అమ్మాయిల వ్యథలూ, బియ్యంకోసం గంటల తరబడి క్యూలో నిలబడక తప్పని నిర్భాగ్యుల వేదనలూ, పూటకూటికోసం పడరానిపాట్లుపడే అనాథల ఆవేదనలూ, అవకాశాలు దొరక్క బతుకంతా సర్దుకుని గడిపేసిన ఒకప్పటి ప్రముఖ క్రీడాకారులకు ఎదురైన అవమానాలూ, ఉద్యోగాల కోసం వందల మైళ్ళు వలసపోయి అవస్థలు పడే సామాన్యులు, ఆ ప్రేమ అనే మాయలేడిని తరుముకెళ్ళి చిట్టడివిలో చిక్కడిపోయిన అమాయకురాళ్ళూ, కడుపు కక్కుర్తితో నమ్మిన వాళ్ళింట్లోనే కన్నం వేసే అభాగ్యులూ, పెళ్ళిళ్ళలో బంధువుల చెప్పులు కొట్టేసి దొరికిపోయే దౌర్భాగ్యులూ – ఇలా మధ్యతరగతి అనే సువిశాల ప్రపంచంలో ని వైవిధ్యాన్నంతటినీ కథానికలుగా చిత్రించారు పెద్దిభొట్ల.
మన దేశజనాభా దాదాపుగా 140 కోట్ల మందికి చేరుకుందని ఒకానొక గణాంక సేకరణ సంస్థ అంచనా. (8) అందులో దాదాపు సగంమంది ‘‘మధ్యతరగతి’’ పద్దు కింద చేరతారన్నది ఓ లెక్క కాగా మనదేశంలో మధ్య తరగతి వాటా దాదాపు 28 శాతం -సుమారు నలభై కోట్లు – మాత్రమే నన్నది మరోలెక్క (9) (పారిశ్రామిక కార్మికులు మొదలుకుని, వాళ్ళ సంపాదనకు అక్షరాలా అనేక రెట్లు ఎక్కువ సంపాదించే ఐటీ వృత్తినిపుణులు వరకూ ఈ లెక్కలో చేరివుండడం గమనార్హం!) కాగా, ఇక్కడ కూడా ‘‘ఏకం సత్‌….’’ అనుకుని ముందుకు పోదాం మనం. మధ్యతరగతి అనే ఆర్థిక శ్రేణి పెద్దిభొట్ల కలం పట్టినప్పుడే పుట్టింది కాదు. బి.బి.మిశ్రా(10) అనే ఆర్థిక చరిత్రకారుడి లెక్క ప్రకారం, పద్దెనిమిదో శతాబ్ది మధ్యలో బ్రిటిష్‌ ప్రభుత్వ విధానాలలో వచ్చిన మార్పుల పర్యవసానంగా, మన దేశంలో మధ్య తరగతి పుట్టుకొచ్చింది. బ్రిటిష్‌ ప్రభుత్వ నూతన సామాజిక -ఆర్థిక- పారిశ్రామిక విధానాల పుణ్యమాని కొత్త వృత్తులు పుట్టుకొచ్చి, మధ్య తరగతి అనే కొత్త ఆర్థిక శ్రేణి ఆవిర్భవించిం దన్నారు మిశ్రా. ఈ పరిశోధకుడు తన పరిశోధన ఫలితాలను పుస్తక రూపంలో ప్రకటించిన సమయమూ – పెద్దిభొట్ల కథానికల్లో మధ్యతరగతి స్వరూప స్వభావాలు చిత్రితమయిన సమయమూ దాదాపు ఒకటే! 1960కి అటూ ఇటూగా ఈ రెండు పరిణామాలు చోటుచేసుకోవడం కేవలం కాకతాళీయం!
స్వయంగా పెద్దిభొట్ల సుబ్బరామయ్యగారే, ‘‘మధ్య తరగతి ప్రజల దుస్థితీ, వాళ్ళ ఆవేదనలూ, ఆందోళనలూ, అసూయలూ నా కథలకు ముడి సరుకు’’లని చెప్పారు. మన దేశంలోని అన్ని భాషల్లోనూ ఉన్న పరిస్థితి ఒక్కటే – రచయితల్లోనూ, పాఠకుల్లోనూ అధికులు మధ్యతరగతికి చెందినవారే! అంచేత, రచయితలకు నేరుగా తెలిసిన జీవితాలు – సాధారణంగా- మధ్యతరగతి బతుకులే!! పెద్దిభొట్ల కథలు రాసేనాటికి గ్రామీణ మధ్య తరగతి జనసంఖ్య బాగా ఎక్కువగా – దాదాపు మూడు వంతులకు పైగా – వుండేది. క్రమంగా, గ్రామీణ-పట్టణ మధ్యతరగతి ప్రజల వాటాలు మారుతూ వచ్చాయి. పల్లెల్లో పనులుదొరకని నేపథ్యం లోనూ, వేరే ప్రాంతాల నుంచి వలస వచ్చే శ్రామికులు పెరుగుతూ పోతుండడం వల్లనూ ఈ మార్పులు చోటుచేసు కున్నాయి. పెద్దిభొట్ల కథల్లో కూడా ఈ మార్పులు గమనించవచ్చు.
పెద్దిభొట్ల – 1959లో – తొలి కథానిక రాసిననాటి నుంచీ, కడదాకా అనుసరిస్తూ వచ్చిన సాహిత్య వ్యూహం ఒకటి వుంది. ‘‘దగ్ధగీతం’’లాంటి అతి కొద్ది కథల్లో మాత్రమే ప్రతినాయకులు కనిపిస్తారు కానీ, పెద్దిభొట్ల రాసిన కథల్లో సాధారణంగా పరిస్థితులే విలన్లు. మరీ ముఖ్యంగా, ఆర్థిక పరిస్థితులు! రోజుకు రెండుపూట్ల తిండితినడానికి మాత్రమే కటాకటిగా సరిపోయేంత ఆర్థిక స్తోమత కారణంగా తీరని కోరికల వెనక వుండే విషాదం ఎంత సాంద్రమో పెద్దిభొట్లకు బాగా తెలుసు. ఏదో సినిమాలో ఒక్క క్షణం సేపు తెరమీద మెరిసిన భర్త మొహాన్ని మళ్ళీ చూడాలనుకున్న వృద్ధురాలి ‘‘కోరిక’’ కాలి బూడిదయిపోవడంలో ఏ సామాజిక శక్తి ప్రతికూల పాత్ర పోషించలేదు. యవ్వనంలో మధుర గాయకుడనిపించుకున్న వ్యక్తి ఇచ్చిన ఒకే ఒక్క రికార్డు ప్లేటు ఆచూకీ అనుకోకుండా దొరికినప్పటికీ, అతగాడి చెవుల్లో ‘‘శని దేవత పదధ్వనులు’’ మాత్రమే వినబడ్డంలో కూడా ప్రత్యక్షంగా ఫలానా ఆర్థిక – సామాజిక విధాననిర్ణయం పర్యవసానంగా జరిగివుం డక పోవచ్చు. అయితే, ఈ పరిణామాలన్నీ ఆర్థిక-సామాజిక సమస్యల పర్యవసానాలే! బాలల మాదిరిగానే వృద్ధుల సంక్షేమం కూడా సామాజిక బాధ్యతే అనే అవగాహనను నినాదప్రాయంగా ఎక్కడా చెప్పకపోయినా, పెద్దిభొట్ల భావన అదే! ముఖ్యంగా, ఈ సమస్యకు వున్న ఆర్థికకోణం విషయంలో ఆయనకు స్పష్టమయిన అవగాహన వున్నందువల్లనే అన్ని కథల్లోనూ ఒకే ‘‘టోన్‌’’ వినబడుతుంది. పాఠకుల చేత చప్పట్లు కొట్టించుకోవాలనే చవకబారు యావ ఇలాంటి పరిణత అవగాహనకు ఎన్నటికీ దారితీయలేదు.
సుబ్బరామయ్యగారి కథల్లో నాగరిక జీవితం బయటి అంచుల్లో బతికే బీద, బికారి, అలగా జనం పాత్రలుగా కనబడుతూ వుంటారు. వాళ్ళలో – శవవాహకులూ- శనిదానం, మృత్యుంజయదానం పట్టేవాళ్ళూ- తద్దినాల భోక్తలూ- వంటబ్రాహ్మలూ తదితరు లుంటారు. పుట్టుక ప్రాతిపదికగా చూస్తే, వీళ్ళందరూ అగ్రవర్ణాల వాళ్ళే. పైగా, వీళ్ళంతా అగ్రవర్ణాల మూఢనమ్మకాలూ, భయాలపై ఆధారపడి బతుకీడ్చే క్షుద్రవృత్తులవారు. వాళ్ళను వేగుంట మోహనప్రసాద్‌ బ్రాహ్మణ దళితులని ఎందుకన్నారో ఆలోచించాల్సివుంది. ఈ ‘‘వృత్తుల్లో వున్న వాళ్ళకి సామాజికంగా గౌరవం దక్కదు. ఇతర బ్రాహ్మణులకీ వాళ్ళకీ ఎందులోనూ సాపత్యం వుండదు. ఎవరు ఈ ‘‘వృత్తులు’’ చేపట్టినా, గత్యంతరం లేకపోవడంవల్లనే అన్నది బ్రాహ్మణ సమాజంతో కనీస పరిచయంవున్న వాళ్ళందరికీ తెలిసిన విషయమే! మర్యాదస్తులతో నిండిన సభ్యసమాజం వాళ్ళను దరి చేరనివ్వదు. ఈ వృత్తుల్లో వున్నవాళ్ళతో – అవే వృత్తుల్లో ఉన్నవాళ్ళు సైతం – సంబంధాలు కలుపుకోరు. బహుశా అందుకేనేమో, మో వాళ్ళను బ్రాహ్మణ దళితులన్నారు.
ఇక, సుబ్బరామయ్యగారి తండ్రి రైల్వే స్టేషన్‌ మాస్టర్‌గా వుండేవారు. అంచేత, చిన్నప్పటినుంచీ రచయిత రైళ్ళూ- స్టేషన్లు టీసీలూ- రైల్వే ప్లాట్‌ ఫారాల పైనే బతుకులు వెళ్ళమార్చే బీదాబిక్కీ జనం-ఇలాంటి వాళ్ళను చూస్తూ పెరిగారు. దూరప్రాంతాలకు పోయే ‘‘ఫాస్ట్‌ ట్రెయ్‌’’ను ఆశ్రయించు కుని బతికే ఊరూ పేరూ లేని అనాథలూ – టిక్కెట్‌ లేకుండా ప్రయాణం చేసే చిలక జోస్యులూపదడుగుల ఎత్తయిన గోడల్ని సునాయాసంగా దూకేసే నిప్పుకోళ్ళూ – ఎక్కువ ఆదాయాలొచ్చే పనులలో ఎక్కువ గౌరవం దొరకదని ! గ్రహించిన చింపిర్లూ – ఆయనకు ఎక్కడోచోట ఎదురయ్యేవుంటారు. వాళ్ళే ఆయన కథల్లో పాత్రల్లా ప్రవేశించి పాతుకుపోయారు. (దశాబ్దాల తరబడి రైల్వే శాఖలో పనిచేసిన ప్రముఖ రచయిత ఘండికోట బ్రహ్మాజీరావు(11) ఇలాంటి వాళ్ళను తన ‘‘శ్రామికశకటం’ నవలలోనూ, అదే శాఖలో చిరకాలం పనిచేసిన మరో ప్రముఖ రచయిత వి. రాజారామమోహన రావు(12) కూడా ‘‘మరో ప్రవాహం’ ‘ అనే నవలికలో ఇలాంటి బతుకులనే చిత్రించడం గమనార్హం.) వాళ్ళకు తోడుగా, చంటిబిడ్డతో వీథిన పడిన నిస్సహాయురాలికి చేయూతనిచ్చిన సతీ సావిత్రులూ – కష్టార్జితాన్ని దోచుకుపోయే పరాన్న భుక్కును వదిలించుకున్న చుక్కమ్మకు అండగా నిలిచిన సుబ్రమణులూ- గొంతు ఆర్చుకుపోయిన ఊరికోసం, సొంత డబ్బుతో మంచినీటి బావి తవ్వించిన పేరయ్యలూ -కూడా పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథల్లో కనిపిస్తారు.
ముగింపు
‘‘ఎప్పుడూ ఆకలి చావులూ, డబ్బు బాధలూ, రోగాలూ వాటిని గురించి రాయకండి. అవి అస్సలు లేవనుకోండి. ఈ గుడ్డి వాళ్ళ గురించీ, కుంటివాళ్ళ గురించీ డబ్బులేనివాళ్ళ గురించీ, పేదల గురించీ రాస్తే వాళ్ళు చదువు తున్నారా? అందువల్ల మీరేం సాధిస్తున్నట్టు? పుణ్యమా పురుషార్థమా??’’ అని ‘‘పుట్ట’’ కథలో వెంకట్రావు అనే పాత్ర, రచయితకు హితబోధ చేస్తుంది. ఆ మాటల్ని ఆ రచయితా పట్టించుకోడు – పెద్దిభొట్ల సుబ్బరామయ్యగారూ పట్టించుకోలేదు! ఆయన కథలూ నవలలూ ఈ విషయమే చెప్తాయి. మ రీముఖ్యంగా, ఆయన రాసిన కథానిక ‘‘ఇరవై అయిదవ గంట’’ ఈ అంశాన్ని నేరుగానే ప్రస్తావించింది. కుడి చేతా ఎడమ చేతా ఎడా పెడా రాసి పారేసే’ రచయితత్రులను అధిక్షేపిస్తూనే, నిద్రాహారాలను మానేసి వాళ్ళు రాసే చెత్తను అచ్చుకు సిద్ధం చేసే కార్మికుల దుస్థి తి పట్ల సానుభూతి ప్రకటిస్తుంది సర్వసాక్షి కథనం. అక్షరాలా అదే పెద్దిభొట్ల ఆత్మ!!
-వి.రాజారామమోహనరావు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img