Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

ప్రజాపోరాటాల సాన మీద పదునెక్కిన
బాబా నాగార్జున్‌

ఆర్వీ రామారావ్‌

దిగువ మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబంలో జననం, చిన్నప్పుడే మాతృ వియోగం, చండశాసనుడైన తండ్రి పెంపకం, కుదురులేని జీవితం, నికరమైన ఆదాయ వనరులు లేకపోవడం, బాల్య వివాహం, దేశదిమ్మరితనం మొదలైన లక్షణాలు కలబోత ప్రసిద్ధ హిందీ రచయిత బాబా నాగార్జున్‌ (30-06-1911 – 05-11-1998).
బాబా నాగార్జున్‌ అసలు పేరు వైద్యనాథ్‌ మిశ్రా. చిన్న తనంలోనే తల్లిని కోల్పోయాడు. తండ్రి గోకుల్‌ మిశ్రాకు విషయ లాలసత ఎక్కువ. తల్లి క్షయ వ్యాధితో బాధపడుతుండేది. ఆమె మంచాన పడి ఉన్నప్పుడు చెడు తిరుగుళ్లను ఆపేయాలని చెప్తే తండ్రి ఆమెను గొడ్డలితో నరుకుతానని బెదిరించాడు. తండ్రికి విధవరాలైన మరదలితో అక్రమ సంబంధాలు ఉండేవి. ఆమె వల్ల అక్రమ సంతానం కలుగుతుందని తెలిసి గర్భస్రావం చేయిస్తే ఆమె మృత్యు కుహరంలోంచి తప్పించుకుంది. ఆరేళ్ల వయసున్నప్పుడే వైద్యనాథ్‌ మిశ్రా తల్లిని కోల్పోయారు. మాతృ ప్రేమ దక్కలేదు. తండ్రి ఆప్యాయతా దక్కలేదు.
నాగార్జున్‌ తన స్వగ్రామమైన తరౌనీలో ఆ నాటి సంప్రదాయం ప్రకారం సంస్కృత అభ్యాసం ప్రారంభించారు. ఆ తర్వాత కాశీలోనూ, కలకత్తాలోనూ సంస్కృతం చదివి సాహిత్య ఆచార్య పట్టా పుచ్చుకున్నారు. ఆయన మాతృ భాష మైథిలి. చదువు పూర్తి అయిన తర్వాత వైద్య నాథ్‌ మిశ్రా ఉద్యోగం చేయకుండా భార్య అపరాజితా దేవిని ఆమె తల్లిదండ్రుల ఇంట్లో వదిలేసి వారణాసి వెళ్లారు. హిందీ మాట్లాడే ప్రాంతాలలో గడిపారు. బెంగాల్‌ లో హిందీ మాట్లాడే ప్రదేశాల్లో ఉన్నారు. అప్పటికి ఆయనకు మాతృ భాష అయిన మైథిలిలో మాత్రమే పట్టు ఉండేది. మొట్ట మొదటి కవిత ఆ భాషలోనే యాత్రి కలం పేరుతో 1930లో రాశారు. వైదేప్‌ా అన్న కలం పేరుతో కూడా రాసే వారు. ఈ దశలోనే వైద్యనాథ్‌ మిశ్రాకు బౌద్ధం మీద ఆసక్తి కలిగింది. మహాపండితుడు, కమ్యూనిస్టు, ఆందోళన కారుడు అయిన రాహుల్‌ సాంకృత్యాయన్‌ తో కలిసి శ్రీలంకలోని కెలేనియా వెళ్లి అక్కడ పాళి భాష నేర్చుకుని, బౌద్ధం అధ్యయనం చేశారు. బౌద్ధ మతం స్వీకరించారు. తన పేరు నాగార్జున్‌ గా మార్చుకున్నారు. శ్రీలంకలో ఉండగానే బ్రిటిష్‌ ప్రభుత్వ నిర్బంధం నుంచి తప్పించుకోవడానికి శ్రీలంక చేరిన కొందరు కమ్యూనిస్టుల సాంగత్యంలో ఆయనకు మార్క్సిజం-లెనినిజంతో పరిచయం అయింది. వారణాసిలో ఉండగానే దుఃఖం అంటే ఏమిటో వైద్యనాథ్‌ కు అనుభవం అయింది. శ్రీ లంక వెళ్లిన తర్వాత బౌద్ధం, మార్క్సిజం మీద ఆసక్తి పెరిగింది. మూడేళ్ల తర్వాత హఠాత్తుగా తన స్వస్థలమైన బిహార్‌ తిరిగి వచ్చారు. సోనేపూర్‌ లో రాజకీయ పాఠశాలకు హాజరయ్యారు. స్వామీ సహజానంద సరస్వతి అండన చేరారు. స్వామీ సహజానంద సరస్వతికి అప్పుడు రాజకీయ పాఠశాల నడపడానికి కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌ వారు సహకరించే వారు. ఆ తర్వాత నాగార్జున్‌ బెట్టియాలో రైతుల ఉద్యమంలో పాల్గొన్నారు.
1939లో నాగార్జున్‌ అంబారీ రైతుల ఉద్యమంలో పాల్గొని 1939 ఫిబ్రవరి 20న అరెస్టయ్యారు. అంతకు ముందే 1937లో హిందీలో కవిత్వం రాయడం ప్రారంభించారు. 1941-52 మధ్య కాలంలో అప్పుడప్పుడు భార్యతో కలిసి ఉండేవారు. బతుకుతెరువు కోసం అనేక చోట్ల తిరిగారు. కొన్నాళ్లు ఉపాద్యాయుడిగా పని చేశారు. ఉన్నట్టుండి నాగార్జున్‌ మళ్లీ సంచారం బయలు దేరితే భార్య అపరాజిత తరౌనీ చేరుకునే వారు. నాలుగు కాసులు సంపాదించడం కోసం నాగార్జున్‌ తన రెండు దీర్ఘ కవితలను చిన్న పుస్తికలుగా అచ్చు వేసి రైల్వే స్టేషన్లలో అమ్మే వారు. మళ్లీ బౌద్ధ మతం మీద దృష్టి మళ్లి రాహుల్‌ సాంకృత్యాయన్‌ తో కలిసి టిబెట్‌ వెళ్లారు. కాని క్రమంగా ఆయనకు బౌద్ధం మీద ఆసక్తి తగ్గుతూ వచ్చింది. అయితే మళ్లీ హిందూ మతం స్వీకరించలేదు. మార్క్సిజం పట్ల నిబద్ధత విడనాడలేదు. తన భార్యను, పిన్నిని తండ్రి బాధలు పెట్టినందుకు నాగార్జునకు చాలా కోపంగా ఉండేది. కాని తనూ ఎన్నడూ ఇల్లు వాకిలి ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించలేదు. బుద్ధి పుట్టినప్పుడల్లా దేశమంతటా తిరిగే వారు. చింపిరి గడ్డం, మురికి బట్టలతో తిరిగే వారు. అందుకే ఆయనను బాబా నాగార్జున్‌ అనే వారు. అదే పేరు స్థిరపడి పోయింది. మహాత్మా గాంధీ హత్య తర్వాత నాగార్జున్‌ రాసిన అనేక కవితలను ప్రభుత్వం నిషేధించింది. ఆ కవితల వల్ల సామాజిక, మతోద్రిక్తతలు పెరుగుతాయని ప్రభుత్వం భావించింది. బాబా నాగార్జున్‌ కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా కూడా ఉన్నారు. కాని 1962లో చైనా మన దేశం మీద యుద్ధానికి దిగడంతో ఆయన భిన్నాభిప్రాయం వ్యక్తం చేయడం మొదలు పెట్టారు. కమ్యూనిస్టు పార్టీతో విభేదాలు తలెత్తాయి. అయినా ఆయనకు మార్క్సిస్టు సిద్ధాంతం మీద మాత్రం కడదాకా విశ్వాసం సడల లేదు.
కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని విరమించడం నాగార్జున్‌ కు మింగుడు పడలేదు. ఆ తర్వాతే ప్రత్యక్ష రాజకీయాల మీద ఆయనకు విశ్వాసం సన్నగిల్లడం మొదలైంది. అయినా కమ్యూనిజం మీద ఆయన నమ్మకం ఏం మాత్రం తగ్గలేదు. తాను స్వతంత్ర కమ్యూనిస్టును అని చెప్పుకునే వారు. అంటే నాగార్జున్‌ కు కమ్యూనిస్టు పార్టీల చట్రంతో అసమ్మతి ఉండొచ్చు కాని మార్క్సిస్టు సిద్ధాంతం మీద ఏ ఫిర్యాదూ లేదు.
1974లో లోక నాయక్‌ జై ప్రకాశ్‌ నారాయణ్‌ ప్రారంభించిన సంపూర్ణ విప్లవం లో నాగార్జున్‌ భాగస్వామి అయ్యారు. జైలు పాలయ్యారు. జైలులో ఉన్నప్పుడు తోటి ఖైదీలతో, ముఖ్యంగా ఆర్‌.ఎస్‌.ఎస్‌., జన సంఘ కార్యకర్తలతో జరిపిన చర్చల వల్ల జై ప్రకాశ్‌ నారాయణ్‌ సంపూర్ణ విప్లవ విధానం మీద విశ్వాసం పోయింది. హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేసిన తర్వాత 1976 మార్చి 26న పట్నా హైకోర్టు నాగార్జున్‌ ను విడుదల చేయాలని ఆదేశించింది. జైలు నుంచి విడుదలైన తర్వాత వేశ్యల, తార్పుడుగాళ్ల నుంచి బయటపడ్డాను అని తీవ్రమైన వ్యాఖ్య చేశారు. 1939-1941 మధ్య కాలంలో రైతుల ఉద్యమాలలో పాల్గొన్నందువల్ల చాలా కాలం జైలులోనే గడపాల్సి వచ్చింది.
బాబా నాగార్జున్‌ వ్యక్తిత్వంలో స్పష్టమైన వైరుధ్యం కనిపిస్తుంది. ప్రవృత్తి రీత్యా ఆయన పాలక వర్గాలకు, ఆధిపత్య ధోరణికి బద్ధ విరోధి. అందుకే రాజ్య సభకు నామినేట్‌ చేస్తామన్నా, మూడు సార్లు బిహార్‌ శాసన మండలి సభ్యత్వం ఇస్తామన్నా తిరస్కరించారు. ఇందిరా గాంధీ నిరంకుశత్వాన్ని నిరసిస్తూ ఆయన ఘాటుగా రాసిన కవితలకు విపరీతమైన జనాదరణ వచ్చింది. కాని ఇందిరా గాంధీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఆ సమయంలో ఆయన అభిమానులు ఈ ద్వైదీభావాన్ని మెచ్చలేదు. కమ్యూనిస్టు పార్టీలో విభేదాలు తలెత్తిన తర్వాత ఆయన కమ్యూనిస్టుల మీద తీవ్రమైన విమర్శలే చేశారు. ఈ ధోరణి ఆయన కవిత్వంలోనూ ప్రతిపలించేది. మళ్లీ నాలిక కరుచుకునే వారు. నక్సల్బరీ ఉద్యమం ప్రారంభం అయిన తర్వాత కమ్యూనిస్టు పార్టీల పార్లమెంటరీ రాజకీయాలను ఈసడిరచిన అనేక మంది మాజీ కమ్యూనిస్టులలాగే నాగార్జున్‌ లో కూడా నూతనోత్సాహం కనిపించింది. నక్షలైట్‌ నాయకుడు నాగభూషణం పట్నాయక్‌ ను కొనియాడుతూ కవిత అల్లారు.
వస్తుతః నాగార్జున్‌ కవి. కాని రతీనాథ్‌ కి చాచి (1948), బల్చన్మ (1952), వరుణ్‌ కే బేటే (1954) వంటి ప్రసిద్ధ నవలలతో పాటు మొత్తం 13 నవలలు రాశారు. అయితే ఆయన నవలలు చాలా వరకు నవలికలే. ప్రాంతీయ ఇతివృత్తంతో నవలలు రాయడం నాగార్జున్‌ ప్రత్యేకత. ప్రాంతీయ ఇతివృత్తాల ఆధారంగా మైలా ఆంచల్‌ వంటి నవల రాసిన ఫణీశ్వర్‌ నాథ్‌ ‘రేణు ‘ కన్నా ముందే ప్రాంతీయ నవలకు బాబా నాగార్జున్‌ ఒరవడి దిద్దారు. రతీ కాంత్‌ కి చాచి నవలలో బెంగాలీ రచయిత శరత్‌ చంద్ర చటర్జీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. బాబా నాగార్జున్‌ సాహిత్యాన్ని బిహార్‌ నుంచి విడదీయడం కష్టం. ఆయన ఏం రాసినా బిహారే కేంద్ర బిందువుగా ఉంటుంది. అక్కడి భౌగోళిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలను ఆయన రచనలు పట్టి చూపిస్తాయి. ఆయన వాడే హిందీ కూడా బిహార్‌ ప్రాంతీయతను గుబాళిస్తూ ఉంటంది. వ్యక్తుల మీద ఆయనకు నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉండేవి. మాధురి దీక్షిత్‌ ను ఆకాశానికి ఎత్తిన ప్రసిద్ధ చిత్రకారుడు ఎం.ఎఫ్‌.హుసేన్‌ ధోరణిని, ఆకాశమే హద్దుగా మాట్లాడే లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ను నాగార్జున్‌ తీవ్రంగా విమర్శించే వారు.
ఛద్మ వేషాలంటే నాగార్జున్‌ కు నచ్చదు. ఆ విషయాన్ని అరమరికలు లేకుండా ‘‘జమీందారులున్నారు, సాహుకార్లున్నారు, వైశ్యులున్నారు, వ్యాపారులున్నారు. వీరంతా అంతరాంతరాల్లో కసాయిలు, పైకి మాత్రం ఖద్దర్‌ ధారులు ’’ అనగలిగినంత సాహసికుడు నాగార్జున్‌. ఆయన సాహిత్యం నిండా శ్రామికుల, దళితుల, ఇతర పీడిత వర్గాల కష్టాలు, దుఃఖం కనిపిస్తాయి. పెట్టుబడిదారీ విధానం, సామ్రాజ్యవాదం, మతతత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించే వారు.
‘‘ఇప్పటికైనా దళిత బిడ్డలంతా తిరగబడతారని
నిప్పు కణికల్లా రాజుకుంటారని
విప్లవాన్ని వెన్నుకెత్తుకుంటారని
మనసెందుకో మారు పలుకుతుంది.’’ అనగలగాలంటే జీవితం ఎంత అడ్డదిడ్డంగా సాగినా జీవితానుభవం అపారంగా ఉన్న బాబా నాగార్జున్‌ వంటి వారికి మాత్రమే సాధ్యం.
(జూన్‌ 30 బాబా నాగార్జున్‌ జయంతి సందర్భంగా)

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img