అనునిత్యం మనిషిని సమ్మోహనపరుస్తూనే ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నఅతిపెద్ద సమస్య అయిపోయింది ప్రపంచీకరణ. జనజీవితమంతా మెల్లమెల్లగా దాని వ్యామోహపు కోరల్లో చిక్కుకొని దాని ఉక్కు పిడికిలిలో బిగుసుకుపోతూవుంది. ఆది చాప కింద నీరులా ప్రపంచ మంతా ఆక్రమించుకుంటూ వుంటే మనిషి దానికి దాసోహమైపోయి తన అస్తిత్వాన్నే కోల్పోతున్నాడు. ప్రపంచీ కరణ ఆవాహనతో మన సంపదే మనకు దూరమైపోతూ వుంది. మన హృదయాల్ని స్పృశించే అనుబంధాలు ఆర్థిక బంధాలుగా మారిపోతున్నాయి. ప్రపంచీకరణ ధాటికి కవిత్వమూ నిరసన వెల్లువవుతోంది. అగ్రరాజ్యాల సామ్రాజ్యవాద దాహానికి చిన్నదేశాలు దాసోహమయ్యే వైనాన్ని అది తూర్పూరబడుతోంది. ప్రపంచీకరణ నీడలో మనుగడ సాగిస్తున్న మనిషి జీవితం విలువలు కోల్పోవడాన్ని అది ఎత్తిచూపుతోంది. గ్లోబలైజేషన్ ఉక్కుపాదాల కింద నలిగిపోతున్న జనజీవితాల విషాదాన్నీ, పైకి కనిపించే పూల దరహాసం వంటి మోజులో పడి పతనమైపోతున్న సంస్కృతిని చూసి కవిత్వం కన్నీళ్ళ పర్యంతమై పోతోంది. రోజురోజుకూ సహజ సౌందర్యాలను కోల్పోతూ కృత్రిమత్వాన్ని నింపుకుంటున్న మన పల్లెల దీనస్థితిని అది దృశ్యమానం చేస్తూ ప్రపంచీకరణ పట్ల వుండవలసిన అప్రమత్తతను ప్రమాద హెచ్చరికలా గుర్తుచేస్తూ వుంది. ‘భారతదేశం అట్లాంటిక్ మహాసముద్రం మీదికి ఒరిగి పోతోంది’ అంటూ మూడు వాక్యాల్లో సామ్రాజ్యవాదపు వికటాట్టహాసాన్ని ధ్వనింపజేశాడు కవివరేణ్యుడు అద్దేపల్లి రామమోహనరావు. సామ్రాజ్యవాద దాహానికి అట్లాంటిక్ మహాసముద్రం ప్రతీక అయింది. మనిషికి ముంచుకొచ్చే ప్రమాదానికి సముద్రం సంకేతమైంది.
‘ఇలా వుంటుందనుకోలేదు/ఉరితాడు
ఇంత అందంగా వుంటుందనుకోలేదు
ఒకర్నుంచి ఒకరిని వేరుచేసి
ఇంటినిండా శ్మశానం చేస్తుందనుకోలేదు
అందరం ఒకే ఇంటిలో వుంటాం
ప్రక్కప్రక్కనే కూర్చోనున్నా
ఒకరితో ఒకరం మాట్లాడుకోలేం
ఇల్లంతా పరచుకున్న రంగుల్లో
ఊపిరాడక మునకవేస్తుంటాం’
(‘ఉరితాడు’ ఖండిక నుంచి)
అంటూ ఉరితాడై మానవజీవితాన్ని కబళిస్తూ మనిషి అనుభూతుల్నీ, అనుబంధాల్ని పూర్తిగా తన వశం చేసుకుంటున్న ప్రపంచీకరణ పదఘట్టనల ఉధృతాన్ని వర్ణిస్తాడు వర్తమాన కవి ఆశారాజు. ప్రపంచీకరణ విసిరిన అందమైన సాంకేతికత వలలో చిక్కుకుని విలవిలలాడు తోంది మానవ జీవితం. మన శరీరాలు మాత్రం పక్కపక్కనే వున్నా ఆప్యాయంగా మాట్లాడుకోలేని మన మనసులు మాత్రం ఆ సాంకేతికతకు కనెక్టు అయిపోయి వుంటుంది. మన ఆప్యాయతల్నీ, అనుబంధాల్నీ రంగరంగుల చానళ్ల రూపంలో, ఎన్నో హంగుల సోషల్ మీడియా యాప్‌ల రూపంలో హరించివేయడానికి మనమధ్యే పొంచివుంటుంది ప్రపంచీకరణ. అవును…దానికి ఉరితాడును మించిన ప్రతీక ఏముంటుంది!? అది మనిషి నిండా కృత్రిమత్వాన్ని, యాంత్రికతనూ నింపేస్తూ అతనిలోని అసలైన స్పృహను మాయం చేసేస్తూవుంది. ఆ యాంత్రికతలోనే మనిషి కొట్టుమిట్టాడుతూ మనిషితనాన్నే కోల్పోతూ వుంటాడు. అందుకే మనచుట్టూ అన్నీ వున్నా, మనచుట్టూ అందరూ వున్నా ఎవరూ లేనితనంతో మనం తెచ్చిపెట్టుకున్న శ్మశాన వైరాగ్యాన్ని అనుభవిస్తుంటాం. మనల్ని ఆవహించేసిన టెక్నాలజీలో ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైపోతోంది.
‘చురుకుదారాలను ఒంటికి చుట్టుకొని
పెరటిబావి దగ్గర జలకాలాడిన
జ్ఞాపకాల ఊట ఒకటుండేది
జీవన వ్యాసార్థాలకు అటూ ఇటూ
గంటలమోతలేని రెక్కల విహారం
పక్షుల్ని కర్ణభేరీలకు తగిలించుకొని
లోపలి లోకాన్ని మేల్కొలిపే ప్రభాతగానం
కావిట్లో తెచ్చిన చెరువు చేవ్రాలును
వసారాలో మట్టికుండతో అనుసంధానించే విన్యాసం
ఒకటుండేది ఒకటుండేది ఒకటుండేది’
(‘చాలా ఒకట్లుండేవి’ ఖండిక నుంచి)
ఎన్నెన్నో అందాల్ని వొలికించిన, ఎన్నెన్నో మధురానుబూతుల్ని అందించిన జ్ఞాపకాలు ప్రపంచీకరణ ఉచ్చులో చిక్కుకొని క్రమంగా మాయమైపోతూ పురాజ్ఞాపకాలుగా మిగిలిపోవడాన్ని గుర్తుచేసుకుంటాడు వర్తమాన కవి ఎమ్వీ రామిరెడ్డి. పెరటిబావి, మనసులో రాగాల్ని పలికించే పక్షుల ప్రభాతగానం, మట్టికుండ ద్వారా మన వొంటినిండా ఆరోగ్యాన్నందించే చెరువు చేవ్రాలు… ఇప్పుడు ఈ పల్లె సౌందర్యాలన్నీ పురాజ్ఞాపకాలై పోతున్నాయి. ఆ జ్ఞాపకాల కోసం మనిషి పదేపదే పలవరించే క్షణాలు దాపురించే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఆ పల్లెలోని పచ్చని పొలాలు కాలుష్యాన్ని వొంటినిండా నింపుకొనే ఫ్యాక్టరీలుగా మారిపోతున్నాయి. ప్రపంచీకరణ ఒక అదృశ్యశక్తిలా మనిషి నుంచి అందమైన జీవితాన్ని వేరుచేసేస్తూ వుంది. అతడి పలుకుకూ, కులుకుకూ, ఆఖరికి అతడి పూర్తి బతుకుకూ కృత్రిమత్వపు నాజూకుతనాన్ని తొడిగేస్తూవుంది. అతడిలోని అసలైన మనిషితనాన్ని కడిగేస్తూవుంది. ఆ దృశ్యాల్ని చూసి కవిత్వం కొండంత ఆవేదనను వెళ్లగక్కుతూ పూలకీ, ప్లాస్టిక్ పూలకీ గల తేడాను విడమరచిచెబుతోంది. అది మనిషి మనుగడను ప్రశ్నిస్తూ ఒక బృహత్తర బాధ్యతతో చైతన్యవాహికై అనేక హెచ్చరికలు చేస్తూనేవుంది.
-డాక్టర్ కొత్వాలు అమరేంద్ర,
సెల్: 9177732414