Wednesday, February 8, 2023
Wednesday, February 8, 2023

బహుముఖాలుగా అల్లుకున్న నవల ‘యుగాంతరం’

హెచ్‌.జీ. వెల్స్‌ రాసిన ‘‘టైమ్‌ మెషీన్‌’’ గానీ, ఆల్విన్‌ టోఫ్లర్‌ రాసిన ‘‘ఫ్యూచర్‌ షాక్‌’’ గానీ, ఐసాక్‌ అసిమోవ్‌ రాసిన అనేక సైన్స్‌ ఫిక్షన్‌ గ్రంథాలు గానీ భవిష్యత్తులో మానవజీవితం ఎలావుండబోతుందీ అనే కోణంలోనే ఉంటాయి, కొన్ని భీతి గొల్పేవిగా, కొన్ని నమ్మశక్యం గానట్టుగా కొన్ని అసాధ్యాలుగా, కొన్ని సుసాధ్యాలుగా వుంటాయ్‌. మర్ల ఒక నూతన సమ సమాజాన్ని ఆవిష్కరించారు ఇందులో!
మర్ల విజయకుమార్‌ ‘‘యుగాంతరం’’ పేరుతో ఒక సైంటిఫిక్‌ నవలని తెలుగువారికి అందించేందుకు ప్రయత్నించారు. వీరి ప్రయత్నంయెందుకు అభినందించదగ్గదంటే మనిషి చారిత్రిక గమనాన్ని ఒక మార్క్సిస్టుగా చూడగల వీరు టైమ్‌మెషీన్‌లో 25వ శతాబ్దంలోకి వెళ్లి, ఎందరి దృష్టిలోనో ఇంకా ఒక స్వప్నంలా భావించే వర్గరహిత, దోపిడీరహిత సమాజాన్ని దర్శించారు. శేఖర్‌ లో పరకాయ ప్రవేశంచేసి, ‘జో’ తో సహవాసం చేస్తూ నిజంగానే నిఖిలలోకం నిండు హర్షం వహించే నూతన ప్రపంచంలోకి మనని తీసుకెళతారు. ఆ స్వప్నం రుజువులు చూపుతూ, ఆకలి కేకలే విననవసరంలేని, ఒకరికొకరు వంచించుకుంటూ, హెచ్చించుకుంటూ, ఒకరెక్కడో పాతాళాన, ఇంకొకరు ఎక్కడో ఆకాశాన అసమానతలే ప్రతీకలుగా వున్న సమస్త అవలక్షణాలుండే సమాజం నుంచి ఇరవై తలాల నీలిరంగు ఇకోసా హెడ్రాన్‌ ప్రిజమ్‌ సాయంతో స్థల కాలాల సమాహారమైన ఈ నాలుగు డైమెన్షన్ల విశ్వం నుంచి ఎకాఎకి అనంత కాల ప్రవాహంలో పదిన్నర కోట్ల సంవత్సరాలు వెనక్కి కొట్టుకెళ్లి, మళ్లీ రaామ్మంటూ 2424 సంవత్సరం లోకి వెళ్ళిపోయి, తమతో పాటూ మననీ తిప్పుతారు.
అక్కడ జాతులున్నా, జాత్యహంకారం లేదు! దేశాల వునికి వున్నా సరిహద్దుల కొట్లాటలు లేవు! గోడలున్నట్టు వున్నా అంతరాలులేవు! విశ్వమే ఒక దేశం! అగ్రదేశం లేదు, శిఖరాగ్రం సమావేశం లేదు, జంతు హింస లేదు, ఆవుల్నే కాదు అన్ని జీవుల్నీ బతకనిచ్చే ప్రపంచమది. సరిహద్దుల గీతలు చెరిపేసి, పెట్టుబడిదారీ సంక్షోభంలో, పర్యావరణ వికృతితో 400 కోట్ల మంది బలయ్యాక ఏర్పడ్డ సమాజ మిది. సమస్త జీవులకూ బతికే హక్కు నిచ్చిన నూతన సమాజమది. కాలుష్యం లేని పరిశ్రమలు, ఎంత మేరకు ఉత్పత్తి చేయాలో తెలిసిన పరిశ్రమలు, వృధా కాని వస్తూత్పత్తి, జైళ్లు లేని, పోలీసులకు పనిలేని, న్యాయస్థానాల అవసరంలేని, స్త్రీ పురుష సంబంధాల మధ్య వివక్షత లేని, ప్రభుత్వ బాధ్యతలు లేని, జీతాల్లేని, కరెన్సీలేని, వ్యాధులులేని, బాధలులేని సమాజంలోకి మరలిస్తారు మర్ల. ‘‘అట్లాస్‌ ష్రగ్డ్‌’’ లో అయాన్‌ రాండ్‌ సృష్టించిన ూపjవష్‌ఱఙఱంఎ బేస్డ్‌ సమాజం కాదిది! శ్రమ దోపిడీ లేని సమసమాజమది!
తిరుగు టపాలో శ్రీ అగ్నిహోత్రుల శేఖర్‌ గారు ఋగ్వేద ఆర్యుల్లో తమ మూలాల్ని వెతుక్కునేప్రయత్నం చేశారేమో అనిపిస్తుంది. మనని ఆర్య పురాల్లో, అశ్వ శాలల్లో, అగ్నిహోత్రాల్లో, యజ్ఞగుండాల్లో, కొంచెం రొమాంటిక్‌గా భలేగా మరలిస్తారు మర్ల!
ఐనిస్టియన్‌ ఈ ఇజీకొల్టు ఎంసీ స్క్వేర్‌ నుంచి మాక్స్‌ ప్లాంక్‌ క్వాన్టమ్‌ థీరీ వరకూ, జీరో పాయింట్‌ ఎనర్జీ, ఇంకా, లీజా రాండల్‌ స్ట్రింగ్‌ థీరీ నుండి హాల్డెన్‌ జీవుల పరిణామం, ఎంగెల్స్‌ చెప్పిన పరిణామ గతిలో శ్రమపాత్ర లాంటి విషయాల్నీ, ఎన్నో భౌతికశాస్త్ర విషయాల్నీ సామాజిక, మానవ పరిణామ చారిత్రక గతినీ వీవర్‌ బర్డ్‌ లా గుదిగూర్చి ఈ నవలికలో అల్లేశారు అద్భుతంగా. ఒక భౌతికశాస్త్ర విషయ నిపుణుడిగా, ఆర్య,ద్రావిడ నాగరికతల అధ్యయన కారుడిగా, మానవ పరిణామాన్ని మార్క్సిస్టు కోణంలో అర్ధం చేసుకున్నవాడిగా, చరిత్ర పట్ల అనురక్తి ఉన్నవాడిగా, సమసమాజాన్ని ప్రేమించేవాడిలా మర్ల బహుముఖాలుగా అల్లుకున్న నవల ‘‘యుగాంతరం.’’ నేనీ నవలను ఏకబిగిని చదివేశాను. అది నా గొప్పకాదు. అలా చదివించేలా చేసిన మర్ల గారిదే ఈ ఘనత! ఎ. గాంధీ గారి సహకారంతో ఈ పుస్తకం వెలుగుచూడటం ముదావహం. ఇది మిమ్మల్ని తప్పక చదివిస్తుంది.
పరిచయం: వి.విజయకుమార్‌, 8555802596.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img