Monday, September 26, 2022
Monday, September 26, 2022

బ్రిటిష్‌ ప్రభుత్వం భారతదేశంలో నిషేధించిన పుస్తకాలు

వాసిరెడ్డి నవీన్‌
సెల్‌: 9849310560

ఈ భూమి మీద విలువైన వస్తువు ఏది?’
‘కొడుకును ఉరి తీస్తే తండ్రి కార్చిన కన్నీరు కాదు. భర్త చనిపోతే అతని చితిమీద ‘సతి’ అయిన ఆ ఇల్లాలి చితాభస్మం కూడా అంత విలువైనది కాదు. దేశవిముక్తి కోసం ఒక వీరుడు చిందించిన చివరి రక్తపుబొట్టు విలువైనది.’ ఈ మాటలు స్వాతంత్య్రోద్యమ జ్వాలకు ఆజ్యం పొయ్యవా మరి! అందుకే అది నిషేధానికి గురయింది. 1907లో ధనత్‌ రాయ్‌ లేదా నవాబ్‌ రాయ్‌ అనే మున్షీ ప్రేమ్‌చంద్‌ రాసిన తొలి కథ దునియాకే సబ్‌ సై అన్‌మోల్‌ రతన్‌ లో సంభాషణ ఇది. దీనితోపాటు అచ్చయిన మరో అయిదు కథల సంకలనం సోజే వతన్‌ ను 1909లో బ్రిటిష్‌ ప్రభుత్వం నిషేధించింది. అప్పటికే అమ్ముడుపోగా మిగిలిన అయిదువందల కాపీలను తగలబెట్టింది. ఇలా ఈ నిషేధాల పరంపర 1881లో బెంగాలీ నాటకం నీల్‌ దర్పణ్‌తో మొదలయింది.
బ్రిటిష్‌ ప్రభుత్వ పుస్తకాల పై విధించిన నిషేధాలను మూడు రకాలుగా విభజించవచ్చు. మొదటిది: బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వతంత్రేచ్ఛను ప్రకటించిన రచనలను నిషేధించడం. ఈ రకమైన నిషేధాలు 1909లో స్వరాజ్య తెలుగుపత్రిక సంపాదకీయాన్ని నిషేధించడంతో మొదలైంది. అది రాసినందుకు గాడిచర్ల హరిసర్వోత్తమ రావుకు మూడు సంవత్సరాల జైలు శిక్ష పడిరది. ఆ తర్వాత ఆ నిషేధాలు నాటికలు, పాటల వైపుకు వెళ్లాయి. చిన్న చిన్న నాటికలు, హరికథలు వంటి రూపాల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తున్న దామరాజు పుండరీకాక్షుడు నాటకాలపై నిషేధాల పరంపర కొనసాగింది. 1919లో జలియన్‌ వాలాబాగ్‌ దురంతాన్ని పంజాబ్‌ దురంతము అనే నాటకంగా రాసి, ప్రదర్శించారు. దాన్ని 1920 లో నిషేధించిన వెంటనే పేరు మార్చి పాంచాల పరాభవంగా ప్రదర్శిస్తే, అదీ నిషేధానికి గురయింది. ఇలా వీరివే గాంధీ మహోదయం, క్విట్‌ ఇండియా, దండి సత్యాగ్రహం, గాంధీ విజయ ధ్వజం వంటి రచనలు 1925 వరకు నిషేధానికి గురవుతూనే ఉన్నాయి. 1921లో స్వరాజ్య సాహసం అనే అముద్రిత నాటకాన్ని, కొడాలి ఆంజనేయులు రాసిన తిలక్‌ మహారాజ నాటకాన్ని, కలియుగ ప్రహ్లాద అనే హరికథను కూడ నిషేధించారు. దేశ చరిత్రలో ఒక పాట రాసినందుకు, దాన్ని పాడినందుకు తొలిసారిగా జైలుకెళ్లిన వ్యక్తి గరిమెళ్ల సత్యనారాయణ. 160 చరణాల మాకొద్దీ తెల్లదొరతనము… అనే ఈ అతి పెద్ద పాటను టంగుటూరి ప్రకాశం ఇంగ్లీషులోకి అనువదించి, తన స్వరాజ్య పత్రికలో ప్రచురించారు. దీన్ని అన్ని భాషల్లోకి అనువదించాలని గాంధీజీ సూచించారు. గరిమెళ్ల రాసిన స్వరాజ్య గీతాల పుస్తకం 1922లో నిషేధానికి గురయింది. పేరు లేకుండా ప్రచురించిన దీపాల పిచ్చయ్యశాస్త్రి స్వప్న ప్రయాణం పద్య గ్రంథాన్ని 1922లో నిషేధించగా, ఆ నిషేధపు ఉత్తర్వులో, పుస్తకాన్ని ప్రచురించిన నెల్లూరు వెంకట రామానాయుడుని రచయితగా పేర్కొన్నారు.
ఉన్నవ లక్ష్మీనారాయణ జైలులో ఉన్నప్పుడు రాసి బయటకు స్మగుల్‌ చేసి ప్రచురించిన మాలపల్లి నవలను 1923లో నిషేధించారు. తెలుగు సాహితీ రంగంలో ఇదొక సంచలనం. ఈనాటికీ ఈ నవల అనేక ముద్రణలు పొందుతూనే ఉంది. తెలంగాణ ప్రాంతంలో నిజాం ప్రభుత్వమే ఉన్నప్పటికీ నిషేధాల విషయంలో అది బ్రిటీష్‌ కనుసన్నల్లోనే మెలిగింది. హైదరాబాదులో కె.సి. గుప్తా స్థాపించిన ‘అణా గ్రంథమాల’ ప్రచురించిన సావర్కర్‌ జీవితచరిత్ర, వెల్దుర్తి మాణిక్యరావు రచించిన రైతు, ఎం.ఎన్‌.రాయ్‌ గ్రంథాలు 1940లో నిషేధానికి గురయ్యాయి. 30 పేజీల రైతు పుస్తకం వల్ల రైతుల్లో అశాంతి, తిరుగుబాటు వస్తుందని నిజాం ప్రభుత్వం భావించడం ఆశ్చర్యము, హాస్యాస్పదము. నిజాం నవాబు సంతకంతో ఈ నిషేధపు ఫర్మానా జారీ చేయటం మరీ విశేషం. మొత్తంగా సహాయ నిరాకరణోద్యమ కాలంలో ఈ నిషేధాల పరంపర ప్రధానంగా సాగింది.
రెండవది: కమ్యునిస్టు భావజాలంతో ప్రచురించిన పుస్తకాలను నిషేధించడం. గాంధీజీ నాయకత్వంలో సహాయ నిరాకరణో ద్యమం ముమ్మరంగా సాగుతున్న కాలంలోనే దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎస్‌.ఎ.డాంగే, సింగారవేలుశెట్టి, ముజఫర్‌ అహ్మద్‌ వంటి వారి నాయకత్వంలో ఉన్న చిన్న చిన్న గ్రూపులను కలుపుకొని 1925 నాటికి కమ్యునిస్టు పార్టీగా అవతరించింది. ఈ ప్రభావం తెలుగు నేల పై బలంగానే పడిరది.
ప్రముఖ కాంగ్రెస్‌ వాది ఉన్నవ లక్ష్మీనారాయణ రాసిన మాలపల్లి నవలలో సైతం రష్యా విప్లవ ప్రస్తావన ప్రముఖంగానే ఉంది. 1932లో జైలుశిక్ష అనుభవిస్తున్న కాంగ్రెసు వాది క్రొవ్విడి లింగరాజు గోర్కీ అమ్మ నవలను చదివి ఉత్తేజితుడై తెలుగులోకి అనువదించారు. దాన్ని 1934లో ఆదర్శగ్రంథమండలి ప్రచురించగా 1935 లో బ్రిటిష్‌ ప్రభుత్వం నిషేధించింది. అది మొదలు 1947 వరకు, ఆ మాటకొస్తే ఆ తర్వాత కూడా ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఈ నిషేధాల పరంపర కొనసాగింది. ముంగండ గోదావరి జిల్లాలో ఒక చిన్న గ్రామం. ప్రముఖ తెలుగు రచయిత మహీధర రామమోహనరావు సోదరులు స్థాపించిన విశ్వ సాహిత్యమాల ఈ ఊళ్లో ప్రారంభమై దాదాపు 85 పుస్తకాలు ప్రచురించగా అందులో కనీసం అరడజను గ్రంథాలు నిషేధానికి గురయ్యాయి. వాటిల్లో కార్ల్‌మార్క్స్‌ ఉపదేశాలు, రష్యా విప్లవం, కూలీ, పెట్టుబడి, సోషలిజం వంటి అనువాద గ్రంథాలు 1937-1942 మధ్యకాలంలో నిషేధింపబడ్డాయి. అయినా ఈ పుస్తకాలు వివిధ రవాణా రూపాల్లో ఆంధ్ర రాష్ట్రమంతా విరివిగా పంపిణీ అయ్యాయి. అనువాదకులు మహీధర కృష్ణమోహనరావు ఏడాదిపాటు జైలుశిక్ష అనుభవించారు. ఆదర్శ గ్రంథమండలి స్థాపించి అమ్మ నవలను ప్రచురించిన గద్దె లింగయ్యగారు కమ్యూనిస్టు ప్రణాళిక, లెనిన్‌ రాసిన సామ్రాజ్యవాదం పుస్తకాలను ప్రచురించగా, అవీ నిషేధింపబడ్డాయి.
1946 జులై 4 న నిజాంకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో ప్రారంభమైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భారతదేశ కమ్యూనిస్టు భారతదేశ చరిత్రలోనే ఒక ముఖ్యమైన పోరాటం. ఇది అప్పటి హైదరాబాద్‌ స్టేట్‌లో 1948 లో నిజాం లొంగిపోయిన అనంతరం కూడా కొనసాగింది. ఈ కాలంలో సుంకర, వాసిరెడ్డి రాసిన ముందడుగు నాటకం 1946 లో నిషేధిస్తే, లక్ష్మీకాంతమోహన్‌ రాసిన సింహగర్జన నవల 1947 లో నిషేధించారు. బుర్రకథ అనే కళారూపం కూడా ఈ కాలంలోనే నిజాం ప్రభుత్వం తెలంగాణలోను, బ్రిటిష్‌ ప్రభుత్వం ఆంధ్ర ప్రాంతంలోను నిషేధించాయి. పాయం అనే ఉర్దూ పత్రికను 1946 లో ఆరునెలల పాటు నిషేధిస్తే, నిర్బంధాలు తట్టుకోలేక మీజాన్‌ పత్రిక మూతపడిరది. ఇలా ఈ కాలంలో నిషేధాలన్నీ ప్రధానంగా కమ్యూనిస్టు రచనల పైనే ఎక్కు పెట్టాయి. మూడవది: మోరల్‌ గ్రౌండ్‌లో నిషేధం. 1858 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం తరువాత బ్రిటిష్‌ ప్రభుత్వం భారతదేశపు మత విషయాలలోను, సాంఘిక ఆచార వ్యవహారాలలోను, నైతిక వ్యవహారాలలోను జోక్యం చేసుకోకూడదని నిర్ణయం తీసుకుంది. ఈ కోణం నుంచి చర్చించ వలసింది ముద్దుపళని రాసిన రాధికా స్వాంతనం కావ్యం గురించి. ముద్దుపళని తంజావూరు ఆస్థానంలో దేవదాసి. ఈ కావ్యాన్ని 1757-1763 మధ్యకాలంలో రాసింది. ఇది ఇళాదేవి, రాధాకృష్ణుల మధ్య నడిచిన శృంగార ప్రధాన కావ్యం. ప్రముఖ సంగీత విద్వాంసురాలు బెంగుళూరు నాగరత్నమ్మ 1910 లో దీనిని సేకరించి, ప్రచురించింది. దీనిలో శృంగారపరమైన అభ్యంతరాలు ఉన్నాయని, ప్రజల నైతిక మనోభావాలు దెబ్బతింటాయని భావించి 1911 లో బ్రిటిష్‌ ప్రభుత్వం నిషేధించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఎంతో ఆధునికవాది, సంస్కరణవాది అయిన కందుకూరి వీరేశలింగం ఈ పుస్తకాన్ని నిషేధించమని కోరటం. వీరేశలింగం చర్యను బెంగుళూరు నాగరత్నమ్మ తీవ్రంగా నిరసించింది. 1947 లో టంగుటూరి ప్రకాశం ముఖ్యమంత్రి అయ్యాక ఈ నిషేధాన్ని ఎత్తేశారు. ఇలాంటిదే మరొక గ్రంథం కడప జిల్లాకు చెందిన చెనికల చెన్నారెడ్డి రాసిన శాంత సారంగధర నాటకం. ఇందులో మితిమీరిన శృంగార, బూతు సన్నివేశాలు ఉన్నాయని దీనిని నిషేధించారు.
ఈ నిషేధాల వివరాలు సమగ్రంగా అంత తేలికగా లభ్యం కావటం లేదు. ఇప్పటికీ గెరాల్డ్‌ బారియర్‌ రాసిన బ్యాణ్‌ అనే పుస్తకమే ప్రామాణికంగా ఉంది. ఇందులో సైతం తెలుగుభాషా పుస్తకాలకు సంబంధించిన నిషేధ వివరాలు అతి కొద్దిగా మాత్రమే ఉన్నాయి. సాహిత్యం మీద ఇప్పటికీ నిషేధం కొనసాగుతూనే ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img