Monday, January 30, 2023
Monday, January 30, 2023

భాషా తపస్వి గిడుగు

ప్రొఫెసర్‌ వెలమల సిమ్మన్న, సెల్‌: 944064 1617

‘‘మనకు తెలిసినంతవరకు భారతీయుల్లో కానీ, యూరోపియనుల్లో కానీ, తెలుగుభాషను వైజ్ఞానిక నేపథ్యంతో పరిశోధించాడని చెప్పగల ఒక్క పండితుడూ లేడు. అలా చెప్పగలినవాడు గిడుగు రామమూర్తి పంతులు గారొక్కడే, శాస్త్రీయ పద్ధతుల్లో భాషా విశ్లేషణ చెయ్యడానికి బహుకాలంగా శ్రమించిన పండితుడు ఆయన తప్ప మరొకడు లేడు’’ – గురజాడ
1863 ఆగస్టు 29వ తేదిన ‘‘పర్వతాల పేట’’ అనే గ్రామంలో రామమూర్తి గారు జన్మించారు. ప్రభుత్వం ప్రతీ సంవత్సరం గిడుగు జయంతి సందర్భంగా ‘‘భాషా దినోత్సవం జరుపుకుంటుంది. తెలుగు భాషా స్ఫూర్తి గిడుగు. వెంకమ్మ, వీర్రాజులు వీరి తల్లి దండ్రులు. ‘‘నేను సంపాదించిన విద్యకు మూల ద్రవ్యమనదగిన భాషాజ్ఞానము, భాషాభిమానం నాకు కలుగజేసినారు బొంతలకోడూరు శిష్టకరణాలు భైరాగి పట్నాయకులు గారు’ అని వున్నది వున్నట్లు నిజాయితీగా గిడుగు చెప్పుకున్నారు.
విజయనగరం మహారాజా వారి కళాశాలలో గిడుగు ‘లాయర్‌ కోర్సు’లో చేరారు. అప్పుడే గురజాడతో పరిచయం ఏర్పడిరది. ఆ పరిచయమే జీవితాంతం మంచి స్నేహితులుగా ఇద్దరూ కలిసి మెలిగారు. 1879-1880లో గిడుగు, గురజాడ ఇద్దరూ మెట్రిక్యూలేషలో ఉత్తీర్ణులయ్యారు. కుటుంబ పరిస్థితుల కారణంగా గిడుగు ఉద్యోగంలో చేరారు. గురజాడ పై చదువులకు వెళ్ళారు.
1879లో భీమునిపట్టణానికి చెందిన కందికొండ రామదాసు గారి రెండో అమ్మాయి. అన్నపూర్ణగారితో గిడుగుకి పెళ్ళి జరిగింది. అప్పటికి గిడుగు వయస్సు 16 సంవత్సరాలు. 1885 జనవరి 28వ తేదిన సీతాపతి పుట్టారు. తర్వాత వరుసగా వీరరాజు, రామదాసు, సత్యనారాయణ ముగ్గురు కొడుకులు పుట్టారు. మొత్తం నలుగురు. విశాఖపట్నం కలెక్టర్‌ ఆఫీసులో 15/- రూపాయల జీతానికి గిడుగు తాత్కాలిక గుమస్తాగా ఉద్యోగంలో చేరారు. చివరకు 1880లో పర్లాకిమిడిలోని మిడిల్‌ స్కూలులో ఉపాధ్యాయుడుగా ఉద్యోగంలో చేరారు గిడుగు. తాను పనిచేస్తున్న మిడిల్‌ స్కూల్‌ని, హైస్కూలుగా చేయడానికి పర్లాకిమిడి రాజా నిర్ణయించారు. హైస్కూల్‌, కాలేజి కాబోతుందని రాజావారు ప్రకటించారు. కాలేజిల్లో లెక్చరర్‌ కాచ్చునని 1886లో బి.ఏ. ప్యాసయ్యారు గిడుగు.
1889లో సవరజాతి వారితో గిడుగుకి పరిచయం ఏర్పడిరది. పర్లాకిమిడి చుట్టూ ‘మాళువా’ పర్వత శ్రేణుల్లో నివసించే వారు సవరులు. ఆ ప్రజలతో, గిడుగుకి మంచి సాన్నిహిత్యం ఏర్పడిరది. వాళ్ళ అమాయకత్వానికీ, వెనుకబడిన తనానికీ, అనాగరికత్వానికీ, అవిద్యకీ, గిడుగు ఆవేదన చెందారు. ఇలాంటి దీన దయనీయ్యమైన పరిస్థితిని చూసి బాధపడ్డారు గిడుగు. సవరుల చరిత్ర, సంస్కృతి, భాష, మీద గిడుగుకి అమితమైన ఆసక్తి కలిగింది. అందువల్ల సవరల భాషపై ప్రత్యేకంగా విశేషమైన కృషి చేశారు. అంతర్జాతీయ భాషా శాస్త్రవేత్తగా ఎదిగారు. ప్రముఖుల ప్రశంసల్ని అందుకున్నారు. సవర భాషాపితామహుడు అయ్యాడు.
1893 జనవరి 15వ తేదిన గిడుగు శ్రీముఖ లింగ క్షేత్రానికి వెళ్ళారు. పర్లాకిమిడికి ఇరవై మైళ్ళ దూరం శ్రీముఖ లింగేశ్వర దేవాలయం. ఆ దేవాలయం రాతి గోడల పైన వున్న 740-1040 కాలం నాటి ప్రాచీన లిపిని పరిశీలించారు. శ్రీముఖలింగంలోని అనేక అంశాల్ని సేకరించి, పరిశీలించిన విషయాలతో ఒక పెద్ద వ్యాసం రాసి గిడుగు ప్రచురించారు కూడా. ప్రముఖుల ప్రశంసల్ని అందుకున్నారు.
1910లో విశాఖపట్నం ఉపాధ్యాయ సదస్సులో గిడుగు భాష గూర్చి బ్రహ్మండంగా ఉపన్యాసం ఇచ్చారు. ప్రముఖుల ప్రశంసల్ని అందుకున్నారు. 1910 తర్వాత గిడుగు పూర్తిగా పరిశోధనలో నిమగ్నమయ్యారు. తండ్రి కొడుకులు ఇద్దరూ చేసిన కృషి తెలుగు జాతి ఎప్పటికీ మరవరానిది.
1911లో సవర భాషపై అనితర సాధ్య మైన, విశేషమైన కృషి చేసి నందుకు గిడుగుకు ప్రభుత్వం ‘‘మెరిట్‌ సర్టిఫికేట్‌’’ బహుకరించింది. దైవభక్తి గలవారు గిడుగు. తప్పనిసరిగా పుట్టిన రోజున గుడికి వెళ్ళి పూజలు చేసేవారు. సంప్రదాయాల్ని గిడుగు పాటించారు. మూఢ విశ్వాసాల్ని నమ్మేవారు కాదు.
1912 నుంచి తెలుగు బోధనా భాష గూర్చి, రచనా భాష గూర్చి, అనేక ఉపన్యాసాలు ఇచ్చారు. విశ్వ విద్యాలయాల్లో విలువైన ఉపన్యాసాలు ఇచ్చి, ప్రముఖులచేత అభినందనలు అందుకున్నారు. ఆనాడు గిడుగుకు అనుచరులుగా మహా పండితులు, మేధావులు వుండేవారు. 1912లో ‘‘గ్రామ్య పదప్రయోగం’’ వ్యాసాన్ని ప్రచురించారు. 1913లో ‘‘నేటి తేట తెలుగు’’ అనే వ్యాసాన్ని వెలువరించారు.
1913లో గిడుగు మద్రాస్‌ విశ్వవిద్యాలయం ఏర్పాటుచేసిన ‘‘తెలుగు కంపోజిషన్‌ కమిటి’’లో సభ్యులుగా చేరారు. అప్పుడే ‘‘ఎ మెమోరండం అనే మోడరన్‌ తెలుగు’’ అనే చిరు గ్రంథాన్ని కూడా వెలువరించారు. ‘డేనిష్‌’లో ‘ఒటోఎన్సర్సన్‌’’ రాసిన చిన్న ఇంగ్లీషు వ్యాకరణాన్ని గిడుగు తెలుగు చేశారు. 1913లో జనవరి 1వ తేదిన ప్రభుత్వం గిడుగుకి ‘రావుసా హెబ్‌’’ అనే అపూర్వమైన బిరుదునిచ్చి ఘనంగా గౌరవించి సన్మానించింది. 1911-1913 మధ్య గిడుగు సవరల అభివృద్ధికోసం చేసిన కృషిని ప్రభుత్వం గుర్తించింది.
తాను పరిశోధన చేసిన విషయాల్ని సేకరించి, తాళపత్రాల్ని, ఆధార గ్రంథాల్ని తీసుకొని కళాశాలల్లోనూ, పాఠశాలల్లోనూ, ఉపన్యాసాలు ఇచ్చారు. అంతేకాదు, వారి నుండి ప్రమాణ పత్రాల్ని కూడా తీసుకొనేవారు. గిడుగు సారథ్యంలో వ్యావహారిక భాషోద్యమం రోజు రోజుకు బలపడిరది.1916లో తణుకులో రమారమి 6 గంటల సేపు ఏకధాటిగా బ్రహ్మండంగా ఆకర్షణీయమైన పెద్ద ఉ పన్యాసం ఇచ్చారు గిడుగు. ‘‘ఇలాంటి ఉపన్యాసాన్ని మా తండ్రిగారు జీవితంలో ఎపుడూ ఇవ్వలేదని’’ సీతాపతి గారు తెలియజేశారు. గిడుగు ఉపన్యాస ప్రభావానికి లోనైన వారు ఆనాడు ఎందరో వున్నారు. అందులో కవులు, రచయితలు, పండితులు, మేధావులు వున్నారు.
1916లో కొవ్వూరులో గిడుగు ఉపన్యాసాన్ని కందుకూరి వారు విన్నారు. ప్రభావితుడు అయ్యారు. గిడుగు ఆవిషయం తెలుసుకొని కందుకూరిని కలుస్తారు. ఇద్దరూ భాషా విషయం పై ఎన్నో చర్చలు జరుపుతారు. 1919లో కందుకూరి ‘ఆనందాశ్రమం’లో జరిగిన సభలో ‘‘వర్తమానాంధ్ర భాషా ప్రవర్తక సమాజం’’ అనే సంస్థను కొత్తగా స్థాపించారు. అనుకోకుండా కందుకూరి చనిపోతారు. కందుకూరి వారి ద్వారా ‘నవ్యాంధ్రవ్యాకరణం’ రాయించాలి అనే గిడుగు కోరిక నెరవేరలేదు. అంతేకాదు, తన శ్రేయోభిలాషి ‘వెల్మెన్‌’ 1917లో ప్రపంచ యుద్ధంలో చనిపోతారు. గిడుగుకు ఈ రెండు విషయాలు తీరని లోటు అయ్యాయి.
గిడుగు 1919లో ‘తెలుగు’ పత్రికను స్థాపించారు. తన భావాల్ని, ఆలోచనల్ని, ఈ పత్రికలో ముద్రించారు. తాను నమ్మిన సిద్ధాంతాల్ని తూచ తప్పకుండా నమ్మిన వారు గిడుగు. అనుకోకుండా తాను రాసిన దానిలో ఎక్కడైనా దోషాలు వున్నాయంటే నిర్మూగమాటంగా నిజాయితీగా ఒప్పుకొనే వారు.
గిడుగుకి జ్ఞాపక శక్తి, ధారణాశక్తి చాలా ఎక్కువ. వారి ఉపన్యాసాలు సహృదయ పాఠకుల్ని ఎంతగానో మంత్ర ముగ్ధుల్ని చేశాయి.
రాజీపడని మనస్తత్వం కలవారు గిడుగు. తాను పరిశోధించిన విషయాన్ని సాహిత్యలోకానికి విడమరిచి మరీ చెప్పేవారు. గిడుగు, సవర భాషపై చేసిన పరిశోధన చెప్పుకోదగ్గది. ధ్వని లిపిలో, భాషా నిర్మాణ దృష్టితో, సాంస్కృతికమైన నేపథ్యంతో, గిడుగు 1931లో ‘‘మాన్యువల్‌ ఆఫ్‌ సవరా లాంగ్వేజ్‌’’ అనే గ్రంథాన్ని రాశారు. మన్రో సవర భాషకు చేసిన కృషి గాను ఈ గ్రంథాన్ని గిడుగు, ఆమెకు అంకితం చేశారు.1933లో ‘‘ఇంగ్లీషు – సోర నిఘంటువు’’ను గిడుగు తయారుచేశారు. 1936లో ఈ గ్రంథాన్ని ప్రభుత్వం వెలువరించింది. ఈ నిఘంటు నిర్మాణంలో గిడుగు కృషి అనన్య సామాన్యమైంది. అనితర సాధ్యమైంది. సవర భాషలో ఇలాంటి నిఘంటువు ప్రపంచంలో రావడం ఇదే ప్రారంభం.గిడుగు చేసిన భాషా సేవకు గుర్తింపుగా అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా భావించిన ‘‘కైజర్‌-ఇ-హింద్‌’’ అనే బంగారు పతకాన్ని 1-1-1933 తేదిన గిడుగుకి ప్రభుత్వం ఇచ్చి ఘనంగా గౌరవించింది.
పరిశోధన అంటే గిడుగు, గిడుగు అంటే పరిశోధన అనే పేరు తెచ్చుకున్నారు. ఆయనలాంటి పరమ ప్రామాణికమైన పరిశోధన ఇంతవరకు తెలుగు భాషలో ఎవ్వరూ చేయలేదు. గిడుగు పరిశోధనలో పరాకాష్ఠకు చేరుకున్నారు. అటు వంటి మహా మేధావికి, గొప్ప పండితుడికి, ప్రముఖ విమర్శకుడికి, విఖ్యాత పరిశోధకుడికి ఆంధ్ర విశ్వకళాపరిషత్‌ లో, తెలుగు శాఖలో, ఆచార్య పదవి ఇవ్వకపోవడం దురదృష్టకరం.
గిడుగు బహుముఖ ప్రజ్ఞాశాలి. అందుకు ఆయన రచనలు, ఆయన చేసిన ఎన్నో కార్యక్రమాలు ఉదాహరణ. సవర భాషకోసం కృషిచేసిన సవరభాషా శాస్త్రవేత్త గిడుగు.
కుటుంబ సభ్యులు అందరూ గిడుగు చేసిన భాషాపరిశోధనలో భాగమయ్యారు. ఈలాంటి సంఘటన తెలుగు సాహిత్యంలో అరుదుగా వుంటుంది. గిడుగు భాషా పరిశోధనా కృషిలో సీతాపతి ఎప్పుడూ వెంటే వుండేవారు. తన వంతు సహాయ సహకారాల్ని తండ్రికి అందించేవారు. సనాతన సంప్రదాయ కుటుంబంలో పుట్టినప్పటికీ, అన్ని విషయాల్లోనూ ఆధునికతను ఆహ్వానించిన మహానుభావుడు గిడుగు. అందుకే అందరికీ మార్గదర్శకుడయ్యారు.
గిడుగు ఇంటిలోకూడా అందరూ భాష పైనే ఎక్కువగా మాటలాడేవారు. గిడుగు సీతాపతి గారి మాటలో చెప్పాలంటే ‘‘మేము నిత్యం మాట్లాడుకొనే మాటల్లో గృహకృత్యాలు విషయం ఒకపాలు, చదువు విషయాలు తొంభై తొమ్మిది పాళ్ళు’’ అని అన్నారు. దీనిబట్టి గిడుగు తత్త్వం మనకు కొట్ట వచ్చేటట్లు కన్పిస్తుంది.
ప్రజాభాషకు పట్టం కట్టిన ప్రజల మనిషి గిడుగు. గిడుగు ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. 1940 జనవరి 22వ తేదిన తెల్లవారే సరికి గిడుగు ఆరోగ్యం బాగా క్షీణించింది. ఉదయం 7.20 నిమిషాలకు గిడుగు మద్రాసులో పరమపదించారు. గిడుగు ‘‘తుదివిన్నపం’’ను గూడవల్లి రామబ్రహ్మం గారు తన ‘ప్రజామిత్ర’ పత్రికలో, చనిపోయిన రోజే అంటే 22వ తేదీన మధ్యాహ్నం 2 గంపపలకు ముద్రించారు. సహృదయ పాఠకులందరికీ గిడుగు వారి అద్భుత సందేశాన్ని తెలియజేశారు. గిడుగు భార్య శ్రీమతి అన్నపూర్ణమ్మ గారు 1942 జూలై 2 తేదిన టెక్కలిలో చనిపోయారు.
సవర భాష కోసం, వ్యావహారిక భాష కోసం, గిడుగు చేసిన కృషి, అనన్య సమాన్యమైంది. అనితర సాధ్యమైంది. అక్షర జ్ఞానంలేని సవరలకు జ్ఞానం కలుగుచేయడం కోసం ‘‘సవర భాషోద్యమం’’ చేపట్టారు గిడుగు. మహామహా పండితులకు, మేధావులకు ‘‘వ్యావహారిక భాషావాదాన్ని ఒప్పించడం కోసం వ్యావహారిక భాషోద్యం చేపట్టారు. అజ్ఞానంతో వున్న వారికి జ్ఞానభిక్ష పెట్టేది ‘‘సవర భాషోద్యమం’’. జ్ఞానం వున్నవారిలోని అజ్ఞానాన్ని తొలగించేది ‘‘వ్యావహారిక భాషోద్యమం’’. రెండూ గొప్ప ఉద్యమాలే. రెండూ మంచిపనులే. అసలు విషయం ఏమంటే ఈ రెండు ఉద్యమాలు నూటికి నూరుపాళ్ళు ప్రజలకు సంబంధించినవే. గిడుగు చేసిన ఈ రెండు ఉద్యమాలూ ప్రజలకోసం చేసినవే. ఈ ఉద్యమాల్లో రవ్వంతయినా స్వార్ధం లేదు. ఈ రెండూ ఉద్యమాల్లోనూ గిడుగు నిజాయితీ, మానవీయ విలువలు చాలా స్పష్టంగా కన్పిస్తాయి. అందుకే గిడుగు మానవతావాదిగా పేరు ప్రఖ్యాతలు గడిరచారు.
నిరక్షరాస్యుల్ని అక్షరాస్యులుగా చేయడానికి ‘‘వాడుక భాష’’నే అన్నింటావాడడం మంచిదని గిడుగు ఎలుగెత్తి చాటారు. తెలుగు భాషకు గొడుగు గిడుగు.ఒక్క మాటలో ఆయన గూర్చి చెప్పాలంటే భాషావైతాళికుడు గిడుగు. ఆయన జీవితం, ఆయన నడిపిన ఉద్యమాలు, ఆయన పరిశోధన, ఆయన రచనలు, ఆయన ఉపన్యాసాలు ఇతరులకు మార్గదర్శకం వహిస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
‘‘మన భాషలో ఇద్దేరే వాగనుశాసనులు నన్నయభట్టు, గిడుగు రామమూర్తి

  • విశ్వనాథ సత్యనారాయణ

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img