Wednesday, February 1, 2023
Wednesday, February 1, 2023

భాషా పాటవమే రచయితల బలం

చందు సుబ్బారావు

అక్కడే రచయితకూ, సామాన్యుడికీ తేడా ఉంటుంది. భావాలు సామాన్యులలో కూడా అద్భుతంగా ఉంటాయి. అసలెందుకు..చిత్రకారులు, నృత్యకారులు, నటులు ఎన్ని భావాలు వ్యక్తం చేస్తారో చూసారుగా! వారెవ్వరూ ఒక సంఘటననూ, ఒక వ్యక్తి ఉదంతాన్నీ, ఒక సందర్భాన్నీ కలం పట్టి రాయలేరు. ఒకవేళ రాసినా జర్నలిస్టు ‘రిపోర్టు’ చేసినట్లే తప్ప కవిగారిలా వర్ణించలేరు. నెహ్రూ మరణంవేళ వందల రిపోర్టు లొచ్చాయి. ఎవ్వరైనా కవి తిలక్‌లా ‘‘ప్రిన్స్‌ ఛార్మింగ్‌..డార్లింగ్‌ ఆఫ్‌ ది మిలియన్స్‌ వెళ్లిపోతున్నాడు దారి నివ్వండి’’ అనగలిగారా. అలాగే గాంధీ మరణంపై వేల రిపోర్టులు వచ్చాయి. ఎవరైనా శ్రీశ్రీలా ‘‘అతడిప్పుడు లేడు. అతడెప్పుడూ ఉన్నాడు. అన్యాయం సమక్షంలో ఆగ్రహామహోదగ్ర మూర్తి..అతనికినానతులు’’ అనగలిగారా? రచయిత చరిత్రకు భాష్యకారుడు. తదితరులు చరిత్రను రికార్డు చేసే పాత్రికేయులు..అలాంటప్పుడు రచయితకు భాషా సౌలభ్యం కలిగి ఉండాలి. అతని బాధ్యత భావితరాలకు అందించవలసిన వార్త మాత్రమే కాదు. వ్యాఖ్యానం. ఉన్నత శ్రేణి వ్యక్తీకరణ. ఎదుట పాఠకులను కదిలిచే తత్వం. ఈ అదనపు శక్తికి భాష అవసరం. భాష ప్రబంధ కవులకే కాదు. ప్రజా కవులకు, జానపద కవులకు, చైతన్యం రగిలించే ఉద్యమకారులకు మరింత ఎక్కువ కావాలి. భాష అనగానే గిడుగు, విశ్వనాథ, శ్రీశ్రీ, పుట్టపర్తి నారాయణా చార్యులు (ఎనిమిది భాషల్లో పండితుడు) అని వక్కాణించనవసరం లేదు. కవికీ, నవలాకారుడికీ, కథకుడికీ, విమర్శకుడికీ ‘‘తగినంత’’ భాష రావాలని మాత్రమే యిక్కడ మనం చెప్పుకోవలసింది. శ్రీశ్రీకి మించిన ఊహాశక్తి చాలామందిలో ఉండవచ్చును. కాని ‘పొలాలనన్నిహాలాలదున్నీ ఇలాతలంలో హేమం పిండగాజగానికంతా సౌఖ్యం నిండగ’ అన్నపుడు పొలాల తర్వాత ‘హలాలు’ అన్నపదం వాడటం సాధారణ విషయమేనా? ‘బలం ధరిత్రికి బలి కావించే’ అన్న చరణంలోని పదాలు మనకూ తెలుసును. కానీ అలా వాడలేం..వాడటానికి లోన పదాలు కళాపెళా ఉడుకుతుండాలి. దూకటానికి ఊగుతుండాలి. మనకొచ్చినవే నూరు పదాలనుకోండి. పొలాలను నాగళ్లతో దున్ని ..పొలాల్లో బంగారం పండిరచటానికి రైతుకూలీలు చెమట ధారపోయటం లేదా.. అంటాం అంతే.. చెమటోడ్చి కష్టపడే పదాలకు ‘ఘర్మజలానికి’ ధర్మ జలానికిఖరీదు కట్టే షరాబులేడోయ్‌. అనలేం. కారణం అన్ని పదాలు మన దగ్గర లేవు. నీ దగ్గర పదిరూపాలుంటే ‘ఐస్‌క్రీం’ అంటావు. ఇరవైరూపాయలుంటే ‘కూల్‌డ్రిరక్‌’ అంటావు. వంద రూపాయలుంటే బీర్‌బాటిల్‌ వంక చూస్తావు. ఆలోచనాతరంగాలు అర్హత బట్టి లేస్తుంటాయన్నది న్యాయమే గదా! సామాన్యులు చాలాసార్లు బాధలు వ్యక్తం చేయలేక, ఎదిరించి వాదించలేక, బోనెక్కి సత్య సంపుటికి సాక్ష్యం పలకలేక ఓడిపోయి వాడిపోయి మాడిపోతుంటారు.‘నోరున్నవాడిది రాజ్యం’ అన్న సామెతలో అంతరార్థం అదే కదా. భార్యలు తమ భర్తలు పెట్టే బాధలను ఎదిరించలేకపోవటానికి ‘గొంతులేక’ అంటాం. మాటలు చాలు అనే దానర్థం. ఏ పాయింటుకు ఏం చెప్పాలో తెలియక అనే అర్థం. అదే కాసింత చదువుకున్న అమ్మాయిలైతే నీకు తగిన రీతి జవాబులు చెబుతారు. ఒక్కమాట మగవారు మరి నోరు మెదపలేనంతగా మాట్లాడతారు. ‘దీనికి నోరెక్కువ’. లా పాయింట్లు తీస్తుంది. అనుకుని (!) నోరు మూసుకుని వెళ్లిపోతారు. అన్నింటికీ భాషలోని అగ్నికణమే కారణం కదా. మన కవులు, రచయితలు సాధించవలసిందదే. కుటుంబరావులో వచనం చుట్టుముట్టి పాఠకుణ్ణి కట్టిపడేస్తోంది. చలంలోని వచనం భావోద్వేగంతో చెట్టెక్కిస్తుంది. పురాణం కాబోలు ఓసారి వ్యాఖ్యానిస్తూ ‘కుటుంబరావు వచనం సాధారణంగా కన్పిస్తుంది. ఆయన విశ్లేషణ తర్వాత ఆ వచనానికున్న ప్రత్యేక శక్తి ఏమిటో తెలుస్తోంది’ అన్నాడు. అంటే అర్థం సంస్కృత పదాలతో నిండి ఉంటే తప్ప గొప్పవచనం కాదనుకునే అలవాటు మనకు అబ్బింది. దానికి విరుగుడుగా కొ.కు..చలం మనల్ని జ్ఞానోదయం వేపు నడిపించారు. శ్రీపాద వారి కథలు చదివితే తెలుగు ఎంతటి వెలుగులతో నిండి ఉందో అవగతమవుతుంది. ముళ్లపూడి కథల్లో మాటలు ఎలా నవ్విస్తాయో అర్థమవుతుంది. ఆ మాటలు మనకు బాగా తెలుసు. అయినా వాటికా శక్తి కల్పించటం తెలియదు. రావిశాస్త్రి సారా, సారో కథలు చదువుతుంటే ఓరి బాబో యీ భాష ఎక్కడిది..ఈ మాటలు మనవాళ్లవేనా..అని ఆశ్చర్యపోతుంటాం.
తెలుగు పారిభాషిక పదాలకున్న శక్తిని అమోఘంగా బయటకు తీసిన వారిలో నామిని సుబ్రమణ్యం, కె.యన్‌.వై.పతంజలి మన తరానికి చెందిన ముఖ్యులు. పతంజలి ఊహలు అనితర సాధ్యంగా ఎదిగాయనుకుంటే (వాళ్ల ఊళ్లో రెండు కులాల మధ్య తగాదా..ఏ పాయింటు మీదట..భూమి గుండ్రంగా ఉందా..బల్లపరుపుగా ఉందా అనట!!) భాష కులాల వారీగా విహాయసవిహారం చేస్తుంటుంది. విశాఖలోని నిమ్న వర్గాల భాషను శాస్త్రీ, విశాఖ, విజయనగరం ప్రాంతాల్లోని ఉన్నత వర్గాల కుటుంబాల్లోని భాషను పతంజలీ, గుంటూరుకృష్ణా జిల్లాల్లోని దళిత వర్గాల భాషను ఇనాక్‌, రాయలసీమ అగ్రవర్ణాల భాషను మధురాంతకం, సింగిరెడ్డి , నారాయణస్వామి, కేతు విశ్వనాథరెడ్డి అద్భుతంగా పట్టుకున్నారు కేతు ఏకకాలములో భూస్వాములు, చిన్నరైతులు, అంటరానివారు ( !) ఎలా సంభాషించుకుంటారో రికార్డు చేశారు. అకాల మరణానికి గురైన గోదావరి శర్మ రాసిన రెండు మూడు కథల్లో ‘గోదావరీ తీర’ భాషను అద్భుతంగా రికార్డు చేశారు. అలాగే వాడ్రేవు వీరలక్ష్మీ, చినవీరభద్రుడూ, దాట్ల దేవదానంరాజు, అదృష్టదీపక్‌లు తూర్పుగోదావరి మధ్యతరగతి మందహాసాన్ని చక్కగా పట్టుకున్నారు. ప్రజల భాషలో కవిత్వం రాసిన వాళ్లున్నారు. అటు గద్దర్‌, ఇటు వంగపండులు కనిపిస్తారు. కాని కవిత్వం కన్నా వచనం బాగా కోర్టులో సాక్ష్యం పలుకుతుంది. భూషణం కథలు పార్వతీపురం నోటిమాటను చక్కగా పట్టుకున్నాయి. భూషణాన్ని అభినందిస్తూ ‘సోదరా..తీవ్రవాదాన్ని సమర్థించే నీ కథల్ని తెలుగు నుడికారం కోసమైనా చదవక తప్పదు’ అంటే భావాలు వదిలి భాష సొగసుల్నా..అని జవాబు రాసాడు? అవును మరి..విశ్వనాథ పద్యాల్ని చదివిన వారంతా హైందవ సంప్రదాయవాదులూ, శ్రీశ్రీ పద్యాల్ని మెచ్చుకునే వారంతా సామ్యవాద పోరాటవాదులూ అయ్యారా..! కూచిపూడి నృత్య కళాకారిణి ‘‘రారా స్వామిరారా’ అంటూ ఎంతసేపు నృత్యం చేసినా అలా చూస్తూనే ఉండిపోతాం తప్ప..ఏమిటి తల్లీ నీ గొడవ..నీ స్వామిని చాటుగా పిలుచుకోవచ్చును గదాఅనుకోం అనలేం!!
వ్యాస రచయిత సెల్‌: 9441360083

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img