Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

మట్టి నుండి మట్టిలోకి…

జలపాతపు సెగ
కళ్ళలోకి ఒలికింది
గుండె అదిరి
ఆర్తధ్వని పరచుకుంది
పాట తెగి
ఎగతెగని యాది తరిమింది
మనసు సముద్రం ఇంకోసారి
అల్లకల్లోల గాయాల కేంద్రమైంది
ఉరిసే కష్టమైంది
కనికరం మరచిన కసాయి కాలమే..
నిర్దయగా అది
కలల పుస్తకాల్ని చించేసింది
కండ్ల దీపాలను ఆర్పేసింది
సింగిడీలను రాల్చేసింది
పూల గుడిసెల్ని కూల్చేసింది
అలల అనుబంధాల్ని ఆబగా తొక్కేసి
అనుభూతుల్ని నలిపేసింది
ఇంకిపోయిన అమాయకపు ప్రాణం
చివరికి ఒయాసిస్సులోకి చేరింది
వెతుకులాటలు పూర్తిగా ఆగాయి
కాలం మాయాజాలంలో
జీవన శైథిల్యమే మిగిలింది
సత్యం ఇక్కడే స్పష్టమైంది
కాలం మనిషికిచ్చిన
అతి స్వల్ప అనల్ప అవకాశం జీవితం
జనన మరణాలు ఒట్టి యాదృశ్చికాలు
ఏది ఎప్పుడో
ఏ ఆట చివరిదో చెప్పలేం
అందుకే…
మట్టే నిజం
మట్టే నిరంతరం
మట్టే భాస్వరం
మట్టే జీవన స్వరం
మట్టే సతతం
మట్టే సర్వస్వం
ఇదే నిజం
మనిషి ప్రయాణం
మట్టి నుండి మట్టిలోకి…
తిరునగరి శ్రీనివాస్‌, 8466053933

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img