Monday, September 26, 2022
Monday, September 26, 2022

మహనీయుడికి మరువలేని నివాళి !

‘చందురుని మించు అందమొలికించు ముద్దు పాపాయివే
నిను కన్నవారింట కష్టముల నీడ కరిగిపోయేనులే ..’
ఈ పాట ప్రతి తెలుగువాడి గుండెల్లో మార్మోగే అపురూప గీతం. అన్నాచెల్లెళ్ల బంధం గొప్పతనాన్ని చాటి చెప్పే ఈ ఉదాత్త చిరస్మరణీయ గీతం ‘రక్తసంబంధం’ సినిమాలోది. ఇది మన అందరికీ తెలుసు. అన్నాచెల్లెళ్లుగా ఎన్టీఆర్‌ – సావిత్రి తమ పాత్రలకు ప్రాణ ప్రతిష్ఠ చేసారని కూడా మనకు తెలుసు.
కానీ ఈ పాట ఎవరు రాశారో ఎవరికీ తెలీదు. మామూలు సాధారణ ప్రజలకే కాదు. పెద్ద చదువులు చదివిన వారికి, సారస్వత రంగంలో ఉన్నవారికి కూడా తెలియదు. ఇదే మన తెలుగునాట రచయితల దౌర్భాగ్యం. ‘క్రాంతదర్శి’ అనిపించుకున్న కవి/ రచయిత ఎప్పుడూ ‘తెర వెనకే’ మిగిలిపోతాడు. ముఖ్యంగా సినిమా రంగంలో కవి/ రచయితది ఎప్పుడూ వెనుక బెంచీనే!
ఈ పాట విషయానికి వస్తే ఇది అనిసెట్టి సుబ్బారావు గారి రచన. సుశిక్షిత అక్షర కార్మికుడైన అనిసెట్టి సరిగ్గా నూరేళ్ల క్రితం గుంటూరు జిల్లా నరసరావుపేటలో జన్మించారు. కలం వీరుడైన అనిశెట్టి ఆదినుంచి తాడిత పీడిత జనుల పక్షపాతే! అభ్యుదయపథ వాదే!!
కేవలం సినిమా గీతాలే కాదు ప్రగతిశీల రచనలెన్నింటినీ చేశారాయన. వామపక్ష భావజాలంతో దినదిన ప్రవర్ధమానం అవుతూ ప్రజా చైతన్యానికి అవిరళ కృషి చేశారు. సాధారణంగా ఒకప్పటి సినీ ప్రియులకు అనిశెట్టి, పినిశెట్టి పేర్లు తరచు వినబడుతూ ఉండేవి. వారిలోని అనిశెట్టి గురించే మనం ప్రస్తుతం చెప్పుకునేది. ఆయన ఎన్నో చిరస్మరణీయ సినీ గీతాలు, అభ్యుదయ కథలు, నాటకాలు, రేడియో నాటకాలు మాత్రమే కాక చాలా సినిమాలకు సంభాషణ రచయితగా పని చేశారు. తన నాటకాలలో అనేక ప్రయోగాలు చేశారాయన. ‘గాలి మేడలు’ నాటకంలో రంగస్థలం మీది పాత్రలు ముందు కూర్చున్న ప్రేక్షకులతో సంభాషణలు జరపడం అప్పట్లో ఒక కొత్త వరవడి. ఇలాంటి ప్రయోగాలను ఆయన పాశ్చాత్య నాటకాల నుంచి స్వీకరించారు. అడుగడుగున కొత్తదనం కోసం తహతహలాడే అనిసెట్టి తన రచనలలో వాటిని ప్రవేశపెట్టి సమకాలీన రచయితలలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు
ఆయన నాటకాలు, కథలలో – సమాజంలోని స్వార్థాన్నిఎండగడుతూ సామాన్యుడిని ప్రగతి మార్గంలో నడిపించడానికి అవిరళ కృషి చేశారు. సాంఘిక సాహిత్య ఉద్యమాల్లో ఆయన పోషించిన పాత్ర అవిస్మరణీయమైంది. అనిసెట్టి రచనలు అనేకం ఇతర భాషలలోకి కూడా అనువాదమై ఆయనకు ఎనలేని కీర్తిని సంపాదించి పెట్టాయి. మహాకవి శ్రీశ్రీ లాగే పౌరాణిక ప్రతీకలను తన కవిత్వంలో అక్కడక్కడా వాడడం అనిసెట్టికి కూడా అలవాటే.
అనిసెట్టి కవితా పంక్తులు ఎంత పదునుగా ఉంటాయో చూడండి..
భరత దేశమే పతనమాయెనా/ కరకు గుండెగా మారిపోయెనా?
మళ్ళీ ఈ ఉదాత్తత చూడండి..
అవనిలోన ఒక అనాథ ఉన్నా/ మానావాళికవమానం కాదా !
ఈ ఆశావహ దృక్పథం చూడండి.. ఆశ సుమించే ఆత్మ సుఖించే/ ఆ మహోదయం రాదా!
ఏది ఏమైనా అనిసెట్టి లాంటి అక్షరవీరుల్ని ఈ తరం చదవాలి. ఇప్పటికీ ఎంతో నవ్యతతో తళతళలాడే ఆ వ్యక్తీకరణలను ఆపోశన పట్టాలి. హృదయంలో ప్రతిష్టించుకోవాలి.
‘అనిసెట్టి సాహిత్యానుశీలనం’ పేరుతో డాక్టర్‌ పి వి సుబ్బారావు గారు కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా పొందిన సిద్ధాంత గ్రంథానికి ఇది మలి ముద్రణ. తొలి ముద్రణలో లేని అనిసెట్టి డబ్బింగ్‌ పాటలు, ఇంకా ఇతరత్రా విశేషాలు ఈ శత జయంతి ముద్రణలో చేర్చారు. అనిసెట్టి గీతాల్లో మాత్రా ఛందస్సుల నడకను కూడా రచయిత ఇందులో వివరంగా విప్పిచెప్పారు. సిద్ధాంత గ్రంథ రచయిత సుబ్బారావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అనిసెట్టికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి, క్రోడీకరించడానికి వారెంత శ్రమదమాదులకు ఓర్చారో ఒక్కసారి వారు ఇచ్చిన ‘ఉపయుక్త గ్రంథ సూచీ’ని చూస్తే చాలు ఇట్టే అర్థం అవుతుంది. వారి కృషి ముందు తరాలకు దిక్సూచి.
కనుకనే సుబ్బారావు ధన్యులు.. మూర్ధన్యులు!!
-చంద్ర ప్రతాప్‌ కంతేటి, 80081 43507

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img