Monday, November 28, 2022
Monday, November 28, 2022

మహాప్రస్థానం కీర్తి పతాక

ఆర్వీ రామారావ్‌

శ్రీశ్రీ మహాప్రస్థానం గొప్ప గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ గ్రంథం మీద బోలెడు సాహిత్యం వెలువడిరది. పరిశోధనా గ్రంథాలూ వచ్చాయి. గురజాడ దేశభక్తి గీతాలు వెలువడిన సంవత్సరమే జన్మించిన శ్రీశ్రీ మరణించి 38 ఏళ్లు గడిచాయి. శ్రీశ్రీ షష్టిపూర్తి జరిగి 50 ఏళ్లు దాటింది. అయినా శ్రీశ్రీ, ఆయన రచనలు, ప్రధానంగా మహాప్రస్థానం నేటి తరానికి స్ఫూర్తిదాయకమే. భవిష్యత్‌ తరాలకూ మార్గదర్శకమే.
శ్రీశ్రీ ప్రింటర్స్‌ విశ్వేశ్వర రావు ఈ మధ్య మహా ప్రస్థానం అపు రూప ప్రతి వెలువరించారు. శ్రీశ్రీ తన మహా ప్రస్థానం విలక్షణమైన సైజులో అంటే నిలువుటద్దం సైజులో అచ్చు కావాలనుకున్నారు. ఆ సైజులో కాకపోయినా దాదాపు 19 అంగుళాల పొడవు, 14 అంగుళాల వెడల్పులో శ్రీశ్రీ ప్రింటర్స్‌ అధినేత ముద్రించారు. తన ముద్రణాశాలకు శ్రీశ్రీ ప్రింటర్స్‌ అని పేరుపెట్టుకున్నందువల్ల శ్రీశ్రీకి తన బాకీ తీర్చుకోవడానికే ఈ ప్రత్యేక ముద్రణ రూపొందించానని విశ్వేశ్వర రావు చెప్తారు. ఏ రకంగా చూసినా ఇది విశిష్టమైన ప్రతే. ఇంత సైజు పుస్తకం తెలుగులో ఇప్పటిదాకా రాలేదు. దీన్ని కాఫీ టేబుల్‌ బుక్‌ అంటారు. ఇది చదువుకోవడానికన్నా అపూరూప మైన,అందమైన అలంకార వస్తువుగా ముచ్చటగొల్పుతుంది.
‘‘నాలుగు దశాబ్దాల క్రితమే శ్రీశ్రీ పేరు పెట్టుకుని నేను అక్షర లక్షలు గడిరచాను. నాకు భూమ్యాకాశాలు శ్రీశ్రీయే. పంచభూతాలు శ్రీశ్రీయే. శ్రీశ్రీ నా కంచంలో నాలుగు మెతుకులయ్యారు. నా ఇల్లూ, వాకిలీ శ్రీశ్రీ ప్రింటర్స్‌ అయినప్పటికీ ఆ పేరును నేను ఇన్నాళ్లూ వాడుకున్నందుకు శ్రీశ్రీకి బాకీ చెల్లించాలి.’’ అనుకున్నారు విశ్వేశ్వర రావు. ఆయన పేరుతోకన్నా శ్రీశ్రీ ప్రింటర్స్‌ విశ్వేశ్వరరావు అంటేనే చాలామంది గుర్తుపడ్తారు. మహా ప్రస్థానం గీతాలలో ఒకటి రెండు తప్ప మిగతావన్నీ శ్రీశ్రీ 1934-1940 మధ్య రాసినవే. కానీ మరో పదేళ్లకు గానీ మహా ప్రస్థానం అచ్చు కాలేదు. నవ్య సాహిత్య పరిషత్తు సమావేశాల్లో శ్రీశ్రీ కవితా ఓ కవితచదివితే ముగ్ధుడైపోయిన విశ్వనాథ సత్యనారాయణ అభినందించడమే కాక శ్రీశ్రీ రచనలను తానే అచ్చు వేస్తానని వాగ్దానం చేశారు. చింతా దీక్షితులును పురమాయించి చలంచేత ముందు మాట (యోగ్యతా పత్రం) కూడా రాయించారు. కానీ విశ్వనాథకు మహా ప్రస్థానం అచ్చు వేసే అవకాశం ఎందుకనో రానే లేదు.
ఆవంత్స సోమసుందర్‌ ‘‘కళాకేళి’’ ప్రచురణలు నిర్వహించే వారు. తన గ్రంథం వజ్రాయుధం అచ్చు వేయించాలనుకున్నారు. అప్పుడే శ్రీశ్రీని నీ మహా ప్రస్థానం ఇవ్వు అచ్చేద్దాం అని అడిగారు. కానీ శ్రీశ్రీ నిలువుటద్దం సైజులో ఆ పుస్తకం అచ్చు కావాలనుకున్నారు. అక్కడితో సోమసుందర్‌ మహాప్రస్థానం ముద్రణ సంకల్పాన్ని విరమించుకున్నారు. కళాకేళి ప్రచురణల తరఫున తన వజ్రాయుధం 1949లో వెలువరించారు. కానీ కళాకేళి తరఫున సోమ సుందర్‌ అచ్చువేసిన తొలి గ్రంథం ఆరుద్ర త్వమేవాహం. 1950లో నళినీ కుమార్‌ అనే రచయిత మహాప్రస్థానాన్ని మొదటి సారి రాయల్‌ డెమీ సైజులో అచ్చు వేశారు. అయితే అప్పుడు రచయిత పేరు శ్రీశ్రీ అని కాకుండా శ్రీరంగం శ్రీనివాస రావు అని పూర్తి పేరు ఉంది. ఆ తరవాతే శ్రీశ్రీ అని పిలవడం మొదలైంది. నళినీ కుమార్‌ పొగాకు వ్యాపారి. సంపన్నుడు. డబ్బు ఖర్చుకు వెనుకాడే తత్వం కాదాయనది. అందుకే మహాప్రస్థానం ఆయనే అందరికన్నా ముందు ముద్రించగలిగారు. ఆ తరవాత మహాప్రస్థానం కనీసం 50 ముద్రణలైనా వెలువడి ఉంటుంది. 1954నుంచి 2020 నాటికి మాగోఖలే ముఖ చిత్రంతో విశాలాంధ్ర 34 ముద్రణలు వెలువరించించింది. రాష్ట్ర విభజన తరవాత విశాలాంధ్ర ప్రచురణాలయం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమైంది. కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) తెలంగాణాలో విడిగా నవచేతన పబ్లిషింగ్‌హౌజ్‌ ప్రారంభించింది. మహాప్రస్థానం ప్రచురణ హక్కులు ఇప్పటికీ నవచేతన పబ్లిషింగ్‌ హౌజ్‌ దగ్గరే ఉన్నాయి. 2016లో సరోజా శ్రీశ్రీ నవచేతన పబ్లిషింగ్‌ హౌజ్‌ కు కాపీ రైట్‌ ఇచ్చారు. విడిగా విశాలాంధ్ర సైతం ఈ గ్రంథాన్ని ముద్రిస్తూనే ఉంది. విశాలాంధ్ర మహాప్రస్థానం ముద్రణను ప్రారంభించిన తరవాత ఇతర ముద్రణలూ వచ్చాయి. డా. గూటాల కృష్ణమూర్తి లండన్‌ నుంచే శ్రీశ్రీ చేతిరాతలో ముద్రించారు. దానితో పాటు శ్రీశ్రీ చదివిన మహాప్రస్థానం ఆడియో కాసెట్‌ కూడా ఉంది. శ్రీశ్రీ చేతి రాతలో విశాలాంధ్ర కూడా ఒక ముద్రణ వెలువరించింది. తరవాత చలసాని ప్రసాద్‌ సంపాదకత్వంలో విప్లవ రచయితల సంఘం మహాప్రస్థానంతో పాటు శ్రీశ్రీ రచనల సర్వస్వాన్ని 1999లో ప్రచురించింది. మనసు ఫౌండేషన్‌ 2010లో వెలువరించిన ప్రస్థాన త్రయం అనే మూడు సంపుటాలలో మహాప్రస్థానమూ ఉంది. ఈ చర్చలను పక్కనబెడ్తే శ్రీశ్రీ ప్రింటర్స్‌ విశ్వేశ్వర రావు కాఫీ టేబుల్‌ బుక్‌ తీసుకొచ్చి మహాప్రస్థానం కీర్తి పతాకను మరో సారి ఎగురవేశారు. ఈ పుస్తక ప్రచురణకు శ్రీశ్రీ దస్తూరిలా ఉండే ఫాంట్‌ ప్రత్యేకంగా తయారు చేయించారు. ఈ పుస్తకాన్ని డిజైన్‌ చేసిన వారు అరసవల్లి గిరిధర్‌, ముఖ చిత్రం గీసిన బ్రెంట్‌ నికాస్ట్రో, లోపలి పేజీల్లో శ్రీశ్రీ ఫొటో గీసిన భూషణ్‌, కారికేచర్లు ఇలస్ట్రేషన్లు వేసిన మోహన్‌, శంకర్‌, మోషే దయాన్‌ వెనక అట్ట మీద బొమ్మ గీసిన శ్రీధర్‌ ఇలా ఎంతమందో తలో చేయి వేశారు. సంకల్పం విశ్వేశ్వర రావుది. శ్రమ సాముదాయికమైంది. అందుకే ఈ ప్రత్యేక ప్రతి కళాత్మకంగా తయారైంది. శ్రీశ్రీని మహాకవి అనడం ఎప్పటి నుంచి మొదలైందో కూడా ఆసక్తికరమైన ఉదంతమే. 1950లలో నంద్యాలలో సీపీఐ నిర్వహించిన సభలో శ్రీశ్రీ కూడా వేదిక మీద ఉన్న వక్త. సీపీఐనాయకుడు చండ్ర రాజేశ్వరరావు మొదటిసారి శ్రీశ్రీని మహాకవిని అని సంబోధించారు. అప్పటి నుంచి అందరూ శ్రీశ్రీని మహాకవి అనే అంటున్నారు. శ్రీశ్రీని మహాకవి అని మొదటిసారి సంబోధించిందీ కమ్యూనిస్టు పార్టీనే. మహా ప్రస్థానం ముద్రణలను ఎక్కువ సార్లు వెలువరించింది కమ్యూనిస్టు పార్టీ ప్రచురణ సంస్థలే.
మహాప్రస్థానం ప్రచురణల తబ్సీళ్లు మరింత వివరంగా తెలుసుకోవాలనుకునేవారు డా. బూదరాజురాధాకృష్ణ కేంద్ర సాహిత్యఅకాడమీకోసం రాసిన మోనోగ్రాఫ్‌, పెనుగొండ లక్ష్మీనారాయణ 2000 సంవత్సరంలో కమ్యూనిజంపత్రికలో రాసిన వ్యాసం లోనూ చూడొచ్చు. ఈ వ్యాసాన్ని పెనుగొండ తన విదిత గ్రంథంలోనూ చేర్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img