Friday, March 31, 2023
Friday, March 31, 2023

వచ్చావా కోయిల


ఎస్‌.ఆర్‌.పృథ్వి, సెల్‌: 9989223245


మావి చిగురు వేసిందని చూడగ వచ్చావా కోయిల
చైత్రం పలకరించిందని మురిసి వచ్చావా కోయిల
పండుగలలో ఆనందపు జాడ తరిగిపోతున్నది
తిరిగి నింపగ ఉగాదివై తరలివచ్చావా కోయిల
చెలిమి కుప్పె పగిలి, గాయమయిన మనసుకి
లేపనము పూయగ గానమై వచ్చావా కోయిల
ధన ప్రవాహాన మనిషి జాడలు మరుగుపడుతున్నవి చూడు
మనిషి బతుకున దిగిన ముళ్ల నేరగ వచ్చావా కోయిల
మనసు చుట్టూ ఆశల వల పరుచుకొని ఉంది
ఆశయాల రెక్కలు తొడగగ వచ్చావా కోయిల
వాగ్దానాల గూడు నిండుగ నిండిపోయిన దిపుడు
పగులగొట్టి విముక్తి చేయ వచ్చావా కోయిల
తెగిపడిన గాలి పటమే గద నేడు మానవ విలువలు
జారిపోయిన విలువలను జత గుచ్చగ వచ్చావా కోయిల
రాజకీయ మిపుడు ప్రజల నమ్మకంతో ఆటలాడతా ఉంది.
మారుతున్న వర్ణాలను గమనించ నీడగా వచ్చావా కోయిల
షడ్రుచుల సారమే గదరా యీ జీవితం ఓ పృథ్వి!
మనిషిగ బతికే పాఠాలు నేర్పగ వచ్చావా కోయిల!!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img