Monday, September 26, 2022
Monday, September 26, 2022

వ్యవహారికభాషకు ఆద్యుడు గిడుగు

గ్రాంధిక భాష మార్గం మార్చి, వాడుక భాషకు ప్రాణం పోసిన మేరునగధీరుడు గిడుగు రామమూర్తి పంతులు. ‘‘కావ్య భాష వద్దు . వ్యవహారిక భాష ముద్దు’’ అనే నినాదంతో ఉద్యమం చేపట్టి తెలుగు సాహిత్యంలో చారిత్రాత్మక మార్పుకు శ్రీకారం చుట్టారు. 1911లో మొదలైన ఈ వ్యవహారిక భాషా ఉద్యమం సుమారు ఆరు దశాబ్దాల పాటు, ఆయన మరణించినా అనేక మంది కవులు, కళాకారులు, రచయితలు, పాత్రికేయులు తమ భుజాలపై మోసి చివరకు 1973లో తమ లక్ష్యాన్ని చేరుకున్నారు. వ్యవహారిక భాషగా తెలుగు అటు పరిపాలనలో ఇటు విద్యాపరంగా పరిపుష్టం అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా 6000 భాషలు ఉండగా, దాదాపు 3000 భాషలు మృత స్థితిలో ఉండగా, 9.2కోట్లమంది మాట్లాడే మన తెలుగుభాష కూడ 2030 నాటికి చితికి శల్యంఅయ్యే స్థితికి చేరుకుంటుంది అని సాక్షాత్తూ ఐక్యరాజ్యసమితి ప్రకటించుట తెలుగు ప్రజల, భాషాభిమానుల హృదయం కకావికలం అవుతుంది. దీనికి ప్రధాన కారణం ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంగ్ల భాష అంతర్జాతీయ భాషగా అవతరించి, తెలుగు ప్రజలు ఆ వ్యామోహంలో చిక్కుకుని, ఆంగ్లాన్ని అనుసరించుటకు సిద్ధ పడుటయే.
‘‘నిలుచుటకు చోటు ఇస్తే – ఇల్లే నాది అన్నట్లు’’ నానుడిలా, ఉపాధి కోసం నేర్చుకున్న ఆంగ్లం ఇప్పుడు సర్వస్వం తానై మన జీవితాన్ని, స్థానికతను లాగేసుకుని, చివరికి మాతృభాషను కాలసర్పంలా మింగేస్తుంది. ఏ జాతి ప్రజల ప్రగతికైనా మాతృభాషే పునాది. అటువంటి కోవకు చెందినదే మన తెలుగు ప్రాచీన భాష. శాతవాహనుల కాలంలో జనించి, మధ్యయుగ కాలంలో ప్రరిఢవిల్లి, ‘‘దేశ భాషలందు తెలుగు లెస్స’’ అన్న కీర్తి గడిరచిన తెలుగు నేటికాలంలో అవసాన దశలో ఉండుట అత్యంత బాధాకరమైన విషయం. మన పొరుగు రాష్ట్రాలు వారి మాతృభాషలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ, ఇతర భాషలకు తరువాతి స్థానం కల్పిస్తూ ముందుకు సాగుతూ ఉండగా, మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆంగ్లంలోనే అభివృద్ధి అనే భావనతో సాగుతున్నారు. ‘‘సైకో లింగ్విస్టిక్స్‌’’ సిద్ధాంతం ప్రకారం తల్లిదండ్రులు మాట్లాడే భాషను బట్టే, వారి పిల్లలు భాషలో పరిపక్వత చెందుతారు అని తెలిపారు. అంతేకాకుండా 2020 జాతీయ విద్యా విధానం (యన్‌.ఇ.పి) కూడా ప్రాధమిక విద్య మాతృభాషలో ఉండాల్సిన అవసరం ఉంది అని తెలిపింది.
1863, ఆగష్టు 29న జన్మించిన గిడుగు రామమూర్తి పంతులు గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ వృత్తి చేపట్టి, అక్కడ ప్రజలు ముఖ్యంగా ‘‘సవరలు’’ మాట్లాడే భాష, పుస్తకాల్లో ఉన్న భాష అర్థంకాక వారిపడే ఇబ్బందులు దృష్టిలో వుంచుకుని, ఈయనే స్వయంగా సవర భాష నేర్చుకుని, లిపి, వ్యాకరణం, నిఘంటువు తయారు చేసి అక్కడ ప్రజలు అభిమానంతో పాటు ఆనాటి బ్రిటిష్‌ వారి ఆదరణ పొందాడు. ఈయన పరిశోధనలకు, కృషికి బ్రిటిష్‌ వారు 1913లో ‘‘రావు సాహెబ్‌’’, 1934లో ‘‘కైజర్‌ హింద్‌’’ బిరుదులతో సత్కరించారు. అయితే అక్కడితో ఆగకుండా పుస్తకాలలో ఉన్న భాష పండితులకే అర్థంకాని గ్రాంథిక భాష స్థానే, సామాన్య ప్రజలు మాట్లాడే వాడుకభాష ప్రవేశపెట్టేందుకు ‘‘వ్యవహారిక భాషా ఉద్యమం’’ చేపట్టి, ఆనాటి తెలుగు భాషా ఉద్ధండుల సహకారంతో వ్యవహారిక భాషా ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళారు. ‘‘తెలుగు’’ పత్రిక స్థాపించి చైతన్య పరిచాడు. రాజమహేంద్రవరంలో ‘‘వర్థమానాంధ్ర భాషా ప్రవర్తక సంఘం’’ స్థాపించి ఇక్కడ, తణుకు పలుచోట్ల సమావేశాలు నిర్వహించి వాడుక భాష ఆవశ్యకత తెలియజేశారు. ఆ కృషి ఫలితమే ‘‘శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం’’ లో పరిశోధనలు తెలుగులో చేయుటకు, ‘‘ఆంధ్ర విశ్వవిద్యాలయం’’లో పరీక్షలు రాసేందుకు వీలు ఏర్పడిరది. 1924లో కాకినాడలోని ఆంధ్ర సాహిత్య పరిషత్తు అధికారికంగా, వ్యవహారిక భాష వాడకంపై ఉన్న నిషేధం ఎత్తివేసింది. తెలుగు మన జీవనం, భావనం కావాలని భావించి, ఆధునీకరణకు ఆలోచన చేసిన భాషా భగీరథుడు పిడుగు గిడుగు రామమూర్తి పంతులు. గ్రాంథిక భాష నుండి వాడుక భాషలో తెలుగు సాహిత్య చరిత్రను మలుపు తిప్పి, ఎన్నో పత్రికలు తెలుగునాట ఆవిర్భవించుటకు, ఎంతో మంది అక్షరాస్యత సాధించుటకు, ఎందరో కవులు, కళాకారులు, రచయితలు అభివృద్ధి చెందుటకు కారణమైన గిడుగు రామమూర్తి జయంతినే మనం ‘‘తెలుగు భాషా దినోత్సవం’’గా జరుపుకొనుట సమంజసమే కదా.!.
పదహారణాల తెలుగుతనంతో, తెలుగు భాషలో విజ్ఞానం సంపాదించి, పరభాషలో ప్రావీణ్యం సాధిస్తూ నేటితరం కదలాలి. ఎక్కడ ఉన్నా మన తెలుగు భాషను మరువరాదు. ప్రపంచ భాషల్లో నేడు తెలుగు 16వ భాషగా, దేశంలో 4వ భాషగా వర్ధిల్లుతున్నది. అయితే నేటి గణాంకాలు ప్రకారం కేవలం 27శాతం మాత్రమే తెలుగు మాధ్యమంలో చదువుట బాధగా ఉంది. ‘‘గ్రాంథికము నెత్తిన పిడుగు గిడుగు.. వ్యవహారిక భాషోద్యమ స్థాపన ఘనుడు గిడుగు…తేట తేనీయుల తెల్లని పాల మీగడ గిడుగు…కూరి తెలుగు భాషకు గొడుగు గిడుగు’’ అన్న పులిదిండు మహేశ్వర్‌ మాటలు , ‘‘రామ్మూర్తి పంతులు తెలుగు సరస్వతి నోముల పంట’’ అన్న విశ్వనాథ సత్యనారాయణ మాటలు యదార్ధమే కదా…! తెలుగుభాషను కాపాడుకోవడమే గిడుగు రామమూర్తికి మనం ఇచ్చే ఘన నివాళి.
(ఆగస్టు 29వ తేదీ గిడుగు రామమూర్తి పంతులు జయంతి)
వ్యాస రచయిత ఐ.పి.రావు, సెల్‌: 9948272919.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img