Sunday, August 14, 2022
Sunday, August 14, 2022

శీర్షిక నుండే ఆలోచనల్లో పడవేసే
‘భూమి రంగు మనుషులు’

ఇది కెక్యూబ్‌ వర్మ నాలుగో కవితాసంపుటి ఇది. పదిహేనేళ్ల క్రితం ‘వెన్నెల దారుల్లో’ ప్రయాణించి, ‘రెప్పల వంతెన’ మీదుగా ‘కాగుతున్న రుతువు’ లోంచి ‘భూమి రంగు మనుషులు’ ను రూపొందించారు. మొత్తం 70 కవితలున్న ఈ కవితా సంపుటిలో కవిత్వం పొంగిపొర్లుతోంది.
మొదటి కవిత ‘దుఃఖం’ శీర్షికలోనే కవిత్వ ప్రవాహం ఎలా ఉందో చూడండి. ‘కొన్ని వాక్యాలకు ఫుల్‌ స్టాపులుండవు/ కొన్ని పరిచయాలకు ముగింపులుండవు/కొన్ని గాయాలు చికిత్సకు అందవు/కొన్ని కరచాలనాలు మరపురావు/ కొన్ని మాటలకు శబ్దం ఉండదు/ కొన్ని పాటలు గొంతు దాటిరావు/ కొన్ని క్షణాలు ఊపిరినిస్తాయి/ కొన్ని సమయాలు పరిమళిస్తాయి/ కొన్ని జీవితాలు దుఃఖాంతమవుతాయి/ చివరిగా తడి అంటిన పూలు సమాధిని తాగుతాయి’ ఇలా పిల్ల కాలువ లాంటి ఒక్కో పుటలోని కవిత్వం ప్రవాహమై, నది అయ్యి, సముద్రంగా అవతరిస్తుందీ సంపుటి. మౌన సంభాషణ కవితలో కవిత్వం ఇలా కారుతుంది-‘ఒక్కో కల ముక్కలు అవుతూ/ గాజు గిన్నెలో ఇన్ని నూనె చుక్కలు’,… ‘నీళ్లు’ అనే కవితా శీర్షికలో కడవల కొద్దీ నీళ్ళు/ కలలో కళ్లలో/.. నదిలో పాదాలు/ మండుతూ ఇసుకలో’ ఇప్పుడు మనకిలేనిదాన్ని కవి కవిత్వంలో ప్రతిబింబంగా చూపిస్తాడు. ఈ కవితలో ఒక్కొక్క అక్షరాన్ని ఒక్కొక్క పాదం కింద మలిచి పదప్రయోగం కూడా చేస్తాడు.
అలాగే ‘ఒక నిమిషం’ కవితలో ఒక్క అక్షరం ఒక పాదంగా చేసి పాద ప్రయోగం చేస్తాడు కవి. కవిత్వంతో ఆడుకున్నట్టు అక్షరాలతోనూ, పదాలతో కూడా కవి ఆడుకోవడం, ప(పా)ద ప్రయోగం చేయడం, ఇది సాధారణంగా కనిపించదు. ఇది అవసరమా, అనవసరమో… అప్రయోజనమో.. ఇది కవి సరదామాత్రమే. కవిత్వంతో ఈ సంపుటిలో మొత్తం ఇలాగే ఆడుకుంటుంది అని అనుకోనక్కర్లేదు. ‘భూమి రంగు మనుషుల్లో’ ‘వివక్ష నేడు ఆగ్రహ జ్వాలగా మారి/ నిన్ను నేలమాళిగలోకి నెట్టి వేస్తోంది’ అని హెచ్చరిస్తాడు. రైతుకు నమస్కరిద్దాం అంటాడు.. రైతంటే ఈ నెలలోంచి/ మొలకెత్తిన అన్నం మెతుకు/ ప్రకృతిలో కలగలిసి ఎదిగే పచ్చనిరుతువు’ అని తనదైన శైలిలో కవిత్వంగా అభివర్ణిస్తాడు. అలాగే సందర్భాన్నిబట్టి కాలాన్ని కూడా రికార్డ్‌ చేస్తాడు.. కామ్రేడ్‌ వరవరరావుకు బెయిల్‌ తీర్పు చూశాక ‘అందని ఆకాశం’ ఎలాగుందో చూపిస్తాడు. యుద్ధానికి ఆవల ఎలాగుంటుందో చూపిస్తాడు. ఈ సంపుటి చదువుతున్నంతసేపు పాఠకుడు కవితా సాగరంలో ఊగుతూ..పరవశిస్తూ..మునకలతో…తేలియాడుతూ ఉంటాడు. ఫలాన వస్తువుని స్వీకరించి ఫలానా కవిత రచించాడు అనేకంటే, వస్తువుని కవిత్వంలో ముంచి పాఠకుణ్ణి ఎటెటో తీసుకుపోయాడు అనవచ్చు. చివరికి చిన్న కవితలో కూడా దృశ్యాన్ని కవిత్వం చేశాడు- ‘ఒక మాట/ఒక గొంతు/ ఒక చిగురాశను కలిగిస్తాయి కదా?/ ఎక్కడైనా ఒక పిడికిలెత్తిన దృశ్యం/ అపురూపం అవుతుంది కదా’ అంటూ ఒక మాట ఒక గొంతు ఒక మహా దృశ్యం అవుతుందనే విషయాన్ని చిన్న కవితలో కూడా అద్భుతంగా పండిరచాడు కెక్యూబ్‌ వర్మ. తెలుగు కవితాశీర్షికలకి ఆంగ్ల పదాలు పెట్టడం అన్నది సరైనవిధానం కాదేమో. ఈమధ్య ఒక విమర్శావ్యాసంలో పేర్కొన్నట్టు ..తెలుగు కవితలకు ఇంగ్లీష్‌ పదాలు పెడుతున్నారు కదా…మరి ఇంగ్లీష్‌ కవులు తమ కవితలకు తెలుగు పదాల శీర్షికలు పెడతారా? అన్నది ఒకప్రశ్న ?…అసలు ఆంగ్లపదాలకి సరిపడ తెలుగు పదాలు లేవా? అర్ధాలు కాన రావా ? అన్నది కూడా ఆలోచించవలసిన సందర్భం. ఈ విమర్శను కవులందరూ గమనించాలి, దృష్టిలో పెట్టుకుని పరిగణనలోకి తీసుకోవాలి.
-చలపాక ప్రకాష్‌,
సెల్‌. 92474 75975

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img